Day 13 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)


  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము (రోమా 8:37).

ఇది విజయం కంటే ఇంకా ఎక్కువైంది. ఇది ఎంత సంపూర్ణ విజయమంటే మనం ఓటమిని, వినాశనాన్ని తప్పించుకోవటమే గాక, మన శత్రువుల్ని తుడిచిపెట్టేసి, విలువైన దోపుడుసొమ్ము చేజిక్కించుకొని, అసలు ఈ యుద్ధం వచ్చినందుకు దేవునికి కృతజ్ఞత చెప్పేలా చేసే విజయం. మనం అత్యధిక విజయాన్ని ఎలా పొందగలం? మనకి వచ్చిన సంఘర్షణ ద్వారా మన విశ్వాసాన్ని కట్టుదిట్టం చేసి, మన ఆత్మీయ వ్యక్తిత్వాన్ని స్థిరపరిచే ఆత్మీయ క్రమశిక్షణను ఈ పోరాటాల మూలంగా పొందగలగాలి. ఆత్మీయ జీవితంలో మనం వెళ్ళు పాతుకుని వర్ధిల్లాలంటే శోధన అవసరం. కొండలోయల్లో వీచే బలమైన గాలి ఆ కొండల్లో పెరిగే దేవదారు వృక్షాల వేళ్ళు లోతుగా పాతుకుపోవటానికి కారణమవుతుంది. మన ఆత్మీయ సంఘర్షణలు మన పాలిటి అద్బుత ఆశీర్వాదాలు. మనకి బద్దశత్రువని మనమనుకునేది నిజానికి దాన్ని ఓడించడానికి మనకి శిక్షణ నిస్తుందన్నమాట. పురాతన కాలంలో ఫ్రుగియ ప్రాంతంలో ఒక నమ్మకం ఉండేది. వాళ్లు ఎవరైనా శత్రువుని గెలిచినప్పుడుడెల్లా గెలిచినవాడు తన చేతిలో ఓడిపోయినవాడి బలన్నంతటినీ తనలోకి పీల్చుకుంటాడట, ఈ విధంగా అతని తేజస్సు, శక్తి పెరుగుతాయట. అలానే మనమొక శోధనని విజయవంతంగా ఎదురుకోనగలిగితే మన ఆత్మబలం రెట్టింపవుతుంది. ఈ విధంగా మన శత్రువుని ఓడించడమే కాకుండా మనపక్షంగా దానిచేత పని చేయించుకోవచ్చు. ఫిలిప్తీయుల భుజాలమీద ఎక్కడం గురించి యెషయా మాట్లాడుతాడు (యెషయా 11:14). ఈ ఫిలిప్తీయులు ఇజ్రాయేలీయులు బద్ద శత్రువులు. అయితే ఇక్కడ అంటున్నదాని ప్రకారం ఇశ్రాయేలీయులు వాళ్లని చేయించడమే కాకుండా తమని ఇంకా మిగిలిన విజయాలు పొందడానికి వాహనాలుగా వాళ్లను ఉపయోగించుకుంటారట. తెలివైన నావికుడు గాలివాటును బట్టి తెరచాపనెత్తి ఆ ప్రకృతి శక్తిని తనకనుకూలంగా వినియోగించుకోవడం లాంటిది ఇది. అలాగే జయాననునుగ్రహించే దేవుని కృప మూలంగా మన ఆత్మీయ జీవితాల్లో మనకి విరోధంగా అనిపించే వాటిని అనుకూలంగా మార్చుకోవడం మనకి సాధ్యమే. "నాకు వ్యతిరేకంగా జరిగిన ఈ సంఘటనలు సువార్త వ్యాప్తి కోసమే జరిగాయి" అని ప్రతిసారి చెప్తుండాలి.

కడుపులో చల్ల కదలకుండా ప్రశాంతంగా బ్రతకగలగడం అనేది క్షేమకరమైన జీవితం అని అందరూ అనుకుంటారు. కానీ మహా పురుషులైన వాళ్ల జీవితాలు ఇందుకు వ్యతిరేకంగా చెపుతున్నాయి. కష్టాలను భరించగలగడమే మనిషిని ఉన్నతుడిగా చేస్తుంది. కేవలం బ్రతుకు వెళ్ళబుచ్చడానికి, శక్తివంతమైన నిండు బ్రతుకుకి తేడా ఇదే. కష్టాలు వ్యక్తిత్వాన్ని పెంచుతాయి.

"మా ద్వారా ప్రతి స్థలమును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచు ఆయనయందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము" (2 కొరింథీ 2: 14).