Day 21 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)


  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ??????? ?????????

ఈ విషయాలేవీ నన్ను కదిలించవు (అపొ.కా. 20:24, స్వేచానువాదం).

సమూయేలు గ్రంథంలో చదువుతాము - హెబ్రోనులో దావీదును అభిషేకించగానే ఫిలిష్తీయులంతా దావీదు మీదపడి దాడి చెయ్యడానికి వెదుక్కుంటూ వచ్చారు. ప్రభువు దగ్గరనుండి యోగ్యమైనది ఏదన్నా పొందామంటే వెంటనే సైతాను మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాడు.

మనం దేవుడి కోసం ఏదన్నా గొప్పకార్యం చేయడానికి పూనుకున్నప్పుడు శత్రువు ఆదిలోనే మనకి అడ్డుపడ్డాడనుకోండి అది మనకి రక్షణ సూచన. రెండింతలు ఆశీర్వాదాలు, శక్తి, విజయం మనవి అవుతాయన్నమాట. ఫిరంగి పేలినప్పుడు దాని గుండు ఇరుకు గొట్టంలోగుండా వెళ్ళవలసి రావడంచేత దాని వేగం రెట్టింపవుతుంది. విద్యుచ్ఛక్తి పుట్టేది కూడా ఇలానే కదా. పవర్ హవుస్ లో తిరిగే చక్రాల రాపిడి వల్లనే ఈ శక్తి పుడుతుంది. ఈ విధంగా మన ఆశీర్వాదాలకు దేవుడు సైతానును కూడా సాధనంగా వాడుకుంటాడు అని అర్థమవుతుంది.

వీరుడి జీవితం విరిపాన్పు కాదు
ముళ్ళతోట అతని బాట
మహనీయుల నివాసాలు చెరసాలలే
పెనుగాలులు తగిలేది నేరుగా తెరచాపకే

విజయానికి బాటలే కష్టాలు. లోయ దారిగుండా నడిచివెళ్తే రాజబాట వస్తుంది గదా. గొప్ప విజయాలన్నిటిమీదా కష్టాల ముద్ర కనిపిస్తుంది. కఠినమైన మూసల్లోనే కిరీటాలను పోతపోసేది. దుఃఖపు గానుగలో నలగకుండా ఎవరికీ ఘనవిజయం రాదు. చింతాక్రాంతుడైన యేసు నుదిటి మీద కలతల చారలతో హెచ్చరించాడు "ఈ ప్రపంచంలో మీకెన్నో ఉపద్రవాలు వస్తాయి." ఈ మాటలు అన్న వెంటనే ప్రశస్తమైన వాగ్దానం వచ్చింది. అయితే భయపడకండి, నేను లోకాన్ని జయించాను." ఈ అడుగు జాడలు ఎక్కడికి వెళ్ళినా కన్పిస్తాయి. సింహాసనానికి దారితీసే మెట్లమీద రక్తపు చారికలు కనిపిస్తాయి. గాయపు మచ్చలకి బహుమానమే రాజదండం. మన చేతిలో ఓడిపోయిన మహా బలవంతుల దగ్గరనుంచి కిరీటాలను మనం లాక్కుంటాము. గొప్పతనానికి వెనుకనే ఆవేదన ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన రహస్యమే.

సంస్కర్తలైనవాళ్ళను శ్రమలెప్పుడూ నీడల్లా వెంటాడినాయి. పౌలు, లూథరు, నాక్స్, వెస్లీ తదితర విశ్వాసవీరుల కథలన్నీ ఇంతే. వాళ్ళు కీర్తివంతులు కావడానికి వాళ్ళు ఆపదల బాటమీదుగానే నడిచివచ్చారు.

శాశ్వతంగా నిలిచిపోయిన పుస్తకాలన్నింటినీ వాటి రచయితలు తమ రక్తంతో రాసారు. "వీరంతా మహా శ్రమకాలం నుండి బయటికి వచ్చినవాళ్ళు." గ్రీకుల్లో అసమానుడైన కవివర్యుడు ఎవరు? హోమర్, కాని ఆయన గ్రుడ్డివాడు. "యాత్రికుని ప్రయాణం" అనే కరిగిపోని కలను రచించిందెవరు? చీనాంబరాలు ధరించుకుని పట్టు పరుపుల మధ్య కూర్చున్న రాకుమారుడా? కాదు. ఆ కల వెలుగు బెడ్ ఫోర్డు జైలు చీకటి గోడలపై నీడలు పరిచింది. ఆ జైలు గదికి రాజు బన్యన్. ఆ దైవజ్ఞాని తనకి కనిపించిందంతా కాగితం మీద పెట్టాడు.

విజేత గొప్పవాడు
క్షతగాత్రుడై నెత్తురొల్కుతూ
కొన ఊపిరితో మూర్ఛితుడై
రణరంగంలో కడదాకా పోరాడుతూ
నేలకొరిగిన వీరుడు
అతనికంటే నిజంగా గొప్పవాడు


Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2022. info@sajeevavahini.com
Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: , . Whatsapp: 8898 318 318 or call us: +918898318318
Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.