Day 25 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)


  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

నీ దుడ్డుకఱ్ఱయు నీ దండమును నన్ను ఆదరించును (కీర్తన 23:4).

మా నాన్నగారిది ఓ పల్లెటూరు. ఆ ఊళ్లో మా ఇంట్లో ఒక చిన్న అల్మెరా ఉంది. దాన్లో తరతరాలుగా మా పూర్వికులు వాడిన చేతికర్రలు భద్రంగా ఉన్నాయి. సెలవులకి ఆ ఊరు వెళ్ళి ఆ యింట్లో ఉంటుంటాము. అక్కడుండేటప్పుడు నేను, మా నాన్నగారు షికారుకి వెళ్తూ అల్మెరా దగ్గరికి వెళ్ళి మాకు నచ్చిన కర్ర పట్టుకుని బయటికి వెళ్ళేవాళ్ళం. ఈ సందర్భాల్లో దుడ్డుకర్ర గురించిన వాక్యం నాకు గుర్తుకు వచ్చేది.

యుద్ధం జరిగే రోజుల్లో బిక్కుబిక్కుమంటూ ఉన్నప్పుడు ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందోనని భయపడుతూ ఉన్నప్పుడు ఈ వాక్యం నాకు దుడ్డుకర్రలాగా ఆదరించేది. "చెడు వర్తమానమునకు అతడు భయపడడు. అతని హృదయము దేవుని నమ్ముకొని స్థిరముగానున్నది."

మా కుమారుణ్ణి యుద్ధం పొట్టన పెట్టుకున్నప్పుడు మా హృదయం పగిలిపోయింది. వాక్యంలో మా ఆదరణకి మరో దుడ్డుకర్ర దొరికింది. "రాత్రంతయు విలాపముండెను. ఉదయముతోపాటు ఆనందము వచ్చెను."

నా ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు సంవత్సరంపాటు ఇంటికి దూరంగా ఉండవలసి వచ్చింది. తిరిగి ఇంటికివెళ్ళి నా పని మొదలు పెట్టవచ్చో లేదో తెలియని పరిస్థితి. నాతోబాటు ఓ దుడ్డుకర్రను తీసుకెళ్ళాను. అది నన్నెప్పుడు ఆదరించక మానలేదు. "నా పక్షముగా ఆయన చేయు ఆలోచనలు ఆయనకు తెలియును. అవి మేలుకే గాని కీడు చేయునవి కావు."

ప్రమాదం, లేక అనుమానం అలుముకున్న సమయంలో, సమస్య మానవ జ్ఞానానికి అందకుండాపోయిన వేళలో ఈ దుడ్డుకర్ర సాయంతో ముందుకి సాగిపోవడం నాకు తేలికైంది. "ఊరకుండుటయందే వారికి బలము కలదు." అత్యవసర పరిస్థితుల్లో స్థిమితంగా ఆలోచించడానికి సమయం లేనప్పుడు ఈ దుడ్డుకర్ర ఆదుకునేది. "తొందరపడని నిరీక్షణ గలవాణ్ణి."

మార్టిన్ లూథర్ భార్య ఒకసారి అంది, "దేవుడు నా బ్రతుకులో కొన్ని కష్టాలు తీసుకురాక పోయినట్టయితే, ఫలానా కీర్తనలో ఫలానా విషయాలున్నాయనీ, ఆత్మ ఫలానా రీతిలో పనిచేస్తుంటుందని నాకెప్పటికీ తెలిసేది కాదు. క్రైస్తవుల బాధ్యతలేమిటో ఎప్పటికీ అర్థమయ్యేది కాదు. దేవుని దండం చిన్న పిల్లవాడిని శిక్షించే ఉపాధ్యాయుడి బెత్తం లాంటిది. అది ఆ పిల్లవాడికి అక్షరాలు నేర్పిస్తుంది. దేవుడు అలానే తన దండంతో మామూలు పరిస్థితుల్లో మనం నేర్చుకోలేని యోగ్యమైన పాఠాలను నేర్పుతాడు.

దేవుడెప్పుడూ తన దండంతోపాటు దుడ్డుకర్ర కూడా పంపుతాడు.

"నీ కమ్ములు (పాదరక్షలు) ఇనుపవియు, ఇత్తడివియునై యుండును. నీవు బ్రదుకు దినములలో నీకు విశ్రాంతి (బలము) కలుగును" (ద్వితీ 33:25).

రాతిబండలున్న దారిగుండా పంపేటప్పుడు తప్పకుండా ఇనుప చెప్పులు ఇస్తాడని నిస్సందేహముగా నమ్ముదాం. మనకి సరైన పరికరాలు ఇవ్వకుండా మనల్ని ఏ ప్రయాణానికీ పంపడు.