ఒక విశ్వాసి ఎలా మోసగించబడుచున్నాడు


  • Author:
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 6
  • Reference: Sajeeva Vahini

ఎవడును మిమ్మును మోసపుచ్చకుండ చూచుకొనుడి

ప్రస్తుత దినాలలో భిన్నమైన పరిచర్యలు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసిన విస్తారముగా వాక్యము ప్రకటించబడుచున్నది. ఎవరిని గమనించినా మేమే సత్యము ప్రకటిస్తున్నాము అని చెప్పుచున్నారు.

ఒక విశ్వాసి ఏది సత్యమో, ఏది అసత్యమో ఎలా తెలుసుకుంటాడు? ఒక విశ్వాసి ఎలా మోసగించబడుచున్నాడు?

ప్రస్తుత పరిస్తితులు గమనిస్తే అనేకమంది యేసుక్రీస్తుని సంపూర్ణముగా తెలుసుకోవాలి, యేసుక్రీస్తుతో పరిశుద్ధముగా నడవాలి మరియయేసుక్రీస్తునకు మహిమకరముగా జీవించాలి అని దేవుని దగ్గరకు రావడంలేదు. అద్భుతాల కొరకు, స్వస్థతలకొరకు, తక్షణ ఆశీర్వాదము కొరకు పరుగెడుతున్నారు.

ఆది అపొస్తలుల దినములలో సత్యము ప్రకటించబడుటకు, సంఘము విస్తరించబడుట కొరకు, పరిశుద్ధుల అవసరతలు తీర్చబడుట కొరకు చర-స్థిరాస్తులను అమ్మి అపొస్తలులకు ఇస్తే; ఈ దినాలలో స్వస్థతలకొరకు, అద్భుతాల కొరకు ఇస్తున్నారు.

మనలో ఓపిక తగ్గిపోవుచున్నది. ఏదైన త్వరగా జరగాలి అని కోరుకొంటున్నాము. విశ్వాసములో స్థిరముగా ఉండాలి, ప్రార్ధన జీవితము పెంచుకోవాలి, వాక్యము సంపూర్ణముగా తెలుసుకోవాలి అని ప్రయత్నం చేయడంలేదు. ఇన్స్టెంట్ కాఫి వచ్చినట్లు, ఏటియం లో డబ్బు వచ్చినట్లు, ఆత్మీయతలో కూడ త్వరగా కార్యములు జరగాలి, త్వరగా ఎదిగిపోవాలి అని ఆశపడుచున్నాము. మనలో అనేకమంది ఒక సంఘము నుండి మరియొక సంఘమునకు మారుతూ స్థిరమైన సహవాసం లేకయున్నాము.

ప్రతి ఆలోచన దేవుని ఆలోచనగానే భావిస్తు తొందరపాటు నిర్ణయాలతో అపవాదికి అవకాశమిస్తున్నాము. అందుకే సులువుగా మనలో అనేకమంది మోసపోవుచున్నాము. అనేకసార్లు నడిపించు ప్రభువా అని ప్రార్ధన చేసి, పరుగెత్తడానికి ప్రయత్నం చేస్తున్నాము. అందుకే కదా అపవాది మనలను మోసగిస్తూనే ఉన్నాడు.

యాకోబు 1:4 "...ఏ విషయములోనైనను కొదువ లేనివారునై యుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి" అని సెలవిస్తుంది.

దేవుడు నడిపిస్తాడు, పరిగెత్తించడు.
ఓర్పుతో అడుగులు ముందుకు వేద్దాం.

Audio: https://youtu.be/njQ8_sk8jSg