ఎవరి ప్రాణమునకు వారే ఉత్తరవాదులు


  • Author:
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 6
  • Reference: Sajeeva Vahini

మత్తయి 7:22 లో – ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగోట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు. అప్పుడు – నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును అని సెలవిస్తుంది.

ఇక్కడ వీరికి ప్రవచన వరం ఎవరు ఇచ్చారు?
దయ్యములను వెళ్ళగొట్టె వరం ఎవరు ఇచ్చారు?
అద్భుతములు చేసే వరం ఎవరు ఇచ్చారు?
వీరి పాపములు క్షమించి, రక్షణ ఇచ్చి పరిశుద్ధాత్మ అను వరం ఇచ్చింది ఎవరు?
పేరు పెట్టి సేవకు పిలిచింది ఎవరు?
యేసుక్రీస్తే కదా?

ఆ రక్షించిన దేవుడే ఇక్కడ మిమ్మును ఎన్నడు ఎరుగను అని ఎందుకు చెప్పుచున్నాడు?

వారు మొదట నీతిగానే ఉన్నారు కాని, తరువాత అక్రమము చేసారు కాబట్టి. మొదట యేసుతో ప్రయాణం చేసారు కాని, తరువాత క్రీస్తుని విడిచిపెట్టారు కాబట్టి.

లూకా 21:34 లో మీ హృదయములు ఒక వేళ తిండివలనను మత్తువలనను ఐహిక విచారములవలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి.

మత్తయి 24:50 లో నిర్లక్ష్యముగా ఉండేవారిని, మెలుకువ లేనివారిని నరికించి వేస్తాడని సెలవిస్తుంది.

ప్రియ చదువరి! ఎవరి ప్రాణమునకు వారే ఉత్తరవాదులు. ఈ లోకంలో చేసిన, చేస్తున్న ప్రతి పనికి ఒకదినాన ఎవరికి వారే లెక్కచెప్పాలి.

యాకోబు 3:1లో ...బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని... అని హెచ్చరింపబడుచున్నాము.

యేసుక్రీస్తుతో రక్షించబడిన, విశ్వాసివైన, పరిచర్యలో పాలివాడవైన నీ ప్రయాణం ఎలా ఉంది.?