హనోకులాంటి క్రైస్తవులు దేవునికి కావాలి


  • Author:
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 6
  • Reference: Sajeeva Vahini

ఆది 5:21-24 “హనోకు అరువదియైదేండ్లు బ్రతికి .. దేవుడతని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను”.ఆది 5:21-24 “హనోకు అరువదియైదేండ్లు బ్రతికి .. దేవుడతని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను”.

హనోకు దేవునితో నడుస్తున్న రోజులలో అనగా 300 సంవత్సరములు, పనిలో నెమ్మది లేదు. భూమి శపించబడి ఉంది. చేతుల కష్టం ఎక్కువగా ఉంది. అందులో నెమ్మది లేదు.
ఆదామును దేవుడు ఆశీర్వదించాడు, ఆదాము పాపము చేసిన తరువాత; ఆదాము నిమిత్తం నేల శపించబడింది. అప్పటి నుండి అబ్రాము, అబ్రహాముగా మార్చబడే వరకు ఆశీర్వాదము అనేది భూమి మీద లేదు. శాపం హనోకు మీద ఉంది; పరలోక నిరీక్షణ లేదు, దేవుని కార్యం ఒక్కటి కూడా లేదు. హనోకు ఇటువంటి పరిస్థితులలో లోకమును చూడకుండా, ఒక దినము విడువకుండా దేవునితో నడిచాడు. తనకు భార్యా పిల్లలు ఉన్నారు, చేతులతో కష్టము చేస్తునాడు. ఇంటి బాధ్యతలు అన్ని నెరవేరుస్తూ; నెమ్మది అనేది లేకపోయినా సాకులు చెప్పకుండా దేవునితో నడుస్తున్నాడు.


క్రీస్తు యేసు మరణం ద్వారా మనం శాపం నుండి విడుదల (రక్షణ) పొందుకొని, ఆశీర్వాదమునకు పాత్రులమైనాము. పరలోకం మనకు తెరువబడింది. ప్రతి రోజు దేవుని స్వరం వింటున్నాము. అడుగడుగునా దేవుని కార్యములు చూస్తున్నాము కాని, దేవునితో నడుస్తున్నామా? ఆదివారం చర్చికి రావడానికే కొందరికి కష్టముగా మారిపోయింది. సాకులు చెప్పడం క్రైస్తవులకు వ్యసనముగా మారిపోయింది. కొందరు చదువుకోవాలని, కొందరు కొత్తగా పెళ్ళి అయిందని, కొందరు పిల్లలున్నారు అని, కొందరు ఉద్యోగం అని ఏదో ఒక సాకు చెప్తుంటారు. కొంతమంది దేవునితో నడవడంకాదు, దేవుడే నడిపిస్తాడు అని చెప్తుంటారు; దేవునికి తనతో నడిచే క్రైస్తవులు కావాలి, తనను నడిపించేవారు కాదు.

దావీదుహారాజు, ఆదాము వలే పాపము కప్పుకోలేదు, ఒప్పుకున్నాడు. అందుకే ఆదాము గురించి ఎక్కడ బైబిల్ ఎక్కువగా జ్ఞాపకము చేయబడలేదు కాని, దావీదు గురించైతే సొలోమోను మొదలుకొని అనేక సందర్భాలలో తన సేవకుడైన దావీదు వలే తన దేవుడైన యెహోవా యెడల యధార్ధముగా లేకపోయెను అని జ్ఞాపకము చేయబడినది. 

ఎవరు దీనులై యదార్ధముగా దేవుని దగ్గర తన పాపములను ఒప్పుకుంటారో వారే నీతిమంతులు. నీతిపరుడును, నిందారహితుడుగా జీవించే వారినే దేవునితో నడిచేవారు అంటారు. 
హనోకులాంటి క్రైస్తవులు దేవునికి కావాలి.అలాంటి వారితోనే దేవుడు నడుస్తాడు. పరలోకంలో స్థానం కూడా హనోకు లాంటి వారికే.