యోబు


  • Author:
  • Category: Articles
  • Reference: Sajeeva Vahini

ఊజు దేశస్తుడైన యోబు యథార్ధవంతుడు, న్యాయవంతుడు దైవభక్తిగలవాడు. చెడుతనమును విసర్జించినవాడు. భూమి మీద అతనివంటి వాడు లేడని దేవునితో మెప్పుపొందాడు.

అతని భార్య పేరు ఎక్కడ వ్రాయబడలేదు. కేవలం యోబు భార్య గానే పిలవబడింది. వీరికి ఏడుగురు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు.

ఏడువేల గొర్రెలు, మూడువేల ఒంటెలు, అయిదువందల జతల ఎడ్లు (వెయ్యి ఎడ్లు ). అయిదువందల ఆడ గాడిదలు యింకా అనేకమంది దాసదాసీజనం కలిగి తూర్పు దేశంలో అందరికంటె ఘనంగా ఎంచబడ్డాడు.

యోబు దేవుని అధికంగా ప్రేమించినవాడు. అతని ఆధ్యాత్మిక జీవితాన్నిబట్టి అతని కుటుంబ సభ్యులు ఇక్యమత్యంగా జీవించగలిగారు. సత్ప్రవర్తనవల్లనే యోబు సమస్తమూ పొందగలుగుస్తున్నాడని ఇరుగు పొరుగువారు గ్రహించారు. తన భర్త కుటుంబ భోగభాగ్యాలకు యోబు భార్య ఎంతగానో మురిసిపోతువుండేది.

ఈ కుటుంబ సంపద, ఐక్యత సాతానుకు నచ్చలేదు. చెరుపు చేయడమే వాని నిత్యకృత్యం. దేవుని నుండి ఉత్తర్వులు పొంది ప్రాణం తప్ప దెబ్బపై దెబ్బ పెడుతూ యోబు సంపద సంతతి నాశనపరచింది సాతాను. ఇల్లు, భార్య, నలుగురు పనివారు మాత్రమే అతనికి మిగిలలారు.

ఆస్తిపాస్తులు అన్ని నాశనం అయ్యాయి. సర్వాన్ని కోల్పోయినా దేవుని మాత్రం విడువలేదు. దైవధ్యానం మరువలేదు. ప్రాణం తప్ప సమస్తాన్ని తన స్వాధీనంలోకి తీసుకున్న సాతాను యోబు భక్తుణ్ణి తీవ్రమైన చర్మవ్యాధికి గురిచేసింది. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కురుపులు, బొబ్బలు వచ్చాయి. పట్టుపరుపులపై కూర్చునే అతను పెంటకుప్పలలో కూర్చుండే పరిస్థితి ఏర్పడింది.

ఇది కడు దయనీయ స్థితి అందుకే కొందరు క్రైస్తవులు తమకు కష్టాలు కలిగినప్పుడు యోబు భక్తుని గుర్తుచేసుకుంటారు.

దేవునియందు భక్తి విశ్వాసములులేని యోబు భార్య అతని దుస్థితిని తీవ్రంగా వ్యతిరేకించింది. ఇంకా నీవు యథార్ధతను విడిచి పెట్టావా అని గద్దించింది. దేవుని దూషించి మరణము కమ్మని ఉచిత సలహా ఇచ్చింది. కష్ట సమయంలో తోడునీడగా ఉండవలసిన అర్థాంగి, వాడి అయిన మాటలతో కించపరచింది.

అయినా యోబు చలించలేదు. దేవునిపై అతనికున్న భక్తి అచంచలమైనది. అవిశ్వాసి అయిన అతని భార్య జరిగిన నష్టాలను భరించలేకపోయింది. స్త్రీ సహజ గుణాలయిన ప్రేమ, కరుణ, క్షమాగుణాలను నిలపలేకపోయింది.

అందుకే పౌలు భక్తుడు కొరింథీయులకు 4:4 లో “క్రీస్తు మహిమను కనబరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగసంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గ్రుడ్డి తనము కలుగజేసింది” ( ఈఈకోరింతీ 4:4) అని సెలవిచ్చాడు.

చీకటివెంట వెలుగులా దేవుడు యోబును తిరిగి దీవించాడు. యథావిధిగా ఏడుగురు కుమారులను, కుమార్తెలను అనుగ్రహించాడు. పశుసంపదను ఇచ్చాడు. మునుపటికంటే రెట్టింపు ఆశీర్వాదం కలుగజేసాడు.

తాత్కాలికంగా సాతాను పెట్టే బాధలు పడడాన్ని తట్టుకోలేని యోబు భార్య తన భర్తను తూలనాడింది, దైవ దూషణ చేయడానికికూడా వెనుకాడలేదు. అయితే దేవుడు కొన్నిసార్లు తన బిడ్డలమీదికి బాధలు, కష్టాలు పంపినా అవి కేవలము బాధకోసము మాత్రమే కాక మంచి ఫలాలను ఫలించాలనే ఆయన ఉద్దేశమైయున్నది. యోబు భార్య ఈ సత్యాన్ని గ్రహించాలేకపోయింది.

మనము బాధలు పరంపరగా వచ్చినప్పుడు ఓర్చుకోలేని, ఓర్పులేని స్థితిలో దైవదూషణ చేస్తుంటాము. అది మంచిది కాదని ప్రతివారు గ్రహించాలి.