క్రీస్తుతో 40 శ్రమానుభవములు 31వ అనుభవం

  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Suffering with Christ
  • Reference: Sajeeva Vahini

సిలువనుగూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18

రాబోయే తరానికి పుట్టబోయే బిడ్డను క్రీస్తు కొరకు అంకితం చేయాలని నిర్ణయించుకుంది తల్లి మోనికా. చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకున్న కుమారునికి, అనుదినం దేవుని గూర్చి బోధిస్తూ, తన ఉద్దేశాలను వివరిస్తూ క్రీస్తును గూర్చిన విషయాలు చిన్ననాటినుండే నేర్పించడానికి ప్రయత్నించింది. యౌవనస్తుడయ్యెసరికి ఆ కుమారుడు లోకసంబంధమైన పాపాలకు బానిసై వాటితో జీవిస్తూ తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఏరోజైనా నా కుమారుడు దేవునివైపు తిరుగుతాడు అనే నమ్మకంతో తన కుమారుని కొరకు రేయింబగళ్లు ప్రార్థన చేసింది ఆ తల్లి.

లోకాశలతో నశించిపోతున్న జీవితానికి క్రీస్తును గూర్చిన వార్త వెర్రితనంగా అనిపించింది. వయసు 33... అయినా భాద్యతారహితంగా జీవితం జీవిస్తూ ఉండగా, అనుకోని రీతిలో తన తల్లి మరణం అతన్ని కలచివేసింది. పరుగులు తీస్తున్న లౌకిక జీవితం ఒక్కసారిగా ఒంటరితనంలోనికి నెట్టేసింది. తన తల్లి మాటలను జ్ఞాపకము చేసుకున్నాడు, జీవితానికి అర్ధం తెలుసుకున్నాడు, క్రీస్తును గూర్చిన విషయాలు శక్తిని కలుగజేయగా తన పరుగును ప్రభువు వైపు మళ్ళించాడు పరిశుద్ధుడైన అగస్టీన్.

క్రీస్తును సంపూర్ణంగా తెలుసుకున్న ఆయన "నా తల్లి కన్నీటి ప్రవాహములో నేను దేవుని రాజ్యములోనికి కొట్టుకొని వచ్చితిని" అని సాక్ష్యమిచ్చారు.

ఎవరునూ పుట్టుకతో క్రెస్తవులు కాలేరు. జాతిని బట్టి మతమును బట్టి అసాధ్యం.
నేనంటాను, క్రీస్తును వ్యక్తిగతంగా అనుభవించడమే నిజమైన క్రైస్తవ్యత్వం.

సిలువకు ముందు... క్రీస్తు బోధలు ఎవరు పట్టించుకోలేదు. సిలువలో...ఆయన మరణం సువార్త ప్రకటిస్తే; ఈనాడు త్రోసిపుచ్చేవారెందరో. క్రీస్తు మాటలను జ్ఞాపకము చేసుకుందాం. మనకొరకు ఆయన పడిన ప్రయాస గాయాలు-దెబ్బలు చివరికి మరణం. క్రీస్తు నా కొరకు మరణించాడు అనే అనుభవం రక్షణ మార్గంవైపు నడిపిస్తుంది. సిలువ శ్రమ మన జీవితాలను పాపమునుండి విడిపిస్తే, సిలువలో క్రీస్తు మరణం మన జీవితాలను పరిశుద్ధపరచిన ఈ సిలువను గూర్చిన సువార్త రక్షించబడిన మనకు శక్తి కలిగిస్తుంది.

మొదటిసారి సువార్త వినువారికి అది వెర్రితనంగానే అనిపిస్తుంది. క్రీస్తును నమ్ముకోండి అని చెప్పడం కూడా చాలా సులభం. కాని, సువార్తను ప్రకటించి వారికొరకు ప్రార్ధన చేస్తే ఆ సువార్త బలమైన ఆయుధంగా మారి ఎటువంటి పాపాత్ముడనైనా తలకిందులు చేసే శక్తిగలదిగా మారుతుంది. ఇది మన బాధ్యత. మన జీవిత కాలంలో కనీసం ఒకరినైనా క్రీస్తువైపు నడిపించే ప్రయత్నం చేద్దామా!

అనుభవం: సువార్త ప్రకటిస్తూ దేవుని శక్తిని పొందుకునే అనుభవం సిలువలో క్రీస్తుతో శ్రమను అనుభవించడం.