చరిత్రలో శుభ శుక్రవారాన జరిగిన 7 అద్భుతమైన అసాధారణ వాస్తవాలు


  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 6
  • Reference: Sajeeva Vahini

చరిత్రలో శుభ శుక్రవారాన జరిగిన 7 అద్భుతమైన అసాధారణ వాస్తవాలు:

1. యూదుల రాజని పైవిలాసము. (లూకా 23:34,38). ప్రధాన యాజకులు మరియపొంతు పిలాతు ప్రభుత్వం వారు, యేసు క్రీస్తును అవమాన పరచుటకు సిలువపై యూదుల రాజాని పైవిలాసము వ్రాశారు. INRI అనే అక్షరాలతో నజరేయుడైన యేసు, యూదుల రాజు మరియఇశ్రాయేలుకు రాజు అనే అర్ధమిచ్చు పదాలను లాటిన్ భాషలో వ్రాసియుంచడం గమనార్హం. అంతేకాదు, నేరస్తుడని నిర్ధారించిన యేసు క్రీస్తు రక్త సిక్తమైన వస్త్రాలను తీసి చీట్లు వేసుకొని సైనికులు పంచుకోవడం అసాధారణ వాస్తవం.

2. దేశమంతటి మీద చీకటి. (లూకా 23:44). దేవునిపై మానవుని తిరుగుబాటుకు సంపూర్ణ సూర్యగ్రహణం కంటే విభిన్న పరిణామాలు ఆ రోజున చోటుచేసుకున్నాయి. యేసు క్రీస్తు తన ప్రాణమును విడువగానే, ఇంచుమించు మధ్యాహ్నం మూడు గంటలకు సూర్యుడు అదృశ్యమై ఆ దేశమంతటా చీకటి కమ్ముకున్నది.

3. దేవాలయపు తెర పైనుండి క్రిందివరకు రెండుగా చినిగెను. (మత్తయి 27:51). అతి పరిశుద్ధ స్థలంలో ఉండే దేవునికి - మానవునికి మధ్య గోడగా ఉంచబడిన దేవాలయపు తెర, దానంతట అదే చిగిపోయింది. దేవుని సన్నిధి నుండి మానవుడు ఇకెన్నడుకూడా నిరోధించబడడని గ్రహించగలం.

4. భూమి వణికెను; బండలు బద్దలాయెను. (మత్తయి 27:51). యేసు క్రీస్తు సిలువలో తన ప్రాణాన్ని తండ్రి చేతికి అర్పించగానే...భూమి వణకింది. బండలు బద్దలైపోయాయి. ఇది సాధారణమైన భూకంపం కాదని గ్రహించగలం.

5. సమాధులు తెరువబడెను. (మత్తయి 27:52). చరిత్రలో ఎన్నడు జరగని మరొక సంఘటన, సమాధులు తెరువబడి నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచి, పట్టణ వీధుల్లో అగుపడడం ఆశ్చర్యమైన అసాధారణ వాస్తవం.

6. తాను రాతిలో తొలిపించుకొనిన కొత్త సమాధి. (మత్తయి 27:60). ధనవంతుడైన అరిమాతయ యోసేపు తాను బ్రదికుండగానే తన కోసం తొలిపించుకున్న రాతి సమాధిలో యేసు క్రీస్తును సమాధి చేయడం, అనగా యేసు క్రీస్తుకు సమాధి కూడా తొలిపించబడకపోగా మరొకరికొరకు సిద్ధపరచుకున్నదానిలో సమాధి చేయబడడం ఆశ్చర్యమైన సంగతి.

7. కావలివారిని పెట్టి రాతికి ముద్రవేసి సమాధిని భద్రం చేశారు. (మత్తయి 27:66). చరిత్రలో ఏ సమాధికి కూడా మూసిన రాయి పై ప్రభుత్వం ముద్రవేయడం ఇదే మొదటిసారి జరిగింది, ఈ సంఘటన యేసు క్రీస్తు సమాధిపై ముద్రవేయడమే కాదు, కావలి వారిని కూడా పెట్టి భద్రపరచడం ఆలోచించవలసిన విషయం.