అద్బుతమైన ప్రతిఫలం

  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini Daily Devotions Telugu

అద్బుతమైన ప్రతిఫలం.

ఒకరోజు నేను నా భార్య కలిసి బిరియాని చేద్దాం అనుకున్నాము. దాని కోసం ప్రత్యేకమైన సామగ్రిని సమకూర్చుకున్నాము. ప్రత్యేకమైన దినుసులు, మసాలాలను సేకరించి వంట చేయడం మొదలుపెట్టాము. కనీసం 5 రకముల సుగంధ ద్రవ్యాలను వాటితో పాటు కొంత మాంసమును, బియ్యమును కలిపి వంట చేయడం ప్రారంభించాము. నెమ్మదిగా బిరియాని ఉడుకుతూ కొన్ని గంటల తరువాత గమనిస్తే ఇల్లంతా కమ్మని వాసనతో నిండిపోయింది. నోరూరించే బిరియాని సిద్దమయ్యాక మొదటి ముద్ద తినగానే ఇంపుగా అనిపించింది. బియ్యం, మసాలాలు, సుగంధ ద్రవ్యాలు మరియు మాంసం విడివిడిగా సాధించలేని దానిని, కలిపి నెమ్మదిగా వంట చేసి...దాని కొరకు వేచి చూసినప్పుడు చివరకు ఒక అద్భుతమైన ప్రతిఫలాన్ని చూడగలిగాను.

మన జీవితంలో విడివిడిగా శ్రమలు సమకూడి ఎదురైనప్పుడు, వాటి నుండి విజయము పొందగాలుగుతామో లేదో అని మనం సందేహం కలిగియుండడం సహజమే. కాని దేవుని వాక్యములో మనకు సంతుష్టి కలుగజేసే ఒక మాటను అపో. పౌలు రోమా సంఘానికి వివరిస్తూ “దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని అంటున్నాడు.” (రోమా 8:28)

శ్రమలు మనల్ని క్రుంగదీయడానికి కాదు గాని, విశ్వాసి జీవితంలో ప్రతి శ్రమను దేవుడు అనుమతించి, ఆ శ్రమ చివర దేవుని ఉన్నతమైన ఉద్దేశం ఉంటుందని మనకు నేర్పిస్తున్నాడు. దేవుడు అనుమతించిన శ్రమలలో సహనముతో, ఓపికతో, పట్టుదలతో నిలకడ కలిగినవారమైతే; దేవుని ప్రణాళికలో పరిస్తితులు సమకూడి మనకు మేలుచేయడమే కాదు గాని అద్బుతమైన ప్రతిఫలాన్ని చూడగలం. దేవుని ఉన్నతమైన ఉద్దేశాలకోరకు మనం వేచి చూసినప్పుడు మనం పొందుకునే ప్రతిఫలం, మనం ఊహించిన దానికంటే ఉన్నతమైనదిగా ఉంటుంది. మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం, ఏ పని తలపెట్టినా అందులో విజయం వంటి తాత్కాలికమైనవి మాత్రము కాదు గాని, “తన కుమారుని సారూప్యము లోనికి మార్చబడే” (రోమా 8:29) అనుభవాన్ని పొందగలం.

మనము క్రీస్తు సారూప్యములోనికి మార్చబడాలని దేవుడు మనలను ముందుగా నిర్ణయించుకొని, ఆయన మహిమకొరకు మనలను ఏర్పరచుకున్నాడు కాబట్టి ఎటువంటి పరిస్తితులు మనకు ఎదురైనా మనకు మేలుకలుగుతుందని విశ్వాసముతో అడుగులు ముందుకు వేస్తె దేవుని ఆశీర్వాదాలు పొందగలం. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. ఆమెన్.

Audio Message : https://youtu.be/a92ABsJSCV0