అంతరంగ పోరాటాలు


  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 6
  • Reference: Sajeeva Vahini Daily Devotions Telugu

అంతరంగ పోరాటాలు

నాకు తెలిసిన ఒక స్నేహితుడు సువార్త విని నూతనంగా క్రీస్తును విశ్వసించడం మొదలుపెట్టాడు. అయితే క్రీస్తును విశ్వసించకముందు శరీర క్రియలతో పాపములో తన జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. యేసు ప్రభువును స్వంత రక్షకుడిగా అంగీకరించి తన జీవితాన్ని మర్చుకుందాం అనుకున్నా; రోజు తన ప్రాచీన స్వభావాలతో పెనుగులాడుతూ ఉండేవాడు. నిజముగా ఇటువంటి పరిస్థితి మనలో అనేకమంది ఎదుర్కొంటూనే ఉంటాము.

రక్షణ అనుభవం పొందినప్పటికీ ప్రతి రోజు ఎదో ఒక బలహీనతలతో సవాళ్ళను ఎదుర్కొంటూనే ఉంటాము. అపో. పౌలు ఇట్టి సంగతిని వివరిస్తూ రోమా 7:18-20 “ మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని, దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలుచేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసినయెడల, దానిని చేయునది నాయందు నివసించు పాపమే గాని యికను నేను కాదు.” అని చెప్పబడిన రీతిగా దేవునికి వ్యతిరేకంగా పాపము చేయాలనే కోరిక మనలో ఉండదు గాని పాపము చేయుటకు మన శరీరము అంతరంగములో పోరాటాన్ని ఎదుర్కొంటుంది. రోమా 7:14 “ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని యెరుగుదుము; అయితే నేను పాపమునకు అమ్మబడి శరీరసంబంధినై యున్నాను” అని వ్రాయ బడిన రీతిగా...సమస్య ధర్మశాస్త్రానిది కాదు గాని మనదే. ఎందుకంటే మనం పాపమునకు అమ్మబడి శరీర సంబంధియై యున్నాము.

మన జీవితాలను మార్చుకొని, మన ప్రతి పాపమును దేవుని దగ్గర ఒప్పుకొని, కీస్తులోనే రక్షణ కలుగుతుందని విశ్వసించిన ఆ క్షణమే మన జీవితం నూతన సృష్టిగా మారుతుంది. అయితే, క్రీస్తును సంపూర్ణంగా విశ్వసించినప్పటికి, పరిపూర్ణంగా ఆధ్యాత్మికంగా నిర్మించబడాలంటే జీవితకాలం ప్రయాణంలా కొనసాగే ప్రక్రియ. శ్రరీరములో అంతరంగ పోరాటాల మధ్య పెనుగులాడుతున్నప్పటికీ వాటిని అధిగమిస్తూ ఉన్నప్పుడు శారీరేచ్చలపై విజయం పొందగలం. ఈ అనుభవం గుండా ప్రయాణించి మార్పు చెందిన మన జీవితాలు ఒకనాడు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, ఆయనను ఎదుర్కొని, ఆయనను పోలినవారమై రూపాంతరం పొందగలం.

Audio: https://youtu.be/m7g5PUroar8