దేవుడిచ్చే స్నేహితులు


  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 6
  • Reference: Sajeeva Vahini Daily Devotions Telugu

దేవుడిచ్చే స్నేహితులు

మనలో ప్రతి ఒక్కరికి కనీసం ఒక్కరైనా మంచి స్నేహితులు గా ఉండేవారు ఖచ్చితంగా ఉంటారు. వారితో మనం అన్ని సంగతులను పంచుకుంటాం. ఈ వ్యక్తీ నా మంచి స్నేహితుడు; అని మనం అనుకుంటే, మన జీవితంలోని రహస్యాలను, భావాలను, అనుభవాలను మాట్లాడుకుంటూ ఉంటాము. ఏ సందర్భంలోనైనా తప్పును తప్పుగా చెప్పే వాడే నిజమైన స్నేహితుడు. ఉన్నది ఉన్నట్టుగా, లేనిది లేనట్టుగా ఆ స్నేహితుల మధ్య సంభాషణలు ఉంటేనే స్నేహబంధం బలపడుతుంది. మంచి స్నేహితులు కేవలం కలిసియుండడమే కాదు గాని, ఇరువురి కష్ట సుఖాలను కూడా పంచుకుంటారు. చిన్న చిన్న విభేదాలు కలిగినా సర్దుకుపోతూ ఒకరినొకరు అర్ధం చేసుకుంటారు. ఇటువంటి స్నేహితులు చివరి శ్వాస వరకు మనతో ఉంటారు, ఉండగలుగుతారు అనుటలో ఎట్టి సందేహము లేదు.

పరిశుద్ధ గ్రంథంలోని మంచి స్నేహితుల గూర్చి ప్రస్తావిస్తే దావీదు యోనాతాను, వీరిద్దరి మధ్య ఉన్న స్నేహబంధం పటిష్టమైనది అని చెప్పవచ్చు. యోనాతాను తండ్రి సౌలుసూయతో నిండుకొని దావీదు పై అసహ్యకరమైన ప్రణాలికలు వేస్తున్నప్పటికీ, దావీదును చంపాలని చూసే చెడుదినాలల్లో కూడా వీరిద్దరూ ఒకరితో ఒకరు తమ భయాలను శ్రమలను పంచుకొని కలిసి అనుభవించారు. (1 సమూయేలు 19,20)

వెలుపటి పరిస్థితులు మారినప్పుడు లేదా సరిగాలేనప్పుడు మంచి స్నేహితిలు మనలను విడిచి పెట్టరు. మంచి రోజుల్లో, చెడు రోజుల్లో కూడా వారు మనతోనే ఉంటారు. ప్రతి కష్టాన్ని, శ్రమను సంతోషాన్ని కూడా మనతో కలిసి తన సమస్యలా భావించి కలిసి అనుభవిస్తారు. దేవుని నుండి దూరంగా మనం వెళ్ళిపోదామని శోధింపబడుతున్నప్పుడు మంచి స్నేహితుడు మనల్ని దేవునివైపు నడిపిస్తాడు. మంచి స్నేహితుడు దొరకడం అరుదు, అయితే ఈ లోకంలో జీవించినంత కాలం, మన జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా నమ్మకంగా ఉండే స్నేహితులు, నిజమైన స్నేహబంధాలు ఖచ్చితంగా ఉంటాయి అనుటకు దావీదు యోనతాను నిదర్శనం. ఇటువంటి స్నేహబంధాలు దేవుని నుండి మనం పొందే బహుమానాలు.

నా ఈ వర్తమానం వినే ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన మంచి స్నేహితుడు లేదా స్నేహితురాలు ఉంటారని అనుకుంటున్నాను. వారిని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. యేసు క్రీస్తు మన మంచి స్నేహితుడు గా “నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను” (హెబ్రీ 13 : 5) మనకు చేసే వాగ్దానం. ఆమెన్.

Audio: https://youtu.be/-Vml_csr-jk