నేను పొరపాటు చేశాను!


  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 6
  • Reference: Sajeeva Vahini Daily Devotions Telugu

నేను పొరపాటు చేశాను!

ఒక అతి పెద్ద కార్పోరేట్ కంపెనీ సి.యీ.వో, తన కంపెనీ అక్రమమైన కార్యకలాపాలను గురించి టీవీ వారితో చర్చిస్తూ “పొరపాట్లు జరిగాయి అన్నారు”. ఈ మాటను చెప్తూ - బాధలో తానున్నాడని బయటకు కనిపించేలా చెప్పినా, ఆయన ఆ నిందను ఆమడ దూరంలో ఉంచి, తను వ్యక్తిగతంగా ఆ తప్పును తాను చేసినట్లు ఒప్పుకోలేక పోయాడు.

కొన్ని తప్పులు కేవలం తప్పులు మాత్రమే! రాంగ్ రూట్ లో డ్రైవ్ చేయడం, ఫలానా టైం కి సహాయం చేస్తాను అని చెప్పి మర్చిపోవడం, టైం కి కట్టవలసిన డబ్బులు కట్టకుండా ఉండడం వంటివి మరెన్నో తెలియక జరిగిపోతుంటాయి. అయితే కొన్ని వీటికి మించిన తప్పులు ఉంటాయి, అవి మనం ఉద్దేశపూర్వకంగా చేసినవి; వీటినే దేవుడు పాపం అంటాడు.

దేవుడు ఆదాము హవ్వాలను వారు ఆయనకు ఎందుకు అవిధేయత చూపించారని ప్రశ్నించినప్పుడు, వారు నిందను వెంటనే మరోకరివైపు వెయ్యాలని చూశారు (ఆది 3:8-13). అదేవిధంగా అరణ్యములో ఇశ్రాయేలీయులు తాము పూజించడానికి బంగారు దూడను చేసుకున్నప్పుడు. ఆహారోను – నేను ఎలాంటి బాధ్యతను వహించలేదు...నేను ఎవరి దగ్గర బంగారం ఉన్నదో వాళ్ళంతా దాన్ని ఊడదీసి తీసుకు రండి అని చెప్పాను. వాళ్ళు తెచ్చిన దాన్ని అగ్నిలో వేస్తే ఈ దూడ అయ్యింది అని చెప్పాడు (నిర్గమ 32:24). దీనికి బదులు “నేను పొరపాటు చేశాను” అని చెప్పవచ్చు .

కొన్ని సార్లు మన తప్పులను మనం ఒప్పుకోకుండా ఇతరులపై నింద మోపడం సుళువుగా ఉంటుంది. అలాగే మన పాపాన్ని మన నిజ స్వభావంతో ఒప్పుకోకుండా “అది కేవలం పొరపాటు మాత్రమే” అని దాన్ని చిన్న తప్పుగా భావించి మాట్లాడడం ప్రమాదకరమైన విషయం అని గ్రహించాలి. దేవుని క్షమాపణను పొందడానికి మొదటి మెట్టు – మన పాపాన్ని మనం ఒప్పుకోవడం. అయితే మనం బాధ్యత వహించి, మన పాపాన్ని అంగీకరించి దేవునితో ఒప్పుకున్నట్లయితే “మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును.” (1 యోహాను1:9). ఈ స్వభావం మనలో ఉన్నప్పుడే, దేవుడు మనల్ని తప్పకుండా క్షమించి పునరుద్ధరిస్తాడు. ఆమెన్.

Audio: https://youtu.be/lhB_yXJhPfY