దేవుని ముఖదర్శనం


  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 6
  • Reference: Sajeeva Vahini Daily Devotions Telugu

దేవుని ముఖదర్శనం

తొమ్మిదేళ్ళ నా కుమారుడు ఎప్పుడు నన్ను అనేక ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. కొన్ని సార్లు వాడు వెనక్కి తిరిగి కూడా మాట్లాడం నేర్చుకున్నాడు. నేను తరచూ, “నాకు వినబడడం లేదు, మాట్లాడుతున్నప్పుడు దయచేసి నావైపు చూసి మాట్లాడు” అని అంటూ ఉంటాను. ఈ అనుభవం మనలో అనేకమందికి ఎదురై ఉండవచ్చు. వాస్తవంగా ఇప్పుడు ఫోన్ కాల్ కంటే వీడియో కాల్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము; మనకు వినబడక కాదు గాని ముఖాన్ని చూసి మాట్లాడితే లేదా ప్రశ్నలడిగితే ఆలోచన వేరే విధంగా ఉంటుంది కదా.

మనం ప్రార్ధన చేస్తాము, కాని ఎవరికైతే ప్రార్ధన చేస్తున్నామో ఆయన వ్యక్తిత్వాన్ని మరచిపోయి మనవైన ప్రశ్నలలో చిక్కుకొని, దృష్టంతా మనతోనే నింపుకొని ఉంటాము. కొన్ని సార్లు మనం ప్రార్ధనలో చెప్తుంది ఆయనకు వినబడక కాదు గాని, ఆయన వంక మనం నిజంగా చూడకుండా మాట్లాడే అవకాశమున్న కారణాన్ని బట్టి దేవుడు ఇదే విషయాన్ని మనతో చెప్పలనుకుంటున్నాడని నాకనిపిస్తుంది. నా కుమారుని లాగా మనం ఎవరితోనైతే మాట్లాడుతున్నామో వారిపై దృష్టి నిలపకుండా ప్రశ్నలడుగుతూ ఉంటాం. దేవుడెవరో, అయన ఏమి చేశాడో అన్నవి గుర్తుచేసుకోవడం వల్ల మనకున్న అనేక సమస్యలకు ఉత్తమమైన పరిష్కారం దొరుకుతుంది. అయన ప్రేమగలిగినవాడు, క్షమించేవాడు, సార్వభౌముడు, కృప గలిగినవాడు అన్న అయన వ్యక్తిత్వాన్ని మనం ఎరిగి వాటిపై తిరిగి దృష్టి నిలపడం ద్వారా ఆదరణ పొందుతాం.

దావీదు - ఆరాధనకు, ప్రార్ధనకు నాయకులను నియమించినప్పుడు దేవుని బలమును శక్తిని అంటే అయన వ్యక్తిత్వాన్ని స్తుతిస్తూ, గతంలో ఆయన విశ్వాస్యతను గూర్చిన సంగతులను వివరించమని ప్రజలను ఆయన పురికొల్పాడు (1 దిన 16:8-27). యెహోవాను ఆశ్రయించుడి ఆయన బలము నాశ్రయించుడి ఆయన సన్నిధి నిత్యము వెదకుడి. (11వ) దేవుని సన్నిధి పై మనం దృష్టిని సారిస్తే, జవాబు దొరకని ప్రశ్నల నడుమ మనల్ని నిలబెట్టగల శక్తిని ఆదరణను పొందగలము. దేవుని ముఖదర్శనం మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. ఆమెన్.

Audio: https://youtu.be/2bZ-Xug6BFg