దేవుడు చేసినదంతా మనిషితో సహా చాలా బాగుంది. మనిషి పాపం లేనివాడు, పాపం చేయనివాడు. దేవునితో సహవాసం చేయగలిగినవాడు. ఆత్మతో సత్యంతో ఆయన్ను ప్రేమించి ఆరాధించగలిగినవాడు. ప్రత్యేకమైన నోట్ బైబిల్లోని సృష్టి సత్యం, విజ్ఞానశాస్త్రం గురించి ఒక మాట – ఈ అధ్యాయంలో కనిపిస్తున్న సృష్టి విధానానికీ ఆధునిక విజ్ఞానశాస్త్రం కనుగొన్న సత్యాలకూ విభేదమేదన్నా ఉందా? ఎంతమాత్రం లేదు. ఈ మొదటి అధ్యాయం (బైబిలు అంతా కూడా) సాక్షాత్తూ దేవుని నుంచి వెల్లడైన సత్యం. అందువల్ల ఇది కేవలం వాస్తవం. 2 తిమోతికి 3:16 2 పేతురు 1:21 మొ।। చూడండి. ఇక్కడ ఇవ్వబడిన సృష్టిక్రమం ఇలా ఉంది: ఆకాశాలు, నిరాకారమై ఉన్న భూమి, భూమిపై వెలుగు ప్రసరించడం, వృక్షజాలం తరువాత నీటిలో జలచరాలు, ఆ పైన భూచరాలు, చివరిగా మానవుడు. ఈ సృష్టిక్రమం సక్రమమేనని ఆధునిక విజ్ఞానశాస్త్రం అంగీకరిస్తున్నది. సృష్టి వాస్తవమని కూడా విజ్ఞానశాస్త్రం అంగీకరిస్తున్నది. అయితే దేవునితో ప్రమేయం లేకుండా ఈ సృష్టి ఉనికిలోకి వచ్చిందన్న సిద్ధాంతానికీ అలాంటి ఊహాగానాలకూ దేవుని వాక్కు వ్యతిరేకం. అయితే సైన్సు పేరుతో చేసే ఊహాగానాలు సైన్సు ధర్మాలు, సత్యాలు కావు. ఈ తేడా తెలియకుండా మనం అపార్థం చేసుకోరాదు. ఈ విశ్వం తనకు తానే ఉనికిలోకి వచ్చిందని చెప్పడం సరైన విజ్ఞానశాస్త్ర సమ్మతం కాదు. అప్పట్లో ఏమి జరిగిందో పరిశీలించేందుకు ఏ శాస్త్రజ్ఞుడూ అక్కడ లేడు. అలాంటివి జరుగుతాయని ప్రయోగ పూర్వకమైన ఏ సాక్ష్యాధారాలు లేవు. విశ్వానికి మూలమేదో చెప్పవలసి వస్తే శాస్త్రజ్ఞులు సామాన్యుల్లాగానే ఊహాగానాలన్నా చెయ్యాలి. లేదా, ఇక్కడ తన వాక్కులో దేవుడు ఇచ్చిన వివరణను నమ్మాలి. అన్నిటి ఆరంభం, మూలం గురించి బైబిల్లోని ఈ మొదటి అధ్యాయం హేతుబద్ధమయిన, సక్రమమైన, సమంజసమైన వివరణ ఇస్తున్నది. సైన్సు దీన్ని తప్పని ఇంతవరకు నిరూపించలేదు. అనేకమంది నేర్పరులైన విజ్ఞానవేత్తలు ఈ వివరణను దేవుడు వెల్లడించాడని స్వీకరించి నమ్ముతున్నారు.