Genesis - ఆదికాండము 13 | View All

1. అబ్రాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడనున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగెబునకు వెళ్లెను.

1. కనుక అబ్రాము ఈజిప్టు విడచిపెట్టాడు. తన భార్యను, స్వంతంగా తనకు ఉన్నదంతా తీసుకొని, నెగెబుగుండా అబ్రాము ప్రయాణం చేసాడు. లోతు కూడా వాళ్లతో ఉన్నాడు.

2. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై యుండెను.

2. ఈ సమయానికి అబ్రాము చాలా ఐశ్వర్యవంతుడు. అతనికి చాలా విస్తారంగా పశువులు ఉన్నాయి. చాలా వెండి, బంగారం ఉన్నాయి.

3. అతడు ప్రయాణము చేయుచు దక్షిణమునుండి బేతేలువరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలమువరకు వెళ్లి

3. అబ్రాము చుట్టుప్రక్కల సంచరిస్తూనే ఉన్నాడు. నెగెబు విడచిపెట్టి మళ్లీ బేతేలు వెనుకకు వెళ్లాడు. బేతేలు పట్టణానికి, హాయి పట్టణానికి మధ్యనున్న చోటుకు అతడు వెళ్లాడు. ఇంతకు ముందు అబ్రాము నివసించిన స్థలమే ఇది.

4. తాను మొదట బలిపీఠమును కట్టినచోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను.

4. అబ్రాము ఒక బలిపీఠాన్ని నిర్మించిన స్థలమిది. కనుక ఈ స్థలంలో అబ్రాము యెహోవాను ఆరాధించాడు.

5. అబ్రాముతో కూడ వెళ్లిన లోతుకును గొఱ్ఱెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక

5. ఈ సమయంలో అబ్రాముతో లోతు గూడా ప్రయాణం చేస్తున్నాడు. లోతుకు గొర్రెలు, పశువులు, గుడారాలు చాలా ఉన్నాయి.

6. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలక పోయెను; ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమైయుండెను.

6. అబ్రాముకు, లోతుకు పశువులు విస్తారంగా ఉన్నందువల్ల వాళ్లిద్దరికి ఈ భూమి సరిపోలేదు.

7. అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీ యులు ఆ దేశములో కాపురముండిరి.

7. అబ్రాము గొర్రెల కాపరులు లోతు గొర్రెల కాపరులు వాదించుకోవడం మొదలు పెట్టారు. అదే సమయంలో కనానీయులు, పెరిజ్జీయులు కూడా ఈ దేశంలో నివసిస్తున్నారు.

8. కాబట్టి అబ్రాము మనము బంధువులము గనుక నాకు నీకును, నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకును కలహ ముండకూడదు.

8. కనుక లోతుతో అబ్రాము ఇలా అన్నాడు: “నీకు, నాకు మధ్య వాదం ఏమీ ఉండకూడదు. నీ మనుష్యులు నా మనుష్యులు వాదించుకోగూడదు. మనమంతా సోదరులం.

9. ఈ దేశమంతయు నీ యెదుట నున్నదిగదా, దయచేసి నన్ను విడిచి వేరుగానుండుము. నీవు ఎడమతట్టునకు వెళ్లిన యెడల నేను కుడితట్టుకును, నీవు కుడితట్టునకు వెళ్లినయెడల నేను యెడమ తట్టునకును వెళ్లుదునని లోతుతో చెప్పగా

9. మనం వేరైపోవాలి. నీకు ఇష్టం వచ్చిన స్థలం ఏదైనా నీవు కోరుకో నీవు ఎడమకు వెళ్తే నేను కుడికి వెళ్తాను. నీవు కుడికి వెళ్తే, నేను ఎడమకు వెళ్తాను.”

10. లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొఱ్ఱా అను పట్టణములను నాశనము చేయకమునుపు సోయరుకు వచ్చువరకు అదంతయు యెహోవా తోటవలెను ఐగుప్తు దేశమువలెను నీళ్లు పారు దేశమైయుండెను.

10. లోతు పరిశీలించి యోర్దాను లోయను చూశాడు. అక్కడ నీళ్లు విస్తారంగా ఉన్నట్టు లోతు చూశాడు. (ఇది సొదొమ గొమొర్రాలను యెహోవా నాశనము చేయకముందు ఆ కాలంలో సోయరు వరకు యోర్దాను లోయ యెహోవా తోటలా ఉంది, ఈజిప్టు భూమిలా ఇది కూడ మంచి భూమి.)

11. కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణముచేసెను. అట్లు వారు ఒకరి కొకరు వేరై పోయిరి.

11. అందుచేత యోర్దాను లోయలో జీవించాలని లోతు నిర్ణయించుకొన్నాడు. ఆ ఇద్దరు మనుష్యులు వేరైపోయారు, లోతు తూర్పు దిక్కుగా ప్రయాణం మొదలు పెట్టాడు.

12. అబ్రాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపుర ముండి సొదొమదగ్గర తన గుడారము వేసికొనెను.

12. అబ్రాము కనాను దేశంలోనే ఉండిపోయాడు, లోతు లోయలోని పట్టణాల్లో నివసించాడు. బాగా దక్షిణాదిన ఉన్న సొదొమకు తరలిపోయి అక్కడ లోతు నివాసం ఏర్పర్చుకొన్నాడు.

13. సొదొమ మనుష్యులు దుష్టులును, యెహోవా దృష్టికి బహు పాపులునై యుండిరి.

13. సొదొమ ప్రజలు చాలా దుర్మార్గులు. వాళ్లు ఎప్పుడూ యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు.

14. లోతు అబ్రామును విడిచి పోయిన తరువాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్నచోట నుండి ఉత్తరపుతట్టు దక్షిణపుతట్టు తూర్పు తట్టు పడమరతట్టును చూడుము;

14. లోతు వెళ్లపోయిన తర్వాత అబ్రాముతో యెహోవా ఇలా అన్నాడు: “నీ చుట్టు చూడు ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర చూడు.

15. ఎందుకనగా నీవు చూచుచున్న యీ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను.
అపో. కార్యములు 7:5, గలతియులకు 3:16

15. నీవు చూస్తోన్న ఈ దేశం అంతా నీకు, నీ వారుసులకు నేను ఇస్తాను. ఇది శాశ్వతంగా నీ దేశం అవుతుంది.

16. మరియు నీ సంతానమును భూమి మీద నుండు రేణువులవలె విస్తరింపచేసెదను; ఎట్లనగా ఒకడు భూమిమీదనుండు రేణువులను లెక్కింప గలిగినయెడల నీ సంతానమును కూడ లెక్కింపవచ్చును.

16. భూమిమీద ధూళి కణాలు ఎంత విస్తారమో, నీ వారసులను గూడ అంత విస్తరింప జేస్తాను. నేలమీద ధూళి కణాలను ఎవరైనా లెక్కించగలిగితే అది నీ ప్రజల సంఖ్య అవుతుంది.

17. నీవు లేచి యీ దేశముయొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము; అది నీకిచ్చెదనని అబ్రాముతో చెప్పెను.

17. కనుక వెళ్లు నీ దేశంలో సంచరించు. దానిని ఇప్పుడు నేను నీకు ఇస్తున్నాను.”

18. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోను లోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షవనములోదిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను.

18. కనుక అబ్రాము తన గుడారాలను తరలించాడు, మమ్రే సమీపంలోని మహా వృక్షాల దగ్గర నివసించాలని అతడు వెళ్లాడు. ఇది హెబ్రోను పట్టణానికి దగ్గరగా ఉంది. యెహోవాను ఆరాధించటానికి ఈ స్థలంలో ఒక బలిపీఠాన్ని అబ్రాము కట్టించాడు.Shortcut Links
ఆదికాండము - Genesis : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |