Genesis - ఆదికాండము 15 | View All

1. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి అబ్రామా, భయపడకుము; నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను.

1. ఈ సంగతులన్నీ జరిగాక, ఒక దర్శనంలో అబ్రాముకు యెహోవా వాక్కు వచ్చి “అబ్రామూ భయపడకు, నేను నిన్ను కాపాడుతాను. నేను నీకు గొప్ప ప్రతిఫలం ఇస్తాను” అన్నాడు దేవుడు.

2. అందుకు అబ్రాము ప్రభువైన యెహోవా నాకేమి యిచ్చిననేమి? నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే; దమస్కు ఎలీయెజెరే నాయింటి ఆస్తి కర్తయగును గదా

2. అయితే అబ్రాము అన్నాడు; “యెహోవో దేవా, నన్ను సంతోష పెట్టగలిగేందుకు నీవు ఇవ్వగలిగింది ఏదీ లేదు. ఎందుచేతనంటే నాకు కుమారుడు లేడు. కనుక నేను చనిపోయిన తర్వాత, నా సేవకుడును దమస్కువాడైన ఎలీయెజెరు నా ఆస్తి అంతటికి కర్త అవుతాడు.”

3. మరియఅబ్రాము ఇదిగో నీవు నాకు సంతానమియ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా

3. అబ్రాము: “చూడు దేవా, నాకు నీవు కుమారుణ్ణి ఇవ్వలేదు. కనుక నా ఇంటిలో పుట్టిన సేవకుడు నాకు గల ఆస్తి అంతా దక్కించుకొంటాడు,”

4. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు; నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను.

4. అప్పుడు అబ్రాముతో యెహోవా మాట్లాడాడు: “నీకు ఉన్నవాటన్నింటిని పొందేవాడు నీ సేవకుడు కాదు. నీకు ఒక కుమారుడు కలుగుతాడు. నీకుగల వాటన్నింటిని నీ కుమారుడు పొందుతాడు.”

5. మరియు ఆయన వెలుపలికి అతని తీసికొని వచ్చి నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పినీ సంతానము ఆలాగవునని చెప్పెను.
రోమీయులకు 4:18, హెబ్రీయులకు 11:12

5. అంతట దేవుడు అబ్రామును గుడారము బయటకు తీసుకొని వెళ్లి, ఇలా చెప్పాడు: “ఆకాశం చూడు, అక్కడ ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో చూడు. అవి చాలా ఉన్నాయి. నీవు లెక్కపెట్టలేవు. భవిష్యత్తులో నీ కుటుంబం అలాగే ఉంటుంది.”

6. అతడు యెహోవాను నమ్మెను; ఆయన అది అతనికి నీతిగా ఎంచెను.
రోమీయులకు 4:3-9-22-2, గలతియులకు 3:6, యాకోబు 2:23

6. అబ్రాము దేవుణ్ణి నమ్మాడు, అబ్రాముయొక్క విశ్వాసాన్ని దేవుడు నీతిగా అంగీకరించాడు

7. మరియు ఆయననీవు ఈ దేశమును స్వతంత్రించు కొనునట్లు దాని నీకిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణములోనుండి నిన్ను ఇవతలకు తీసికొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు

7. అబ్రాముతో దేవుడు ఇలా అన్నాడు, “కల్దీయుల ఊరు అను పట్టణము నుండి నిన్ను బయటకు నడిపించిన యెహోవాను నేనే. ఈ దేశాన్ని నీకు ఇచ్చేందుకు నేను అలా చేసాను. ఈ దేశం నీ స్వంతం అవుతుంది.”

8. అతడు ప్రభువైన యెహోవా, నేను దీని స్వతంత్రించు కొనెదనని నాకెట్లు తెలియుననగా

8. అయితే అబ్రాము, “యెహోవా, నా ప్రభువా ఈ దేశం నాదే అవుతుందని నాకు ఎలా తెలుస్తుంది?” అన్నాడు.

9. ఆయన మూడేండ్ల పెయ్యను మూడేండ్ల మేకను మూడేండ్ల పొట్టేలును ఒక తెల్ల గువ్వను ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పెను.

9. అబ్రాముతో దేవుడు అన్నాడు: “మనం ఒక ఒడంబడిక చేసుకొందాం. మూడు సంవత్సరాల ఆవు ఒకటి, మూడు సంవత్సరాల మేక ఒకటి, మూడు సంవత్సరాల పొట్టేలు ఒకటి తీసుకురా. ఇంకా నా కోసం ఒక పావురాన్ని, ఒక చిన్న పావురాన్ని తీసుకురా.”

10. అతడు అవన్నియు తీసికొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను; పక్షులను అతడు ఖండింపలేదు

10. దేవుని కోసం వీటన్నిటిని అబ్రాము తెచ్చాడు. ఆ జంతువులన్నింటిని చంపి ఒక్కోదాన్ని రెండేసి ముక్కలు చేసాడు, తర్వాత అబ్రాము ఈ భాగాలను ఒకదానికొకటి ఎదురెదురుగా వేసాడు. పక్షులను రెండు భాగాలుగా అబ్రాము ఖండించలేదు.

11. గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను.

11. తర్వాత ఈ జంతువులను తినటానికి పెద్ద పక్షులు వచ్చి వాలాయి. కాని అబ్రాము వాటిని వెళ్లగొట్టేసాడు.

12. ప్రొద్దుగ్రుంక బోయినప్పుడు అబ్రామునకు గాఢనిద్రపట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా

12. తర్వాత ఆ రోజు సూర్యుడు అస్తమిస్తున్నాడు. అబ్రాముకు బాగా నిద్ర వచ్చి నిద్రపోయాడు. అతడు నిద్రపోతూ ఉండగా భయంకర గాఢ చీకటి కమ్మింది.

13. ఆయన నీ సంతతివారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపువారికి దాసులుగా నుందురు.
అపో. కార్యములు 7:6

13. అప్పుడు అబ్రాముతో యెహోవా ఇలా చెప్పాడు: “ఈ సంగతులు నీవు తెలుసుకోవాలి, నీ సంతానము విదేశీయులై వారి స్వంతం కాని దేశంలో అపరిచితులుగా ఉంటారు. వారు అక్కడ బానిసలుగా ఉంటారు. ఇంకా, 400 సంవత్సరాలు కఠినంగా వాళ్లు శ్రమ పెట్టబడతారు.

14. వారు నాలుగు వందల యేండ్లు వీరిని శ్రమ పెట్టుదురు; వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు.
అపో. కార్యములు 7:7

14. అయితే వాళ్లకు యజమానిగా ఉన్న దేశాన్ని, 400 సంవత్సారాల తరువాత నేను శిక్షిస్తాను. మరి నీ ప్రజలేమో ఆ దేశాన్ని విడిచి పెట్టేస్తారు. నీ ప్రజలు వెళ్లిపోయేటప్పుడు విస్తారమైన ఆస్తులను వారితో తీసుకొనిపోతారు.

15. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయె దవు; మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడుదువు.

15. “నీ మట్టుకు నీవు చాలా వృద్ధాప్యం వరకు జీవిస్తావు, మనశ్శాంతితో నీవు మరణిస్తావు. నీ వంశం వారితో నీవు పాతి పెట్టబడతావు.

16. అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ నాలుగవ తరమువారు ఇక్కడికి మరల వచ్చెదరని నిశ్చయముగా తెలిసికొనుమని అబ్రాముతో చెప్పెను.
1 థెస్సలొనీకయులకు 2:16

16. నాలుగు తరాల తర్వాత నీ ప్రజలు మరల ఈ దేశం వస్తారు. ఆ సమయంలో అమోరీ ప్రజలను నీ ప్రజలు ఓడిస్తారు. అక్కడ నివసిస్తోన్న అమోరీ ప్రజలను శిక్షించుటానికి నీ ప్రజలను నేను వాడుకొంటాను. ఇది భవిష్యత్తులో జరుగుతుంది. ఎందుచేతనంటే, శిక్షకు తగినంత చెడుతనం ఇప్పుడు అమోరీ ప్రజల్లో లేదు.”

17. మరియు ప్రొద్దు గ్రుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్నిజ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను.

17. సూర్యుడు అస్తమించాక, చాలా చీకటి పడింది, చచ్చిన జంతువులు రెండేసి ముక్కలుగా ఖండించబడి ఇంకా అక్కడే నేలమీద పడి ఉన్నాయి. ఆ సమయంలో పొగమంటల వరుస చచ్చిన జంతువుల రెండేసి ముక్కల మధ్యగా సాగిపోయింది. దేవుడు అబ్రాముతో చేసుకొన్న ఒప్పందానికి ఇది ఒక ‘ముద్ర’ లేక ‘సంతకం’. ఆ రోజుల్లో, కోయబడ్డ జంతువుల ముక్కల మధ్య నడవడం అనే ఒడంబడిక ఆ మనిషి యొక్క నిజాయితీని తెలుపుతుంది. ‘నేను ఈ ఒడంబడికను అనుసరించకపోతే ఇదే నాకు జరుగనీ’ అన్నది దీని అర్థం.

18. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నదియైన యూఫ్రటీసు నదివరకు ఈ దేశమును, అనగా
అపో. కార్యములు 7:5, ప్రకటన గ్రంథం 9:14, ప్రకటన గ్రంథం 16:12

18. కనుక ఆనాడు, ఒక వాగ్దానాన్ని, ఒక ఒడంబడికను అబ్రాముతో యెహోవా చేసాడు. యెహోవా అన్నాడు: “ఈ దేశాన్ని నీ సంతానమునకు నేను ఇస్తాను. ఈజిప్టు నదికి, యూఫ్రటీసు నదికి మధ్య ఉన్న దేశాన్ని నేను వారికి ఇస్తాను.

19. కేనీయు లను కనిజ్జీయులను కద్మోనీయులను

19. కెనీయులు, కెనిజ్జీయులు, కద్మానీయులు,

20. హిత్తీయులను పెరిజ్జీయులను రెఫాయీయులను

20. హిత్తీయులు, పెరిజ్జీయులు, రెఫాయీమీయులు,

21. అమోరీయులను కనానీయులను గిర్గాషీయులను యెబూసీయులను నీ సంతానమున కిచ్చియున్నానని అబ్రాముతో నిబంధన చేసెను.

21. అమోరీయులు, కనానీయులు, గిర్గాషీయులు, యోబూషీయుల దేశమిది.”Shortcut Links
ఆదికాండము - Genesis : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |