Genesis - ఆదికాండము 21 | View All

1. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాటచొప్పున శారాను గూర్చి చేసెను.

1. యెహోవా శారాకు అనుగ్రహిస్తానని ఆమెకు వాగ్దానం చేసాడు. ఆయన వాగ్దానం చేసినట్టే ఆమెపై అనుగ్రహాన్ని చూపాడు.

2. ఎట్లనగా దేవుడు అబ్రాహాముతో చెప్పిన నిర్ణయకాలములో శారా గర్భవతియై అతని ముసలి తనమందు అతనికి కుమారుని కనెను.
గలతియులకు 4:22, హెబ్రీయులకు 11:11

2. అబ్రాహాము వృద్దాప్యంలో శారా గర్భవతి అయ్యింది, అతనికి ఒక కుమారుని కన్నది. ఈ సంగతులన్నీ సరిగ్గా దేవుడు వాగ్దానం చేసినట్టే జరిగాయి.

3. అప్పుడు అబ్రాహాము తనకు పుట్టిన వాడును తనకు శారా కనిన వాడు నైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను.
మత్తయి 1:2, లూకా 3:34

3. శారా కుమారుని కన్నది, అబ్రాహాము వానికి ఇస్సాకు అని పేరు పెట్టాడు.

4. మరియదేవుడు అబ్రాహాము కాజ్ఞాపించిన ప్రకారము అతడు ఎనిమిది దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను.
అపో. కార్యములు 7:8

4. దేవుడు ఆజ్ఞాపించినట్టు, ఇస్సాకుకు ఎనిమిది రోజులు నిండగానే అబ్రాహాము అతనికి సున్నతి చేశాడు.

5. అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు నూరేండ్లవాడు.

5. తన కుమారుడు ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రాహాము నయస్సు 100 సంవత్సరాలు.

6. అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలుగజేసెను. వినువారెల్ల నా విషయమై నవ్వుదురనెను.

6. “దేవుడు నన్ను సంతోషపెట్టాడు. ఇది విన్న ప్రతి ఒక్కరూ నాతో సంతోషిస్తారు.

7. మరియశారా పిల్లలకు స్తన్యమిచ్చునని యెవరు అబ్రాహాముతో చెప్పును నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని గదా? అనెను.

7. నేను శారాను, అబ్రాహాము కుమారుణ్ణి పొందుతాడని ఏ ఒక్కరూ తలంచలేదు. కానీ ఆయన వృద్ధుడుగా ఉన్నప్పుడు అబ్రాహాముకు నేను ఒక కుమారుని కన్నాను” అంది శారా.

8. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రాహాము గొప్ప విందు చేసెను.

8. ఇస్సాకు ఎదుగుతున్నాడు. త్వరలోనే గట్టి పదార్థాలు భోజనం చేసేటంతటి పెద్దవాడయ్యాడు. అప్పట్లో అబ్రాహాము ఒక మహా గొప్ప విందు చేసాడు.

9. అప్పుడు అబ్రాహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి
గలతియులకు 4:29

9. గతంలో ఈజిప్టు బానిసైన స్త్రీ హాగరు ఒక కుమారుని కన్నది. ఆ కుమారునికి కూడా తండ్రి అబ్రాహామే. అయితే ఆ కుమారుడు ఇప్పుడు ఇస్సాకును వేధించడం శారా చూసింది.

10. ఈ దాసిని దీని కుమారుని వెళ్లగొట్టుము; ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై యుండడని అబ్రాహాముతో అనెను.
గలతియులకు 4:30

10. “కనుక ఆ బానిస స్త్రీని, ఆమె కుమారుణ్ణి బలవంతంగా వెళ్లగొట్టు. మన మరణం తరువాత మన కుమారుడు ఇస్సాకు మన ఆస్తి అంతటికి వారసుడవుతాడు. దానిలో దాసీ కుమారుడు ఇస్సాకుతో భాగం పంచుకోవటం నాకు ఇష్టం లేదు అంటూ” శారా అబ్రాహాముతో చెప్పింది.

11. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రాహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను.

11. ఇదంతా అబ్రాహాముకు బాధ కలిగించింది. తన కుమారుడైన ఇష్మాయేలును గూర్చి అతడు చింతించాడు.

12. అయితే దేవుడు ఈ చిన్న వాని బట్టియు నీ దాసిని బట్టియు నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము; ఇస్సాకు వలన అయినది యే నీ సంతానమనబడును.
హెబ్రీయులకు 11:18, మత్తయి 1:2, రోమీయులకు 9:7

12. కానీ అబ్రాహాముతో దేవుడన్నాడు: “ఆ పిల్లవాణ్ణి గూర్చి నీవు చింతించకు. ఆ బానిస స్త్రీని గూర్చి నీవు చింతపడకు. శారా కోరినట్టే చేయి. ఇస్సాకు మాత్రమే నీకు వారసుడయిన కుమారుడు.

13. అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతనికూడ ఒక జనముగా చేసెదనని అబ్రాహాముతో చెప్పెను.

13. అయితే నీ బానిస స్త్రీ కుమారుణ్ణి కూడా నేను ఆశీర్వదిస్తాను. అతడు నీ కుమారుడే, కనుక అతని వంశం నుండి గూడ నేను ఒక గొప్ప జనాన్ని చేస్తాను.”

14. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసికొని ఆ పిల్లవానితో కూడ హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్లి బెయేరషెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను.

14. మర్నాడు వేకువనే అబ్రాహాము కొంత భోజనాన్ని, తిత్తిలో నీళ్లు తెచ్చాడు. అబ్రాహాము వీటిని హాగరుకు ఇచ్చాడు. హాగరు వీటిని తీసుకొని, తన కుమారునితో కలసి వెళ్లిపోయింది. హాగరు ఆ చోటు విడిచి బెయేర్షెబా అరణ్యంలో సంచరించింది.

15. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాని పడవేసి

15. కొన్నాళ్లకు తిత్తిలోని నీళ్లన్నీ అయిపోయాయి. తాగటానికి ఏమీ మిగలలేదు. కనుక హాగరు తన కుమారుణ్ణి ఒక పొద పక్కన పెట్టింది.

16. యీ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని, వింటి వేత దూరము వెళ్లి అతని కెదురుగా కూర్చుండెను. ఆమె యెదురుగా కూర్చుండి యెలుగెత్తి యేడ్చెను.

16. హాగరు కొంచె దూరం నడచి వెళ్లింది. అక్కడ ఆగిపోయి కూర్చుంది. నీళ్లు లేవు గనుక తన కుమారుడు చనిపోతాడనుకొంది హాగరు. వాడు చస్తోంటే చూడటం ఆమెకు ఇష్టం లేదు. ఆమె అక్కడ కూర్చొని ఏడ్వటం మొదలు పెట్టింది.

17. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి హాగరూ నీకేమివచ్చినది? భయపడకుము; ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని యున్నాడు;

17. ఆ పిల్లవాడు ఏడ్వడం దేవుడు విన్నాడు. పరలోకంనుండి దేవుని దూత హాగరును పిలిచాడు. అతడన్నాడు, “హాగరూ, ఏం జరిగింది? భయపడకు. అక్కడ పిల్లవాడు ఏడ్వడం యెహోవా విన్నాడు.

18. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము; వానిని గొప్ప జనముగా చేసెదనని ఆమెతో అనెను.

18. వెళ్లి పిల్లవాడికి సహాయం చేయి. వాడి చేయి పట్టి నడిపించు. ఒక గొప్ప జనాంగానికి అతణ్ణి తండ్రిగా నేను చేస్తాను”

19. మరియదేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్లి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను.

19. అంతలో హాగరుకు ఒక బావి కనబడేటట్టు చేసాడు దేవుడు. కనుక హాగరు ఆ బావి దగ్గరకు వెళ్లి తన తిత్తిని నీళ్లతో నింపుకొన్నది. తర్వాత పిల్లవాడు తాగటానికి ఆమె నీళ్లు ఇచ్చింది.

20. దేవుడు ఆ చిన్నవానికి తోడైయుండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి విలుకాడాయెను.

20. ఆ పిల్లవాడు ఎదుగుతూ ఉండగా దేవుడు వానికి తోడుగానే ఉన్నాడు. ఇష్మాయేలు అరణ్యంలో జీవిస్తూ, వేయగాడయ్యాడు. బాణం కొట్టడంలో నిపుణత నేర్చుకొన్నాడు.

21. అతడు పారాను అరణ్యములో నున్నప్పుడు అతని తల్లి ఐగుప్తుదేశమునుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లిచేసెను.

21. అతని తల్లి అతని కోసం ఈజిప్టులో భార్యను కనుగొన్నది. వారు పారాను అరణ్యంలోనే జీవిస్తూ ఉన్నారు.

22. ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతియైన ఫీకోలును అబ్రాహాముతో మాటలాడినీవు చేయు పనులన్నిటిలోను దేవుడు నీకు తోడైయున్నాడు గనుక.

22. అంతట ఆబీమెలెకు, ఫీకోలు అబ్రాహాముతో మాట్లాడారు. అబీమెలెకు, అతని సైన్యాధిపతి ఫికోలు అబ్రాహాముతో ఇలా చెప్పారు: “నీవు చేసే ప్రతి దానిలోను దేవుడు నీతో ఉన్నాడు.

23. నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వంచింపక, నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకును నీవు పరదేశివైయున్న యీ దేశమునకు చేసెదనని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణము చేయుమని చెప్పెను.

23. కనుక ఇక్కడ దేవుని యెదుట నాకు ఒక వాగ్దానం చేయాలి. నాతో, నా పిల్లలతో నీవు న్యాయంగా వ్యవహరిస్తావని వాగ్దానం చేయాలి. నీవు నివసించిన ఈ దేశం మీద, నా మీద నీవు దయగలిగి ఉంటానని వాగ్దానం చేయాలి. నీపైన నేను ఎంత దయ చూపెట్టానో, నాపైన నీవు కూడా అంత దయ చూపెడ్తానని వాగ్దానం చేయాలి.”

24. అందుకు అబ్రాహాము ప్రమాణము చేసెదననెను.

24. “నన్ను నీవు ఎలా పరామర్శించావో నేను కాడు నిన్ను అలాగే పరామర్శిస్తానని నేను వాగ్దానం చేస్తున్నాను” అన్నాడు అబ్రాహాము.

25. అబీమెలెకు దాసులు బలాత్కారముగా తీసికొనిన నీళ్ల బావివిషయమై అబ్రాహాము అబీమెలెకును ఆక్షేపింపగా అబీమెలెకు ఈ పని యెవరు చేసిరో నేనెరుగను;

25. అప్పుడు అబ్రాహాము అబీమెలెకుతో ఒక ఫిర్యాదు చేసాడు. అబీమెలెకు సేవకులు ఒక మంచి నీటి బావిని స్వాధీనం చేసుకొన్నందుచేత అబ్రాహాము అబీమెలెకుతో ఫిర్యాదు చేసాడు.

26. నీవును నాతో చెప్పలేదు; నేను నేడే గాని యీ సంగతి వినలేదని చెప్పగా.

26. కానీ అబీమెలెకు, “ఇది ఎవరు చేసారో నాకు తెలియదు. ఇంతకు ముందు ఈ విషయం నీవు నాతో చెప్పలేదు” అన్నాడు.

27. అబ్రాహాము గొఱ్ఱెలను గొడ్లను తెప్పించి అబీమెలెకుకిచ్చెను. వారిద్దరు ఇట్లు ఒక నిబంధన చేసికొనిరి.

27. కనుక అబ్రాహాము, అబీమెలెకు ఒక ఒడంబడిక చేసుకొన్నారు. ఆ ఒడంబడిక సూచనగా కొన్ని గొర్రెలను, పశువులను అబీమెలెకుకు అబ్రాహాము ఇచ్చాడు.

28. తరువాత అబ్రాహాము తన గొఱ్ఱెల మందలో నుండి యేడు పెంటి పిల్లలను వేరుగా నుంచెను గనుక

28. ఏడు ఆడ గొర్రె పిల్లల్ని కూడా అబీమెలెకు ఎదుట ఉంచాడు అబ్రాహాము.

29. అబీమెలెకు అబ్రాహాముతో నీవు వేరుగా ఉంచిన యీ యేడు గొఱ్ఱపిల్లలు ఎందుకని యడిగెను. అందుకతడు

29. “ఈ ఏడు ఆడ గొర్రెపిల్లల్ని ఇలా ప్రత్యేకంగా ఎందుకు పెట్టావు?” అని అబీమెలెకు అబ్రాహామును అడిగాడు.

30. నేనే యీ బావిని త్రవ్వించినందుకు నా సాక్ష్యార్థముగా ఈ యేడు గొఱ్ఱ పిల్లలను నీవు నాచేత పుచ్చుకొనవలెనని చెప్పెను.

30. “ఈ గొర్రెపిల్లల్ని నా దగ్గర నుండి నీవు స్వీకరించినప్పుడు, ఈ బావిని నేను తవ్వించినట్టు రుజువు అవుతుంది” అని అబ్రాహాము జవాబిచ్చాడు.

31. అక్కడ వారిద్దరు అట్లు ప్రమాణము చేసికొనినందున ఆ చోటు బెయేరషెబా అనబడెను.

31. కనుక ఆ తర్వాత ఆ బావి బెయేర్షెబా అని పిలువబడింది. వారిద్దరు ఒకరికి ఒకరు ఆ స్థలంలో వాగ్దానం చేసుకొన్న చోటు గనుక దానికి వారు ఆ పేరు పెట్టారు.

32. బెయేరషెబాలో వారు ఆలాగు ఒక నిబంధన చేసికొనిన తరువాత అబీమెలెకు లేచి తన సేనాధిపతియైన ఫీకోలుతో ఫిలిష్తీయుల దేశమునకు తిరిగి వెళ్లెను.

32. కనుక అబ్రాహాము, అబీమెలెకు బెయేర్షెబా దగ్గర ఒక ఒడంబడిక చేసుకొన్నారు. అప్పుడు అబెమెలెకు, అతని సైన్యాధిపతి తిరిగి ఫిలిష్తీ ప్రజల దేశం వెళ్లిపోయారు.

33. అబ్రాహాము బెయేరషెబాలో ఒక పిచుల వృక్షమునాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసెను.

33. బెయేర్షెబాలో అబ్రాహాము ఒక అలంకారపు చెట్టు నాటాడు. అప్పుడు అబ్రాహాము ప్రభువు, ఎల్లప్పుడు జీవిస్తున్న దేవుడైన యెహోవాకు అతడు అక్కడ ప్రార్థన చేశాడు.

34. అబ్రాహాము ఫిలిష్తీయుల దేశములో అనేక దినములు పరదేశిగా నుండెను.

34. ఫిలిష్తీయుల దేశంలో అబ్రాహాము చాలాకాలం నివసించాడు.



Shortcut Links
ఆదికాండము - Genesis : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |