“ఒకే ఒక కొడుకు”– ఇష్మాయేల్ దాసికి పుట్టిన కొడుకు. అబ్రాహాముకూ అతని భార్యకూ పుట్టిన ఏకైక సంతానం ఇస్సాకు. దేవుని ఒడంబడిక, ప్రమాణాలకు సంబంధించిన ఒకే ఒక కొడుకు. బైబిల్లోని ఏకైక నిజ దేవుడు ఇతర దేవుళ్ళకు నరబలి చేయకూడదన్నాడు (లేవీయకాండము 18:21 ద్వితీయోపదేశకాండము 18:9-10 2 రాజులు 17:17). ఎందుకంటే ఇతర దేవుళ్ళు దేవుళ్ళే కాదు. వాళ్ళకు ఏదైనా అర్పించడం, ఎవరికైనా సరే, తగదు. సాటి మనుషుల్ని బలి ఇవ్వడం అంతకన్నా హీనం. భూమిపై ఉన్నవన్నీ, మనుషులందరూ సృష్టికర్త అయిన దేవునికి చెందినవారు (యెహె 18:4), అంతేగాక ఆయన విమోచించినవారు రెండింతలు ఆయన సొత్తు (ఆదికాండము 1:27 కీర్తనల గ్రంథము 50:10 యెషయా 42:5 యెహెఙ్కేలు 18:4 నిర్గమకాండము 13:1-2 నిర్గమకాండము 19:5 లేవీయకాండము 20:26 1 కోరింథీయులకు 6:19-20).
మనుషులంతా దేవుని ఆస్తి గనుక వారితో ఏం చెయ్యడం ఆయనకిష్టమైతే అలా చెయ్యవచ్చు. కావలిస్తే తనకు వారిని హోమబలిగా అర్పించమని కూడా అడిగే హక్కు ఆయనకు ఉంది. ఇస్సాకును అర్పించమని అబ్రాహాముకు చెప్పడం ఇలాంటిదే. దేవుడు న్యాయవంతుడు, పవిత్రుడైన దేవుడని గుర్తుంచుకోండి. తప్పు పని చెయ్యమని అబ్రాహామును ఎన్నటికీ కోరడు (యాకోబు 1:13). నిజానికి వేరొక మనిషిని బలిగా ఇమ్మని ఒక మనిషిని దేవుడు అడగడం బైబిలంతటిలో ఇక్కడ ఒక్క సారే.
ఇందులో దేవునికి రెండు ఉద్దేశాలు ఉన్నట్టు చూడవచ్చు. అబ్రాహాము భక్తి, నిష్ఠ, నమ్మకాలను పరీక్షించాలని; రెండవది లోక పాపాలకోసం తన కుమారుడైన యేసుక్రీస్తును అర్పించబోతున్న తన చర్యకు ముందుగా ఒక గుర్తును చూపడం. ఇది అబ్రాహాముకు పరీక్ష: ఇస్సాకు అబ్రాహాముకు ఏకైక కుమారుడనీ, అతడి వారసుడనీ, దేవుని ఒడంబడిక అతని మూలంగా స్థిరపడుతుందనీ దేవుడు అబ్రాహాముతో చెప్పాడు (ఆదికాండము 15:4 ఆదికాండము 17:16 ఆదికాండము 17:19 ఆదికాండము 21:12 ఆదికాండము 22:2). దేవుని మాటకే వ్యతిరేకంగా ఉన్నట్టు కనిపిస్తున్న దేవుని ఆజ్ఞ ఎదురైతే అబ్రాహాము దేవుని మాటపై ఇంకా నమ్మకం నిలుపుకుంటాడా? దేవుడు ఎలాంటి తప్పిదం చెయ్యడనీ, తన మాటను మీరడనీ నమ్ముతాడా? అబ్రాహాము ఈ పరీక్షకు నిలిచాడు. దేవుడు తననొక పని చెయ్యమన్నాడంటే దాని వెనుక సరైన కారణం తప్పక ఉంటుందనీ, దేవుడు ఏదో ఒక విధంగా తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడనీ నమ్మాడు (రోమీయులకు 4:21). ఇస్సాకును హతం చెయ్యవలసి వచ్చినా, దేవుడు తన మాటను నిలబెట్టుకునేందుకు అతణ్ణి తిరిగి బ్రతికిస్తాడని నమ్మాడు (హెబ్రీయులకు 11:17-19).
ఇదంతా దేవుడు యేసుక్రీస్తు విషయంలో ఏమి చేశాడో దానికి దృష్టాంతం. ఇస్సాకులాగే యేసు కూడా తండ్రికి ఏకైక కుమారుడు (యోహాను 3:16). ఆయన ఈ లోకానికి వారసుడు (హెబ్రీయులకు 1:2). దేవుడు తన కొత్త ఒడంబడికను ఆయన ద్వారా చేశాడు (హెబ్రీయులకు 9:15). అబ్రాహాముకు మాట ఇచ్చి లోకమంతటికీ దీవెనలు కలుగుతాయని చెప్పినది నెరవేరేది యేసు మూలంగానే (అపో. కార్యములు 3:26 గలతియులకు 3:14 ఎఫెసీయులకు 1:3). దేవుడు మానవ జాతిని ప్రేమిస్తూ పాపుల కోసం ఆయన్ను బలి చేశాడు (రోమీయులకు 5:8 హెబ్రీయులకు 9:28 1 పేతురు 3:18 1 యోహాను 4:9). తరువాత తన వాగ్దానాలన్నీ నెరవేర్చేందుకు ఆయన యేసును మళ్ళీ బతికించాడు (అపో. కార్యములు 2:24 అపో. కార్యములు 2:32-36 1 కోరింథీయులకు 15:3-4). దేవుడు ఇస్సాకును “మోరియా ప్రదేశానికి” తీసుకువెళ్ళమని అబ్రాహాముతో చెప్పాడు. జెరుసలం ఉన్నది ఈ ప్రదేశంలోనే (2 దినవృత్తాంతములు 3:1). యేసుక్రీస్తు సిలువ మరణం చెంది తిరిగి సజీవంగా లేచినది జెరుసలంలోనే గదా.