Genesis - ఆదికాండము 38 | View All

1. ఆ కాలమందు యూదా తన సహోదరులను విడిచి హీరా అను ఒక అదుల్లామీయునియొద్ద ఉండుటకు వెళ్లెను.

1. సుమారు అదే సమయంలో యూదా తన సోదరులను విడిచి, హీరా అనే ఒకతని దగ్గర ఉండేందుకు వెళ్లాడు. హీరా అదుల్లాము నివాసి.

2. అక్కడ షూయ అను ఒక కనానీయుని కుమార్తెను యూదా చూచి ఆమెను తీసికొని ఆమెతో పోయెను.

2. అక్కడ యూదా ఒక కనానీ అమ్మాయిని కలుసుకొని ఆమెను పెళ్లి చేసుకొన్నాడు. ఆ అమ్మాయి తండ్రి పేరు షూయ.

3. ఆమె గర్భవతియై కుమారుని కనగా అతడు వానికి ఏరు అను పేరు పెట్టెను.

3. ఆ కనానీ స్త్రీకి ఒక కుమారుడు పుట్టగా, వారు అతనికి ఏరు అని పేరు పెట్టారు.

4. ఆమె మరల గర్భవతియై కుమారుని కని వానికి ఓనాను అను పేరు పెట్టెను.

4. తర్వాత ఆమె మరో కుమారుని కన్నది. ఆ కుమారునికి వారు ఓనాను అని పేరు పెట్టారు.

5. ఆమె మరల గర్భవతియై కుమారుని కని వానికి షేలా అను పేరు పెట్టెను. ఆమె వీని కనినప్పుడు అతడు కజీబులోనుండెను.

5. తర్వాత షేలా అనే పేరుగల ఇంకో కుమారుడు ఆమెకు పుట్టాడు. యూదాకు మూడో కుమారుడు పుట్టునప్పుడు, అతడు కజీబులో నివాసం ఉంటున్నాడు.

6. యూదా తన జ్యేష్ఠకుమారుడైన ఏరునకు తామారు అను దానిని పెండ్లి చేసెను.

6. యూదా తన మొదటి కుమారుడైన ఏరుకు భార్యగా ఒక అమ్మాయిని ఏర్పాటు చేసాడు. ఆ అమ్మాయి పేరు తామారు.

7. యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతని చంపెను.

7. కానీ ఏరు చాలా చెడ్డపనులు చేసాడు. అతని విషయంలో యెహోవాకు సంతోషం లేదు. అందుచేత యెహోవా అతణ్ణి చంపేసాడు.

8. అప్పుడు యూదా ఓనానుతో - నీ అన్నభార్యయొద్దకు వెళ్లి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలుగ జేయుమని చెప్పెను.
మత్తయి 22:24, మార్కు 12:19, లూకా 20:28

8. అప్పుడు యూదా అతని సోదరుడైన ఓనానుతో “పోయి, చచ్చిన నీ సోదరుని భార్యతో శయనించు. ఆమెకు భర్తలా ఉండు. పిల్లలు పుడితే వారు నీ సోదరుడైన ఏరు పిల్లలుగా పరిగణించ బడతారు” అని చెప్పాడు.

9. ఓనాను ఆ సంతా నము తనది కానేరదని యెరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగజేయకుండునట్లు తన రేతస్సును నేలను విడిచెను.

9. ఈ సంబంధంవలన కలిగే పిల్లలు తన పిల్లలుగా పరిగణింపబడరని ఓనానుకు తెలుసు. ఓనాను తామారుతో సంభోగించి, ఇంద్రియమును బయట పడవేసాడు.

10. అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతనికూడ చంపెను.

10. దీనితో యెహోవాకు కోపము వచ్చి ఆయన ఓనానును చంపేసాడు.

11. అప్పుడు యూదాఇతడు కూడ ఇతని అన్నలవలె చని పోవు నేమో అనుకొనినా కుమారుడైన షేలా పెద్దవాడగువరకు నీ తండ్రియింట విధవరాలుగా నుండుమని తన కోడలైన తామారుతో చెప్పెను.కాబట్టి తామారు వెళ్లి తన తండ్రి యింట నివసించెను.

11. అప్పుడు యూదా “నీవు తిరిగి నీ తండ్రి యింటికి వెళ్లిపో. నా చిన్న కుమారుడు షేలా పెద్దవాడయ్యేంత వరకు నీవు మళ్లీ పెళ్లి చేసుకోకు” అని తన కోడలైన తామారుతో చెప్పాడు. షేలా కూడ తన అన్నల్లాగే చస్తాడేమోనని యూదాకు భయం. అతని కోడలు తామారు తిరిగి తన తండ్రి ఇంటికి వెళ్లిపోయింది.

12. చాలా దినములైన తరువాత షూయ కుమార్తెయైన యూదా భార్య చని పోయెను. తరువాత యూదా దుఃఖనివారణ పొంది, అదుల్లామీయుడైన హీరా అను తన స్నేహితునితో తిమ్నాతునకు తన గొఱ్ఱెల బొచ్చు కత్తిరించు వారియొద్దకు వెళ్లెను

12. ఆ తర్వాత షూయ కుమార్తె, యూదా భార్య చనిపోయింది. యూదాకు దుఃఖ కాలం తీరిపోయ్యాక, అతడు తన స్నేహితుడు, అదుల్లాము మివాసి హీరాతో కలిసి తిమ్నాతునకు వెళ్లాడు. తన గొర్రెల బొచ్చు కత్తిరించాలని యూద తిమ్నాతునకు వెళ్లాడు.

13. దాని మామ తన గొఱ్ఱెల బొచ్చు కత్త్తిరించుటకు తిమ్నాతునకు వెళ్లుచున్నాడని తామారునకు తెలుపబడెను.

13. తామారు తన మామగారు యూదా తన గొర్రెల బొచ్చు కత్తిరించేందుకు తిమ్నాతునకు వస్తున్నాడని తెలుసుకొంది.

14. అప్పుడు షేలా పెద్దవాడై నప్పటికిని తాను అతనికియ్యబడకుండుట చూచి తన వైధవ్యవస్త్రములను తీసివేసి, ముసుకువేసికొని శరీరమంతయు కప్పుకొని, తిమ్నాతునకు పోవు మార్గములోన

14. తామారు ఎప్పుడు విధవరాలి గుడ్డలే ధరించేది. కనుక ఇప్పుడు వేరే వస్త్రాలు ధరించి, నెత్తిమీద ముసుగు వేసుకొంది. అప్పుడు తిమ్నాతునకు దగ్గర్లో ఎనాయిం అనే పట్టణానికి పోయే మార్గంలో కూర్చొంది. యూదా చిన్న కుమారుడు షేల ఇప్పుడు పెద్దవాడయ్యాడని తామారుకు తెలుసు. అయినా గాని ఆమె అతణ్ణి పెళ్లి చేసికొనే ఏర్పాట్లు యూదా చేయటం లేదు.

15. యూదా ఆమెను చూచి, ఆమె తన ముఖము కప్పుకొనినందున వేశ్య అనుకొని

15. యూదా ఆ మార్గాన ప్రయాణం చేసాడు. అతడు ఆమెను చూశాడు గాని ఆమె వేశ్య అనుకొన్నాడు. (వేశ్యాలా ఆమె ముఖం మీద ముసుగు వేసుకొంది.)

16. ఆ మార్గమున ఆమె దగ్గరకు బోయి, ఆమె తన కోడలని తెలియక - నీతో పోయెదను రమ్మని చెప్పెను. అందుకామె-నీవు నాతో వచ్చినయెడల నా కేమి యిచ్చెదవని అడిగెను.

16. కనుక యూదా ఆమె దగ్గరకు వెళ్లి, “నన్ను నీతో లైంగింకంగా కలవనీ” అని అడిగాడు. (ఆమె తన కోడలు తామారు అని యూదాకు తెలియదు.) “అసలు నీవు ఏ మాత్రం ఇస్తావేంటి?” అంది ఆమె.

17. అందుకతడు-నేను మందలోనుండి మేక పిల్లను పంపెదనని చెప్పినప్పుడు ఆమె అది పంపువరకు ఏమైన కుదువ పెట్టినయెడల సరే అని చెప్పెను.

17. యూదా, “నా మందలోనుంచి ఒక మేక పిల్లను పంపిస్తా” అని జవాబిచ్చాడు. “సరే, ఒప్పుకొంటాను. కాని నీవు ఆ మేక పిల్లను పంపించేంత వరకు నా దగ్గర ఉంచుకొనేందుకు నీవు యింకేమైన నాకు ఇవ్వాలి సుమా” అని జవాబు చెప్పింది ఆమె.

18. అతడు-నేను నీయొద్ద ఏమి కుదువ పెట్టవలెనని అడిగినప్పుడు ఆమె-నీ ముద్రయు దాని దారమును నీ చేతికఱ్ఱయునని చెప్పెను. అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయెను; ఆమె అతనివలన గర్భవతి

18. “నేను నీకు మేకపిల్లను పంపిస్తానని రుజువుగా ఉండేందుకు నన్నేమి ఇవ్వమంటావు?” అడిగాడు యూదా. తామారు, “నీవు నీ ఉత్తరాల మీద ఉపయోగించే నీ ముద్ర, దాని దారం, నీ చేతి కర్ర ఇవ్వు” అని చెప్పింది. యూదా అవన్నీ ఆమెకు ఇచ్చాడు. అప్పుడు యూదా తామారుతో సంభోగించగా ఆమె గర్భవతి అయ్యింది.

19. అప్పుడామె లేచిపోయి తన ముసుకు తీసివేసి తన వైధవ్యవస్త్రములను వేసికొనెను.

19. తామారు ఇంటికి వెళ్లి, తన ముఖం మీద ముసుగు తీసివేసింది. మరల విధవ వస్త్రాలే ఆమె ధరించింది.

20. తరువాత యూదా ఆ స్త్రీ యొద్దనుండి ఆ కుదువను పుచ్చుకొనుటకు తన స్నేహితుడగు అదుల్లా మీయునిచేత మేకపిల్లను పంపినప్పుడు ఆమె అతనికి కనబడలేదు.

20. యూదా తామారుకు ఇచ్చిన మాట ప్రకారం ఒక మేకను ఇచ్చి తన స్నేహితుడు హీరాను ఆమె ఇంటికి పంపించాడు. మరియు ఆమె దగ్గర్నుండి ప్రత్యేక ముద్రను, చేతి కర్రను తీసుకొని రమ్మని యూదా అతనితో చెప్పాడు. కానీ హీరాకు ఆమె కనబడలేదు.

21. కాబట్టి అతడు-మార్గమందు ఏనాయిము నొద్ద నుండిన ఆ వేశ్య యెక్కడనున్నదని ఆ చోటి మనుష్యులను అడుగగా వారు-ఇక్కడ వేశ్య యెవతెయు లేదని చెప్పిరి.

21. “ఇక్కడ దారి ప్రక్కగా ఉంటూండే ఆ వేశ్య ఏమయింది?” అని ఏనాయిము దగ్గర కొందరిని అడిగాడు హీరా. “ఇక్కడ ఎన్నడూ వేశ్య నివసించలేదే” అని వాళ్లు అన్నారు.

22. కాబట్టి అతడు యూదా యొద్దకు తిరిగి వెళ్లిఆమె నాకు కనబడలేదు; మరియు ఆ చోటి మనుష్యులుఇక్కడికి వేశ్య యెవతెయు రాలేదని చెప్పిరని అనినప్పుడు

22. కనుక యూదా స్నేహితుడు యూదా దగ్గరకు తిరిగి వెళ్లి, “ఆ స్త్రీ నాకు కనబడలేదు. అక్కడ ఎన్నడూ వేశ్య లేదని అక్కడ ఉండేవాళ్లు చెప్పారు” అన్నాడు.

23. యూదా-మనలను అపహాస్యము చేసెదరేమో; ఆమె వాటిని ఉంచు కొననిమ్ము; ఇదిగో నేను ఈ మేక పిల్లను పంపితిని, ఆమె నీకు కనబడలేదు అనెను.

23. అందుచేత యూదా, “ఆ వస్తువులు ఆమె దగ్గరే ఉండనివ్వు. మనుష్యులు నన్ను చూచి నవ్వటం నాకు ఇష్టం లేదు. ఆమెకు మేకను ఇవ్వాలని నేను ప్రయత్నంచేసాను, కానీ ఆమె మనకు కనబడలేదు. అది చాలు” అన్నాడు.

24. రమారమి మూడు నెలలైన తరువాత నీ కోడలగు తామారు జారత్వము చేసెను; అంతేకాక ఆమె జారత్వమువలన గర్భవతియైనదని యూదాకు తెలుపబడెను. అప్పుడు యూదా-ఆమెను బయటికి తీసికొనిరండి, ఆమెను కాల్చి వేయవలెనని చెప్పెను.

24. మూడు నెలల తర్వాత, “నీ కోడలు తామారు ఒక వేశ్యలా పాపం చేసింది, ఇప్పుడు గర్భవతిగా ఉంది” అని యూదాతో చెప్పారు. అప్పుడు యూదా, “ఆమెను బయటకు లాగి చంపేసి, ఆమె శరీరాన్ని కాల్చివేయండి” అన్నాడు.

25. ఆమెను బయటికి తీసికొని వచ్చి నప్పుడు ఆమె తన మామయొద్దకు ఆ వస్తువులను పంపి-ఇవి యెవరివో ఆ మనుష్యునివలన నేను గర్భవతినైతిని. ఈ ముద్ర యీ దారము ఈ కఱ్ఱ యెవరివో దయచేసి గురుతు పట్టుమని చెప్పించెను.

25. తామారును చంపటానికి మనుష్యులు వెళ్లారు. అయితే ఆమె తన మామగారికి ఒక సందేశం పంపింది. “నన్ను గర్భవతిగా చేసినవాడు ఈ వస్తువుల స్వంతదారుడే. (ప్రత్యేక ముద్ర, చేతి కర్ర ఆమె అతనికి చూపించింది.) ఈ వస్తువులు చూడు. ఇవి ఎవరిది? ఈ ముద్ర, దారం ఎవరివి? ఈ చేతి కర్ర ఎవరిది?”

26. యూదా వాటిని గురుతు పట్టినేను నా కుమారుడైన షేలాను ఆమెకు ఇయ్యలేదు గనుక ఆమె నాకంటె నీతిమంతురాలని చెప్పి మరి యెప్పు డును ఆమెను కూడలేదు.

26. వాటిని యూదా గుర్తుపట్టి, “ఆమెదే సరి. నాదే తప్పు. నేను వాగ్దానం చేసిన ప్రకారం నా కుమారుడైన షేలాను నేను ఆమెకు ఇవ్వలేదు” అన్నాడు. యూదా మళ్లీ ఇక ఆమెతో శయనించలేదు.

27. ఆమె ప్రసవకాలమందు కవల వారు ఆమె గర్భమందుండిరి.

27. తామారు ప్రసవించే సమయం వచ్చినప్పుడు ఆమెకు కవలలు పుడతారని వారికి తెలిసింది.

28. ఆమె ప్రసవించుచున్నప్పుడు ఒకడు తన చెయ్యి బయటికి చాచెను గనుక మంత్రసాని ఎఱ్ఱనూలు తీసి వాని చేతికి కట్టి-ఇతడు మొదట బయటికి వచ్చెనని చెప్పెను.

28. ఆమె ప్రసవిస్తున్నప్పుడు ఒక శిశువు చేయి బయటకు వచ్చింది. మంత్రసాని ఆ చేతికి ఒక ఎర్ర దారం కట్టి, “ఈ శిశువు ముందు పుట్టాడు” అంది.

29. అతడు తన చెయ్యి వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటికి వచ్చెను. అప్పుడామెనీవేల భేదించుకొని వచ్చితివనెను. అందు చేత అతనికి పెరెసు అను పేరు పెట్టబడెను.
మత్తయి 1:3

29. అయితే ఆ శిశువు తన చేయి లోపలకు లాగేసాడు. అప్పుడు మరో శిశువు ముందు పుట్టాడు. కనుక “మొత్తానికి నీవే ముందు భేదించుకొని పుట్టావన్న మాట” అంది మంత్రసాని. అంచేత వారు పెరెసు అని వానికి పేరు పెట్టారు.

30. తరువాత తన చేతిని తొగరుగల అతని సహోదరుడు బయటికివచ్చెను. అతనికి జెరహు అను పేరు పెట్టబడెను.

30. తర్వాత రెండో శిశువు పట్టాడు. చేతికి ఎర్రదారం కట్టబడిన శిశువు వీడు. వారు వాడికి జెరహు అనే పేరు పెట్టారు.Shortcut Links
ఆదికాండము - Genesis : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |