Genesis - ఆదికాండము 41 | View All

1. రెండేండ్లు గడిచిన తరువాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటిదగ్గర నిలిచియుండగా

1. రెండు సంవత్సరాల తర్వాత ఫరోకు ఒక కల వచ్చింది. ఫరో నైలునది ప్రక్కగా నిలబడినట్టు అతనికి కల వచ్చింది.

2. చూపునకు అందమైనవియు బలిసినవియునైన యేడు ఆవులు యేటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయుచుండెను.

2. అప్పుడు ఏడు ఆవులు నదిలోనుంచి బయటకు రావటం ఫరో చూశాడు. ఆవులు బలిసి అందంగా ఉన్నాయి. ఆవులు అక్కడ నిలబడి గడ్డి తింటున్నాయి.

3. వాటి తరువాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి యేడు ఆవులు ఏటిలోనుండి పైకి వచ్చుచు ఏటి యొడ్డున ఆ ఆవులదగ్గర నిలుచుండెను.

3. అప్పుడు ఇంక ఏడు ఆవులు నదిలోనుంచి బయటకు వచ్చాయి. కానీ ఈ ఆవులు చిక్కిపోయి, బక్కగా ఉన్నాయి. అందంగా ఉన్న ఏడు ఆవుల ప్రక్కగా ఈ ఏడు ఆవులు నిలబడ్డాయి.

4. అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేయుచుండెను. అంతలో ఫరో మేలుకొనెను.

4. అసహ్యంగా ఉన్న ఏడు ఆవులు అందంగా బలిసి ఉన్న ఏడు ఆవులను తినివేసాయి. అంతలో ఫరో మేల్కొన్నాడు.

5. అతడు నిద్రించి రెండవసారి కల కనెను. అందులో మంచి పుష్టిగల యేడు వెన్నులు ఒక్క దంటున పుట్టుచుండెను.

5. ఫరో మరల నిద్రపోగా రెండవసారి కల వచ్చింది. ఒకే ధాన్యపు మొక్కకు ఏడు వెన్నులు పెరగటం అతడు తన కలలో చూశాడు. ఆ ధాన్యపు గింజలు బలంగా, బాగుండటం అతడు చూశాడు.

6. మరియు తూర్పు గాలిచేత చెడిపోయిన యేడు పీల వెన్నులు వాటి తరువాత మొలిచెను.

6. తర్వాత అదే ధాన్యపు మొక్కకు మరో ఏడు వెన్నులు పెరగటం అతడు చూశాడు. అయితే ఈ వెన్నులు పీలగా ఉండి, వేడి గాడ్పులకు పాడైపోయాయి.

7. అప్పుడు నిండైన పుష్టిగల ఆ యేడు వెన్నులను ఆ పీలవెన్నులు మింగివేసెను. అంతలో ఫరో మేలుకొని అది కల అని గ్రహించెను.

7. అప్పుడు పీలగా ఉన్న వెన్నులు, బలంగా బాగున్న వెన్నులను తినివేసాయి. ఫరోకు మరల మెళుకువ వచ్చింది. అదంతా కల మాత్రమేనని ఫరో గ్రహించాడు.

8. తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడెను గనుక అతడు ఐగుప్తు శకున గాండ్ర నందరిని అక్కడి విద్వాంసులనందరిని పిలువనంపి ఫరో తన కలలను వివరించి వారితో చెప్పెను గాని ఫరోకు వాటి భావము తెలుపగల వాడెవడును లేకపోయెను.

8. మర్నాడు ఉదయం ఆ కలల విషయమై ఫరోకు కలవరం కలిగింది. కనుక అతడు ఈజిప్టులోని మంత్రగాళ్లందరిని పిలిపించాడు. విద్వాంసులందరిని అతడు పిలిపించాడు. ఆ కలను గూర్చి ఫరో వాళ్లతో చెప్పాడు. అయితే వాళ్లలో ఒక్కడు కూడా ఆ కలను వివరించలేక పోయారు. దాని భావం చెప్పలేకపోయారు.

9. అప్పుడు పానదాయకుల అధిపతి-నేడు నా తప్పిదములను జ్ఞాపకము చేసికొనుచున్నాను.

9. అప్పుడు ద్రాక్షాపాత్రల సేవకునికి యోసేపు జ్ఞాపకం వచ్చాడు. ఆ సేవకుడు ఫరోతో ఇలా చెప్పాడు: “నాకు జరిగిన ఒక విషయం జ్ఞాపకం వస్తుంది.

10. ఫరో తన దాసులమీద కోపగించి నన్నును భక్ష్యకారుల అధిపతిని మా ఉభయులను రాజసంరక్షక సేనాధిపతి యింట కావలిలో ఉంచెను.

10. నా మీద, మరో సేవకుని మీద తమరికి కోపం వచ్చింది. మీరు మమ్మల్ని చెరసాలో వేసారు.

11. ఒక రాత్రి నేను అతడు మేమిద్దరము కలలు కంటిమి. ఒక్కొకడు వేరువేరు భావములు గల కలలు చెరి యొకటి కంటిమి.

11. చెరసాలలో మా యిద్దరికీ ఒకే రాత్రి కల వచ్చింది. ఒక్కో కలకు ఒక్కో అర్థం ఉంది.

12. అక్కడ రాజ సంరక్షక సేనాధిపతికి దాసుడైయుండిన యొక హెబ్రీ పడుచువాడు మాతో కూడ ఉండెను. అతనితో మా కలలను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావమును మాకు తెలిపెను.

12. హెబ్రీ యువకుడు ఒకడు మాతో బాటు ఆ చెరసాలలోనే ఉన్నాడు. రాజు సంరక్షక ధళాధిపతికి అతడు సేవకుడు. మేము మా కలలు అతనితో చెబితే, అతడు వాటిని మాకు వివరించాడు. ఒక్కో కల అర్థం అతడు మాకు చెప్పాడు.

13. అతడు మాకు ఏ యే భావము తెలిపెనో ఆయా భావముల చొప్పున జరిగెను. నా ఉద్యోగము నాకు మరల ఇప్పించి భక్ష్యకారుని వ్రేలాడదీయించెనని ఫరోతో చెప్పగా

13. అతడు చెప్పిన అర్థాలు సత్యం. నాకు విడుగల అవుతుందని, నా పాత ఉద్యోగం మళ్లీ నాకు లభిస్తుందని అతడు నాకు చెప్పాడు. అది సత్యమే. వంటల పెద్ద మరణిస్తాడని అతడు చెప్పాడు, అదీ సత్యమే.”

14. ఫరో యోసేపును పిలువనంపెను. కాబట్టి చెరసాలలోనుండి అతని త్వరగా రప్పించిరి. అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరోయొద్దకు వచ్చెను.

14. కనుక ఫరో చెరసాలలోనుంచి యోసేపును పిలిపించాడు. సంరక్షకులు వెంటనే యోసేపును చెరసాలలోనుంచి తీసుకొని వచ్చారు. యోసేపు క్షవరం చేసుకొని శుభ్రమైన బట్టలు వేసుకొన్నాడు. అప్పుడు అతడు వెళ్లి ఫరో ముందర నిలవబడ్డాడు.

15. ఫరో యోసేపుతో నేనొక కల కంటిని, దాని భావమును తెలుపగలవారెవరును లేరు. నీవు కలను విన్నయెడల దాని భావమును తెలుపగలవని నిన్నుగూర్చి వింటినని అతనితో చెప్పినందుకు

15. అప్పుడు ఫరో “నాకో కల వచ్చింది, అయితే ఆ కలను నాకు వివరించగల వాళ్లు ఒక్కళ్లూ లేరు. ఎవరైనా వారి కల నీతో చెబితే నీవు వాటిని వివరించి, భావంకూడ చెప్పగలవని నేను విన్నాను” అని యోసేపుతో అన్నాడు.

16. యోసేపు నావలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చునని ఫరోతో చెప్పెను.

16. యోసేపు, “కలలను గ్రహించటంలో నా నైపుణ్యం ఏమీ లేదు. ఆ శక్తి దేవుడికే ఉంది. కనుక దేవుడే ఫరోకు గూడ ఈ పని చేసి పెడ్తాడు” అని జవాబిచ్చాడు.

17. అందుకు ఫరోనా కలలో నేను ఏటియొడ్డున నిలుచుంటిని.

17. అప్పుడు ఫరో యోసేపుతో చెప్పాడు: “నా కలలో నేను నైలునది పక్కగా నిలబడ్డాను.

18. బలిసినవియు, చూపున కంద మైనవియునైన, యేడు ఆవులు ఏటిలోనుండి పైకివచ్చి జమ్ములో మేయుచుండెను.

18. ఆ నదిలోనుంచి ఏడు ఆవులు బయటకు వచ్చి గడ్డి మేయటం నేను చూశాను. ఈ ఆవులు బలిసి, అందంగా ఉన్నాయి.

19. మరియు నీరసమై బహు వికార రూపము కలిగి చిక్కిపోయిన మరి యేడు ఆవులు వాటి తరువాత పైకి వచ్చెను. వీటి అంత వికారమైనవి ఐగుప్తు దేశమందు ఎక్కడను నాకు కనబడలేదు.

19. అప్పుడు మరో ఏడు ఆవులు నదిలో నుంచి రావటం నేను చూశాను. ఈ ఆవులు బక్కచిక్కి రోగిష్టివిగా ఉన్నాయి. ఈజిప్టు దేశం మొత్తంలో నేను చూసిన ఆవుల్లో అవి పరమ అసహ్యంగా ఉన్నాయి.

20. చిక్కిపోయి వికారముగానున్న ఆవులు బలిసిన మొదటి యేడు ఆవులను తినివేసెను.

20. అసహ్యమైన ఈ ఏడు ఆవులు ముందు వచ్చిన అందమైన ఏడు ఆవులను తినివేసాయి.

21. అవి వాటి కడుపులో పడెను గాని అవి కడుపులో పడినట్టు కనబడలేదు, మొదట ఉండినట్లే అవి చూపు నకు వికారముగా నుండెను. అంతలో నేను మేలుకొంటిని.

21. అయితే ఆ ఏడు ఆవులను తినివేసిన తర్వాత కూడ అవి ఇంకా బక్కచిక్కి ఉన్నాయి. వాటిని చూస్తే, అవి ఏడు ఆవులను తిన్న వాటిల్లాగ అగుపించవు. ముందు అవి ఎంత బక్కగా అసహ్యంగా ఉన్నాయో యిప్పుడూ అలానే కనబడ్డాయి. అప్పుడు నేను మేల్కొన్నాను.”

22. మరియు నా కలలో నేను చూడగా పుష్టిగల యేడు మంచి వెన్నులు ఒక్కదంటున పుట్టెను.

22. “తర్వాత నాకు వచ్చిన మరో కలలో ఒకే ధాన్యపు మొక్కకు ఏడు వెన్నులు పెరగటం నేను చూశాను. ఆ వెన్నులు నిండుగా, చక్కగా, అందంగా ఉన్నాయి.

23. మరియు తూర్పు గాలిచేత చెడి పోయి యెండిన యేడు పీలవెన్నులు వాటి తరువాత మొలిచెను.

23. తర్వాత వాటికి యింకా ఏడు వెన్నులు పెరిగాయి. కానీ ఆ వెన్నులు పీలగా, అసహ్యంగా ఉండి, వేడి గాడ్పులకు పాడైపోయాయి.

24. ఈ పీలవెన్నులు ఆ మంచి వెన్నులను మింగివేసెను. ఈ కలను జ్ఞానులకు తెలియ చెప్పితిని గాని దాని భావమును తెలుపగలవారెవరును లేరని అతనితో చెప్పెను.

24. అప్పుడు ఏడు మంచి వెన్నులను పీల వెన్నులు తినివేసాయి. మంత్రాలు తెలిసిన నా మనుష్యులకు, విద్వాంసులకు నేను ఈ కల చెప్పాను. కానీ ఎవ్వరూ ఆ కలను వివరించలేక పోతున్నారు. ఏమిటి దీని భావం?”

25. అందుకు యోసేపుఫరో కనిన కల ఒక్కటే. దేవుడు తాను చేయబోవుచున్నది ఫరోకు తెలియచేసెను. ఆ యేడు మంచి ఆవులు ఏడు సంవత్సరములు

25. అప్పుడు ఫరోతో యోసేపు ఇలా చెప్పాడు: “ఈ రెండు కలల భావం ఒక్కటే. ఏమి చేయనున్నాడో అది దేవుడు మీతో చెబతున్నాడు.

26. ఆ యేడు మంచి వెన్నులును ఏడు సంవత్స రములు.

26. ఏడు మంచి ఆవులు ఏడు సంవత్సరాలు. ఏడు మంచి ధాన్యపు వెన్నులు ఏడు సంవత్సరాలు. రెండు కలల్లోని సంగతి ఒక్కటే.

27. కల ఒక్కటే. వాటి తరువాత, చిక్కిపోయి వికారమై పైకివచ్చిన యేడు ఆవులును ఏడు సంవత్సరములు; తూర్పు గాలిచేత చెడిపోయిన యేడు పీలవెన్నులు కరవుగల యేడు సంవత్సరములు.

27. బక్కచిక్కి ఉన్న ఏడు ఆవులు, పీలగా ఉన్న ఏడు ధాన్యపు వెన్నులు కూడ, ఏడు అంటే, అవి ఈ దేశంలో ఏడు ఆకలి సంవత్సరాలు. ఏడు మంచి సంవత్సరాల తర్వాత ఈ ఏడు సంవత్సరాలు వస్తాయి.

28. నేను ఫరోతో చెప్పు మాట యిదే. దేవుడు తాను చేయబోవుచున్నది ఫరోకు చూపించెను.

28. త్వరలో ఏమి జరుగుతుందో దాన్ని దేవుడు మీకు చూపెట్టాడు. నేను చెప్పినట్టే ఇది జరుగుతుంది.

29. ఇదిగో ఐగుప్తు దేశమందంతటను బహు సమృద్ధిగా పంటపండు ఏడు సంవత్సరములు వచ్చుచున్నవి.

29. ఈజిప్టు దేశమంతటా ఏడేళ్లపాటు మంచి పంటలు పండి తినటానికి సమృద్ధిగా ఉంటుంది.

30. మరియు కరవు గల యేడు సంవత్సరములు వాటి తరువాత వచ్చును; అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరువబడును, ఆ కరవు దేశ మును పాడుచేయును.

30. అయితే ఆ ఏడు సంవత్సరాల తర్వాత, దేశమంతటా కరువు సంవత్సరాలు ఏడు వస్తాయి. ఈజిప్టులో పండిన పంట ఎంత ఉన్నదానిని మరచిపోతారు. ఈ ఆకలి దేశాన్ని నాశనం చేస్తుంది.

31. దాని తరువాత కలుగు కరవుచేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును; ఆ కరవు మిక్కిలి భారముగా నుండును.

31. సమృద్ధగా భోజనం చేయటం అంటే ఏమిటో ప్రజలు మరచిపోతారు.

32. ఈ కార్యము దేవునివలన నిర్ణయింపబడి యున్నది. ఇది దేవుడు శీఘ్ర ముగా జరిగించును. అందుచేతనే ఆ కల ఫరోకు రెట్టింప బడెను.

32. “ఫరోగారూ, ఒకే విషయాన్ని గూర్చి మీకు రెండు కలలు ఎందుకు వచ్చాయి? దేవుడు తప్పక జరిపిస్తాడని చూపించేందుకు ఇలా జరిగింది. అదీ త్వరలోనే దేవుడు జరిగిస్తాడని సూచిస్తోంది.

33. కాబట్టి ఫరో వివేక జ్ఞానములుగల ఒక మనుష్యుని చూచుకొని ఐగుప్తు దేశముమీద అతని నియ మింపవలెను.

33. కనుక ఓ ఫరో, చాలా తెలివి, జ్ఞానం ఉన్న ఒక మనిషిని మీరు ఏర్పాటు చేసుకోవాలి. ఆ మనిషిని ఈజిప్టు దేశం అంతటిమీద అధికారిగా మీరు నియమించాలి.

34. ఫరో అట్లు చేసి యీ దేశముపైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంటపండు ఏడు సంవత్సరములలో ఐగుప్తు దేశమందంతటను అయిదవ భాగము తీసికొనవలెను.

34. ఆ తర్వాత ప్రజల దగ్గర్నుండి ధాన్యం సేకరించేందుకు మరి కొందర్ని మీరు నియమించాలి. ప్రతీ వ్యక్తి ఏడు మంచి సంవత్సరాల్లో పండించే మంచి పంటలో అయిదవ భాగం ఇవ్వాలి.

35. రాబోవు ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహార మంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకై భద్రము చేయవలెను.

35. రాబోయే మంచి సంవత్సరాల కాలంలో ఈ ధాన్యం అంతా సేకరించమని ఈ మనుష్యులకు ఆజ్ఞాపించండి. ఈ ధాన్యం పట్టణాల్లో భద్రం చేయటానికి వాళ్లకు అధికారం ఉందని ఈ మనుష్యులకు చెప్పండి. తర్వాత ఆ ధాన్యం అవసరం వచ్చేంతవరకు వారు దాన్ని కాపాడాలి. ఫరో! ఈ విధంగా ఆ ఆహారం మీ అధీనంలో ఉంటుంది.

36. కరవుచేత ఈ దేశము నశించి పోకుండ ఆ ఆహారము ఐగుప్తుదేశములో రాబోవు కరవు సంవత్సరములు ఏడింటికి ఈ దేశమందు సంగ్రహముగా నుండునని ఫరోతో చెప్పెను.

36. ఈజిప్టు దేశంలో వచ్చే ఏడు ఆకలి సంవత్సరాల్లో ఈ ధాన్యం సహాయపడుతుంది. అప్పుడు ఈజిప్టు ప్రజలు ఆ ఏడు సంవత్సరాల్లో కరువు కారణంగా మరణించరు.”

37. ఆ మాట ఫరోదృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమైయుండెను గనుక

37. ఇది చాలా చక్కని తలంపులా కనబడింది ఫరోకు. అతని సేవకులంతా ఒప్పుకొన్నారు.

38. అతడు తన సేవకులను చూచి ఇతనివలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని యనెను.

38. “ఈ పని చేసేందుకు యోసేపు కంటే మంచివాడ్ని ఇంకెవరినైనా మీరు కనుగొనగలరా? దేవుని ఆత్మ మూలంగా ఇతడు నిజంగా జ్ఞాని” అని ఫరో తన సేవకులతో చెప్పాడు.

39. మరియఫరో-దేవుడు ఇదంతయు నీకు తెలియపరచెను గనుక నీవలె వివేక జ్ఞానములు గలవారెవరును లేరు.

39. కనుక ఫరో, “వీటన్నింటిని దేవుడే నీకు చూపెట్టాడు కనుక నీవు అందరిలో మహా జ్ఞానివై ఉండాలి.

40. నీవు నా యింటికి అధికారివై యుండవలెను, నా ప్రజలందరు నీకు విధేయులై యుందురు; సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటె పైవాడనై యుందునని యోసేపుతో చెప్పెను.
అపో. కార్యములు 7:10

40. అంచేత నిన్నే ఈ దేశం మీద అధిపతిగా నేను చేస్తాను. ప్రజలు నీ ఆజ్ఞలన్నింటికి విధేయులవుతారు. ఈ దేశంలో నేను ఒక్కడ్ని మాత్రమే నీకంటె గొప్ప అధికారిగా ఉంటాను” అని యోసేపుతో చెప్పాడు.

41. మరియఫరో-చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి యున్నానని యోసేపుతో చెప్పెను.

41. (ఫరో యోసేపును రాజ్యపాలకునిగా నియమించినప్పుడు ప్రత్యేక సమావేశం మరియు ఊరేగింపు వుండినవి.) అప్పుడు ఫరో, “ఇప్పుడు ఈజిప్టు దేశం అంతటి మీద నిన్ను నేను పాలకునిగా నియమిస్తున్నాను” అని యోసేపుతో చెప్పాడు.

42. మరియఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి, సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి, అతని మెడకు బంగారు గొలుసు వేసి

42. అప్పుడు ఫరో రాజముద్రగల తన ఉంగరాన్ని యోసేపుకు ఇచ్చాడు. యోసేపు ధరించటానికి నాణ్యతగల ఒక అంగీని అతడు ఇచ్చాడు. యోసేపు మెడలో ఒక బంగారు గొలుసు ఫరో వేసాడు.

43. తన రెండవ రథముమీద అతని నెక్కించెను. అప్పుడు-వందనము చేయుడని అతని ముందర జనులు కేకలువేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటిమీద అతని నియమించెను.
అపో. కార్యములు 7:10

43. రెండో రాజరథం మీద తిరిగమని ఫరో యోసేపుతో చెప్పాడు. ప్రత్యేక సంరక్షకులు అతని రథానికి ముందర నడిచారు. “ప్రజలారా, యోసేపుకు సాష్టాంగపడండి” అంటూ వాళ్లు ప్రజలను హెచ్చరించారు. కనుక ఈజిప్టు దేశం అంతటి మీద యోసేపు పాలకునిగా నియమించబడ్డాడు.

44. మరియఫరో యోసేపుతో-ఫరోను నేనే; అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పెను.

44. అతనితో ఫరో అన్నాడు: “నేను ఫరోను అంటే రాజును. కనుక నేను ఏమి అయినా చేయాలనుకొంటే అది చేస్తాను. కానీ, ఈజిప్టులో మరి ఏ వ్యక్తి అయినా నీవు చెప్పకుండ ఒక చేయి ఎత్తకూడదు, కాలు కదపగూడదు.”

45. మరియఫరో యోసేపునకు జప్నత్ప నేహు అను పేరు పెట్టి, అతనికి ఓనుయొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెయగు ఆసెనతు నిచ్చి పెండ్లి చేసెను.

45. యోసేపుకు జప్నత్సనేహు అనే మరో పేరు ఫరో పెట్టాడు. ఓను యాజకుడు పోతీఫెర కుమార్తె ఆసెనతును యోసేపుకు భార్యగా ఫరో ఇచ్చాడు. కనుక ఈజిప్టు దేశం అంతటిమీద యోసేపు పాలకుడయ్యాడు.

46. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమందంతట సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో యెదుట నిలిచినప్పుడు ముప్పది సంవత్సరములవాడై యుండెను. అప్పుడు యోసేపు ఫరో యెదుటనుండి వెళ్లి ఐగుప్తు దేశమందంతట సంచారము చేసెను.
అపో. కార్యములు 7:10

46. యోసేపు ఈజిప్టు రాజు కొలువులో పని చేయడం మొదలు బెట్టినప్పుడు అతని వయస్సు 30సంవత్సరాలు. యోసేపు ఈజిప్టు దేశం అంతటా సంచారం చేసాడు.

47. సమృద్ధిగా పంటపండిన యేడు సంవత్సరములలో భూమి బహు విరివిగా పండెను.

47. ఏడు మంచి సంవత్సరాల కాలంలోనూ దేశంలో పంటలు బాగుగా పండాయి.

48. ఐగుప్తు దేశమందున్న యేడు సంవత్సరముల ఆహారమంతయు అతడు సమకూర్చి, ఆయా పట్టణములలో దాని నిలువచేసెను. ఏ పట్టణము చుట్టునుండు పొలముయొక్క ధాన్యము ఆ పట్టణమందే నిలువచేసెను.

48. ఆ ఏడు సంవత్సరాల్లో యోసేపు చాలా ధాన్యం ఈజిప్టులో పొదుపు చేసాడు. ఆహారాన్ని యోసేపు పట్టణాల్లో భద్రపరచాడు. ప్రతి పట్టణం చుట్టు ప్రక్కల పండిన పంటను ఆ పట్టణంలోనే యోసేపు భద్రపరచాడు.

49. యోసేపు సముద్రపు ఇసుకవలె అతి విస్తారముగా ధాన్యము పోగుచేసెను. కొలుచుట అసాధ్య మాయెను గనుక కొలుచుట మానివేసెను.

49. యోసేపు విస్తారంగా ధాన్యం చేర్చి పెట్టాడు. సముద్రపు ఇసుకలా ఉంది అదంతాను. కొలిచేందుకు గూడ వీలు లేనంత విస్తారంగా ఉంది అతడు చేర్చిపెట్టిన ధాన్యం.

50. కరవు సంవత్సరములు రాకమునుపు యోసేపుకిద్దరు కుమారులు పుట్టిరి. ఓనుయొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెయగు ఆసెనతు అతనికి వారిని కనెను.

50. ఓను యాజకుడైన పోతీఫెర కుమార్తె అయిన ఆసెనతు యోసేపుకు భార్య. మొదటి ఆకలి సంవత్సరం రాకముందే యోసేపు ఆసెనెతులకు ఇద్దరు కుమారులు పుట్టారు.

51. అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రియింటి వారినందరిని నేను మరచి పోవునట్లు చేసెనని చెప్పి తన జ్యేష్ఠకుమారునికి మనష్షే అను పేరు పెట్టెను.

51. మొదటి కుమారుని పేరు మనష్షే. “నా కష్టాలు అన్నింటినీ, నా ఇంటని గూర్చిన విషయాలన్నింటినీ నేను మరచిపోయేటట్టు దేవుడు చేసాడు” అని అనుకొన్నాడు గనుక యోసేపు అతనికి ఈ పేరు పెట్టాడు.

52. తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెనని చెప్పి, రెండవవానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టెను.

52. యోసేపు తన రెండవ కుమారునికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. “నాకు ఎన్నో గొప్ప కష్టాలు వచ్చాయి, గాని అన్ని విషయాల్లో దేవుడు నాకు సాఫల్యాన్ని కార్యసాధనను కల్గించాడు” అని యోసేపు అనుకొన్నాడు గనుక యోసేపు అతనికి ఈ పేరు పెట్టాడు.

53. ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంటపండిన సంవత్సరములు గడచిన తరువాత

53. ఏడు సంవత్సరాల పాటు ప్రజలు తినేందుకు అవసరమైన ఆహారం అంతా వారికి ఉంది. కానీ సంవత్సరాలన్నీ ముగిశాయి. అవసరమైనది అంతా పండింది.

54. యోసేపు చెప్పిన ప్రకారము ఏడు కరవు సంవత్సరములు ఆరంభమాయెను గాని ఐగుప్తు దేశమందంతటను ఆహార ముండెను.
అపో. కార్యములు 7:11

54. అయితే ఏడు సంవత్సరాల ఆకలి కాలం మొదలయింది. సరిగ్గా యోసేపు చెప్పినట్టే ఇది జరిగింది. అన్ని దేశాలలో, అంతట ఏ ఆహారం పండలేదు. తినుటకు ప్రజలకు ఏమీ లేదు. కానీ యోసేపు ధాన్యం భద్రపరచినందువల్ల ఈజిప్టులో ప్రజలు తినుటకు సరిపడినంత ఉంది.

55. ఐగుప్తు దేశమందంతటను కరవు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారము కోసము ఫరోతో మొరపెట్టుకొనిరి, అప్పుడు ఫరో-మీరుయోసేపు నొ ద్దకు వెళ్లి అతడు మీతో చెప్పునట్లు చేయుడని ఐగుప్తీయులందరితో చెప్పెను.
యోహాను 2:5, అపో. కార్యములు 7:11

55. కరువు కాలం ప్రారంభం కాగానే ఆహారంకోసం ప్రజలు ఫరోకు మొరపెట్టారు. ఫరో, “యోసేపును అడగండి. అతడు ఏమి చేయమంటే అలా చేయండి” అని చెప్పాడు ఈజిప్టు ప్రజలతో.

56. కరవు ఆ దేశమందంతటను ఉండెను గనుక యోసేపు కొట్లన్నియు విప్పించి ఐగుప్తీయులకు ధాన్యమమ్మకము చేసెను. ఐగుప్తు దేశ మందు ఆ కరవు భారముగా ఉండెను;

56. కనుక ఆ దేశంలో ఎక్కడ చూసినా కరువు ప్రబలుతున్నప్పుడు, ధాన్యము భద్రపరచిన గదులలో నుండి యోసేపు ప్రజలకు ధాన్యం ఇచ్చాడు. చేర్చిపెట్టిన ధాన్యం ఈజిప్టు ప్రజలకు యోసేపు విక్రయించాడు. ఈజిప్టులో కరువు చాలా భయంకరంగా ఉంది.

57. మరియు ఆ కరవు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపునొద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి.

57. ఈజిప్టు చుట్టుపక్కల దేశాల ప్రజలంతా ధాన్యం కొనేందుకు ఈజిప్టు వచ్చారు. కరువు ఈజిప్టులోను, మరి యితర ప్రాంతాలలోను ఎక్కువగా ఉంది. ఈజిప్టు చుట్టుపక్కల దేశాలవారు యోసేపు దగ్గరకు వచ్చారు.Shortcut Links
ఆదికాండము - Genesis : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |