Samuel II - 2 సమూయేలు 11 | View All

1. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతనివారిని ఇశ్రా యేలీయులనందరిని పంపగా వారు అమ్మోనీయులను సంహ రించి రబ్బా పట్టణమును ముట్టడివేసిరి; అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను.

1. వసంతకాలం వచ్చింది. రాజులు యుద్ధాలకు దిగే తరుణం. దావీదు యోవాబును, ఇతర సేవకులను, ఇశ్రాయేలీయులను సిద్ధంచేసి అమ్మోనీయులను నాశనం చేయటానికి పంపాడు యోవాబు సైన్యం (అమ్మోనీయుల రాజధాని నగరమైన) రబ్బా నగరంపై కూడ దాడి చేసింది. ఈసారి దావీదు యెరూషలేములోనే వుండిపోయాడు.

2. ఒకానొక దినమున ప్రొద్దు గ్రుంకువేళ దావీదు పడకమీదనుండి లేచి రాజనగరి మిద్దెమీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానముచేయు ఒక స్త్రీ కనబడెను.

2. ఆ రోజు సాయంత్రం పడకనుంచి లేచి, రాజు మేడ మీద అటు యిటు తిరుగ సాగాడు. అప్పుడతడు స్నానం చేస్తూ ఉన్న స్త్రీనొక దానిని చూసాడు. ఆమె చాలా అందంగా ఉంది.

3. ఆమె బహు సౌందర్యవతియై యుండుట చూచి దావీదు దాని సమాచారము తెలిసికొనుటకై యొక దూతను పంపెను, అతడు వచ్చిఆమె ఏలీయాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యయునైన బత్షెబ అని తెలియజేయగా

3. దావీదు తన సేవకులను పిలువనంపాడు. ఆ స్త్రీ ఎవరని అడుగగా, ఒక సేవకుడు, “ఆమె పేరు బత్షెబ అనీ, ఆమె ఏలీయాము కుమార్తె అనీ చెప్పాడు. ఆమె హిత్తీయుడగు ఊరియాకు భార్య అనికూడ చెప్పాడు.”

4. దావీదు దూతలచేత ఆమెనుపిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను; కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన యింటికి మరల వచ్చెను.

4. దావీదు దూతలను పంపి బత్షెబను తన వద్దకు తీసుకొని రమ్మని చెప్పాడు. ఆమె దావీదు వద్దకు వచ్చినప్పుడు, ఆమెతో అతడు సంగమించాడు. ఆమె స్నానాదులు చేసి, శుచియై తన ఇంటికి వెళ్లిపోయింది.

5. ఆ స్త్రీ గర్భవతియైనేను గర్భవతినైతినని దావీదునకు వర్తమానము పంపగా

5. కాని “బత్షెబ గర్భవతి” అయింది. ఈ విషయమై దావీదుకు వర్తమానం పంపింది.

6. దావీదు హిత్తీయుడగు ఊరియాను నాయొద్దకు పంపుమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చెను.

6. దావీదు ఒక వర్తమానం యోవాబుకు పంపాడు. “హిత్తీయుడగు ఊరియాను నా వద్దకు పంపుమని” కబురు చేశాడు. అందువల్ల యోవాబు ఊరియాను దావీదు వద్దకు పంపాడు.

7. ఊరియా దావీదు నొద్దకు రాగా దావీదు యోవాబు యోగక్షేమ మును జనుల యోగక్షేమమును యుద్ధసమాచారమును అడి గెను.

7. ఊరియా దావీదు వద్దకు వచ్చాడు. దావీదు అతనిని యోవాబు ఎలా ఉన్నాడనీ, సైనికులెలా వున్నారనీ, యుద్ధం ఎలా కొనసాగుతున్నదనీ అడిగాడు.

8. తరువాత దావీదుఇంటికి పోయి శ్రమ తీర్చుకొనుమని ఊరియాకు సెలవియ్యగా, ఊరియా రాజ నగరిలోనుండి బయలువెళ్లెను.

8. తరువాత “ఇంటికి పోయి విశ్రాంతి తీసుకోమని” దావీదు ఊరియాకు చెప్పాడు. ఊరియా రాజు ఇంటిని వదిలి బయటికి వచ్చాడు. రాజు ఊరియాకు ఒక బహుమానం కూడ పంపాడు.

9. అతనివెనుక రాజు ఫలా హారము అతనియొద్దకు పంపించెను గాని ఊరియా తన యింటికి వెళ్లక తన యేలినవాని సేవకులతో కూడ రాజ నగరిద్వారమున పండుకొనెను.

9. కాని ఊరియా ఇంటికి పోలేదు. రాజు ఇంటి ఆవరణ ద్వారం వద్ద ఊరియా నిద్రపోయాడు. మిగిలిన రాజ సేవకుల మాదిరిగా అతను కూడా అక్కడే నిద్ర పోయాడు.

10. ఊరియా తన యింటికి పోలేదను మాట దావీదునకు వినబడినప్పుడు దావీదు ఊరి యాను పిలిపించినీవు ప్రయాణముచేసి వచ్చితివి గదా; యింటికి వెళ్లకపోతివేమని యడుగగా

10. “ఊరియా ఇంటికి పోలేదని” సేవకులు దావీదుకు చెప్పారు. అప్పుడు దావీదు ఊరియాను పిలిచి, “నీవు చాలా దూరంనుండి వచ్చావు గదా! నీవు ఇంటికి ఎందుకు వెళ్లలేదు?” అని అడిగాడు.

11. ఊరియామందస మును ఇశ్రాయేలు వారును యూదావారును గుడారములలో నివసించుచుండగను, నా యధిపతియగు యోవా బును నా యేలినవాడవగు నీ సేవకులును బయట దండులో నుండగను, భోజనపానములు చేయుటకును నా భార్యయొద్ద పరుండుటకును నేను ఇంటికిపోదునా? నీ తోడు నీ ప్రాణముతోడు నేనాలాగు చేయువాడను కానని దావీదుతో అనెను.

11. దావీదుతో ఊరియా ఇలా అన్నాడు: “పవిత్ర పెట్టె, ఇశ్రాయేలు, యూదా సైనికులు అందరూ గుడారాలలో ఉంటున్నారు. నా యజమాని యోవాబు, నా ప్రభువు (దావీదు రాజు) యొక్క సేవకులందరూ బయట పొలాల్లో గుడారాలు వేసుకొనివున్నారు. కావున నేను ఇంటికి వెళ్లి తాగి, భార్యతో విలాసంగా కాలం గడపటం మంచిది కాదు!”

12. దావీదునేడును నీ విక్కడ నుండుము, రేపు నీకు సెలవిత్తునని ఊరియాతో అనగా ఊరియా నాడును మరునాడును యెరూషలేములో నిలిచెను.

12. “అయితే ఈ రోజు ఇక్కడే ఉండు. రేపు నిన్ను మళ్లీ యుద్ధానికి పంపివేస్తాను” అని దావీదు ఊరియాతో అన్నాడు. ఊరియా ఆ రోజు యెరూషలేములో ఉన్నాడు. అతడు మరుసటి రోజు తెల్లవారే వరకు వున్నాడు.

13. అంతలో దావీదు అతనిని భోజనమునకు పిలిపించెను; అతడు బాగుగా తిని త్రాగిన తరువాత దావీదు అతని మత్తునిగా చేసెను; సాయంత్రమున అతడు బయలు వెళ్లి తన యింటికి పోక తన యేలినవాని సేవకుల మధ్య పడకమీద పండుకొనెను.

13. ఊరియాను తన వద్దకు వచ్చి కన్పించమని దావీదు కబురు పంపాడు. దావీదుతో కలిసి ఊరియా బాగా తాగి, తిన్నాడు. దావీదు ఊరియాకు బాగా తాగ బోశాడు. అయినా ఊరియా ఇంటికి పోలేదు. ఆరోజు సాయంత్రం ఊరియా రాజుగారి సేవకులతో కలిసి రాజభవన ద్వారం వద్ద నిద్రపోవటానికి వెళ్లాడు.

14. ఉదయమున దావీదు యుద్ధము మోపుగా జరుగుచున్నచోట ఊరియాను ముందుపెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యొద్దనుండి వెళ్లి పొమ్మని

14. మరునాటి ఉదయం దావీదు యోవాబుకు ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం ఊరియా ద్వారా పంపాడు.

15. యోవాబునకు ఉత్తరము వ్రాయించి ఊరియాచేత పంపించెను.

15. ఆ ఉత్తరంలో దావీదు ఇలా రాశాడు, “యుద్ధం ఎక్కడ ముమ్మరంగా సాగుతూ వుంటుందో అక్కడ ఊరియాను ముందు వరుసలో పెట్టు. అక్కడ వానిని ఒంటరిగా వదిలి వేయి. అలా నిస్సహాయుడై చనిపోయేలా చేయి.”

16. యోవాబు పట్ట ణమును ముట్టడివేయు చుండగా, ధైర్యవంతులుండు స్థల మును గుర్తించి ఆ స్థలమునకు ఊరియాను పంపెను.

16. యెవాబు నగరాన్ని పరిశీలించి ఎక్కడ అమ్మోనీయులు ధైర్యంగా ఉన్నారో చూశాడు. అతడా ప్రదేశానికి ఊరియాను పంప నిర్ణయించాడు.

17. ఆ పట్టణపువారు బయలుదేరి యోవాబుతో యుద్ధమునకు రాగా దావీదు సేవకులలో కొందరు కూలిరి, హిత్తీయుడగు ఊరియాయును హతమాయెను.

17. ఆ నగర (అమ్మోనీయుల రాజధానియగు రబ్బా) ప్రజలు యోవాబును ఎదిరించటానికి బయటికి వచ్చారు. దావీదు మనుష్యులు కొందరు చంపబడ్డారు. చంపబడిన వారిలో హిత్తీయుడైన ఊరియా ఒకడు.

18. కాబట్టి యోవాబు యుద్ధ సమాచార మంతయు దావీదునొద్దకు పంపి దూతతో ఇట్లనెను

18. యుద్ధ పరిణామాలపై యోవాబు దావీదుకు ఒక నివేదిక పంపాడు.

19. యుద్ధసమాచారము నీవు రాజుతో చెప్పి చాలించిన తరువాత రాజు కోపము తెచ్చుకొనియుద్ధము చేయునప్పుడు మీరెందుకు పట్టణము దగ్గరకు పోతిరి?

19. ఆ దూతతో యుద్ధంలో ఏమి జరిగిందో దావీదురాజుకు వివరంగా చెప్పమన్నాడు.

20. గోడమీదనుండి వారు అంబులు వేయుదురని మీకు తెలి యక పోయెనా?

20. “బహుశః రాజు కలత చెందుతాడు. ‘యోవాబు సైన్యం నగర సమీపానికి ఎందుకు వెళ్లింది? వారు గోడల మీదుగా బాణాలు వేశేవారని తెలియదా?

21. ఎరుబ్బెషెతు కుమారుడైన అబీమెలెకు ఏలాగు హతమాయెను? ఒక స్త్రీ తిరుగటిరాతి తునకఎత్తి గోడమీదనుండి అతని మీద వేసినందున అతడు తేబేసుదగ్గర హతమాయెను గదా? ప్రాకారముదగ్గరకు మీరెందుకు పోతిరని నిన్నడిగినయెడల నీవుతమరి సేవకు డగు ఊరియాయు హతమాయెనని చెప్పుమని బోధించి దూతను పంపెను.

21. ఎరుబ్బెషెతు కుమారుడైన అబీమెలుకును ఎవరు చంపారో మీకు గుర్తుందా? ఆ నగర గొడపై నుండి ఒక స్త్రీ తిరుగలి పై రాయిని విసరివేయగా అబీమెలెకు చనిపోయాడు. ఆ స్త్రీ అతనిని తేబేసువద్ద చంపింది. మీరు ఆ గోడ చెంతకు ఎందుకు వెళ్లారు? అని అనవచ్చు. దావీదు రాజు గనుక అలా అంటే నీవు తప్పకుండా ‘నీ సేవకుడు హిత్తీయుడైన ఊరియా కూడా చనిపోయాడు’ అని చెప్పాలి” అంటూ యోవాబు దూతను పంపాడు.

22. దూత పోయి యోవాబు పంపిన వర్తమానమంతయు దావీదునకు తెలియజేసెను.

22. ఆ వచ్చిన దూత లోనికి వెళ్లి యోవాబు చెప్పమన్నట్లు దావీదుకు వివరించి చెప్పాడు.

23. ఎట్లనగా ఆ మనుష్యులు మమ్మును ఓడించుచు పొలములోనికి మాకెదురు రాగా మేము వారిని గుమ్మమువరకు వెంటాడి గెలిచితివిు.

23. దూత ఇలా చెప్పాడు: “అమ్మోనీయులు మమ్మల్ని పొలాల్లో ఎదుర్కొన్నారు. కాని మేము వారితో నగర ద్వారం వద్ధ పోరాడాము.

24. అప్పుడు ప్రాకారముమీదనుండి విలుకాండ్రు తమ సేవకులమీద అంబులువేయగా రాజు సేవ కులలో కొందరు హతమైరి, తమరి సేవకుడైన హిత్తీయుడగు ఊరియాకూడ హతమాయెను.

24. మీ సేవకులపై నగర గోడల మీద ఉన్న వారు బాణాలు వేశారు. మీ సేవకులలో కొంతమంది చనిపోయారు. మీ సేవకుడు, హిత్తీయుడైన ఊరియా కూడ చనిపోయాడు.”

25. అందుకు దావీదునీవు యోవాబుతో ఈ మాట చెప్పుముఆ సంగతినిబట్టి నీవు చింతపడకుము; ఖడ్గము ఒకప్పుడు ఒకనిమీదను ఒకప్పుడు మరియొకనిమీదను పడుట కద్దు; పట్టణముమీద యుద్ధము మరి బలముగా జరిపి దానిని పడగొట్టుమని చెప్పి, నీవు యోవాబును ధైర్యపరచి చెప్పుమని ఆ దూతకు ఆజ్ఞ ఇచ్చి పంపెను.

25. సరే ఈ విషయంపై కలతపడవద్దని యోవాబుతో చెప్పమని దూతతో దావీదు అన్నాడు. “కత్తికి వారూ, వీరూ అనీ తేడా వుండదు. అది అందరినీ చంపుతుంది. రబ్బా నగరంపై దాడి తీవ్రం చేయండి. ఆ నగరం అప్పుడు వశమవుతుంది” అని చెప్పి యోవాబును ప్రోత్సహించుమని దావీదు దూతకు చెప్పాడు.

26. ఊరియా భార్య తన భర్తయగు ఊరియా హత మైన సంగతి విని తన భర్తకొరకు అంగలార్చెను.

26. తన భర్త ఊరియా చనిపోయినట్లు బత్షెబ విన్నది. తన భర్తకై విలపించింది.

27. అంగ లార్పుకాలము తీరిన తరువాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య యయి అతనికొక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను.

27. సంతాప దినాలు గడిచాక, దావీదు తన మనుష్యులను పంపి ఆమెను తన ఇంటికి తీసుకొని రమ్మన్నాడు. తరువాత ఆమె దావీదుకు భార్య అయింది. దావీదు వల్ల ఆమెకు కుమారుడు జన్మించాడు. దావీదు చేసిన ఈ చెడ్డ పనిని యోహోవ ఆమోదించలేదు.Shortcut Links
2 సమూయేలు - 2 Samuel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |