Kings I - 1 రాజులు 19 | View All

1. ఏలీయా చేసినదంతయును అతడు ఖడ్గముచేత ప్రవక్తల నందరిని చంపించిన సంగతియును అహాబు యెజెబెలునకు తెలియజెప్పగా

“చంపిన”– 1 రాజులు 18:40. “యెజెబెల్”– 1 రాజులు 16:31.

2. యెజెబెలు ఒక దూతచేత ఏలీయాకు ఈ వర్తమానము పంపించెనురేపు ఈ వేళకు నేను నీ ప్రాణ మును వారిలో ఒకని ప్రాణమువలె చేయనియెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక.

3. కాబట్టి అతడు ఈ సమాచారము తెలిసికొని, లేచి తన ప్రాణము కాపాడు కొనుటకై పోయి, యూదా సంబంధమైన బెయేరషెబాకు చేరి, అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి

“భయపడి”– 18 వ అధ్యాయంలో మనం చూచినట్టు ఏలీయా కొన్నిసార్లు అసాధారణమైన ధైర్యాన్ని ప్రదర్శించాడు. ఇప్పుడైతే మానసికంగా పూర్తిగా కృంగిపోయిన స్థితిలో ఉన్నాడు (గొప్ప విజయం తరువాత ఇలాంటిది తరచుగా జరుగుతుంది). కొన్ని పరిస్థితుల్లో ఎవరికైనా భయం వేయవచ్చు. ఏలీయా అందరు మనుషుల్లాంటి మనస్తత్వం గలవాడే (యాకోబు 5:17). దేవుని సేవకులు దేవునిలో నిర్భయులై, ధైర్యవంతులై ఉన్నా, తమలో తాము బలహీనులు, పిరికివారై ఉండవచ్చు (మత్తయి 26:69-74; అపో. కార్యములు 4:8-13 పోల్చి చూడండి).

4. తాను ఒక దినప్రయాణము అరణ్యములోనికి పోయి యొక బదరీవృక్షముక్రింద కూర్చుండి, మరణా పేక్షగలవాడైయెహోవా, నా పితరులకంటె నేను ఎక్కువవాడను కాను, ఇంతమట్టుకు చాలును, నా ప్రాణము తీసికొనుము అని ప్రార్థనచేసెను.

సంఖ్యాకాండము 11:15; యోనా 4:3 యోనా 4:8. ఇలాంటి నిరుత్సాహం గురించిన నోట్స్ కీర్తన 42లో ఉన్నాయి. “మంచివాణ్ణి కాను”– దీన్ని ఏలీయా గ్రహించాలని దేవుడు ఈ అనుభవం అతనికి కలిగేందుకు అనుమతించాడేమో. ఇతరులకంటే తాను గొప్పవాణ్ణన్న తలంపు అతనిలో మొలకెత్తిందేమో. దేవుని సేవకులకు ఇలాంటి దుష్‌ప్రేరణ అప్పుడప్పుడూ రావచ్చు. తాము ఇతరులకంటే మంచివారం కాబట్టి దేవుడు గొప్ప కార్యాలు చేసేందుకు తమను ఉపయోగించుకున్నాడని వారు అనుకోవచ్చు. ఇలాంటి దుష్‌ప్రేరణకు లొంగరాదు. రోమీయులకు 3:9-10; లూకా 18:9; ఫిలిప్పీయులకు 2:3 చూడండి.

5. అతడు బదరీవృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టినీవు లేచి భోజనము చేయుమని చెప్పెను.

“నిద్రపోయాడు”– 1 రాజులు 2:10 నోట్. “దేవదూత”– ఆదికాండము 16:7 నోట్.

6. అతడు చూచినంతలో అతని తలదగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను గనుక అతడు భోజనముచేసి తిరిగి పరుండెను.

తన సేవకుని పట్ల దేవుని అప్యాయతనూ శ్రద్ధనూ ఇది చూపిస్తున్నది. 1 రాజులు 17:4 1 రాజులు 17:9 పోల్చిచూడండి. కీర్తనల గ్రంథము 23:1 చూడండి.

7. అయితే యెహోవా దూత రెండవమారు వచ్చి అతని ముట్టినీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై యున్నది, నీవు లేచి భోజనము చేయుమని చెప్పినప్పుడు

“యెహోవా దూత”– దేవుని కుమారుడు ఏలీయాదగ్గరికి వచ్చాడు. “ప్రయాణం”– ఏలీయా చెయ్యాలనుకున్న ప్రయాణం గురించి దేవునికి తెలుసు. అయితే ఆ ప్రయాణం చెయ్యమని ఆయన ఏలీయాను ఆదేశించలేదు. దేవుని ఆదేశం లేకుండా ఏలీయా ప్రమాదం నుండి పారిపోతున్నప్పుడు కూడా దేవుడు అతణ్ణి ప్రేమతో చూస్తూ అతనికి తోడై ఉన్నాడు. ఇదంతా కృపే.

8. అతడు లేచి భోజనముచేసి, ఆ భోజనపు బలముచేత నలువది రాత్రింబగళ్లు ప్రయాణముచేసి, దేవుని పర్వతమని పేరుపెట్టబడిన హోరేబునకు వచ్చి

“హోరేబు”– అంటే సీనాయి పర్వతం (నిర్గమకాండము 3:1 నిర్గమకాండము 3:12; నిర్గమకాండము 19:1-3). ఇది బేర్‌షెబాకు 400 కి.మీ. దక్షిణంగా ఉంది.

9. అచ్చట ఉన్న యొక గుహలోచేరి బసచేసెను. యెహోవావాక్కు అతనికి ప్రత్యక్షమైఏలీయా, యిచ్చట నీవేమి చేయుచున్నావని అతని నడుగగా

“ఇక్కడేమి చేస్తున్నావు?”– మరో విధంగా చెప్పాలంటే “ఏలీయా, నువ్వేం వెతుకుతున్నావు? ఇబ్బందులు, ప్రమాదం నుండి పారిపోవడం మాత్రమేనా నీ ఉద్దేశం?”

10. అతడుఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసి వేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గముచేత హతము చేసిరి. సైన్యముల కధిపతియు దేవుడునగు యెహోవా కొరకు మహా రోషముగలవాడనై నేను ఒక డనుమాత్రమే మిగిలియుండగా వారు నా ప్రాణమును కూడ తీసివేయుటకై చూచుచున్నారని మనవిచేసెను.
రోమీయులకు 11:3

ఏలీయా ఇంకా కృంగిపోయిన స్థితిలోనే ఉన్నాడు. తన పరిచర్య అంతా వ్యర్థమైపోయిందనీ తనకిక మరణం మాత్రమే మిగిలి ఉందనుకుంటున్నాడు. “నేనొక్కణ్ణే”– 1 రాజులు 18:22.

11. అందుకాయననీవు పోయి పర్వతముమీద యెహోవా సముఖమందు నిలిచి యుండుమని సెలవిచ్చెను. అంతట యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను, యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను; శిలలు ఛిన్నా భిన్నములాయెను గాని యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తరువాత భూకంపము కలిగెను గాని ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు.

కొన్ని సార్లు దేవుడు తన ప్రజలను ఒళ్ళు గగుర్పొడిచే విధానాల్లో గాలివాన, భూకంపం, అగ్నిజ్వాలలు మొదలైనవాటిల్లో దర్శించాడు (1 రాజులు 18:38; నిర్గమకాండము 19:16-19; యోబు 38:1; కీర్తనల గ్రంథము 18:6-15; యెషయా 29:6). కానీ ఇలాంటి కళ్ళు మిరుమిట్లు గొలిపే దృశ్యాలు బోలెడన్ని చూశాడు ఏలీయా. అతనికిప్పుడు నెమ్మది, శాంతి అవసరం. దేవుడు తన ఉద్దేశాలను ప్రశాంతంగా, మృదువుగా కూడా నెరవేర్చుకోగలడని అతనికి మరింత స్పష్టంగా అర్థం కావాలి. యెషయా 42:1-4 పోల్చిచూడండి. దేవుడు మనుషులతో ఉరుము శబ్దంతోనో, అద్భుత కార్యాల శక్తితోనో మాట్లాడనవసరం లేదు.

12. ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు, మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాటలాడు ఒక స్వరము వినబడెను.

13. ఏలీయా దాని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహవాకిట నిలిచెను. అంతలో ఏలీయా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని యొకడు పలికిన మాట అతనికి వినబడెను.

14. అందుకతడుఇశ్రా యేలువారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గముచేత హతము చేసిరి. సైన్య ములకధిపతియు దేవుడునగు యెహోవా కొరకు మహా రోషముగలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలియుండగా వారు నా ప్రాణము తీసివేయుటకై చూచు చున్నారని చెప్పెను.
రోమీయులకు 11:3

దేవుడతనికి నేర్పించడానికి ప్రయత్నిస్తున్నది ఏలీయాకు అర్థమైనట్టు లేదు. మనం అలా అర్థం చేసుకోగలుగుతున్నామా?

15. అప్పుడు యెహోవా అతనికి సెల విచ్చిన దేమనగానీవు మరలి అరణ్యమార్గమున దమస్కు నకు పోయి దానిలో ప్రవేశించి సిరియ దేశముమీద హజాయేలునకు పట్టాభిషేకము చేయుము;

మనకు తెలిసినంతవరకు ఏలీయా ఈ ఆజ్ఞలను నెరవేర్చలేదు. హజాయేల్ దగ్గరికి ఎలీషా వెళ్ళాడు (2 రాజులు 8:8-15). యెహూను అభిషేకించేందుకు వేరొకణ్ణి పంపాడు (2 రాజులు 9:1-10). ఏలీయా మాత్రం ఎలీషా దగ్గరికి వెళ్ళాడు గానీ అతణ్ణి చేజేతులా అభిషేకించినట్టు లేదు. ఇక్కడ దేవుడు ఎలీషాను గురించి చెప్పడం వల్ల ఏలీయా పరిచర్య ఆఖరౌతున్నదని తెలుస్తున్నది. దేవుడు అతనికి ఓ పని అప్పగించాడు. అతడు ఆ పనిని దాదాపుగా పూర్తి చేశాడు. ఇప్పుడు తన తరువాత రావలసిన వాణ్ణి నియమించవలసి ఉంది. మోషే, యెహోషువలను పోల్చి చూడండి (ద్వితీయోపదేశకాండము 31:1-2 ద్వితీయోపదేశకాండము 31:7-8).

16. ఇశ్రాయేలు వారిమీద నింషీకుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయుము; నీకు మారుగా ప్రవక్తయైయుండుటకు ఆబేల్మె హోలావాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము.

17. హజాయేలుయొక్క ఖడ్గమును తప్పించుకొనువారిని యెహూ హతముచేయును; యెహూ యొక్క ఖడ్గమును తప్పించుకొనువారిని ఎలీషా హతము చేయును.

దేవుడు ఇస్రాయేల్ మీద శిక్ష పంపబోతున్నాడు.

18. అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్లూనకయు, నోటితో వాని ముద్దు పెట్టుకొనకయునుండు ఏడు వేలమంది నాకు ఇంకను మిగిలియుందురు.
రోమీయులకు 11:4

“ఏడు వేలమంది”– ఏలీయా తాననుకున్నంత ఒంటరివాడేమీ కాడు (వ 14). సమాజం ఎంత కుళ్ళిపోయినదైనప్పటికీ దేవునికి నమ్మకంగా ఉండిపోయినవారు కొద్దిమంది ఎప్పుడూ ఉంటారు (యెషయా 1:9; రోమీయులకు 11:4-5; మత్తయి 16:18). క్రీస్తు సంఘ చరిత్రలో మనం నేర్చుకోగల గొప్ప పాఠాలలో ఇది ఒక్కటి.

19. ఏలీయా అచ్చటనుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న పండ్రెండు అరకల యెడ్లచేత దుక్కి దున్నించుచు పండ్రెండవ అరక తాను తోలుచుండెను. ఏలీయా అతని చేర బోయి తన దుప్పటి అతనిమీద వేయగా

“దున్నుతూ”– తరచుగా తన సేవకులు సాధారణమైన చిన్న చిన్న పనుల్లో ఉండగా దేవుడు వారిని పిలుస్తుంటాడు (మత్తయి 4:8; మత్తయి 9:9). “పై వస్త్రం”– బహుశా అతణ్ణి అభిషేకించడానికి ఏలీయా వాడుకొన్న విధానం ఇదే కావచ్చు.

20. అతడు ఎడ్లను విడిచి ఏలీయావెంట పరుగెత్తినేను పోయి నా తలిదండ్రులను ముద్దుపెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబ డించెదనని చెప్పి అతనిని సెలవడుగగా అతడుపోయి రమ్ము, నావలన నీకు నిర్బంధము లేదని చెప్పెను.
మత్తయి 8:21, లూకా 9:61

“తిరిగి వెళ్ళు”– ఎలీషాను తనతో రమ్మని ఏలీయా చెప్పలేదు.

21. అందు కతడు అతనిని విడిచి వెళ్లి కాడి యెడ్లను తీసి, వధించి వాటిమాంసమును గొర్తినొగల చేత వంటచేసి జనులకు వడ్డిం చెను. వారు భోజనము చేసిన తరువాత అతడు లేచి ఏలీయా వెంబడి వెళ్లి అతనికి ఉపచారము చేయుచుండెను.

ఎలీషా దేవుని సేవ – అది ఎంత చిన్నదైనా సరే – చెయ్యడానికి ఆత్రుతగా ఉన్నాడు (2 రాజులు 3:11). తిరిగి వెనక్కు వెళ్ళే అవకాశాలన్నిటినీ తొలగించుకున్నాడు. తన జీవనోపాధిని చెడగొట్టేసి దేవుని కోసం బయలుదేరాడు. మార్కు 1:16-20 పోల్చి చూడండి.Shortcut Links
1 రాజులు - 1 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |