Kings I - 1 రాజులు 5 | View All

1. తరువాత తూరునకు రాజైన హీరాము తన తండ్రికి బదులుగా సొలొమోను పట్టాభిషేకము నొందెనని విని తన సేవకులను సొలొమోనునొద్దకు పంపెను; ఏలయనగా హీరాము ఎప్పటికి దావీదుతో స్నేహముగా నుండెను.

1. హీరాము అనునతను తూరు దేశానికి రాజు. అతను దావీదుకు చిరకాల స్నేహితుడు. దావీదు స్థానంలో సొలొమోను రాజ్యానికి వచ్చాడని విన్న హీరాము తన సేవకులను సొలొమోను వద్దకు పంపాడు.

2. హీరామునొద్దకు సొలొమోను ఈ వర్తమానము పంపెను.

2. సొలొమోను వారిద్వారా రాజైన హీరాముకు ఇలా చెప్పి పంపాడు:

3. యెహోవా నా తండ్రియైన దావీదు శత్రువులను అతని పాదములక్రింద అణచు వరకు అన్నివైపులను యుద్ధములు అతనికి కలిగియుండెను.

3. “నా తండ్రియగు రాజైన దావీదు చుట్టుపక్కల రాజ్యాల వారితో అనేక యుద్ధాలు చేసినట్లు నీకు తెలుసు. అందువల్ల యెహోవాయగు తన దేవుని ఘనపరిచేలా ఒక దేవాలయం నిర్మించ లేకపోయాడు. తన శత్రువులందరినీ యెహోవా తాను ఓడించేలా చేసే వరకు రాజైన దావీదు వేచివున్నాడు.

4. తన దేవుడైన యెహోవా నామ ఘనతకు అతడు మందిరమును కట్టింప వీలులేక పోయెనన్న సంగతి నీ వెరుగుదువు. ఇప్పుడు శత్రువు ఒకడును లేకుండను అపాయమేమియు కలుగకుండను నా దేవుడైన యెహోవా నలుదిశలను నాకు నెమ్మది దయచేసి యున్నాడు.

4. కాని ఇప్పుడు యెహోవా దేవుడు నీ రాజ్యాం నలుమూలలా శాంతి నెలకొనేలా చేశాడు. ప్రస్తుతం నాకు శత్రువులు లేరు. నా ప్రజలు నిర్భయంగావున్నారు.

5. కాబట్టినీ సింహాసనముమీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టు నీ కుమారుడు నా నామఘనతకు ఒక మందిరమును కట్టించునని యెహోవా నా తండ్రి యైన దావీదునకు సెలవిచ్చినట్లు నా దేవు డైన యెహోవా నామఘనతకు ఒక మందిరమును కట్టించుటకు నేను ఉద్దేశము గలవాడనై యున్నాను.

5. “యెహోవా నా తండ్రియగు దావీదుకు ఒక మాట ఇచ్చాడు. యెహోవా ఇలా అన్నాడు, ‘నీ తరువాత నీ కుమారుని రాజును చేస్తాను. నీ కుమారుడు నా పట్ల గౌరవ సూచకంగా ఒక దేవాలయం నిర్మిస్తాడు.’ కావున ఇప్పుడు నా యెహోవా దేవునికి ఘనంగా ఒక దేవాలయం నిర్మింపజేస్తున్నాను.

6. లెబానోనులో దేవదారు మ్రానులను నరికించుటకై నాకు సెలవిమ్ము; నా సేవకులును నీ సేవకులును కలిసి పని చేయుదురు; మ్రానులను నరుకుట యందు సీదోనీయులకు సాటియైనవారు మాలో ఎవరును లేరని నీకు తెలియును గనుక

6. అందువల్ల ఈ విషయంలో నీ సహాయం కోరుతున్నాను. నీ మనుష్యులను లెబానోనుకు పంపించు. వారక్కడ నా కొరకు దేవదారు వృక్షాలను పడగొట్టాలి. నా పనివాళ్లు నీ పనివారితో కలిసి పని చేస్తారు. నీ పనివాళ్లకు వేతనంగా నీవు ఎంత నిర్ణయిస్తే అది నేను చెల్లిస్తాను. కాని నీ సహాయం మాత్రం నాకు కావాలి. మా వడ్రంగులు సీదోను వడ్రంగులకు సాటిరారు.”

7. నీ యేర్పాటుచొప్పున నేను నీ సేవకుల జీతము నీకిచ్చెదను అనెను. హీరాము సొలొమోను చెప్పిన మాటలు విని బహుగా సంతోషపడి ఈ గొప్ప జనమును ఏలుటకు జ్ఞానముగల కుమారుని దావీదునకు దయచేసిన యెహోవాకు ఈ దినమున స్తోత్రము కలుగునుగాక అని చెప్పి

7. సొలొమోను అడిగినదంతా విన్న హీరాము చాలా సంతోషపడ్డాడు. “ఆ మహా సామ్రాజ్యానికి రాజుగా వ్యవహరించటానికి దావీదుకు ప్రజ్ఞాశాలియైన కుమారుని ప్రసాదించినందుకు దేవునికి ఈ రోజు నమస్కరిస్తున్నాను!” అని రాజైన హీరాము అన్నాడు.

8. సొలొమోనునకు ఈ వర్తమానము పంపెనునీవు నాయొద్దకు పంపిన వర్త మానమును నేను అంగీకరించితిని; దేవదారు మ్రానులను గూర్చియు సరళపు మ్రానులనుగూర్చియు నీ కోరిక యంతటి ప్రకారము నేను చేయించెదను.

8. అప్పుడు హీరాము ఒక సమాచారాన్ని సొలొమోనుకు యిలా పంపాడు: “నీవు అడిగిన విషయాలన్నీ నేను విన్నాను. నీవు కోరినన్ని దేవదారు వృక్షాలను, సరళపు చెట్లను నీకు యిస్తాను.

9. నా సేవకులు వాటిని లెబానోనునుండి సముద్రమునొద్దకు తెచ్చెదరు; అప్పుడు వాటిని తెప్పలుగా కట్టించి నీవు నాకు నిర్ణయించు స్థలమునకు సముద్రముమీద చేరునట్లు చేసి, అక్కడ అవి నీకు అప్పగింపబడు బందోబస్తు నేను చేయుదును, నీవు వాటిని తీసికొందువు. ఇందునుగూర్చి నీవు నాకోరిక చొప్పున జరిగించి నా యింటివారి సంరక్షణకొరకు ఆహా రము ఇచ్చెదవు.

9. నా పనివాళ్లు ఆ దూలాలన్నిటినీ లెబానోను నుండి సముద్రతీరానికి చేరవేస్తారు. వాటిని నేను తెప్పలుగా కట్టించి సముద్రంలో వేయించి నీవు కోరిన స్థలానికి చేరేలా చేస్తాను. అక్కడ ఆ దూలాలను విడివిడిగా తీస్తాను. వాటిని నీవు తీసుకోవచ్చు. ఈ సందర్భంగా నీవు నా మాట మన్నించి నా రాజకుటుంబ పోషణకు తగిన ఆహార పదార్థాలను సమకూర్చుతావని ఆశిస్తున్నాను.”

10. హీరాము సొలొమోనునకు ఇష్టమైనంత మట్టుకు దేవదారు మ్రానులను సరళపు మ్రానులను పంపించగా

10. ఆ విధంగా హీరాము దేవదారు, సరళపు చెట్ల కలపను సొలొమోనుకు సరఫరా చేయసాగాడు.

11. సొలొమోను హీరామునకును అతని యింటి వారి సంరక్షణకును ఆహారముగా రెండులక్షల తూముల గోధుమలను మూడు వేల ఎనిమిదివందల పళ్ల స్వచ్ఛమైన నూనెను పంపించెను. ఈ ప్రకారము సొలొమోను ప్రతి సంవత్సరము హీరామునకు ఇచ్చుచువచ్చెను.
అపో. కార్యములు 12:20

11. సొలొమోను కూడ హీరాముకు అతని ఇంటి వారి పోషణకు రెండు లక్షల తూముల గోధుమలు, మూడు వేల ఎనిమిది వందల పడుల స్వచ్ఛమైన ఒలీవగింజల నూనెను ప్రతియేటా పంపాడు.

12. యెహోవా సొలొమోనునకు చేసిన వాగ్దానము చొప్పున అతనికి జ్ఞానము దయచేసెను; మరియహీరామును సొలొమోనును సంధిచేయగా వారిద్దరికి సమాధానము కలిగియుండెను.

12. యెహోవా చేసిన వాగ్దానం ప్రకారం ఆయన సొలొమోనుకు గొప్ప జ్ఞానాన్ని కలుగజేశాడు. హీరాము, సొలొమోనుల మధ్య శాంతి, సామరస్యాలు నెలకొన్నాయి. ఆ ఇద్దరు రాజులు ఒక ఒడంబడిక చేసుకున్నారు.

13. రాజైన సొలొమోను ఇశ్రాయేలీయులందరిచేతను వెట్టిపని చేయించెను; వారిలో ముప్పదివేలమంది వెట్టి పని చేయువారైరి,

13. రాజైన సొలొమోను ముప్పదివేల మంది ఇశ్రాయేలీయులను ఈ పనిలో సహాయపడటానికి బలవంతంగా కూలిపనికి చేర్చుకున్నాడు.

14. వీరిని అతడు వంతులచొప్పున నెలకు పది వేలమందిని లెబానోనునకు పంపించెను; ఒక నెల లెబా నోనులోను రెండు నెలలు ఇంటియొద్దను వారు ఉండిరి; ఆ వెట్టివారిమీద అదోనీరాము అధికారియై యుండెను.

14. వీరిపై అధికారిగా అదోనీరాము అను వానిని రాజైన సొలొమోను నియమించాడు. సొలొమోను వారిని మూడు జట్లుగా విభజించాడు. ప్రతి జట్టులోను పదివేల మంది వున్నారు. ప్రతి జట్టు లెబానోనులో ఒక నెలపాటు పనిచేసి, రెండు నెలలు ఇంటివద్ద ఉండేవారు.

15. మరియసొలొమోనునకు బరువులు మోయువారు డెబ్బది వేలమందియు పర్వతములందు మ్రానులు నరకువారు ఎను బది వేలమందియు నుండిరి.

15. సొలొమోను ఎనుబది వేల మందిని కొండ ప్రాంతంలో పనిచేయటానికి బలవంతపర్చాడు. వీరు రాళ్లు కొట్టి చెక్కాలి. కొట్టిన రాళ్లను చేరవేయటానికి డెబ్బది వేల మంది వున్నారు.

16. వీరు కాక పనిమీదనున్న సొలొ మోను శిల్పకారులకు అధికారులు మూడువేల మూడువందలమంది; వీరు పనివారిమీద అధికారులై యుండిరి.

16. ఈ పని చేసే వారిపై పర్యవేక్షణకై మూడు వేల మూడు వందల మంది నియమితులయ్యారు.

17. రాజు సెలవియ్యగా వారు మందిరముయొక్క పునాదిని చెక్కిన రాళ్లతో వేయుటకు గొప్ప రాళ్లను మిక్కిలి వెలగల రాళ్లను తెప్పించిరి.

17. రాజైన సొలొమోను దేవాలయ పునాదులకు పనికి వచ్చే విలువైన పెద్ద బండలు చెక్కమని పనివారికి ఆజ్ఞ ఇచ్చాడు. ఈ రాళ్లు అతి నేర్పుగా కొట్టబడేవి.

18. ఈలాగున సొలొమోను పంపినవారును గిబ్లీయులును, హీరాము శిల్పకారు లును మ్రానులను నరికి రాళ్లను మలిచి మందిరము కట్టుటకు మ్రానులను రాళ్లను సిద్ధపరచిరి.

18. సొలొమోను యొక్క, హీరాము యొక్క శిల్పులు, మరియు బిబ్లోసు నుండి వచ్చన వారును రాళ్లను చెక్కారు. ఈ కట్టడపు పనివారంతా రాళ్లను, దూలాలను, దేవాలయ నిర్మాణానికి తయారు చేశారు.Shortcut Links
1 రాజులు - 1 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |