Chronicles I - 1 దినవృత్తాంతములు 16 | View All

1. ఈ ప్రకారము వారు దేవుని మందసమును తీసికొని వచ్చి, దావీదు దానికొరకు వేయించియున్న గుడారము నడుమను దాని ఉంచి, దేవుని సన్నిధిని దహనబలులను సమాధానబలులను అర్పించిరి.

1. దేవుని ఒడంబడిక పెట్టెను లేవీయులు తెచ్చి దావీదు దాని కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గుడారంలో వుంచారు. పిమ్మట వారు దేవునికి దహన బలులు, సమాధాన బలులు సమర్పించారు.

2. దహనబలులను సమాధాన బలులను దావీదు అర్పించి చాలించిన తరువాత అతడు యెహోవా నామమున జనులను దీవించి

2. దావీదు దహన బలులు, సమాధాన బలులు ఇచ్చిన తర్వాత యెహోవా పేరుతో ప్రజలను ఆశీర్వదించాడు.

3. పురుషులకేమి స్త్రీలకేమి ఇశ్రాయేలీయులందరిలో ఒక్కొక్కరికి ఒక రొట్టెను ఒక భక్ష్యమును ఒక ద్రాక్షపండ్ల అడను పంచి పెట్టెను.

3. అప్పుడతడు ఒక రొట్టెను, ఖర్జూర పండ్లను, ఎండు ద్రాక్షాపండ్లను ఇశ్రాయేలు స్త్రీ పురుషులందరికీ పంచిపెట్టాడు.

4. మరియు అతడు యెహోవా మందసము ఎదుట సేవ చేయుచు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును, వందించుటకును ఆయ నకు స్తోత్రములు చెల్లించుటకును లేవీయులలో కొందరిని నియమించెను.

4. ఆ తరువాత దేవుని ఒడంబడిక పెట్టెకు ముందు సేవచేయటానికి కొందరు లేవీయులను దావీదు ఎంపిక చేశాడు. వారు ఇశ్రాయేలు దేవుని ఉత్సవాలు చేయటానికి, యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించేందుకు, ఆయనకు జయజయ ధ్వనులు చేసేందుకు నియమింపబడ్డారు.

5. వారిలో ఆసాపు అధిపతి, జెకర్యా అతని తరువాతివాడు, యెమీయేలు షెమరామోతు యెహీయేలు మత్తిత్యా ఏలీయాబు బెనాయా ఓబేదెదోము యెహీయేలు అనువారు స్వరమండలములను సితారాలను వాయించుటకై నియమింపబడిరి, ఆసాపు తాళములను వాయించువాడు.

5. వీరిలో మొదటి జట్టు వారికి ఆసాపు పెద్ద. ఆసాపు వర్గం వారు తాళాలు మోగించేవారు. జెకర్యా రెండవ జట్టు వారికి అధిపతి. మిగిలిన లేవీయులు ఎవరనగా ఉజ్జీయేలు, షెమీరామోతు, యెహీయేలు, మత్తిత్యా, ఏలీయాబు, బెనాయా, ఓబేదెదోము మరియు యెహీయేలు. వీరు తీగలు గల వీణాసితార వాద్యాలను వాయించేవారు.

6. బెనాయా యహజీయేలు అను యాజ కులు ఎప్పుడును దేవుని నిబంధన మందసము ఎదుట బూరలు ఊదువారు.

6. యాజకులైన బెనాయా, యహజీయేలు ఎల్లప్పుడూ దేవుని ఒడంబడిక పెట్టెకు ముందు బూరలు వూదే వారు.

7. ఆ దినమందు యెహోవాను స్తుతిచేయు విచారణను ఏర్పరచి, దావీదు ఆసాపుచేతికిని వాని బంధువులచేతికిని దానిని అప్పగించెను. ఆ స్తుతి విధమేమనగా

7. అదే సమయంలో దావీదు ప్రథమంగా ఆసాపు, అతని సోదరులు యెహోవాకి ఈ స్తుతిగీతం పాడే పని అప్పజెప్పాడు.

8. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి.ఆయన నామమును ప్రకటనచేయుడిఆయన కార్యములను జనములలో తెలియజేయుడి.

8. యెహోవాను స్తుతించండి ఆయన నామమును ప్రకటించండి. యెహోవా ఘనకార్యాలను ప్రజలకు చెప్పండి.

9. ఆయననుగూర్చి పాడుడి ఆయనను కీర్తించుడిఆయన అద్భుత క్రియలన్నిటినిగూర్చి సంభాషణ చేయుడి.

9. యెహోవాకి భజన చేయండి! యెహోవాకు స్తుతిగీతాలు పాడండి. యెహోవా మహిమలు ప్రజలకు తెలపండి!

10. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి యెహోవాను వెదకువారు హృదయమునందు సంతో షించుదురు గాక.

10. యెహోవా పవిత్ర నామం తలంచి గర్వపడండి; యెహోవా సహాయం కోరిన వారందరూ సుఖ సంతోషాలు పొందెదరు గాక!

11. యెహోవాను ఆశ్రయించుడి ఆయన బలము నాశ్రయించుడిఆయన సన్నిధి నిత్యము వెదకుడి.

11. యెహోవాను శరణు కోరండి; ఆయన బలాన్ని ఆశ్రయించండి. ఆయన సన్నిధిని నిత్యం వెదకండి.

12. ఆయన దాసులగు ఇశ్రాయేలు వంశస్థులారాఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారలారా

12. యెహోవా చేసిన అద్భుత కార్యాలను జ్ఞాపకం చేసుకోండి. ఆయన నిర్ణయాలను ఆయన చేసిన ఘనకార్యాలను మననం చేసుకోండి.

13. ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను జ్ఞాపకము చేసి కొనుడిఆయన సూచక క్రియలను ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసికొనుడి.

13. యెహోవా సేవకులగు ఇశ్రాయేలు బిడ్డల్లారా, యాకోబు సంతతి వారలారా మీరు యెహోవా ఎన్నుకున్న ప్రజలు.

14. ఆయన మన దేవుడైన యెహోవా ఆయన తీర్పులు భూమియందంతట జరుగుచున్నవి.

14. యెహోవాయే మన దేవుడు ఆయన శక్తి ప్రతి స్థలములో వ్యాపించి వున్నది!

15. మీ సంఖ్య కొద్దిగాను మీరు స్వల్పసంఖ్యగల జనులుగానుకనాను దేశములో అన్యులుగాను ఉండగా కొలవబడిన స్వాస్థ్యముగా దాని నీకిచ్చెదనని

15. తన ఒడంబడికను ఆయన జ్ఞాపకముంచుకుంటాడు. ఆయన మాట వేయితరాల పంట!

16. ఆయన అబ్రాహాముతో చేసిన నిబంధనను

16. అది అబ్రాహాముతో యెహోవా చేసుకొన్న ఒడంబడిక. అది యెహోవా ఇస్సాకుకు చేసిన వాగ్దానం

17. ఇస్సాకుతో చేసిన ప్రమాణమును ఏర్పాటును నిత్యము జ్ఞాపకముంచుకొనుడి.

17. యాకోబుకు యెహోవా దానిని శాసనంగా చేశాడు. అది ఇశ్రాయేలుకు యెహోవా నిరంతరం కొనసాగేలా చేసిన ఒడంబడిక.

18. వేయితరములవరకు ఆ మాట నిలుచునని ఆయన సెల విచ్చెను.

18. “కనాను దేశాన్ని నేను మీకు ఇస్తాను. వాగ్దానం చేయబడిన రాజ్యం నీకు చెందుతుంది!” అని యెహోవా ఇశ్రాయేలుకు చెప్పియున్నాడు.

19. యాకోబునకు కట్టడగాను ఇశ్రాయేలునకు నిత్యనిబంధనగాను ఆయన ఆ మాటను స్థిరపరచియున్నాడు.

19. దేవుని ప్రజలు అప్పుడు కొద్దిమంది మాత్రమే. వారు ఆ రాజ్యంలో పరాయి వారు.

20. వారు జనమునుండి జనమునకును రాజ్యమునుండిరాజ్యమునకును తిరుగులాడుచుండగా

20. వారు ఒక దేశాన్నుండి మరో దేశానికి వెళ్లారు. వారు ఒక రాజ్యం నుండి మరో రాజ్యానికి తరలిపోయారు.

21. నేను అభిషేకించినవారిని ముట్టవలదనియు నా ప్రవక్తలకు కీడుచేయవద్దనియు సెలవిచ్చి

21. కాని ఎవ్వరూ వారికి హాని కలుగజేయకుండా యెహోవా కాపాడాడు. యెహోవా తన ప్రజలను ప్రేమించిన కారణంగా రాజులనే ఆయన మందలించాడు.

22. ఆయన ఎవరినైనను వారికి హింసచేయనియ్యలేదు వారి నిమిత్తము రాజులను గద్దించెను.

22. “నేను ఎన్నుకున్న నా ప్రజలకు కీడు చేయవద్దు; నా ప్రవక్తలకు హాని కలుగు జేయవద్దు!” అని యెహోవా రాజులకు చెప్పియున్నాడు.

23. సర్వభూజనులారా, యెహోవాను సన్నుతించుడి అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి.

23. భూమిపై గల సర్వజనులారా, యెహోవాను భజించండి! యెహోవా మనలను కాపాడుతున్న సువార్తను ప్రతినిత్యం చాటండి!

24. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకార్యములనుప్రచురించుడి.

24. యెహోవా మహిమను అన్ని దేశాలలోను చాటండి. దేవుని అద్భుత కార్యాలను గురించి ప్రజలందరికి తెలియ జెప్పండి!

25. యెహోవా మహా ఘనత వహించినవాడు ఆయన బహుగా స్తుతినొంద తగినవాడు సమస్త దేవతలకంటె ఆయన పూజ్యుడు.

25. యెహోవా గొప్ప మహిమాన్వితుడు; ఆయనను మిక్కిలిగా సన్నుతించండి అన్య దేవతల కన్న యెహోవా ఘనంగా ఆరాధించబడాలి.

26. జనముల దేవతలన్నియు వట్టి విగ్రహములే యెహోవా ఆకాశవైశాల్యమును సృజించినవాడు.

26. ఎందువల్లననగా మిగిలిన ప్రజలందరి దేవుళ్లు విగ్రహాలే! కాని యెహోవా ఈ విశాల ఆకాశాన్ని కలుగజేశాడు.

27. ఘనతాప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి బలమును సంతోషమును ఆయనయొద్ద ఉన్నవి.

27. యెహోవా మహిమయు, ఘనతయు కల్గినవాడు. యెహోవా మిక్కిలి ప్రకాశమానంగా వెలుగొందే జ్యోతివంటి వాడు!

28. జనముల కుటుంబములారా, యెహోవాకు చెల్లించుడి. మహిమాబలమును యెహోవాకు చెల్లించుడి.

28. పలు వంశీకులారా, సర్వ ప్రజలారా, యెహోవా మహిమను, శక్తిని పొగడండి!

29. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి నైవేద్యములు చేత పుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి పరిశుద్ధాలంకారములగు ఆభరణములను ధరించుకొని ఆయన యెదుట సాగిలపడుడి.

29. యెహోవా మహిమను కొనియాడండి ఆయన నామాన్ని ఘనపర్చండి! మీ అర్పణలను యెహోవా సన్నిధికి తీసుకొని రండి యెహోవాను, అతిశయించిన ఆయన పవిత్ర సౌందర్యాన్ని ఆరాధించండి!

30. భూజనులారా, ఆయన సన్నిధిని వణకుడి అప్పుడు భూలోకము కదలకుండును అప్పుడది స్థిరపరచబడును.

30. భూలోక ప్రజలారా, యెహోవా ముందు గజగజ వణకండి. కాని ఆయన ఈ భూమిని బలంగా నిర్మించాడు; అది కదల్చబడదు.

31. యెహోవా ఏలుచున్నాడని జనములలో చాటించుడి. ఆకాశములు ఆనందించునుగాక భూమి సంతోషించునుగాక

31. భూలోకం, పరలోకాలు సంతోషంగా వుండును గాక! “యెహోవా పరిపాలిస్తున్నాడు” అని ప్రజలు ప్రతిచోట చెప్పుకొందురు గాక!

32. సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక పొలములును వాటియందుండు సర్వమును సంతోషించునుగాక. యెహోవా వేంచేయుచున్నాడు.

32. సముద్రము, దానిలోని ప్రతిదీ ఘోషించుగాక! పొలాలు, వాటిలోనివన్నీ తమ సంతోషాన్ని వెలిబచ్చుగాక!

33. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు వనవృక్షములు ఆయన సన్నిధిని ఉత్సయించును.

33. అడవిలోని చెట్లన్నీ యెహోవాముందు ఉల్లాసంగా పాడుతాయి! ఎందువల్లననగా యెహోవా వస్తున్నాడు గనుక. ఆయన ప్రపంచానికి తీర్పు ఇవ్వటానికి వస్తున్నాడు.

34. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. ఆయనను స్తుతించుడి.

34. ఆహా, యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించు. ఆయన మంచివాడు! యెహోవా ప్రేమ నిరంతరం కొనసాగుతుంది.

35. దేవా మా రక్షకా, మమ్మును రక్షించుము మమ్మును చేర్చుకొనుము.
అపో. కార్యములు 26:17

35. “మా సంరక్షకుడవగు ఓ దేవా! మమ్ములను రక్షింపుము! మమ్ము ఒక దగ్గరికి చేర్చి మమ్మల్ని పరాయి రాజ్యాల నుండి కాపాడుము. అప్పుడు నీ పవిత్ర నామాన్ని మనసార స్తుతించుకోగలుగుతాము. మేము నీకు స్తుతిగీతాలు పాడగలుగుతాము!” అని యెహోవాకు విన్నవించండి.

36. మేము నీ పరిశుద్ధనామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లు నిన్ను స్తుతించుచు అతిశయించునట్లు అన్యజనుల వశములోనుండి మమ్మును విడిపింపుము. అని ఆయనను బతిమాలుకొనుడి. ఇశ్రాయేలీయులకు దేవుడైన యెహోవా యుగములన్నిటను స్తోత్రము నొందునుగాక. ఈలాగున వారు పాడగా జనులందరు ఆమేన్‌ అని చెప్పి యెహోవాను స్తుతించిరి.

36. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు సర్వకాల సర్వావస్థలయందు జయమగు గాక! అప్పుడు ప్రజలంతా “ఆమేన్” అన్నారు! యెహోవాను స్తుతించారు!

37. అప్పుడు మందసము ముందర నిత్యమును కావలసిన అనుదిన సేవ జరుపుటకై దావీదు అచ్చట యెహోవా నిబంధన మందసముమీద ఆసాపును అతని సహోదరులను నియమించెను. ఓబేదె దోమును వారి సహోదరులైన అరువది ఎనిమిది మందిని

37. పిమ్మట ఆసాపును, అతని సోదరులను దావీదు ఒడంబడిక పెట్టె ముందు ఉంచాడు. నిత్యం దాని ముందు సేవ చేయటానికి దావీదు వారిని అక్కడ నియమించాడు.

38. యెదూతూను కుమారుడైన ఓబేదెదోమును హోసాను ద్వారపాలకులుగా నియమించెను

38. ఓబేదెదోమును, మరి అరువది ఎనిమిది మంది లేవీయులను కూడ ఆసాపుతోను, అతని సోదరులతోను కలిసి సేవచేయటానికి దావీదు నియమించాడు. ఓబేదెదోము, హోసా ద్వార పాలకులు. ఓబేదెదోము తెండ్రి పేరు యెదూతూను.

39. గిబియోనులోని ఉన్నతస్థలముననున్న యెహోవా గుడారముమీదను అచ్చటి బలిపీఠముమీదను యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమందు వ్రాయబడియున్న ప్రకారము

39. యాజకుడైన సాదోకును, గిబియోనులో ఉన్నత స్థలంలో అతనితో కలిసి దేవుని గుడారంలో సేవ చేసిన ఇతర యాజకులను కూడా దావీదు అక్కడ నియమించాడు.

40. ఉదయాస్తమయములయందు అనుదినమున నిత్యమైన దహనబలిని ఆయనకు అర్పించుటకై అచ్చట అతడు యాజకుడైన సాదోకును అతని సహోదరులైన యాజకులను నియమించెను.

40. దహన బలిపీఠం మీద ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సాదోకు, ఇతర యాజకులు దహన బలులు సమర్పించారు. యెహోవా ఇశ్రాయేలుకిచ్చిన ధర్మశాస్త్ర నియమాలకు అనుగుణంగా వారాపని చేశారు.

41. యెహోవా కృప నిత్యముండునని ఆయనను స్తుతిచేయుటకై వీరితోకూడ హేమానును యెదూతూనును పేళ్లవరుసను ఉదాహరింపబడిన మరి కొందరిని నియమించెను.

41. హేమాను, యెదూతూను, ఇతర యాజకులు పేరు పేరునా ఎంపిక చేయబడి యెహోవాకు స్తుతిగీతాలు పాడటానికి నియమింపబడ్డారు. ఎందువల్లననగా దేవుని ప్రేమ నిరంతరం కొనసాగుతుంది గనుక.

42. బూరలు ఊదుటకును తాళములను వాయించుటకును దేవునిగూర్చి పాడతగిన గీతము లను వాద్యములతో వినిపించుటకును వీరిలోనుండు హేమానును యెదూతూనును అతడు నియమించెను.మరియయెదూతూను కుమారులను అతడు ద్వార పాలకులుగా నియమించెను.

42. హేమాను, యెదూతూను వారితో వుండి బాకాలు వూదుతూ, తాళాలు వాయించారు. దేవునిపై భక్తిగీతాలు పాడేటప్పుడు వారు ఇతర వాద్య విశేషాలను కూడ వాయించేవారు. యెదూతూను కుమారుడు ద్వారాల వద్ద కాపలాకై నియమింపబడ్డాడు.

43. తరువాత జనులందరును తమతమ యిండ్లకు వెళ్లిపోయిరి; దావీదును తన యింటి వారిని దీవించుటకై వారియొద్దకు పోయెను.

43. పిమ్మట అందరూ తమ తమ ఇండ్లకు వెళ్లిపోయారు. దావీదు కూడ తన కుటుంబం వారిని ఆశీర్వదించటానికి ఇంటికి వెళ్లాడు.Shortcut Links
1 దినవృత్తాంతములు - 1 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |