Chronicles I - 1 దినవృత్తాంతములు 29 | View All

1. రువాత రాజైన దావీదు సర్వసమాజముతో ఈలాగు సెలవిచ్చెనుదేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేతప్రాయముగల బాలుడై యున్నాడు, కట్టబోవు ఆలయము మనుష్యునికి కాదు దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది.

1. అక్కడ సమావేశమైన ఇశ్రాయేలు ప్రజలందరినీ ఉద్దేశించి రాజైన దావీదు ఇలా అన్నాడు: “దేవుడు నా కుమారుడు సొలొమోనును ఎంపిక చేశాడు. సొలొమోను చిన్నవాడు. అందువల్ల తాను చేయవలసిన పనులన్నిటిలో తగిన అనుభవం లేదు. కాని పని మాత్రం అతి ముఖ్యమైనది! ఈ భవనం ప్రజల కొరకు కాదు. ఇది యెహోవా దేవుని ఆలయం.

2. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండిపనికి వెండిని, యిత్తడిపనికి ఇత్తడిని, యినుపపనికి ఇనుమును, కఱ్ఱపనికి కఱ్ఱలను, గోమేధికపురాళ్లను, చెక్కుడురాళ్లను, వింతైన వర్ణములుగల పలువిధములరాళ్లను, మిక్కిలి వెలగల నానావిధరత్నములను తెల్లచలువరాయి విశేషముగా సంపాదించితిని.

2. నా దేవుని ఆలయం కట్టించటానికి తగిన నమూనాలు, ఏర్పాట్లు నాశక్తి కొలదీ చేశాను. బంగారంతో చేయదగిన వస్తు సామగ్రికి కావలసిన బంగారం, వెండితో చేయదగిన వస్తువులకు వెండి, కంచు సామగ్రికి కావలసిన కంచు, ఇనుప పనిముట్లకు కావలసిన ఇనుము, కలప సామాన్లు చేయటానికి తగిన కలప ఏర్పాటు చేశాను. పొదగటానికి సులిమాను రాళ్లు అనబడే మణులను, నల్లరాతిని, విలువైన రంగురంగుల రత్నాలను, పాల రాతిని కూడ నేను ఇచ్చాను. ఆలయం నిర్మాణానికి ఈ రకమైన వస్తుసామగ్రిని లెక్కకు మించి ఇచ్చాను.

3. మరియు నా దేవుని మందిముమీద నాకు కలిగియున్న మక్కువచేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించియుంచిన వస్తువులు గాక, నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చెదను.

3. నా దేవుని ఆలయానికి వెండి బంగారు వస్తువులను ప్రత్యేక కానుకలుగా ఇస్తున్నాను. నేనిది ఎందుకు చేస్తున్నానంటే నిజంగా నేను నా దేవుని ఆలయం కట్టించ దలిచాను. ఈ పవిత్ర ఆలయ నిర్మాణానికే ఈ వస్తువులన్నీ నేను ఇస్తున్నాను.

4. గదుల గోడల రేకుమూతకును బంగారపు పనికిని బంగారమును, వెండిపనికి వెండిని పనివారు చేయు ప్రతివిధమైన పనికి ఆరువేల మణుగుల ఓఫీరు బంగారమును పదునాలుగువేల మణుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను

4. ఆరువేల మణుగుల ఓఫీరు దేశపు బంగారాన్ని, పధ్నాలుగు వేల మణుగుల శుద్దమైన వెండిని ఇచ్చాను. ఆలయ భవనాల గోడలపై వెండిరేకుల తొడుగు వేస్తారు.

5. ఈ దినమునయెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చు వారెవరైన మీలో ఉన్నారా?

5. వెండి బంగారాలతో చేయదగిన వస్తువులకు కావలసిన వెండిని, బంగారాన్ని ఇచ్చాను. ఆలయానికి పనికివచ్చే అనేక రకాల వస్తు సామగ్రిని నిపుణతగల పనివారు చేయగలిగేలా నేను వెండిని, బంగారాన్ని సమకూర్చాను. ఇప్పుడు ఇశ్రాయేలీయులైన మీలో ఎంతమంది ఆరోజు యెహోవా కార్యానికి మనసారా కానుకలు ఇవ్వటానికి సిద్ధంగా వున్నారు?”

6. అప్పుడు పితరుల యిండ్లకు అధిపతులును ఇశ్రాయేలీయుల గోత్రపు అధి పతులును సహస్రాధిపతులును శతాధిపతులును రాజు పనిమీద నియమింపబడిన అధిపతులును కలసి

6. కుటుంబాల పెద్దలు, ఇశ్రాయేలీయుల వంశాల పెద్దలు, సహస్ర సైనిక దళాధిపతులు, శత దళాధిపతులు రాజకార్య నిర్వాహకులు వెంటనే తమ విలువైన వస్తువులు స్వయంగా అర్పించారు.

7. మనఃపూర్వకముగా దేవుని మందిరపుపనికి పదివేల మణుగుల బంగారమును ఇరువదివేల మణుగుల బంగారపు ద్రాములను ఇరువదివేల మణుగుల వెండిని ముప్పదియారువేల మణుగుల యిత్తడిని రెండులక్షల మణుగుల యినుమును ఇచ్చిరి.

7. ఆలయానికి వారిచ్చిన వస్తువులు ఏవనగా: పదివేల మణుగుల బంగారం, ఇరవై వేల మణుగుల వెండి, ముప్పదియారు వేల మణుగుల కంచు, రెండు లక్షల మణుగుల ఇనుము.

8. తమయొద్ద రత్నములున్నవారు వాటిని తెచ్చి యెహోవామందిరపు బొక్కసముమీదనున్న గెర్షోనీయుడైన యెహీయేలునకు ఇచ్చిరి.

8. విలువైన రత్నాలు కలిగివున్న ప్రజలు వాటిని ఆలయానికి యిచ్చారు. యెహీయేలు విలువైన రత్నాలన్నిటి విషయంలో జాగ్రత్త తీసుకొన్నాడు. యెహీయేలు గెర్షోను వంశీయుడు.

9. వారు పూర్ణమనస్సుతో యెహోవాకు ఇచ్చియుండిరి గనుక వారు ఆలాగు మనః పూర్వకముగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి.

9. తమ నాయకులు అంత ఉదారంగా విరాళాలు ఇవ్వటంతో ప్రజలంతా చాలా సంతోషపడ్డారు. నాయకులు నిండు హృదయంతో విరాళాలు ఇచ్చి సంతోషపడ్డారు. రాజైన దావీదు కూడ ఆనందంగా వున్నాడు.

10. రాజైన దావీదుకూడను బహుగా సంతోషపడి, సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెనుమాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు.

10. సమావేశపర్చబడిన ప్రజానీకం ముందు దావీదు పిమ్మట యెహోవాకి స్తోత్రం చేశాడు. దావీదు ఇలా ప్రార్థన చేశాడు: “ఇశ్రాయేలు దేవుడవైన యెహోవా, మా తండ్రీ, సదా నీకు స్తోత్రం చేస్తాము.

11. యెహోవా, భూమ్యాకాశములయందుండు సమస్తమును నీ వశము; మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి; యెహోవా, రాజ్యము నీది, నీవు అందరిమీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని యున్నావు.
ప్రకటన గ్రంథం 5:12

11. గొప్పతనము, శక్తి, మహిమ, విజయము, గౌరవము అన్నీ నీకు చెందినవే ఎందుకంటే పరలోకమందు, భూమిమీద అన్నీ నీకు చెందినవే, ఓ దేవా, రాజ్యము నీదైయున్నది. నీవు సమస్త ప్రజలపై అధిపతివైయున్నావు.

12. ఐశ్వర్యమును గొప్పతనమును నీవలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించు వాడవును అందరికి బలము ఇచ్చువాడవును నీవే.

12. భోగభాగ్యాలు, గౌరవం నీ నుండేవస్తాయి. సమస్తమును పాలించువాడవు నీవు. నీవు బల పరాక్రమసంపన్నుడవు. నీవు ఎవరినైనా గొప్ప వాడినిగా గాని, బలవంతునిగా గాని చేయగల సమర్థుడవు.

13. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావముగల నీ నామమును కొనియాడుచున్నాము.

13. మా దేవా, మేము నీకు కృతజ్ఞతలు చెల్లించు చున్నాము. మహిమగల నీ నామమును స్తుతిస్తాము!

14. ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపువాడను? నా జనులెంత మాత్రపువారు? సమస్తమును నీవలననే కలిగెను గదా? నీ స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చియున్నాము.

14. ఈ వస్తువులన్నీ నానుండి, నా ప్రజల నుండి రాలేదు. ఈ వస్తువులన్నీ నీనుండి వచ్చినవే. నీనుండి వచ్చిన వాటినే మేము తిరిగి నీకు సమర్పిస్తున్నాము.

15. మా పితరులందరివలెనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై యున్నాము, మా భూనివాసకాలము నీడ యంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడొకడును లేడు
హెబ్రీయులకు 11:13

15. మేము కొత్త వారిలా, బాటసారుల్లా వున్నాము. మా పూర్వీకులు కూడ పరాయివారిలా, బాట సారుల్లా వున్నారు. ఆశలేని మా బ్రతుకులు ఈ భూమి మీద నీడలాంటివి. ఎవ్వరూ స్థిరంగా వుండరు.

16. మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామముయొక్క ఘనతకొరకు మందిరమును కట్టించుటకై మేము సమకూర్చిన యీ వస్తుసముదాయమును నీవలన కలిగినదే, అంతయు నీదియై యున్నది.

16. యెహోవా మా దేవా, నీ ఆలయ నిర్మాణానికై మేము ఈ వస్తువులన్నీ సమకూర్చాము. నీ నామము ఘనపర్చబడేలా మేము ఈ ఆలయం నిర్మిస్తాము. కాని ఈ వస్తుసంపదంతా నీ నుండి వచ్చినదే. ప్రతిదీ నీకు చెందినదే.

17. నా దేవా, నీవు హృదయ పరిశోధనచేయుచు యథార్థవంతులయందు ఇష్టపడుచున్నావని నేనెరుగుదును; నేనైతే యథార్థహృదయము గలవాడనై యివి యన్నియు మనఃపూర్వకముగా ఇచ్చి యున్నాను; ఇప్పుడు ఇక్కడనుండు నీ జనులును నీకు మనఃపూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను.

17. నా దేవా, నీవు ప్రజల హృదయాలను పరీక్షిస్తావని కూడ నాకు తెలుసు. ప్రజలు మంచి పనులు చేస్తే నీవు సంతోషిస్తావు. ఈ వస్తు సముదాయాన్నంతా హృదయ పూర్వకంగా (సదుద్దేశంతో) నేను ఇస్తున్నందుకు సంతోషిస్తున్నాను. నీ ప్రజలంతా అనేక కానుకలు సంతోషంగా నీకు ఇవ్వటానికి ఇక్కడ చేరియున్నట్లు నేను చూశాను.

18. అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలు అను మా పితరుల దేవా యెహోవా, నీ జనులు హృదయ పూర్వకముగా సంకల్పించిన యీ ఉద్దేశమును నిత్యము కాపాడుము; వారి హృదయమును నీకు అనుకూలపరచుము.

18. ఓ దేవా, నీవు మా పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, ఇశ్రాయేలులకు దేవుడివి. నీ ప్రజలు సదా నిన్ను కొలిచేలా వారికి దయచేసి సహయపడుము. వారి హృదయాలెప్పుడూ నీ వైపు తిప్పుకోగలిగేలా వారికి నీవు సహాయపడుము.

19. నా కుమారుడైన సొలొమోను నీ యాజ్ఞలను నీ శాసనములను నీ కట్టడలను గైకొనుచు వాటినన్నిటిని అనుసరించునట్లును నేను కట్టదలచిన యీ ఆలయమును కట్టించునట్లును అతనికి నిర్దోషమైన హృదయము దయ చేయుము.

19. నీ పట్ల సత్యవర్తనుడై మెలిగేలా నా కుమారుడైన సొలొమోనుకు సహాయం చేయుము. నీ ఆజ్ఞలను, ధర్మశాస్త్రాన్ని, నీ నియమ నిబంధనలను అతను ఎల్ల వేళలా పాటించేలా నీవతనికి తోడ్పడుము. ఈ విషయాలలో నీవు సొలొమోనుకు సహాయంచేసి, అతను నేను తలపెట్టిన ఆలయ నిర్మాణకార్యక్రమం పూర్తిచేసేలా తోడ్పడుము.”

20. ఈలాగు పలికిన తరువాత దావీదుఇప్పుడు మీ దేవుడైన యెహోవాను స్తుతించుడని సమాజకులందరితో చెప్పగా, వారందరును తమ పితరుల దేవుడైన యెహోవాను స్తుతించి యెహోవా సన్నిధిని రాజు ముందరను తలవంచి నమస్కారము చేసిరి.

20. పిమ్మట దావీదు అక్కడ చేరిన ప్రజాసమూహాన్ని ఉద్ధేశించి, “ఇప్పుడు మీ దేవుడైన యెహోవాకు స్తోత్రం చేయండి” అని అన్నాడు. తమ పూర్వీకులు కొలిచిన దేవుడగు యెహోవాను ప్రజలంతా స్తుతించారు. యెహోవాకి రాజుకు గౌరవ సూచకంగా వారు సాష్టాంగ నమస్కారం చేశారు.

21. తరువాత వారు యెహోవాకు బలులు అర్పించిరి. మరునాడు దహన బలిగా వెయ్యి యెద్దులను వెయ్యి గొఱ్ఱ పొట్టేళ్లను వెయ్యి గొఱ్ఱపిల్లలను వాటి పానార్పణలతో కూడ ఇశ్రాయేలీయులందరి సంఖ్యకు తగునట్టుగా అర్పించిరి.

21. ఆ మరునాడు ప్రజలంతా యెహోవాకి బలులు అర్పించారు. యెహోవాకు వారు దహన బలులు అర్పించారు. వారు వేయి గిత్తలను, వేయి పొట్టేళ్లను, వేయి గొర్రె పిల్లలను బలి ఇచ్చారు. వారు పానార్పణలను కూడ సమర్పించారు. ఇశ్రాయేలు ప్రజలందరి తరపునా లెక్కలేనన్ని బలులు సమర్పించారు.

22. ఆ దినమున వారు యెహోవా సన్నిధిని బహు సంతోషముతో అన్నపానములు పుచ్చుకొనిరి. దావీదు కుమారుడైన సొలొమోనునకు రెండవసారి పట్టాభిషేకముచేసి, యెహోవా సన్నిధిని అతని అధిపతిగాను సాదోకును యాజకునిగాను అభిషేకించిరి.

22. ఆ రోజు ప్రజలంతా బాగా తిని, తాగి ఆనందించారు. యెహోవా అక్కడ వారితో వున్నాడు. వారు చాలా ఆనందంగా వున్నారు. తరువాత దావీదు కుమారుడైన సొలొమోనును వారు రెండవసారి రాజుగా ప్రకటించారు. వారు సొలొమోనును రాజుగాను, సొదోకును యాజకునిగాను అభిషిక్తం చేశారు. యెహోవా నెలకొని వున్నచోటే వారు ఈ పనిచేశారు.

23. అప్పుడు సొలొమోను తన తండ్రియైన దావీదునకు మారుగా యెహోవా సింహా సనమందు రాజుగా కూర్చుండి వర్ధిల్లుచుండెను. ఇశ్రాయేలీయులందరును అతని యాజ్ఞకు బద్ధులై యుండిరి.

23. తరువాత సొలొమోను యెహోవా సింహాసనం మీద రాజు హోదాలో కూర్చున్నాడు. సొలొమోను తన తండ్రి స్థానాన్ని అలంకరించి వర్థిల్లాడు. ఇశ్రాయేలు ప్రజలంతా సొలొమోను ఆజ్ఞలను పాటించారు.

24. అధిపతులందరును యోధులందరును రాజైన దావీదు కుమారులందరును రాజైన సొలొమోనునకు లోబడిరి.

24. పెద్దలందరు, బలశాలురైన నాయకులు, రాజైన దావీదు కుమారులందరు సొలొమోనును రాజుగా గుర్తించి అతనికి విధేయులై వున్నారు.

25. యెహోవా సొలొమోనును ఇశ్రాయేలీయులందరి యెదు టను బహుగా ఘనపరచి, అతనికి ముందుగా ఇశ్రాయేలీ యులను ఏలిన యే రాజునకైనను కలుగని రాజ్యప్రభావమును అతని కనుగ్రహించెను.

25. యెహోవా సొలొమోనును చాలా గొప్ప వ్యక్తినిగా చేసాడు. యెహోవా సొలొమోనును చాలా ఉన్నతమైన వ్యక్తిగా చేస్తున్నాడని ఇశ్రాయేలు ప్రజలంతా గుర్తించారు. రాజుకు ఇవ్వవలసిన గౌరవాభిమానాలను యెహోవా సొలొమోనుకు ఇచ్చాడు. సొలొమోనుకు ముందు మరొక రాజెవ్వడూ అంతటి గౌరవాన్ని పొందియుండలేదు.

26. యెష్షయి కుమారుడైన దావీదు ఇశ్రాయేలీయులందరి మీద రాజైయుండెను.

26. [This verse may not be a part of this translation]

27. అతడు ఇశ్రా యేలీయులను ఏలిన కాలము నలువది సంవత్సరములు; హెబ్రోనులో ఏడు సంవత్సరములును, యెరూషలేములో ముప్పది మూడు సంవత్సరములును అతడు ఏలెను.

27. [This verse may not be a part of this translation]

28. అతడు వృద్ధాప్యము వచ్చినవాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి, మంచి ముదిమిలో మరణమొందెను. అతని తరువాత అతని కుమారుడైన సొలొమోను అతనికి మారుగా రాజాయెను.

28. దావీదు బాగా వృద్ధుడయినాక మరణించాడు. దావీదు ఉత్తమ జీవితాన్ని దీర్ఘకాలం గడిపాడు. దావీదు అన్ని భోగభాగ్యాలు, గౌరవాభిమానాలు పొందాడు. తరువాత అతని కుమారుడు సొలొమోను నూతన రాజు అయ్యాడు.

29. రాజైన దావీదునకు జరిగినవాటన్నిటినిగూర్చియు, అతని రాజరిక మంతటినిగూర్చియు, పరాక్రమమునుగూర్చియు, అతనికిని ఇశ్రాయేలీయులకును దేశముల రాజ్యములన్నిటికిని వచ్చిన కాలములనుగూర్చియు,

29. రాజైన దావీదు ఆదినుండి అంతం వరకు చేసిన పనులన్నీ దీర్ఘదర్శియైన సమూయేలు వ్రాసిన వ్రాతలలోను, ప్రవక్తయగు నాతాను వ్రాతలలోను, దీర్ఘదర్శియైన గాదు వ్రాసిన వృత్తాంతాలలోను పొందుపర్చబడ్డాయి.

30. దీర్ఘదర్శి సమూయేలు మాటలనుబట్టియు, ప్రవక్తయగు నాతాను మాటలను బట్టియు, దీర్ఘదర్శి గాదు మాటలనుబట్టియు వ్రాయబడి యున్నది.

30. ఆ వ్రాతలన్నీ ఇశ్రాయేలుకు రాజుగా దావీదు చేసిన పనులన్నిటి గురించి తెల్పుతాయి. అవి దావీదు శౌర్యాన్ని గూర్చి, అతనికి సంభవించిన విషయాలను గూర్చి తెలియజేస్తాయి. ఆ వ్రాతలు ఇశ్రాయేలుకు, దాని పొరుగు రాజ్యాలన్నిటిలో జరిగిన కార్యాలు, వాటి పరిస్థితులను తెలియజేస్తాయి.Shortcut Links
1 దినవృత్తాంతములు - 1 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |