Chronicles II - 2 దినవృత్తాంతములు 9 | View All

1. షేబదేశపు రాణి సొలొమోనును గూర్చిన ప్రసిద్ధిని వినినప్పుడు గూఢమైన ప్రశ్నలచేత సొలొమోనును శోధింపవలెనని కోరి, మిక్కిలి గొప్ప పరివారమును వెంట బెట్టుకొని, గంధవర్గములను విస్తారము బంగారమును రత్న ములను ఒంటెలమీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. ఆమె సొలొమోనునొద్దకు వచ్చి తన మనస్సులోని విషయములన్నిటిని గురించి అతనితో మాటలాడెను.
మత్తయి 6:29, మత్తయి 12:42, లూకా 11:31

1. షేబ దేశపు రాణి సొలొమోను కీర్తిని గురించి విన్నది. కఠినమైన, చిక్కు ప్రశ్నలు వేసి సొలొమోనును పరీక్షించాలని ఆమె యెరూషలేముకు వచ్చింది. షేబ రాణి తన వెంట అనేకమంది మనుష్యులను తీసుకొని వచ్చింది. సుగంధ ద్రవ్యాలు, బంగారం, విలువైన రత్నాలు మోసుకొని వచ్చిన ఒంటెలు ఆమెతో వున్నాయి. ఆమె సొలమోను వద్దకు వచ్చి అతనితో మాట్లడింది. ఆమె వద్ద సొలొమోనును అడగటానికి ఎన్నో ప్రశ్నలున్నాయి.

2. సొలొమోను ఆమె ప్రశ్నలన్నియు ఆమెకు విడదీసి చెప్పెను; సొలొమోను ఆమెకు ప్రత్యుత్తరము చెప్పలేని మరుగైన మాట యేదియు లేకపోయెను.

2. ఆమె ప్రశ్నలన్నిటికీ సొలొమోను సమాధాన మిచ్చాడు. వివరించి చెప్పటానికిగాని, సమాధాన మివ్వటానికిగాని సొలొమోనుకు కష్టమైనదేదీ కన్పించలేదు.

3. షేబదేశపురాణి సొలొమోనునకు కలిగిన జ్ఞానమును, అతడు కట్టించిన నగరును,
లూకా 12:27

3. సొలొమోను జ్ఞానాన్ని, అతడు నిర్మించిన భవంతిని షేబ దేశపు రాణి స్వయంగా చూసింది.

4. అతని బల్లమీది భోజనపదార్థములను, అతని సేవకులు కూర్చుండుటను, అతని యుపచారులు కనిపెట్టుటను వారి వస్త్రములను, అతనికి గిన్నెల నందించువారిని వారి వస్త్రములను, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహనబలులను చూచినప్పుడు, ఆమె విస్మయ మొంది రాజుతో ఇట్లనెను

4. సొలొమోను బల్లమీద రాజ భోజన పదార్థలను, అతని ముఖ్య అధికారులనేకమందిని ఆమె చూసింది. అతని సేవకులు పనిచేసే తీరును, వారు ధరించే దుస్తులను ఆమె చూసింది. సొలొమోనుకు ద్రాక్షరసము వడ్డించే వారిని, వారి దుస్తులను ఆమె చూసింది. ఆలయంలో సొలొమోను ఆర్పించిన దహన బలులను కూడ ఆమె చూసింది. షేబ దేశపు రాణి వాటన్నింటినీ చూసి నప్పుడు ఆమె ఆశ్చర్యపడింది!

5. నీ కార్యములనుగూర్చియు జ్ఞానమునుగూర్చియు నేను నా దేశమందు వినిన వర్తమానము నిజవర్తమానమే గాని, నేను వచ్చి దాని కన్నులార చూచువరకు వారి మాటలను నమ్మకయుంటిని.

5. అప్పుడామె రాజైన సొలొమోనుతో యీలా అన్నది: “నీ ఘనమైన కార్యాలను గురించి, నీ అద్భుతమైన తెలివితేటల గురించి నేను నా దేశంలో విన్న విషయాలన్నీ నిజమని తెలుసుకున్నాను.

6. నీ యధిక జ్ఞానమును గూర్చి సగమైనను వారు నాకు తెలుపలేదు. నిన్నుగూర్చి నేను వినినదానికంటె నీ కీర్తి యెంతో హెచ్చుగానున్నది.

6. నేనిక్కడికి వచ్చి, నా కన్నులతో స్వయంగా చూచేవరకు నేనా విషయాలను నమ్మలేదు. ఆహా! నీకున్న మహాజ్ఞానంలో కనీసం సగం కూడ నాకు చెప్పబడలేదు! నేను విన్న విషయాలను మించివున్నావు నీవు!

7. నీ సేవకుల భాగ్యము మంచిది, ఎల్లప్పుడును నీ సముఖమున నిలిచి నీ జ్ఞానసంభాషణ వినుచుండు నీ సేవకులైన వీరి భాగ్యము మంచిది.

7. నీవు భార్యలు, అధికారులు చాలా అదృష్టవంతులు! నీకు సేవ చేస్తూనే నీ జ్ఞాన వాక్కులను వారు వినగలరు!

8. నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు రాజువై ఆయన సింహాసనముమీద ఆసీనుడవై యుండునట్లు నీయందు అనుగ్రహము చూపినందుకు నీ దేవుడైన యెహోవాకు స్తోత్రములు కలుగునుగాక. ఇశ్రా యేలీయులను నిత్యము స్థిరపరచవలెనన్న దయాలోచన నీ దేవునికి కలిగియున్నందున నీతి న్యాయములను జరిగించుటకై ఆయన నిన్ను వారిమీద రాజుగా నియమించెను అని చెప్పెను.

8. నీ దేవుడైన ప్రభువుకు వందనాలు! నీ పట్ల ఆయన సంతోషంగా వున్నాడు. అందువల్ల ఆయన తరపున రాజ్యమేలటానికి ఆయన సింహాసనంపై నిన్ను కూర్చోపెట్టాడు. నీ దేవుడు ఇశ్రాయేలును ప్రేమిస్తున్నాడు. ఆయన సహాయం ఇశ్రాయేలుకు శాశ్వతంగా వుంటుంది. అందువల్లనే ఏది న్యాయమైనదో, ఏది మంచిదో అది చేయటానికి యెహోవా నిన్ను ఇశ్రాయేలుకు రాజుగా చేశాడు.”

9. ఆమె రాజునకు రెండువందల నలుబది మణుగుల బంగారమును విస్తారమైన గంధవర్గములను రత్న ములను ఇచ్చెను; షేబదేశపు రాణి రాజైన సొలొమోనున కిచ్చిన గంధవర్గములతో సాటియైన దేదియులేదు.

9. [This verse may not be a part of this translation]

10. ఇదియుగాక ఓఫీరునుండి బంగారము తెచ్చిన హీరాము పనివారును సొలొమోను పనివారును చందనపు మ్రానులను ప్రశస్తమైన రత్నములనుకూడ కొనివచ్చిరి.

10. హీరాము సేవకులు, సొలొమోను సేవకులు ఓఫీరు నుండి బంగారం తీసుకొని వచ్చారు. వారింకా చందనపు కర్రను, విలవైన రత్నాలను తెచ్చారు.

11. ఆ చంద నపు మ్రానులచేత రాజు యెహోవా మందిరమునకును రాజనగరునకును సౌపానములను, గాయకులకు తంబురలను సితారాలను చేయించెను, అటువంటి పని అంతకుముందు యూదాదేశమందు ఎవ్వరును చూచియుండలేదు.

11. ఆలయంలో మెట్ల నిర్మాణానికి, రాజభవన నిర్మాణంలోను రాజైన సొలొమోను చందనపు కర్రను ఉపయోగించాడు. సంగీత విధ్వాంసుల కొరకు తంబరలు, సితరాలు చేయటానికి కూడ సొలొమోను ఈ కర్రను వినియోగించాడు. యూదాలో చందనపు కర్రతో చేయబడిన చిత్రవిచిత్ర కళాఖండాలను ఎవ్వరూ ముందెన్నడూ చూసి వుండలేదు.

12. షేబ దేశపు రాణి రాజునకు తీసికొనివచ్చిన వాటికి అతడిచ్చిన ప్రతి బహుమానములుగాక ఆమె మక్కువ పడి అడిగిన దంతయు రాజైన సొలొమోను ఆమె కిచ్చెను; తరువాత ఆమె తన సేవకులను వెంట బెట్టుకొని మరలి తన దేశమునకు వెళ్లిపోయెను.

12. రాజైన సొలొమోను కూడ షేబ దేశపు రాణికి ఆమెకు కావలసిన వాటిని, అడిగిన ప్రతి దానిని ఇచ్చాడు. తనకు ఇవ్వటానికి ఆమె తెచ్చిన దానికంటె ఎక్కువగానే సొలొమోను ఇచ్చాడు. తరువాత షేబ దేశపు రాణి, ఆమె పరివారం తమ దేశానికి వెళ్లిపోయారు.

13. గంధవర్గములు అమ్ము వర్తకులును ఇతర వర్తకులును కొని వచ్చు బంగారముగాక సొలొమోనునకు ఏటేట వచ్చు బంగారము వెయ్యిన్ని మూడువందల ముప్పది రెండు మణుగులయెత్తు.

13. ఒక్క సంవత్సరంలో సొలొమోను సేకరించిన బంగారం ఇరవై ఐదు టన్నులు (ఒక వెయ్యి మూడు వందల ముప్పై రెండు మణుగులు) తూగింది.

14. అరబీదేశపు రాజులందరును దేశాధిపతు లును సొలొమోనునొద్దకు బంగారమును వెండియు తీసికొని వచ్చిరి.

14. చార వర్తకులు, వ్యాపారులు సొలొమోనుకు చాలా బంగారం తెచ్చారు. అరబీ రాజులందురూ, దేశంలో ప్రాంతీయ పాలకులూ సొలొమోనుకు వెండి బంగారాలు తెచ్చియిచ్చారు.

15. రాజైన సొలొమోను సాగగొట్టిన బంగారముతో అలుగులుగల రెండువందల డాళ్లను చేయించెను; ఒక్కొక డాలునకు ఆరువందల తులముల బంగారము పట్టెను.

15. బంగారు రేకులు తాపిన రెండు వందల పెద్దడాళ్లను సొలొమోను చేయించాడు. ప్రతి డాలుకూ సుమారు ఏడున్నర పౌనుల (ఆరు వందల తులాల) సాగగొట్టిన బంగారం పట్టింది.

16. మరియు సాగగొట్టిన బంగారముతో మూడువందల కేడెములను చేయించెను; ఒక్కొక కేడెమునకుమూడువందల తులముల బంగారము పట్టెను; వాటిని రాజు లెబానోను అరణ్యపు నగరునందుంచెను.

16. బంగారు రేకులు వేయించి మూడు వందల చిన్న డాళ్లును కూడ సొలొమోను చేయించాడు. సుమారు మూడు ముప్పాతిక పౌనుల (మూడ వందల తులాల) బంగారం ఒక్కొక్క డాలుకు పట్టింది. లెబానోను అరణ్యంలో కట్టిన భవనంలో రాజైన సొలొమోను ఈ డాళ్లను వుంచాడు.

17. మరియు రాజు దంత ముతో ఒక గొప్ప సింహాసనము చేయించి ప్రశస్త మైన బంగారముతో దాని పొదిగించెను.

17. ఒక పెద్ద దంతపు సింహాసనాన్ని సొలొమోను రాజు చేయించాడు. మేలిమి బంగారపు రేకులు దానికి తాపించాడు.

18. ఆ సింహాసనమునకు దానితో కలిసియున్న ఆరు బంగారపు సోపానము లును సింహాసనమునకు కట్టి యున్న బంగారపు పాదపీఠమును ఉండెను, కూర్చుండుచోటికి ఇరుప్రక్కల ఊతలుండెను, ఊతలదగ్గర రెండు సింహము లుండెను;

18. సింహాసనానికి ఆరు మెట్లున్నాయి. బంగారంతో చేయించిన కాలిపీట దాని ముందు వుంది. సింహాసనానికిరుపక్కల చేతులు ఆనించటానికి తగిన ఆసరా ఏర్పాటు వుంది. చేతి ఆసరాలకు రెండు పక్కలా రెండు సింహపు విగ్రహాలున్నాయి.

19. ఆ యారు సోపానములమీద ఇరుప్రక్కల పండ్రెండు సింహములు నిలిచియుండెను, ఏ రాజ్యమందైనను అటువంటి పని చేయబడలేదు.

19. ప్రతి మెట్టుకూ అటు ఇటు రెండేసి సింహాల విగ్రహాలు చొప్పున ఆరు మెట్లకు పన్నెండు సింహాపు విగ్రహాలు అమర్చబడ్డాయి. ఏ యితర సామ్రాజ్యంలోనూ ఈ రకమైన సింహాసనం చేయించబడలేదు.

20. మరియు రాజైన సొలొమోనునకున్న పానపాత్రలన్నియును బంగారపువై యుండెను; లెబానోను అరణ్యపు నగరుననున్న ఉపకరణములన్నియు బంగారముతో చేసినవి; హీరాముయొక్క పనివారితో కూడ రాజు ఓడలు తర్షీషుకు పోయి మూడు సంవత్సరములకు ఒకమారు బంగారము, వెండి, యేనుగుదంతము, కోతులు, నెమళ్లు అను సరకులతో వచ్చుచుండెను గనుక

20. సొలొమోను రాజు తాగే గిన్నెలన్నీ బంగారంతో చేసినవే. లెబానోను అరణ్య భవనంలో వాడే వస్తుసామగ్రి అంతా శుద్ధ బంగారంతో చేయబడింది. సొలొమోను కాలంలో వెండి విలువైన లోహంగా చూడబడలేదు.

21. సొలొమోను దినములలో వెండియెన్నికకు రానిదాయెను

21. తర్షీషు వరకు ప్రయాణం చేసిన ఓడలు సొలొమోను రాజుకు వున్నాయి. హీరాము మనుష్యులు సొలొమోను ఓడలను నడిపేవారు. మూడు సంవత్సరాల కొకసారి ఓడలు వెండి బంగారాలు, ఏనుగు దంతాలు, కోతులు, నెమళ్లు మొదలగు వాటిని తీసుకొని సొలొమోను రాజ్యానికి తిరిగి వచ్చేవి.

22. రాజైన సొలొమోను భూరాజులందరికంటెను ఐశ్వర్య మందును జ్ఞానమందును అధికుడాయెను.

22. భూలోకంలో వున్న రాజులందరికంటె సొలొమోను భాగ్యంలోను, తెలివితేటలలోను గొప్ప వాడయ్యాడు.

23. దేవుడు సొలొ మోనుయొక్క హృదయ మందుంచిన జ్ఞానోక్తులను వినుటకై భూరాజులందరును అతని ముఖదర్శనము చేయగోరిరి.

23. ప్రపంచ దేశాల రాజులంతా సొలొమోను వివేకవంతమైన న్యాయ నిర్ణయాలను వినటానికి అతనిని దర్శించేవారు. సొలొమోనుకు ఆ తెలివితేటలను దేవుడే ప్రసాదించాడు.

24. మరియు ప్రతివాడును ఏటేట వెండివస్తువులను బంగారు వస్తువులను వస్త్రములను ఆయుధములను గంధవర్గములను గుఱ్ఱములను కంచరగాడిదలను కానుకలుగా తీసికొనివచ్చెను.

24. ప్రతి సంవత్సరం సొలొమోనును దర్శించటానికి వచ్చే రాజులందరూ కాన్కలు తెచ్చేవారు. వారు వెండి బంగారు వస్తువులు, బట్టలు, కవచాలు, సుగంధ ద్రవ్యాలు, గుర్రాలు, కంచరగాడిదలను తెచ్చేవారు.

25. రథములు నిలువయుంచు పట్టణములలోను రాజునొద్ద యెరూషలేములోను సొలొమోనునకు నాలుగువేల గుఱ్ఱపు సాలలును రథములును పండ్రెండువేల గుఱ్ఱపు రౌతులును కలిగి యుండెను.

25. సొలొమోనుకు గుర్రాలను, రథాలను వుంచటానికి నాలుగువేల శాలలున్నాయి. అతనికి పన్నెండు వేలమంది రథసారధులున్నారు. రథాలకు ప్రత్యేక నగరాలను ఏర్పాటుచేసి, మరికొన్ని తనతో యెరూషలేములో వుంచుకున్నాడు.

26. యూఫ్రటీసునది మొదలుకొని ఫిలిష్తీ యుల దేశమువరకును ఐగుప్తు సరిహద్దువరకును ఉండు రాజు లందరి పైని అతడు ఏలుబడి చేసెను.

26. యూఫ్రటీసు నది మొదలు ఫిలిష్తీయుల దేశం, మరియు ఈజిప్టు సరిహద్దు వరకు వున్న రాజులందరికీ సొలొమోను రాజైయున్నాడు.

27. రాజు యెరూషలేము నందు వెండి రాళ్లంత విస్తారముగా నుండునట్లును, దేవదారు మ్రానులు షెఫేలా ప్రదేశ ముననున్న మేడివృక్షములంత విస్తారముగా నుండునట్లును చేసెను.

27. సొలొమోను రాజు వద్ద నిలవవున్న వెండి యెరూషలేములో కొండ గుట్టల్లా పడివుంది. అతని వద్ద పల్లపు ప్రాంతంలో వున్న మేడిచెట్లంత విస్తారంగా దేవదారు చెట్ల కలపవుంది.

28. ఐగుప్తునుండియు సకల దేశములనుండియు సొలొమోనునకు గుఱ్ఱములు తేబడెను.

28. ఈజిప్టు నుండి, తదితర దేశాలనుండి ప్రజలు సొలొమోనుకు గుర్రాలను తెచ్చి యిచ్చేవారు.

29. సొలొమోను చేసిన కార్యములన్నిటినిగూర్చి ప్రవక్తయైన నాతాను రచించిన గ్రంథమందును, షిలోనీయుడైన అహీయా రచించిన ప్రవచన గ్రంథమందును, నెబాతు కుమారుడైన యరొబామునుగూర్చి దీర్ఘదర్శి యైన ఇద్దోకు గ్రంథమందును వ్రాయబడి యున్నది.

29. మొదటినుండి చివరివరకు సొలొమోను చేసిన పనులన్నీ ప్రవక్తయైన నాతాను ప్రవచనాలోను, షిలో హువాడైన అహీయా ప్రవచనాలలోను, మరియు దీర్ఘదర్శి అయిన ఇద్దో దర్శనాలలోను పొందుపర్చబడినాయి. అహీయా షిలోనీయుడు. ఇద్దో దీర్ఘదర్శి (ప్రవక్త). ఇద్దో యరొబామును గురించి రాశాడు. యరొబాము నెబాతు కుమారుడు.

30. సొలొమోను యెరూషలేమునందు ఇశ్రాయేలీయులందరిమీద నలుబది సంవత్సరములు ఏలుబడి చేసెను.

30. సొలొమోను నలబై యేండ్లపాటు యెరూషలేము నుండి ఇశ్రాయేలంతటినీ పాలించాడు.

31. తరువాత సొలొ మోను తన పితరులతో కూడ నిద్రించి తన తండ్రియైన దావీదు పట్టణమందు పాతిపెట్టబడెను; అతనికి బదులుగా అతని కుమారుడైన రెహబాము రాజాయెను.

31. పిమ్మట సొలొమోను చని పోయాడు . తన తండ్రి దావీదు నగరంలో ప్రజలతనిని సమాధి చేశారు. సొలొమోను స్థానంలో అతని కుమారుడైన రెహబాము నూతన రాజయ్యాడు.Shortcut Links
2 దినవృత్తాంతములు - 2 Chronicles : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |