Nehemiah - నెహెమ్యా 13 | View All

1. ఆ దినమందు వారు మోషేగ్రంథము జనులకు చదివి వినిపించగా అందులో అమ్మోనీయులు గాని మోయాబీయులు గాని దేవునియొక్క సమాజమును ఎన్నటికి చేరకూడదు.

1. ఆ రోజున మోషే గ్రంథం ప్రజలందరకీ వినిపించేలా బిగ్గరగా పఠింపబడింది. అమ్మోనీయుల్లోగాని, మెయాబీయుల్లోగాని ఏ ఒక్కరూ దేవుని ప్రజల మధ్య ఎల్లప్పుడు ఉండుటకు అనుమతింప బడరన్న నిబంధన మెషే గ్రంథంలో వ్రాసి వుందన్న విషయం జనం గ్రహించారు.

2. వారు అన్నపానములు తీసికొని ఇశ్రాయేలీయులకు ఎదురుపడక వారిని శపించుమని బిలామును ప్రోత్రాహపరచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెనని వ్రాయబడినట్టు కనబడెను.

2. ఇశ్రాయేలీయులకి వాళ్లు ఆహారంగాని, నీరుగాని ఇవ్వలేదు. అందుకే ఈ నిబంధన లిఖించబడింది. పైగా ఇశ్రాయేలీయులకు శాపం ఇచ్చేందుకు బిలాముకు డబ్బు కూడా చెల్లించారు. కాని దేవుడు ఆ శాపాన్ని తిప్పికొట్టి, దాన్ని మనకొక వరంగా చేశాడు.

3. కాగా జనులు ధర్మశాస్త్రమును వినినప్పుడు మిశ్ర జనసమూహమును ఇశ్రాయేలీయులలోనుండి వెలివేసిరి.

3. ఇశ్రాయేలు ప్రజలు ఆ నిబంధనను విన్నారు. వాళ్లు దాన్ని పాటించారు. విదేశీయుల సంతానాల నుంచి వాళ్లు తమని తాము వేరుజేసుకున్నారు.

4. ఇంతకుముందు మన దేవుని మందిరపు గదిమీద నిర్ణయింపబడిన యాజకుడగు ఎల్యాషీబు టోబీయాతో బంధు త్వము కలుగజేసికొని

4. [This verse may not be a part of this translation]

5. నైవేద్యమును సాంబ్రాణిని పాత్రలను గింజలలో పదియవ భాగమును క్రొత్త ద్రాక్షా రసమును లేవీయులకును గాయకులకును ద్వారపాలకుల కును ఏర్పడిన నూనెను యాజకులకు తేవలసిన ప్రతిష్ఠిత వస్తువులను పూర్వము ఉంచు స్థలమునొద్ద, అతనికి ఒకగొప్ప గదిని సిద్ధముచేసి యుండెను.

5. [This verse may not be a part of this translation]

6. ఆ సమయములో నేను యెరూషలేములో ఉండలేదు. ఎందుకనగా బబులోను దేశపు రాజైన అర్త హషస్త యేలుబడియందు ముప్పది రెండవ సంవత్సరమున నేను రాజును దర్శించి కొన్నిదినము లైన తరువాత రాజునొద్ద సెలవుపుచ్చుకొని

6. ఇదంతా జరుగుతున్నప్పుడు నేను యెరూషలేములో లేను. నేను బబులోనుకి రాజుగారిని కలిసేందుకు వెళ్లాను. అర్తహషస్త బబులోను రాజుగావున్న 32వ ఏట నేను బబులోనుకి వెళ్లాను. తర్వాత, నేనా రాజుగారిని యెరూషలేముకి తిరిగి వెళ్లేందుకు అనుమతి అడిగాను.

7. యెరూషలేమునకు వచ్చి ఎల్యాషీబు దేవుని మందిరములో టోబీ యాకు ఒక గది యేర్పరచి చేసిన కీడంతయు తెలిసికొని

7. అలా నేను యెరూషలేముకి తిరిగి వచ్చాను. యెరూషలేములో ఎల్యాషీబు చేసిన విచారకరమైన విషయం నేను విన్నాను. ఎల్యాషీబు టోబీయాకి మన దేవుని ఆలయంలో ఒక గది యిచ్చాడు!

8. బహుగా దుఃఖపడి ఆ గదిలోనుండి టోబీయాయొక్క సామగ్రియంతయు అవతల పారవేసి, గదులన్నియు శుభ్రముచేయుడని ఆజ్ఞాపింపగా వారాలాగు చేసిరి.

8. ఎల్యాషీబు చేసిన పనికి నాకు చాలా కోపం వచ్చింది. కనుక నేను టోబీయా వస్తువులన్నీ గది బయటికి విసిరేశాను.

9. పిమ్మట మందిరపు పాత్రలను నైవేద్య పదార్థములను సాంబ్రాణిని నేనక్కడికి మరల తెప్పించితిని.

9. ఆ గదులను స్వచ్ఛంగా, పరిశుభ్రం చేయాలని ఆజ్ఞనిచ్చాను. తర్వాత నేను గిన్నెలను, వస్తుపులను, ధాన్యాం కానుకలను, ధూప సామగ్రిని తిరిగి ఆ గదుల్లో పెట్టించాను.

10. మరియు లేవీయులకు రావలసిన పాళ్లు వారికి అందక పోవుటచేత సేవచేయు లేవీయులును గాయకులును తమ పొలములకు పారిపోయిరని తెలిసికొని

10. లేవీయులకి వాళ్ల వంతులను జనం ఇవ్వలేదని కూడా నేను విన్నాను. దానితో లేవీయులూ, గాయకులూ తమ సొంత పొలాల్లో పని చేసుకునేందుకు తిరిగి వెళ్లిపోయారు.

11. నేను అధిపతులతో పోరాడిదేవుని మందిరమును ఎందుకు లక్ష్యపెట్టలేదని అడిగి, వారిని సమకూర్చి తమ స్థలములలో ఉంచితిని.

11. అందుకని, నేనా అధికారులకు వాళ్లు చేసింది తప్పని చెప్పాను. “మీరు దేవుని ఆలయం విషయంలో తగిన శ్రద్ధ ఎందుకు తీసుకోలేదు?” అని నేను వాళ్లని నిలదీశాను. తర్వాత, లేవీయులందర్నీ నేను సమావేశపరచాను. నేను వాళ్లకి తమ తమ స్థానాలకి, ఆలయంలో కొలువులకి తిరిగి రమ్మని చెప్పాను.

12. అటుతరువాత యూదులందరును ధాన్య ద్రాక్షారసతైలములలో పదియవ భాగమును ఖజానాలోనికి తెచ్చిరి.

12. తర్వాత, యూదాలోని వాళ్లందరూ ఆలయంలో తమ ధాన్యంలో పదోవంతును, కొత్త ద్రాక్షారసాన్ని, నూనెని సమర్పించారు. ఆ వసువులు వస్తువులను భద్రపరచు గదుల్లో ఉంచబడ్డాయి.

13. నమ్మకముగల మనుష్యులని పేరు పొందిన షెలెమ్యా అను యాజకుని సాదోకు అను శాస్త్రిని లేవీయులలో పెదాయాను ఖజానామీద నేను కాపరులగా నియమించితిని; వారి చేతిక్రింద మత్తన్యా కుమారుడైన జక్కూరునకు పుట్టిన హానాను నియమింపబడెను; మరియు తమ సహో దరులకు ఆహారము పంచిపెట్టు పని వారికి నియమింప బడెను.

13. ఆ గిడ్డంగులకి నేనీ క్రింది వారిని భద్రపరచు వారుగా నియమించాను: యాజకుడు షెలెమ్యా, ఉపదేశకుడు సాదోకు, లేవీయుడు పెదయా. వారికి సహాయకుడుగా హానానును నియమించాను. హానాను జక్కూరు కొడుకు, మత్తన్యా మనుమడు. వీళ్లు విశ్వాసపాత్రులన్న విషయం నాకు తెలుసు. వాళ్లు తమ బంధువులకు ఆయా వస్తువులు అందచేసే విషయంలో బాధ్యులు.

14. నా దేవా, ఈ విషయములో నన్ను జ్ఞాపకముంచుకొని, నా దేవుని మందిరమునకు దాని ఆచారముల జరుగుబాటునకును నేను చేసిన ఉపకారములను మరువకుండుము.

14. దేవా, నేను చేసిన ఈ పనుల దృష్ట్యా నన్ను గుర్తుపెట్టుకో, నా దేవుని ఆలయ నిర్మాణంకోసం, దాని కొలువులకోసం నేను చిత్తశుద్ధితో నమ్మకంగా చేసినవన్నీ గుర్తంచుకో దేవా.

15. ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్షతొట్లను త్రొక్కుటయు, గింజలుతొట్లలో పోయుటయు, గాడిదలమీద బరువులు మోపుటయు, ద్రాక్షారసమును ద్రాక్షపండ్లను అంజూరపు పండ్లను నానా విధములైన బరువులను విశ్రాంతిదినమున యెరూషలేములోనికి తీసికొని వచ్చుటయు చూచి, యీ ఆహారవస్తువులను ఆ దినమున అమ్మినవారిని గద్దించితిని.

15. ఆ రోజుల్లో యూదాలో జనం సబ్బాతు (విశ్రాంతి) నాడు కూడా పనిచేయడం నేను గమనించాను. జనం ద్రాక్షాపళ్లు తొక్కి రసం తీయడం చూశాను. జనం ధాన్యం తీసుకురావడం, దాన్ని గాడిదలమీద మోపడం చూశాను. నగరంలో జ నం ద్రాక్షాను, అత్తిపళ్లను, రకరకాల వస్తువులను తీసుకు రావడం చూశాను. వాళ్లు సబ్బాతు (విశ్రాంతి) రోజున ఈ వస్తుపులన్నింటినీ యెరూషలేముకి తెస్తున్నారు. అందుకని, నేను వాళ్లకి ఈ విషయంలో హెచ్చరిక చేశాను. నేను వాళ్లకి సబ్బాతు రోజున ఆహారం అమ్మ కూడదని చెప్పాను.

16. తూరుదేశస్థులును కాపురముండి, యెరూషలేములోను విశ్రాంతిదినములో యూదులకును చేపలు మొదలైన నానా విధ వస్తువులను తెచ్చి అమ్ముచుండిరి.

16. తూరు నగరానికి చెందిన కొందరు యెరూషలేములో వున్నారు. వాళ్లు చేపలను, రకరకాల వస్తువులను యెరూషలేములోకి తెచ్చి, సబ్బాతు రోజున అమ్ముతున్నారు. యూదులు ఆ వస్తువులను కొంటున్నారు.

17. అంతట యూదుల ప్రధానులను నేనెదురాడి విశ్రాంతిదినమును నిర్లక్ష్యపెట్టి మీ రెందుకు ఈ దుష్కార్యమును చేయుదురు?

17. యూదాలోని ముఖ్యులకు వాళ్లు చేస్తున్నది పొర పాటని చెప్పాను. నేనా ముఖ్యులకి ఇలా చెప్పాను: “మీరు చాలా చెడ్డపని చేస్తున్నారు. మీరు సబ్బాతును నాశనం చేస్తున్నారు. మీరు సబ్బాతును అన్ని ఇతర రోజుల మాదిరిగా మారుస్తున్నారు.

18. మీ పితరులును ఇట్లు చేసి దేవునియొద్దనుండి మనమీదికిని యీ పట్టణ స్థులమీదికిని కీడు రప్పింపలేదా? అయితే మీరు విశ్రాంతిదినమును నిర్లక్ష్యపెట్టి ఇశ్రాయేలీయులమీదికి కోపము మరి అధికముగా రప్పించుచున్నారని చెప్పితిని.

18. మీ పూర్వీకులు కూడా సరిగ్గా ఈ పనులే చేశారన్న విషయం మీకు తెలుసు. అందుకే యెహోవా మనకీ, ఈ నగరానికీ, ఈ ఇబ్బందులూ, విపత్తులూ తెచ్చాడు. మీరు సరిగ్గా అవే పనులు చేస్తున్నారు. అందుకని, ఇలాంటి చెడుగులే ఇశ్రాయేలుకి మరిన్ని దాపురిస్తాయి. ఎందుకంటే, సబ్బాతు రోజు ముఖ్యమైనది కాదన్నట్లు దాన్ని మీరు నాశనం చేస్తున్నారు.

19. మరియు విశ్రాంతిదినమునకు ముందు చీకటి పడినప్పుడు యెరూషలేము గుమ్మములను మూసివేయవలెననియు, విశ్రాంతిదినము గడచువరకు వాటిని తియ్యకూడదనియు నేనాజ్ఞాపించితిని మరియు విశ్రాంతిదినమున ఏ బరువైనను లోపలికి రాకుండ గుమ్మములయొద్ద నా పనివారిలో కొందరిని కావలి యుంచితిని.

19. అందుకని, నేనేమి చేశానంటే: ప్రతి శుక్రవారము సాయంత్రము (విశ్రాంతి దినానికి ముందు) చీకటి పడేందుకు సరిగ్గా ముందు, యెరూషలేము ద్వారాలను మూసేసి, తాళాలు బిగించమని ద్వార పాలకులను నేను ఆదేశీంచాను. ఆ తలుపులను సబ్బాతు రోజు ముగిసేదాకా తియ్యరాదు. ద్వారాల దగ్గర నా సొంత మనుషుల్లో కొందర్ని పెట్టాను. సబ్బాతు రోజున యెరూషలేము నగరంలోకి ఎట్టి పరిస్థితిల్లోనూ ఎలాంటి సరుకుల మూటలూ రాకుండా చూడమని నేను వాళ్లని కట్టడిచేశాను.

20. వర్తకులును నానావిధములైన వస్తువులను అమ్మువారును ఒకటి రెండు మారులు యెరూష లేము అవతల బసచేసికొనగా

20. ఒకటి రెండు సార్లు వ్యాపారస్తులూ, చిల్లిర వర్తకులూ రాత్రి పూట యెరూషలేము ప్రాకారం వెలుపల గడపవలసివచ్చింది.

21. నేను వారిని గద్దించి వారితో ఇట్లంటినిమీరు గోడచాటున ఎందుకు బసచేసి కొంటిరి? మీరు ఇంకొకసారి ఈలాగు చేసినయెడల మిమ్మును పట్టుకొందునని చెప్పితిని; అప్పటినుండి విశ్రాంతి దినమున వారు మరి రాలేదు.

21. అయితే, నేనా వ్యాపారస్తుల్నీ చిల్లిర వర్తకుల్నీ, “రాత్రిపూట ద్వారం ముందర గడపవద్దు. మీరు మరోసారి అలా చేస్తే మిమ్మల్ని పట్టుకొంటాను” అని హెచ్చరించాను. దానితో, అప్పట్నుంచి వాళ్లు తమ సరుకులు అమ్ముకునేందుకు సబ్బాతు రోజున మళ్లీరాలేదు.

22. అప్పుడు తమ్మును తాము పవిత్రపరచుకొనవలెననియు, విశ్రాంతి దినమును ఆచరించుటకు వచ్చి గుమ్మములను కాచుకొనవలెననియు లేవీయు లకు నేను ఆజ్ఞాపించితిని. నా దేవా, యిందును గూర్చియు నన్ను జ్ఞాపకముంచుకొని నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షించుము.

22. తర్వాత తమని తాము పరిశుద్ధుల్నీ చేసుకోమని నేను లేవీయుల్ని ఆదేశించాను. వాళ్లలా చెశాక, వాళ్లు పోయి, ద్వారాలను కావలి కాయాలి. సబ్బాతు రోజును ఒక పవిత్ర దినంగా వుంచేందుకు గాను ఇవన్నీ చేశాను. ఈ పనుల దృష్ట్యా నన్ను గుర్తుంచుకో దేవా. నామీద దయవుంచి, ఘనమైన నీ ప్రేమా, దయ నామీద ప్రసరింపచెయ్యి.

23. ఆ దినములలో అష్డోదు అమ్మోను మోయాబు సంబంధు లైన స్త్రీలను వివాహము చేసికొనిన కొందరు యూదులు నాకు కనబడిరి.

23. ఆ రోజుల్లో కొందరు యూదులు అష్టోదు, అమ్మోను, మోయాబు దేశాలకు చెందిన స్త్రీలను పెళ్లి చేసుకున్న విషయం కూడా నేను గమనించాను.

24. వారి కుమారులలో సగము మంది అష్డోదు భాష మాటలాడువారు. వారు ఆ యా భాషలు మాటలాడువారు గాని యూదుల భాష వారిలో ఎవరికిని రాదు.

24. ఆ వివాహాల ఫలితంగా పుట్టిన పిల్లల్లో సగం ముందికి యూదా భాషలో మాట్లాడటం చేతకాదు. ఆ పిల్లలు అష్డోదు, అమ్మోను లేక మోయాబు భాష మాట్లడేవారు.

25. అంతట నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తలవెండ్రుకలను పెరికివేసిమీరు వారి కుమారులకు మీ కుమార్తెలను ఇయ్యకయు,మీ కుమా రులకైనను మీకైనను వారి కుమార్తెలను పుచ్చుకొనకయు ఉండవలెనని వారిచేత దేవుని పేరట ప్రమాణము చేయించి

25. అందుకని, వాళ్లు పొరపాటు చేస్తున్నారని నేను వాళ్లకి చెప్పాను. నేను వాళ్లని శపించాను. వాళ్లలో నేను కొందర్ని కొట్టాను కూడా. కొందర్ని జుట్టు పట్టుకొని గుంజాను. వాళ్లచేత నేను బలవంతాన దేవుని సాక్షిగా ప్రమాణం చేయించాను. నేను వాళ్లకి ఇలా చెప్పాను: “మీరు వాళ్ల అమ్మాయిల్ని పెళ్లి చేసుకో కూడదు. ఆ విదేశీయుల కూతుళ్లని మీ అబ్బాయిలు పెళ్లి చేసుకోకుండా చూడండి. అలాగే, మీ అమ్మాయిలు ఆ విదేశీయుల కొడుకుల్ని పెళ్లిచేసుకోకుండా చూడండి.

26. ఇట్టి కార్యములు జరిగించి ఇశ్రాయేలీయుల రాజైన సొలొమోను పాపము చేయలేదా? అనేక జనములలో అతనివంటి రాజు లేకపోయినను, అతడు తన దేవునిచేత ప్రేమింపబడినవాడై ఇశ్రాయేలీయులందరిమీద రాజుగా నియమింపబడినను, అన్యస్త్రీలు అతనిచేత సహా పాపము చేయించలేదా?

26. ఇలాంటి పెళ్లిళ్లు సొలొమోను లాంటివాడు సైతం పాపం చేసేందుకు కారణభూతమయ్యాయని మీకు తెలుసు. ఎన్నెన్నో దేశాల్లో సొలొమోనంతటి గొప్ప రాజు లేడు. సొలొమెను దేవుని ప్రేమ పొందినవాడు. దేవుడు సొలొమోనును ఇశ్రాయేలు దేశమంతటికీ రాజును చేశాడు. అలాంటి సొలొమోను సైతం విదేశీ స్త్రీల మూలంగా పాపం చేయవలసి వచ్చింది.

27. కాగా ఇంత గొప్పకీడు చేయునట్లును, మన దేవునికి విరోధముగా పాపము చేయు నట్లును అన్యస్త్రీలను వివాహము చేసికొనిన మీవంటివారి మాటలను మేము ఆలకింపవచ్చునా? అని అడిగితిని.

27. మరి ఇప్పుడు మీరు కూడా అలాంటి ఘోర పాపమే చేస్తున్నట్లు వింటున్నాం. మీరు దేవునిపట్ల నమ్మకంగా వ్యవహరించడం లేదు. మీరు విదేశీ స్త్రీలను పెళ్లి చేసుకుంటున్నారు.”

28. ప్రధాన యాజకుడును ఎల్యాషీబు కుమారుడునైన యోయాదా కుమారులలో ఒకడు హోరోనీయుడైన సన్బల్లటునకు అల్లుడాయెను. దానినిబట్టి నేను అతని నాయొద్దనుండి తరిమితిని.

28. యోయూదా ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు కొడుకు. యోయూదా కొడుకుల్లో ఒకడు హోనానువాసి అయిన సన్బల్లటుకి అల్లుడు. నేను అతని చోటు విడిచిపెట్టేలా చేశాను. నేనతను పారిపోయేలా కట్టడిచేశాను.

29. నా దేవా, వారు యాజక ధర్మమును, యాజకధర్మపు నిబంధనను, లేవీయుల నిబంధ నను అపవిత్రపరచిరి గనుక వారిని జ్ఞాపకముంచకొనుము.

29. ఓ నా దేవా, నువ్వు వాళ్లని శిక్షించు. వాళ్లు యాజకత్వాన్ని అపవిత్రం చేశారు. అదేదో అంత ముఖ్యం కాదన్నట్లు వాళ్లు వ్యవహరించారు. యాజకులతోనూ, లేవీయులతోనూ నువ్వు చేసుకున్న ఒడంబడికను వాళ్లు పాటించలేదు.

30. ఈలాగున వారు ఏ పరదేశులలోను కలియకుండ వారిని పవిత్రపరచి, ప్రతి యాజకుడును ప్రతి లేవీయుడును విధి ప్రకారముగా సేవచేయునట్లు నియమించితిని.

30. అందుకని నేనా యాజకులనూ, లేవియులనూ శుచులనుగా, పరిశుద్ధులనుగా చేశాను. నేను విదేశీయులందర్నీ, వాళ్లు నేర్పిన వింత విషయాల్నీ తోలగించాను. నేను లేవీయులకీ, యాజకులకీ వాళ్ల అసలైన సొంత విధులనూ, బాధ్యతలనూ అప్పగించాను.

31. మరియు కావలసి వచ్చినప్పుడెల్ల కట్టెల అర్పణను ప్రథమ ఫలములను తీసికొని వచ్చునట్లుగా నేను నియమించితిని. నా దేవా, మేలుకై నన్ను జ్ఞాపకముంచుకొనుము.

31. జనం కట్టెల కానుకలనూ, తొలి ఫలాలనూ సరైన సమయాల్లో పట్టుకు వచ్చేలా చూశాను. ఓ నా దేవా, నేను చేసిన ఈ మంచి పనుల దృష్ట్యా నన్ను గుర్తుంచుకో.Shortcut Links
నెహెమ్యా - Nehemiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |