Esther - ఎస్తేరు 3 | View All

1. ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు హమ్మెదాతా కుమారుడును అగాగీయుడునగు హామానును ఘనపరచి వాని హెచ్చించి, వాని పీఠమును తన దగ్గర నున్న అధిపతులందరికంటె ఎత్తుగా నుంచెను.

1. ఈ సంఘటనల తర్వాత అహష్వేరోషు మహారాజు హామానుకు గౌరవనీయ స్థానం ఇచ్చాడు. అగాగీయుడైన హామాను హమ్మెదాతా కొడుకు. మహారాజు హామానుకు ఉన్నత పదవి ఇచ్చి, అతన్ని మిగిలిన అధికారులందరికంటె ఉన్నత స్థానంతో ఉంచాడు.

2. కాబట్టి రాజు గుమ్మముననున్న రాజసేవకులందరును రాజాజ్ఞాను సారముగా మోకాళ్లూని హామానునకు నమస్కరించిరి. మొర్దెకై వంగకయు నమస్కారము చేయకయు నుండగా

2. రాజభవన ద్వారం దగ్గరవుండే అధికారులందరూ హామానుకు మోకరిల్లి, నమస్కరించాలని మహారాజు ఆజ్ఞ జారీచేశాడు. అధికారులందరూ ఈ ఆజ్ఞను పాటించేవారు. అయితే, మొర్దెకై మాత్రం మోకరిల్లేందుకూ, గౌరవాభివందనం చేసేందుకూ నిరాకరించాడు.

3. రాజు గుమ్మముననున్న రాజసేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగిరి.

3. అప్పుడు ద్వారం దగ్గరి ఉద్యోగులు మొర్దెకైని “హామాను ముందు మోకరిల్లాలన్న మహారాజు ఆజ్ఞను నువ్వెందుకు పాటించడర లేదు?” అని ప్రశ్నించారు.

4. ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచు వచ్చినను అతడు వారి మాట చెవిని బెట్టకపోయెను గనుక వారుమొర్దెకైయొక్క మాటలు స్థిరపడునో లేదో చూతమని దాని హామానునకు తెలిపిరి. ఏలయనగా అతడునేను యూదుడను గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి యుండెను.

4. ఆ రాజోద్యోగులు ప్రతిరోజూ మొర్దెకైతో ఈ విషయమై ప్రస్తావించేవారు. అయితే, హామాను ముందు మోకరిల్లాలన్న ఆజ్ఞను పాటించేందుకు మొర్దెకై తిరస్కరిస్తూ వచ్చాడు. దానితో, ఆ ఉద్యోగులు ఈ విషయాన్ని హామానుకు తెలియ జెప్పారు. మొర్దెకై విషయంలో హామాను ఏమి చేస్తాడో చూద్దా మనుకున్నారు. తను యూదుడనన్న విషయాన్ని మొర్దకై ఆ ఉద్యోగులకు చెప్పాడు.

5. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి

5. మొర్దెకై తన ముందు మోకరిల్లి, గౌరవాభివందనం చేసేందుకు నిరాకరించాడని విన్న హామాను చాలా కోపం చెందాడు.

6. మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట స్వల్పకార్యమని యెంచి, మొర్దెకైయొక్క జనులు ఎవరైనది తెలిసికొని, అహష్వేరోషుయొక్క రాజ్యమందంతటనుండు మొర్దెకై స్వజనులగు యూదులనందరిని సంహరించుటకు ఆలోచించెను.

6. మొర్దెకై యూదూడు అన్న విషయం హామానుకు తెలిసింది.అయితే, ఒక్క మొర్దెకైని మాత్రమే చంపడం అతనికి తృప్తికరంగా కనిపించలేదు. మొర్దెకై జాతీయులందర్మీ, అంటే, అహష్వేరోషు సామ్రాజ్యంలోని రాజ్యాలన్నింట్లో గల యూదులందర్నీ సమూలంగా నాశనం చేసే మార్గం ెవెదక నారంభించాడు.

7. రాజైన అహష్వేరోషుయొక్క యేలుబడి యందు పండ్రెండవ సంవత్సరమున నీసాను మాసమున, అనగా, ప్రథమమాసమున వారు హామాను ఎదుట పూరు, అనగా చీటిని దినదినమునకును నెల నెలకును అదారు అను పండ్రెండవ నెలవరకు వేయుచు వచ్చిరి.

7. మహారాజు అహష్వేరోషు పాలనలో పన్నెండవ సంవత్సరం, నీసాను అనబడే మొదటి నెలలో హామానుతన కార్యక్రమానికి మంచి రోజును, నెలను ఎంచు కొనేందుకు చీటీలు వేశాడు. (ఆ రోజుల్లో ఈ చీటీలను “పూరు” అనేవారు). దాంట్లో అదారు అనబడే పన్నెండవ నెల ఎన్నిక చేయబడింది.

8. అంతట హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా మీ రాజ్య సంస్థా నములన్నిటియందుండు జనులలో ఒక జాతివారు చెదరి యున్నారు; వారి విధులు సకలజనుల విధులకు వేరుగా ఉన్నవి; వారు రాజుయొక్క ఆజ్ఞలను గైకొనువారు కారు; కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు.

8. అప్పుడిక హామాను అహష్వేరోషు మహారాజు దగ్గరకు వెళ్లి ఇలా అన్నాడు: “మహారాజా, మీ సామ్రాజ్యంలోని అన్ని సామంత రాజ్యాల్లోనూ చెదురుమదురుగా ఒక జాతివాళ్లు వున్నారు. వాళ్లు ఆ దేశాల ప్రజలతో కలిసివుండక వేరుగా వుంటారు. వాళ్ల ఆచార సంప్రదాయాలు మిగిలిన ప్రజలవాటికి భిన్నమైనవి. వాళ్లు మహారాజు శాసనాలను పాటించరు. వాళ్లను మీ సామ్రాజ్యంలో ఉండనివ్యడం క్షేమ దాయకం కాదు.

9. రాజునకు సమ్మతియైతే వారు హతము చేయబడునట్లును, నేను ఆ పనిచేయువారికి ఇరువదివేల మణుగుల వెండిని రాజుయొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించునట్లును, చట్టము పుట్టించుమనగా

9. “మహారాజు మన్నిస్తే నాదొక సలహా. ఆ జాతి ప్రజలను హతమార్చేందుకు ఆజ్ఞ జారీ చెయ్యండి. ఇందుకయ్యే ఖర్చుకుగాను నేను 10,000 వెండి నాణ్యాలు రాజ్య ఖజానాలో జమకడతాను. ఈ కార్య క్రమాన్ని నిర్వహించేవారికి వేతనాలు చెల్లిం చేందుకు ఈ మొత్తాన్ని వినియోగించవచ్చు.”

10. రాజు తనచేతి ఉంగరము తీసి దానిని హమ్మెదాతా కుమారుడైన అగాగీయుడగు హామానున కిచ్చి

10. మహారాజు రాజముద్రిక ఉన్న ఉంగరాన్ని తీసి హామానుకి ఇచ్చాడు. హామాను అగాగీయుడైన హమ్మెదాతా కొడుకు. హామాను యూదులకు బద్ధ శత్రువు.

11. ఆ వెండి నీ కియ్య బడియున్నది;నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జను లకు చేయునట్లుగా వారును నీకు అప్పగింపబడి యున్నారని రాజు సెలవిచ్చెను. ఈ హామాను యూదులకు శత్రువు.

11. మహారాజు హామానుతో ఇలా అన్నాడు, “ఆ సొమ్ము నీ దగ్గరే వుంచుకో. ఆ జాతివాళ్ల విషయంలో నువ్వేమి చెయ్యదలచుకున్నావో చెయ్యి.”

12. మొదటి నెల పదమూడవ దినమందు రాజుయొక్క వ్రాతగాండ్రు పిలువబడిరి; హామాను ఆజ్ఞాపించిన ప్రకారము అంతయు ఆ యా సంస్థానములమీద నుంచ బడిన రాజుయొక్క అధిపతులకును అధికారులకును, ఆ యా సంస్థానములలోని జనములమీద నుంచబడిన అధి పతులకును అధికారులకును,వారి వారి లిపినిబట్టియు, ఆ యా జనములభాషను బట్టియు, రాజైన అహష్వేరోషు పేరట ఆ వ్రాతగాండ్రచేత తాకీదులు వ్రాయింపబడి రాజు ఉంగరముచేత ముద్రింపబడెను.

12. అటు తర్వాత మొదటి నెల 13వ రోజున మహారాజుగారి లేఖకులు పిలువనంపబడ్డారు. వాళ్లు హామాను ఆజ్ఞలన్నింటినీ ఒక్కొక్క దేశపు భాషాలిపిలో వ్రాశారు. వాళ్లు వాటిని ఆయా ప్రజాబృందాల భాషల్లో వ్రాశారు. వాళ్లు మహారాజు సామంతులకు, ఆయా ప్రాంతాల పాలకులకు ఆ తాఖీదులు పంపారు. వాళ్లు ఆ తాఖీదులను మహారాజు పేరిట, మహారాజు మొద్రికతో పంపారు.

13. అదారు అను పండ్రెండవ నెల పదమూడవ దినమందు ¸యౌవనుల నేమి వృద్ధులనేమి శిశువుల నేమి స్త్రీల నేమి యూదుల నందరిని ఒక్కదినమందే బొత్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము కొల్లపుచ్చు కొమ్మని తాకీదులు అంచెవారిచేత రాజ్య సంస్థానములన్నిటికిని పంపబడెను.

13. వార్తాహరులు ఆయా సామంత దేశాలకు యీ తాఖీదు పత్రాలను తీసుకెళ్లారు. యూదులందర్నీ చంపి వేయాలి, ఆ జాతి మొత్తాన్ని సర్వనాశనం చేయాలి, యిదీ మహారాజు ఆజ్ఞ. అంటే, యూదులందరూ పిల్లపాపలూ, యువతీ యువకులూ, ముసలి, వయస్సులో వున్నవాళ్లు, వయస్సు మళ్లినవాళ్లు, ఒక్కరోజులో హతమార్చ బడాలన్నమాట. ఆ రోజు అదారు అనబడే 12వ నెలలో 13వ రోజు అవుతుంది. ఆ ఆజ్ఞలో మరో అంశం యూదులకు చెందిన వస్తువులన్నింటినీ తీసేసు కోవడం ఈలాగున ఆ తాఖీదు పత్రాలలో వ్రాయబడియున్నది.

14. మరియు ఒకానొక దినమునకు వారు సిద్ధపడవలెనను ఆ ఆజ్ఞకు ఒక ప్రతి ప్రబలింపబడినదై ప్రతి సంస్థానములోనున్న సమస్త జనులకు ఇయ్యబడుటకు పంపబడెను.

14. ఆ ఆజ్ఞల ప్రతులు రాజశాసనంగా అందరికీ పంపబడ్డాయి. ఈ తాఖీదును అన్ని సామంత రాజ్యాల్లోనూ శాసనంగా చెల్లుబడి చెయ్యాలి, దాన్ని సామ్రాజ్యంలో అన్ని జాతుల ప్రజలకీ ప్రకటించాలి.

15. అంచెవారు రాజాజ్ఞ చేత త్వరపెట్టబడి బయలువెళ్లిరి. ఆ యాజ్ఞ షూషను కోటలో ఇయ్యబడెను, దాని విని షూషను పట్టణము కలతపడెను. అంతట రాజును హామానును విందుకు కూర్చుండిరి.

15. రాజాజ్ఞ మేరకు వార్తాహరులు హుటాహుటిగా బయల్దేరారు. రాజధాని నగరం షూషనులో కూడా యీ తాఖీదు ప్రతులు పంచబడ్డాయి. మహారాజూ, హామానూ మద్యం సేవిస్తూ కూర్చుండగా, అటు షూషను నగరం గందరగోళంలో మునిగిపోయింది.Shortcut Links
ఎస్తేరు - Esther : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |