ఈ వాక్యం, తరువాతి వాక్యంలో బైబిల్లోని ఉత్తమోత్తమమైన క్షణాలు మనకు కనిపిస్తున్నాయి. ఇవి మనలో యోబు పట్ల గౌరవ భావాన్ని కలిగించాలి. యోబు విశ్వాసం అతనికి కలిగిన నష్టాలు, దుఃఖం వీటన్నిటికంటే ఉన్నతంగా ఉంది. సైతాను అబద్ధికుడన్న విషయం రుజువైంది. మానవ హృదయాల్లో దేవుని కృపా పరిచర్య శక్తివంతమైనదీ నిజమైనదీ అన్న విషయం నిరూపించబడింది. సైతాను ఊహించినట్టు దేవుణ్ణి దూషించేందుకు బదులు యోబు ఆయనను స్తుతించాడు. యోబు తనకు కలిగిన నష్టాల విషయం షెబావారిని గానీ కల్దీయవారిని గానీ సుడిగాలిని అగ్నిని గానీ చివరికి సైతానునూ కూడా నిందించలేదు. జరిగినవన్నీ ప్రమాదవశానో, మనుషుల దౌర్జన్యం వల్లనో, ప్రకృతి వైపరీత్యం వల్లనో జరిగాయని అతడు భావించలేదు. ఇచ్చినది దేవుడే, తీసివేసినది దేవుడే అన్నాడు. అంతటిలో దేవుని సర్వాధిపత్యాన్ని గుర్తించాడు. దేవుడు జరగనిస్తే తప్ప అక్కడ జరిగినవన్నీ సంభవించవని యోబుకు తెలుసు.
“బట్ట...క్షౌరం”– పట్టరాని సంతాపానికి గుర్తుగా.