Job - యోబు 9 | View All

1. అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను

2. వాస్తవమే, ఆ సంగతి అంతేయని నేనెరుగుదును.నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును?

బిల్దదు మాటల్లో ఏ మాటలను యోబు అంగీకరిస్తున్నాడో స్పష్టంగా లేదు. ముగింపులో పలికిన మాటల గురించి గానీ బిల్దదు మాటల సారాంశమైన యోబు 8:3 గురించి గానీ యోబు ఇలా అని ఉండవచ్చు. ఇప్పుడు యోబు వేస్తున్న ప్రశ్న అత్యంత ప్రాముఖ్యమైనది. దీని జవాబు యోబు గ్రంథంలో లేదు. నిజానికి దీనికి జవాబు దొరుకుతుందని యోబు నమ్మలేదు. అతడు కేవలం మనిషి భ్రష్ట స్వభావాన్నీ అజ్ఞానాన్నీ ఉద్దేశించి మాత్రమే మాట్లాడుతున్నాడు. యోబు భావం బహుశా ఇది కావచ్చు – “మనుషులంతా పాపులే. నేనూ పాపిని. నాకు ఈ సంగతి బాగా తెలుసు. ఎవరైనా సరే దేవుని ఎదుట నిలబడి నేను ఏ లోపమూ లేని న్యాయవంతుణ్ణి అని వాదించడం అసాధ్యం. నా మట్టుకైతే నేను అలా చేయలేను.” కానీ దేవుని దృష్టిలో మనిషి పరిపూర్ణ న్యాయవంతుడుగా ఉండేందుకు మార్గం ఉంది. ఆదికాండము 15:6; రోమీయులకు 3:22-26; ఫిలిప్పీయులకు 3:9 చూడండి.

3. వాడు ఆయనతో వ్యాజ్యెమాడ గోరినయెడలవేయి ప్రశ్నలలో ఒక్కదానికైనను వాడు ఆయనకుఉత్తరమియ్యలేడు.

దేవునితో వాదన విషయానికి వస్తే తాను గెలిచే అవకాశం ఎంత మాత్రం ఉండదని యోబుకు తెలుసు. తాను ఎక్కువ బలప్రభావాలూ జ్ఞానమూ లేనివాడిననీ సంభాషణలో జాగ్రత్త లేనివాడిననీ వాదంలో నేర్పు, ప్రవీణత లేనివాడిననీ అతనికి తెలుసు (3,14-16,20 వ). దేవుడైతే జ్ఞానవంతుడు, బలప్రభావాలుగల సృష్టికర్త అనీ, తన సృష్టికి తన ఇష్టం వచ్చిన విధంగా చేయగలవాడనీ తెలుసు (వ 4-10). యోబు (అతని మిత్రులు కూడా) దేవుని గురించి కొంత సత్యాన్ని తెలుసు కున్నాడు. యోబు భూమినీ సూర్య చంద్ర నక్షత్రాదులనూ చూచి అవి దేవుడు కాదనీ, దేవునిలో కనీసం విభాగాలు కూడా కాదనీ తెలుసుకున్నాడు. సృష్టి కేవలం దేవుని చేతిపనే అని యోబుకు తెలుసు. ఎంతోమంది దేవుళ్ళు లేరు, దేవుడొక్కడే అని తెలుసు. 11వ వచనంలో దేవుడు విశ్వంలో మనుషులకు కనపడని ఆత్మగా ఉన్నాడని యోబు చెప్తున్నాడు. మానవ జీవన వ్యవహారాల్లో దేవుడు సర్వ శక్తిమంతుడు (12,13 వ). దీన్లో బహుశా యోబు ఉద్దేశం ఇది – దేవుడు నా పిల్లలను తీసివేసుకున్నాడు. ఇందులో ఎవరూ చేయగలిగేదేమీ లేదు.

4. ఆయన మహా వివేకి, అధిక బలసంపన్నుడుఆయనతో పోరాడ తెగించి హాని నొందనివాడెవడు?

5. వాటికి తెలియకుండ పర్వతములను తీసివేయువాడు ఆయనే ఉగ్రతకలిగి వాటిని బోర్లదోయువాడు ఆయనే

6. భూమిని దాని స్థలములో నుండి కదలించువాడుఆయనేదాని స్తంభములు అదరచేయువాడు ఆయనే

7. ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపడు ఆయన నక్షత్రములను మరుగుపరచును.

8. ఆయన ఒక్కడే ఆకాశమండలమును విశాలపరచువాడు సముద్రతరంగములమీద ఆయన నడుచుచున్నాడు.

9. ఆయన స్వాతి మృగశీర్షము కృత్తిక అనువాటిని దక్షిణనక్షత్రరాసులను చేసినవాడు.

10. ఎవడును తెలిసికొనలేని మహత్తయిన కార్యములను లెక్కలేనన్ని అద్భుతక్రియలను ఆయన చేయుచున్నాడు.

11. ఇదిగో ఆయన నా సమీపమున గడచిపోవుచున్నాడుగాని నేనాయనను కనుగొనలేను నా చేరువను పోవుచున్నాడు గాని ఆయన నాకు కనబడడు.

12. ఆయన పట్టుకొనిపోగా ఆయనను అడ్డగింపగలవాడెవడు? నీవేమి చేయుచున్నావని ఆయనను అడుగతగినవాడెవడు?

13. దేవుని కోపము చల్లారదురాహాబు సహాయులు ఆయనకు లోబడుదురు.

“రాహాబు”– యోబు 26:12 నోట్.

14. కావున ఆయనకు ప్రత్యుత్తరమిచ్చుటకు నేనెంతటివాడను? ఆయనతో వాదించుచు సరియైన మాటలు పలుకుటకు నేనేపాటివాడను?

15. నేను నిర్దోషినై యుండినను ఆయనకు ప్రత్యుత్తరము చెప్పజాలను న్యాయకర్తయని నేనాయనను బతిమాలుకొనదగును.

16. నేను మొఱ్ఱపెట్టినప్పుడు ఆయన నాకుత్తరమిచ్చినను ఆయన నా మాట ఆలకించెనని నేను నమ్మజాలను.

17. ఆయన ఆలకింపక పెనుగాలిచేత నన్ను నలుగగొట్టు చున్నాడు నిర్ణిమిత్తముగా నా గాయములను విస్తరింపజేయుచున్నాడు

18. ఆయన నన్ను ఊపిరి తీయనియ్యడు చేదైనవాటిని నాకు తినిపించును.

19. బలవంతుల శక్తినిగూర్చి వాదము కలుగగా-నేనే యున్నానని ఆయన యనును న్యాయవిధినిగూర్చి వాదము కలుగగా-ప్రతివాదిగా నుండ తెగించువాడెవడని ఆయన యనును?

20. నా వ్యాజ్యెము న్యాయమైనను నా మాటలు నామీద నేరము మోపును నేను యథార్థవంతుడనైనను దోషియని ఆయన నన్ను నిరూపించును.

21. నేను యథార్థవంతుడనైనను నాయందు నాకిష్టములేదునేను నా ప్రాణము తృణీకరించుచున్నాను.

దేవుని గురించి యోబు పలికిన మాటలన్నిటిలోకి ఇవే కఠినంగా ఉన్నాయి. తన నిరాశలో పూర్తిగా అధమ స్థితికి యోబు ఇక్కడ దిగజారాడు. తనకు దేవుడు చేసినవాటిని అపార్థం చేసుకోవడంలో యోబు ఇక్కడ చాలా దూరం వెళ్ళిపోయాడు. దేవుణ్ణి క్రూరుడైన నియంతగా, కనికరం లేకుండా తోచినది చేసేవాడిగా చిత్రీకరించాడు. న్యాయవంతులు, దుర్మార్గులు అనే తేడా చూపని దేవుడుగా వర్ణిస్తాడు. అయితే యోబు దుర్మార్గుడని ఈ మాటల వల్ల రుజువు కావడం లేదు. ఎడతెరిపి లేని బాధ, దుఃఖం, వేధించే ప్రపంచంలో అత్యంత యోగ్యుడైనవాణ్ణి కూడా ఎలా మాట్లాడించగలవో ఇక్కడ అర్థమౌతున్నది. శరీరం, ఆత్మ బాధతో మెలికలు తిరిగిపోతూ ఉంటే దారీ తెన్నూ తోచని మనిషి దేవదూతలాగానో, కష్టాలు అనుభవించని పవిత్రునిలాగానో ఎలా మాట్లాడగలడు? అయితే ఒకటి గమనించండి. ఇప్పుడు కూడా యోబు దేవుణ్ణి నిరాకరించడం లేదు. నాస్తికత్వం అనే అజ్ఞానం, దుర్మార్గతలో పడడం లేదు. సైతాను ఇలా వాదించి మనుషుల్ని నాస్తికత్వాన్ని అవలంబించడానికి ప్రేరేపిస్తాడు – ఈ లోకం అంతా నిర్దోషుల మీదికీ అమాయకుల మీదికీ వచ్చే అన్యాయమైన బాధలు, విపత్తులతో నిండి ఉంది. దేవుడంటూ ఉంటే ఇలా జరగనివ్వడు గదా. సైతాను తర్కం ఇది: (1) దేవుడే గనుక ఉంటే నిర్దోషులు బాధలు పడరు; (2) కానీ నిర్దోషులు బాధలు పడుతున్నారు; (3) కాబట్టి దేవుడు లేడు. సైతానుకు ఇది నిజం కాదని తెలుసు. గాని కొందరిని ఇది నిజమని నమ్మిస్తాడు. యోబు ఈ ఉచ్చులో పడలేదు. కానీ ఈ లోకంలో కనిపించే కీడు విషయంలో యోబుకు కలిగిన అయోమయావస్థ 24వ వచనంలో కనిపిస్తున్నది. దేవుడు దీన్ని ఎందుకు అరికట్టడు? పైగా దీన్ని సమర్థిస్తున్నట్టు కనిపిస్తున్నదేమిటి? యోబు గానీ బైబిల్లోని దేవుని సంపూర్ణ సత్యం తెలియని వారెవరైనా గానీ మనుషులతో దేవుని తీరు తెన్నులను అర్థం చేసుకోలేరు. బైబిలంతటితో పరిచయం ఉన్న మనం కూడా ఒక్కో సారి దిగ్భ్రమలో పడిపోతాం (కానీ నిరాశ చెందకూడదు). మనం కూడా యోబులాగానే విశ్వాసంతో నడుచుకోవాలి (2 కోరింథీయులకు 5:7), కనిపించేవాటిపై గాక కనిపించని వాటిపై మనస్సు లగ్నం చెయ్యాలి (2 కోరింథీయులకు 4:18).

22. ఏమి చేసినను ఒక్కటే కావున-యథార్థవంతులనేమి దుష్టులనేమి భేదములేకుండ ఆయన అందరిని నశింపజేయుచున్నాడని నేను వాదించుచున్నాను.

23. సమూలధ్వంసము ఆకస్మికముగా కలిగి నాశనముచేయగానిర్దోషుల ఆపదను చూచి ఆయన హాస్యము చేయును.

24. భూమి దుష్టులచేతికి అప్పగింపబడియున్నదివారి న్యాయాధిపతులు మంచి చెడ్డలు గుర్తింపలేకుండ ఆయన చేయును.ఆయన గాక ఇవి అన్నియు జరిగించువాడు మరి ఎవడు?

25. పరుగుమీద పోవువానికంటె నా దినములు త్వరగా గతించుచున్న విక్షేమము లేకయే అవి గతించిపోవుచున్నవి.

26. రెల్లుపడవలు దాటిపోవునట్లు అవి జరిగిపోవునుఎరమీదికి విసురున దిగు పక్షిరాజువలె అవి త్వరపడిపోవును.

27. నా శ్రమను మరచిపోయెదననియుదుఃఖముఖుడనై యుండుట మాని సంతోషముగానుండెదననియు నేను అనుకొంటినా?

దేవుడు తనపై అకారణంగా నేరం మోపుతున్నాడనీ తాను పవిత్ర జీవనం గడిపినప్పటికీ తప్పులెన్నుతున్నాడనీ యోబు అంటున్నాడు. తన బాధలను మరచి, ఈ నేరారోపణ దోషం నుండి విముక్తుడై సంతోషంగా ఉండే దారి ఏదీ కనిపించడం లేదు.

28. నా సమస్త బాధలకు భయపడి వణకుచున్నానునీవు నన్ను నిర్దోషినిగా ఎంచవను సంగతి నేను నిశ్చ యముగా ఎరిగియున్నాను

29. నన్ను దోషినిగా ఎంచవలసి వచ్చెను గదా కాబట్టి నాకు ఈ వ్యర్థప్రయాసమేల?

30. నేను హిమముతో నన్ను కడుగుకొనిననుసబ్బుతో నా చేతులు కడుగుకొనినను

31. నీవు నన్ను గోతిలో ముంచెదవు అప్పుడు నేను నా స్వంతవస్త్రములకై అసహ్యుడనగుదును.

32. ఆయన నావలె నరుడు కాడునేను ఆయనతో వ్యాజ్యెమాడజాలనుమేము కలిసి న్యాయవిమర్శకు పోలేము.

తననూ దేవుణ్ణీ ఒక చోట చేర్చి, వివాదం పరిష్కరించి దేవుని శిక్ష దండాన్ని తన తలపై నుండి తొలగించేలా చెయ్యగలిగే మధ్యవర్తి ఒకడు ఉండాలని యోబు కోరుతున్నాడు. అయితే యోబు ఆశించినదాని కంటే ఊహించినదాని కంటే మరెంతో ఘనమైన రీతిలో ప్రభువైన యేసుక్రీస్తు ఈ అవసరాన్ని పూర్తి చేశాడు. దేవునికీ మనిషికీ ఉన్న ఏకైక మధ్యవర్తి ఆయనే (1 తిమోతికి 2:5). విశ్వాసి తరుఫున పరలోకంలో ఉన్న న్యాయవాది ఆయనే (1 యోహాను 2:1). ఆయన మూలంగా దేవునికీ మానవునికీ మధ్య సంధి కుదిరింది. మనిషికి దేవుని చెంతకు నేరుగా చేరే విధానం ఏర్పడింది (2 కోరింథీయులకు 5:18-19; ఎఫెసీయులకు 2:17-18).

33. మా యిద్దరిమీద చెయ్య ఉంచదగిన మధ్యవర్తి మాకులేడు.

34. ఆయన తన దండమును నామీదనుండి తీసివేయవలెనునేను భ్రమసిపోకుండ ఆయన తన భయంకర మహాత్మ్యమును నాకు కనుపరచకుండవలెను.

35. అప్పుడు ఆయనకు భయపడక నేను మాటలాడెదను, ఏలయనగా నేను అట్టివాడను కాననుకొనుచున్నాను.Shortcut Links
యోబు - Job : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |