Psalms - కీర్తనల గ్రంథము 18 | View All

1. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించు చున్నాను.

ఇదే కీర్తన కొద్ది మార్పులతో 2 సమూ 22వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఇది యుద్ధరంగంలో విజయం సాధించిన వీరుడి పాట. అతడు యుద్ధాలు చేసినది “యెహోవా దాసుడు”గానే (శీర్షిక). కనుక ఈ విజయాల వల్ల కలిగే మహిమ అంతా యెహోవాకే అర్పిస్తున్నాడు. ఇప్పుడు విశ్వాసుల యుద్ధాలు ఆధ్యాత్మికమైనవి. మన అంతరంగంలోని పాపంతోను భ్రష్ట స్వభావంతోను, బయట ఉన్న సైతానుతోను వాడి అనుచరుల మూకతోను మనం పోరాడాలి (1 కోరింథీయులకు 9:26; ఎఫెసీయులకు 6:11-12; కొలొస్సయులకు 3:5; 1 తిమోతికి 6:12). మనం యేసు క్రీస్తుకు మంచి సైనికులుగా ఉండాలి (2 తిమోతికి 2:3). దావీదుకు యెహోవా పట్ల లోతైన ప్రేమ, అనురాగాలు ఉన్నాయి. (ఇక్కడ ఉన్న హీబ్రూ పదం తల్లితండ్రులకూ పిల్లలకూ మధ్య ఉండే వాత్సల్యాన్ని వర్ణించే మాట. హృదయాన్ని ఆప్యాయతతో కదిలించివేసే ప్రేమ). దేవుణ్ణి ప్రేమించే మనిషి ధన్యుడు. అలాంటివాడికి అన్నీ మంచికే జరుగుతాయి (రోమీయులకు 8:28). అతని విజయ రహస్యం అదే అవుతుంది. యుద్ధంలో దేవుడే దావీదు బలం (కీర్తనల గ్రంథము 21:1; కీర్తనల గ్రంథము 46:1; కీర్తనల గ్రంథము 68:28; కీర్తనల గ్రంథము 84:5; నిర్గమకాండము 15:2; యెషయా 12:2; యెషయా 40:31; 1 దినవృత్తాంతములు 16:11).

2. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించు వాడునా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నతదుర్గము, నా దేవుడునేను ఆశ్రయించియున్న నా దుర్గము.
లూకా 1:69

“ఆధారశిల”– ద్వితీయోపదేశకాండము 32:4 దగ్గర నోట్. 1,2 వచనాల్లో దావీదు తనకు దేవునితో లభించిన బలం, ప్రభావం, సంరక్షణల సంపూర్ణతను వెల్లడించడానికి ఎనిమిది రకాల మాటలను ఉపయోగించాడు. ఈ మాటలన్నీ యుద్ధానికీ, దాడులకూ, సంరక్షణ అవసరతకూ సంబంధించినవి. తనకు వచ్చిన అపాయాలు, విషమ పరీక్షలు, భయాలు ఎలాంటివైనప్పటికీ తనకు మాత్రం సంపూర్ణ భద్రత ఉన్నట్టు దావీదు తెలుసుకొన్నాడు (యోహాను 10:28-29; రోమీయులకు 8:35-39; 1 పేతురు 1:5; యూదా 1:1 పోల్చిచూడండి). దావీదు జీవిత కాలమంతట్లోనూ అతని అనుభవం ఇదే. ఇది మనది అయ్యే వీలు ఉంది. మనది కావాలి (1 కోరింథీయులకు 10:13; 2 తిమోతికి 4:18; 2 పేతురు 2:9).

3. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొఱ్ఱపెట్టగా ఆయన నా శత్రువులచేతిలోనుండి నన్ను రక్షించును.

4. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లువలె నామీద పడి బెదరింపగను
అపో. కార్యములు 2:24

దావీదు తనకు సంబంధించిన అతి అపాయకరమైన పరిస్థితులను బాధలను తలచుకొన్నాడు. అయితే ఏమి చెయ్యాలో అతనికి తెలుసు. ఈ వచనాల్లో క్రీస్తు కనిపించడం లేదా? అపో. కార్యములు 2:24; హెబ్రీయులకు 5:7 చూడండి.

5. పాతాళపు పాశములు నన్ను అరికట్టగను మరణపు ఉరులు నన్ను ఆవరింపగను

6. నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని నా దేవునికి ప్రార్థన చేసితిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన నంగీకరించెను నా మొఱ్ఱ ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులజొచ్చెను.
యాకోబు 5:4

7. అప్పుడు భూమి కంపించి అదిరెను పర్వతముల పునాదులు వణకెనుఆయన కోపింపగా అవి కంపించెను.

ఇక్కడినుంచి 19వ వచనం వరకు దావీదు మొరకు దేవుని జవాబు చూస్తున్నాం. న్యాయవంతుడి ప్రార్థన ఎంత బలప్రభావాలు గలది (యాకోబు 5:16; లూకా 18:1-8)! విశ్వాసి చేసే ప్రార్థనకు మాత్రమే అద్భుత ఫలితం కనిపిస్తుంది. దావీదు జీవితంలో ఎప్పుడైనా దేవుడు భూకంపంలో, లేక తుఫానులో అతణ్ణి రక్షించేందుకు వచ్చినట్లు బైబిల్లో కనబడడం లేదు. అయితే ఎప్పుడో ఒకసారి ఇలా జరగలేదని మాత్రం ఖచ్చితంగా చెప్పలేం.

8. ఆయన నాసికారంధ్రములనుండి పొగ పుట్టెను ఆయన నోటనుండి అగ్నివచ్చి దహించెను

మహా కోపాన్ని సూచించే మాటలు. దుర్మార్గులు తన ప్రజలను హింసిస్తే దేవునికి కోపం రాకమానదు (1 థెస్సలొనీకయులకు 2:6-7).

9. నిప్పుకణములు రాజబెట్టెను. మేఘములను వంచి ఆయన వచ్చెనుఆయన పాదములక్రింద గాఢాంధకారము కమ్మియుండెను.

మనిషి అవసరత, నిజమైన ప్రార్థన దేవుణ్ణి కిందకు తీసుకువస్తాయి.

10. కెరూబుమీద ఎక్కి ఆయన యెగిరి వచ్చెను గాలి రెక్కలమీద ప్రత్యక్షమాయెను.

11. గుడారమువలె అంధకారము తన చుట్టు వ్యాపింప జేసెనుజలాంధకారమును ఆకాశమేఘములను తనకు మాటుగా చేసికొనెను.

దేవుడు ఇక్కడ తుఫానులో వస్తున్నట్టుగా చిత్రీకరించబడింది. కారు మేఘాలు ఆయన వస్త్రాలు. ఉరుము గర్జనే ఆయన స్వరం. మెరుపులు ఆయన బాణాలు, పెనుగాలి ఆయన ఊపిరి. బైబిలు రచయితలెవరూ ప్రకృతి శక్తులను ఎన్నడూ దేవుళ్ళనీ, దేవతలనీ పిలవలేదు, వాటిని పూజించలేదు.

12. ఆయన సన్నిధి కాంతిలోనుండి మేఘములును వడ గండ్లును మండుచున్న నిప్పులును దాటిపోయెను.

13. యెహోవా ఆకాశమందు గర్జనచేసెను సర్వోన్నతుడు తన ఉరుముధ్వని పుట్టించెను వడగండ్లును మండుచున్న నిప్పులును రాలెను.

14. ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెనుమెరుపులు మెండుగా మెరపించి వారిని ఓడగొట్టెను.

15. యెహోవా, నీ నాసికారంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువగానీ గద్దింపునకు ప్రవాహముల అడుగుభాగములు కనబడెను.భూమి పునాదులు బయలుపడెను.

16. ఉన్నతస్థలమునుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను నన్ను పట్టుకొని మహా జలరాసులలోనుండి తీసెను.

దావీదు కష్టాలలోను అపాయాలలోను మునిగి పోతున్నాడు. దేవుడతణ్ణి వాటిలోనుంచి పైకి తీశాడు. అతని శత్రువులు అతనికంటే బలవంతులన్నది గమనించండి. అవును, అయితే దేవునికంటే బలవంతులు కారు.

17. బలవంతులగు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటె బలిష్టులైయుండగా వారి వశమునుండి ఆయన నన్ను రక్షించెను.

18. ఆపత్కాలమందు వారు నామీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను.

అపాయం అతణ్ణి దాదాపుగా ముంచెత్తివేసింది. అయితే ఆనుకునేందుకు అతనికి ఆధారం ఉంది (ఇక్కడ హీబ్రూ పదానికి అర్థం ఇదే).

19. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్నుతప్పించెను.

కీర్తనల గ్రంథము 31:8; కీర్తనల గ్రంథము 118:5. దేవుడు వచ్చి ఆశ్చర్యకరంగా తనను విపత్తునుంచి తప్పించిన కారణాలేమిటో దావీదు ఇక్కడ వివరిస్తున్నాడు. దేవుడు అతని స్వభావం, అతని చర్యలను బట్టి తృప్తి చెందాడు. అతను దేవుని హృదయానికి అనుగుణమైన మనిషి (1 సమూయేలు 13:14; అపో. కార్యములు 13:22). కష్టకాలంలో దేవుడు మనల్ని ఆదుకోవాలని మనం ఆశిస్తే ఆయనకిష్టమైన రీతిలో బ్రతకాలి. ఈ వచనానికి పూర్తి నెరవేర్పు యేసు క్రీస్తులో కనిపిస్తుంది (మత్తయి 3:17; హెబ్రీయులకు 5:7).

20. నా నీతినిబట్టి యెహోవా నాకు ప్రతిఫలమిచ్చెను నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను.

ఇది తాను న్యాయవంతుణ్ణని విర్రవీగడం కాదు. దేవుని ఆత్మావేశం మూలంగా వాస్తవాలను తెలియజేయడమే. కీర్తనల గ్రంథము 17:3 చూడండి.

21. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను భక్తిహీనుడనై నేను నా దేవుని విడచినవాడను కాను

22. ఆయన న్యాయవిధులన్నిటిని నేను లక్ష్యపెట్టు చున్నాను ఆయన కట్టడలను త్రోసివేసినవాడను కాను

23. దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని.

తన భ్రష్ట స్వభావాన్ని గురించీ చిక్కులు పెట్టే దుష్ట ప్రేరేపణల గురించీ దావీదుకు బాగా తెలుసు. ఆ మాటకొస్తే దావీదుకంటే ఎక్కువ స్వేచ్ఛగా తన పాపాల గురించి బయటికి చెప్పుకొన్నవారు బైబిల్లో ఎవరూ లేరు (కీర్తనల గ్రంథము 25:7 కీర్తనల గ్రంథము 25:11 కీర్తనల గ్రంథము 25:18; కీర్తనల గ్రంథము 31:10; కీర్తనల గ్రంథము 32:5; కీర్తనల గ్రంథము 38:3-4 కీర్తనల గ్రంథము 38:18; కీర్తనల గ్రంథము 40:12; కీర్తనల గ్రంథము 41:4; కీర్తనల గ్రంథము 51:3 కీర్తనల గ్రంథము 51:5; కీర్తనల గ్రంథము 69:5; కీర్తనల గ్రంథము 103:10 కీర్తనల గ్రంథము 103:12). అయితే పాపం చేసేందుకు ఆశ సులభంగా పుట్టే విషయంలో కూడా దేవుని కృపవల్ల తనను తాను కాపాడుకొన్నాడు. తన పాపాలంటే తనకు అసహ్యమనీ, వాటి విషయం తాను పశ్చాత్తాప పడ్డాననీ, వాటిని విసర్జించాననీ వాటి విషయం శుద్ధీకరించబడ్డాననీ, దేవుని నుంచి క్షమాపణ పొందాననీ తనకు తెలుసు. తాను దేవుణ్ణీ నీతిన్యాయాలనూ ప్రేమించిన సంగతి పాపం నుంచి దూరంగా ఉంటామనీ, రుజువర్తన అవలంబించుదామనీ తాను ఆశించిన సంగతీ అతనికి తెలుసు.

24. కావున యెహోవా నేను నిర్దోషిగానుండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను.

25. దయగలవారియెడల నీవు దయచూపించుదువు యథార్థవంతులయెడల యథార్థవంతుడవుగా నుందువు

దేవుడు మనుషులతో వ్యవహరించే తీరును గురించి ఒక ప్రాముఖ్యమైన నియమం ఇక్కడ కనిపిస్తున్నది. మనుషులు తనపట్ల, ఇతరులపట్ల ఎలా మెలుగుతారో కొంతవరకు అదే రీతిలో వారికి చేస్తాడు (కీర్తనల గ్రంథము 62:12; లేవీయకాండము 26:3-5 లేవీయకాండము 26:23-24 లేవీయకాండము 26:27-28; సామెతలు 3:34; మత్తయి 5:7; మత్తయి 6:14-15; రోమీయులకు 2:5-6). ఇది న్యాయ సూత్రం, ఇది దేవుడిచ్చిన ధర్మశాస్త్రానుసారం. అలాంటప్పుడు వేరు వేరు రకాల వ్యక్తులతో వ్యవహరించే సమయంలో దేవుడు తన స్వభావాన్ని వేరు వేరు రీతులుగా మార్చుకుంటాడా? ఎంతమాత్రం కాదు. అప్పటి సందర్భానికి తగినట్టు తన లక్షణాలు ఒక్కొక్కదానినీ వెల్లడిస్తూ ఉంటాడు. దయాపరులు, యథార్థవంతులు, పవిత్రులు దేవుని దయను, యథార్థతను, పవిత్రతను మరింత వివరంగా తెలుసుకొనేలా ఆయన చేస్తాడు. అయితే దుర్మార్గులు, మోసగాళ్ళు మాత్రం దేవుడు తమకంటే తెలివిగా తమ వక్రబుద్ధి తమకు హాని చేసేలా చెయ్యగలడని తెలుసుకుంటారు (కీర్తనల గ్రంథము 5:10; కీర్తనల గ్రంథము 7:16; కీర్తనల గ్రంథము 9:16; 1 కోరింథీయులకు 3:19).

27. శ్రమపడువారిని నీవు రక్షించెదవు గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసెదవు.

దేవుని న్యాయ వ్యవహారాలకు ఇది ఒక ఉదాహరణ (యాకోబు 4:6; 1 పేతురు 5:5).

28. నా దీపము వెలిగించువాడవు నీవే నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును

29. నీ సహాయమువలన నేను సైన్యమును జయింతును. నా దేవుని సహాయమువలన ప్రాకారమును దాటుదును.

30. దేవుడు యథార్థవంతుడు యెహోవా వాక్కు నిర్మలముతన శరణుజొచ్చు వారికందరికి ఆయన కేడెము.

ద్వితీయోపదేశకాండము 32:4; జెఫన్యా 3:5. ఒక్కొక్క వ్యక్తితోను, ప్రపంచమంతటితోనూ ఎలా వ్యవహరించాలో దేవునికి తెలుసు. ఆయనెన్నడూ పొరపాటు చెయ్యడు, అన్యాయంగా ప్రవర్తించడు, చెయ్యవలసిన దాన్ని చెయ్యకుండా మానుకోడు. పాపాత్ములు దీన్ని అర్థం చేసుకోలేక లోకంలో జరిగేవాటి గురించి దేవుణ్ణి తప్పులెన్నుతారు. దేవుని వాక్కును గురించి కీర్తనల గ్రంథము 12:6; సామెతలు 30:5 చూడండి.

31. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది?

యెహోవాయే ఏకైక నిజ దేవుడు. వేరెవరూ లేరు (యెషయా 44:6 యెషయా 44:8 యెషయా 44:24; యెషయా 45:5 యెషయా 45:18). ఆధారశిల గురించి ద్వితీయోపదేశకాండము 32:4 చూడండి.

32. నాకు బలము ధరింపజేయువాడు ఆయనే నన్ను యథార్థమార్గమున నడిపించువాడు ఆయనే.

“ఏ లోపమూ లేకుండా”అని ఇక్కడ వాడిన పదమే వ 30లో దేవుణ్ణి ఉద్దేశించి వాడాడు. దేవుడు తనను లోపరహితుణ్ణిగా చేశాడని దావీదు అనడం లేదు. తన మార్గాన్ని లోపం లేనిదిగా చేశాడని మాత్రమే అంటున్నాడు. తాను ఎదుర్కోవలసిన పోరాటం కోసం, చేయవలసిన పనికోసం తనను పరిపూర్ణంగా సిద్ధపరిచాడు. అతని ప్రవర్తనలో అతణ్ణి యథార్థవంతుడిగా, న్యాయవంతుడిగా చేశాడు. మనందరికీ ఇలానే చెయ్యగోరుతున్నాడు (కీర్తనల గ్రంథము 101:2 కీర్తనల గ్రంథము 6; ద్వితీయోపదేశకాండము 18:13).

33. ఆయన నాకాళ్లు జింక కాళ్లవలె చేయుచున్నాడు ఎత్తయిన స్థలములమీద నన్ను నిలుపుచున్నాడు.

తన శక్తి సామర్థ్యాలూ, బలప్రభావాలూ, విజయాలూ దేవుని కృపవల్లే అంటున్నాడు దావీదు.

34. నా చేతులకు యుద్ధముచేయ నేర్పువాడు ఆయనే నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కు పెట్టును.

35. నీ రక్షణ కేడెమును నీవు నాకందించుచున్నావు నీ కుడిచెయ్యి నన్ను ఆదుకొనెనునీ సాత్వికము నన్ను గొప్పచేసెను.

మనిషిని గొప్పవాడిగా చేసేది అతడు పదవుల కోసం, అధికారం కోసం విరామం లేకుండా చేసే ప్రయత్నాలు కావు. దేవుని సాదువైన విధానమే.

36. నా పాదములకు చోటు విశాలపరచితివి నా చీలమండలు బెణకలేదు.

37. నా శత్రువులను తరిమి పట్టుకొందును వారిని నశింపజేయువరకు నేను తిరుగను.

దావీదు చరిత్రలో జరిగినవి కొన్ని 1 సమూయేలు 30:16-19; 2 సమూయేలు 5:6-10 2 సమూయేలు 5:17-25; 2 సమూయేలు 8:1-14; 2 సమూయేలు 10:17-19 చూడండి.

38. వారు నా పాదముల క్రింద పడుదురు వారు లేవలేకపోవునట్లు నేను వారిని అణగ ద్రొక్కుదును

39. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి నా మీదికి లేచినవారిని నా క్రింద అణచివేసితివి

40. నా శత్రువులను వెనుకకు నీవు మళ్లచేసితివి నన్ను ద్వేషించువారిని నేను నిర్మూలము చేసితిని

41. వారు మొఱ్ఱపెట్టిరి గాని రక్షించువాడు లేక పోయెను యెహోవాకు వారు మొఱ్ఱపెట్టుదురు గాని ఆయనవారి కుత్తరమియ్యకుండును.

42. అప్పుడు గాలికి ఎగురు ధూళివలె నేను వారిని పొడిగా కొట్టితినివీధుల పెంటను ఒకడు పారబోయునట్లు నేను వారిని పారబోసితిని.

43. ప్రజలు చేయు కలహములలో పడకుండ నీవు నన్ను విడిపించితివినన్ను అన్యజనులకు అధికారిగా చేసితివినేను ఎరుగని ప్రజలు నన్ను సేవించెదరు

44. నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయు లగుదురు అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు

45. అన్యులు నిస్త్రాణగలవారై వణకుచు తమ దుర్గములను విడచి వచ్చెదరు.

46. యెహోవా జీవముగలవాడు నా ఆశ్రయదుర్గమైనవాడు స్తోత్రార్హుడు నా రక్షణకర్తయయిన దేవుడు బహుగా స్తుతినొందునుగాక.

తనకు కలిగిన విజయాలు, కార్యసిద్ధి తనవల్లే అని చెప్పుకునే ఉద్దేశం దావీదుకు ఎంతమాత్రం లేదు. మొదటి నుంచి అంతంవరకు అంతా దేవునివల్లే. మనకు కూడా లోకం పైనా, భ్రష్ట స్వభావం పైనా సైతాను పైనా విజయం లభించిందంటే కారణం ఇదే (రోమీయులకు 8:37; 2 కోరింథీయులకు 1:21; 2 కోరింథీయులకు 2:14; 2 కోరింథీయులకు 3:5).

47. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు జనములను నాకు లోపరచువాడు ఆయనే.

48. ఆయన నా శత్రువుల చేతిలోనుండి నన్ను విడి పించును.నా మీదికి లేచువారికంటె ఎత్తుగా నీవు నన్నుహెచ్చించుదువు బలాత్కారముచేయు మనుష్యుల చేతిలోనుండి నీవు నన్ను విడిపించుదువు

49. అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదనునీ నామకీర్తన గానము చేసెదను.
రోమీయులకు 15:9

50. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగ జేయువాడవు అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు

ఈ విషయంలో దేవుడు తనతో చేసిన ఒడంబడికను దావీదు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాడు (కీర్తనల గ్రంథము 89:3-4; 1 దినవృత్తాంతములు 17:7-14). దీన్ని ఆయన నిలబెట్టుకుంటాడన్న నమ్మకం ఇక్కడ వెల్లడి చేస్తున్నాడు. ఈ వచనం పూర్తిగా నెరవేరింది శరీర రీతిగా దావీదు వంశీకుడు ప్రభువైన యేసు క్రీస్తులోనే (మత్తయి 1:1; రోమీయులకు 1:3). నిజానికి ఆధ్యాత్మిక పోరాటాలు, విజయ సాధనల గురించి ఆలోచిస్తూ ఉంటే జ్ఞాన ప్రకాశం కలిగిన విశ్వాసి ఈ కీర్తనంతటిలో క్రీస్తును చూడగలుగుతాడు. పాత ఒడంబడిక గ్రంథమంతట్లో ఎలాగో అలాగే కీర్తనల్లో కూడా ఎక్కడ చూచినా క్రీస్తే స్ఫురిస్తూ ఉంటాడు (లూకా 24:25-27 లూకా 24:44).Shortcut Links
కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |