మొదటి వచనంలోని ప్రశ్నకు ఇక్కడ జవాబు ఉంది. ప్రజలను వారి పాలకులే రెచ్చగొడుతున్నారు. వెలుగు, సత్యం, పవిత్రతలకూ, వీటన్నిటి రూపు దాల్చిన దేవునికీ వ్యతిరేకంగా ప్రజలు, వారి నాయకులు తమ విరోధ భావాన్ని వెల్లడి చేస్తున్నారు (యోహాను 3:19-20; యోహాను 15:18-19; రోమీయులకు 1:30; రోమీయులకు 8:7). ఈ వచనంలో పరిపాలకులు వ్యర్థంగా కుట్ర పన్నుతున్నది విశ్వానికి నిజ దేవుడైన యెహోవాకూ, ఆయన అభిషిక్తునికీ వ్యతిరేకంగా. పాత ఒడంబడిక రోజుల్లో రాజులు, ప్రవక్తలు, యాజులు అభిషేకం పొందేవారు (నిర్గమకాండము 28:41); (1 సమూయేలు 15:1); (1 సమూయేలు 16:12); (1 రాజులు 19:16). క్రొత్త ఒడంబడికలో యేసు క్రీస్తే అభిషిక్తుడు. ఆయనే తన ప్రజలకు రాజు, ప్రవక్త, యాజి. ఈ కీర్తనలో ఆయన రాజరికం మాత్రమే కనిపిస్తూవుంది. ఈ వచనంలో కనిపించే పరిపాలకుల వ్యతిరేకతా, కుట్రలూ ప్రత్యేకించి క్రీస్తు సిలువ మరణానికి సంబంధించినవి (అపో. కార్యములు 4:25-26). కానీ యేసుప్రభువుకు వ్యతిరేకంగా లేచిన వారందరికీ, అది ఏ కాలమైనా, ఈ వచనం వర్తిస్తుంది.