Psalms - కీర్తనల గ్రంథము 45 | View All

1. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది నేను రాజునుగూర్చి రచించినదానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువాని కలమువలె నున్నది.

శీర్షిక – యేసుప్రభువును తన సంఘానికి రాజుగానూ పరలోక సంబంధమైన వరునిగానూ చిత్రీకరించే మహిమాన్వితమైన కీర్తన ఇది. 2,6,7,11 లాంటి వచనాలను బట్టి చూస్తే ఇది ఏ భూరాజును ఉద్దేశించి రాసినది కాదని స్పష్టమౌతున్నది. క్రొత్త ఒడంబడికలో హెబ్రీయులకు 1:8-9 లో ఈ కీర్తన 6,7 వచనాలు క్రీస్తును ఉద్దేశించినవని రచయిత రాశాడు. ఈ కీర్తన మూలాంశాన్ని ప్రకటించి 2-9 వచనాల్లో ఈ రాజుతో మాట్లాడుతున్నాడు; 10-15 వచనాల్లో సంఘం క్రీస్తుకు పెండ్లి కుమార్తెగా చిత్రీకరించబడింది; ఆ పైన మళ్ళీ రాజుతో పలికిన ముగింపు వాక్యాలు ఉన్నాయి (16,17 వ). దివ్య పరమ రాజు సౌంధర్యం, వైభవం, దయ, బలప్రభావాలు, పవిత్ర స్వభావం గురించిన ఆలోచనలు కవి హృదయమంతా నిండి పొంగి పొరలుతున్నాయి. నిజంగా ఓ “మంచి విషయమే” అతని మనసంతా నిండిపోయింది. మన ఆలోచనల్లో నిండే వేరే విషయమేదీ దీనికంటే శ్రేష్ఠమైనది ఉండబోదు.

2. నరులకంటె నీవు అతిసుందరుడవై యున్నావు నీ పెదవులమీద దయారసము పోయబడియున్నది కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును.
మత్తయి 17:2, మార్కు 13:31, లూకా 4:22, యోహాను 1:14, యోహాను 7:46, హెబ్రీయులకు 1:3-4, ప్రకటన గ్రంథం 1:13-18

యేసుప్రభువు భూమిపై నివసించినప్పుడు ఆయన అందం శరీర సంబంధమైనది కాదు (యెషయా 53:2-3). అది ఆధ్యాత్మికం. ఆయన పెదవులపై దయ పోయబడింది (లూకా 4:22), ఆయనకు నీతిన్యాయాలంటే ఎంతో ఇష్టం, దుర్మార్గత అంటే ఎంతో అసహ్యం (వ 7). అందువల్ల తండ్రి అయిన దేవుడు ఆయనకు శాశ్వత దీవెనలనిచ్చాడు.

3. శూరుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము.

కీర్తన 22లో మనసు కరిగించే విధంగా వర్ణించినట్టు యేసుప్రభువు కేవలం సాత్వికుడూ బాధలననుభవించిన రక్షకుడూ మాత్రమే కాదు. ఆయన సత్యం, సాధుగుణం, నీతిన్యాయాలకోసం పోరు సలిపే మహా బలశాలి అయిన రారాజు. ఆయన జయించి తీరుతాడు. ఆయనది దేవుని ఆత్మ ఖడ్గమే (ఎఫెసీయులకు 6:17; హెబ్రీయులకు 4:12; ప్రకటన గ్రంథం 1:16; ప్రకటన గ్రంథం 19:16). ఆయన తేజస్సునూ వైభవాన్నీ వస్త్రాలుగా ధరించుకొనేవాడు (ప్రకటన గ్రంథం 1:12-16). భూమిపై న్యాయం, వినయం, సత్యం ఎన్నటికీ గెలుపొందవు అని కొన్ని సార్లు అనిపిస్తూ ఉండవచ్చు. సందేహం అక్కరలేదు. తనకు సంపూర్ణ విజయం కలిగే వరకు క్రీస్తు ముందుకు సాగిపోతాడు. ఆయన్ను ఎదిరించడం ఎంత బుద్ధిహీనత! ఆయన బాణాలు నిజంగా వాడిగలవి (కీర్తనల గ్రంథము 120:4; కీర్తనల గ్రంథము 92:9).

4. సత్యమును వినయముతోకూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలు దేరుము నీ దక్షిణహస్తము భీకరమైనవాటిని జరిగించుటకు నీకు నేర్పును.

5. నీ బాణములు వాడిగలవి ప్రజలు నీచేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును.

6. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును నీ రాజదండము న్యాయార్థమైన దండము.
హెబ్రీయులకు 1:8-9

“దేవా”– ఇక్కడ యేసును దేవా అని పిలవడం కనిపిస్తూ ఉంది (హెబ్రీయులకు 1:8 చూడండి). తరువాతి వచనంలో రాజుయొక్క దేవుని గురించి ఉంది. ఈయన ప్రభువైన యేసుక్రీస్తుకు తండ్రి అయిన దేవుడు. త్రిత్వంలోని ఇద్దరు వ్యక్తులు ఇక్కడ కనిపిస్తున్నారు. త్రిత్వం గురించి నోట్స్ మత్తయి 3:16-17 మొదలైన చోట్ల చూడండి. యేసు నిజంగా దేవుడు కాడని వాదించేవారు ఇక్కడి హీబ్రూ పదాలకున్న సహజమైన అర్థాన్ని వక్రం చేశారు (హెబ్రీయులకు 1:8 లోని గ్రీకును కూడా అలా చేశారు). వారు దీన్ని ఈ విధంగా తర్జుమా చేయబూనుకున్నారు – “దేవుడే శాశ్వతంగా నీ సింహాసనం”. ఇలాంటి లోపభూయిష్టమైన తప్పు అనువాదం కూడా యేసుప్రభువు దేవుడనే సత్యాన్ని మరుగు చెయ్యలేకపోతుంది. ఆ మాటకొస్తే ఈ అనువాదం క్రీస్తును తండ్రి అయిన దేవుని కంటే గొప్పవాడుగా చేస్తున్నది. ఎందుకంటే సింహాసనంపై కూర్చునేవాడు సింహాసనం కంటే గొప్పవాడే కదా. “న్యాయం”– 7వ వచనంలో క్రీస్తు స్వభావం వెల్లడి అయితే ఇక్కడ ఆయన రాజ్య లక్షణాలు వెల్లడి అవుతున్నాయి – తిరుగులేని న్యాయం, యథార్థత, నిజాయితీ, నీతి. పాపంలో ఉన్న ఈ లోకం ఆయన్ను అసహ్యించుకొనేది అందుకే. అందుకే ఆయనలాగే నీతిన్యాయాలను ప్రేమించి పాపాన్ని అసహ్యించుకునే వారందరికీ ఆ రాజ్యంలో చెప్పశక్యం కాని ధన్యపాలన కనిపిస్తుంది.

7. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్రకంటె హెచ్చగునట్లుగా నిన్ను ఆనందతైలముతో అభిషేకించి యున్నాడు.
హెబ్రీయులకు 1:8-9

“దుఃఖాలకు గురి అయిన” యేసుకు ఆనందం ఉందా? అవును, ఆయనకెన్ని దుఃఖాలున్నా అంతరంగ లోతులో చెక్కుచెదరని స్థిరమైన ఆనందం ఆయనకు ఉంది (యోహాను 15:11; యోహాను 17:13). ఇప్పుడాయన దుఃఖాలన్నీ తీరిపోయి ఆయన ఆనందం అనంతంగా పరిపూర్ణమైనది. న్యాయాన్ని ప్రేమించేవారే ఆయన అనంత ఆనందంలో ప్రవేశిస్తారు. నీతి న్యాయాలకూ, ఆనందానికీ ఎవరూ తెంచలేని దృఢమైన సంబంధం ఉంది.

8. నీ వస్త్రములెల్ల గోపరస వాసనే అగరు వాసనే లవంగిపట్ట వాసనే దంతముతో కట్టిన నగరులలో తంతివాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి.

ఇక్కడ క్రీస్తు పరమ పెండ్లికుమారుడుగా ప్రత్యక్షమౌతున్నాడు. పరిమళాలు వెదజల్లే ఆ వస్త్రాలు, దంతంతో చెక్కిన భవనాలలోనుంచి తేలివస్తున్న సంగీతం, ఆయనవెంట ఉన్న పరివారం, ఇవన్నీ చూస్తుంటే ఏదో గొప్ప మహోత్సవ సమయంలాగా ఉంది. ఇది గొర్రెపిల్ల వివాహోత్సవం గాక మరేమిటి? (ప్రకటన గ్రంథం 19:7-9). 9వ వచనంలో యువరాణి స్వర్ణాలంకారంతో కనిపిస్తున్నది. ఈమె క్రీస్తు నిజ విశ్వాసులతో ఏర్పడిన యేసుప్రభువు సంఘం గాక మరేమిటి? (2 కోరింథీయులకు 11:2; ఎఫెసీయులకు 5:25-27).

9. నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడిపార్శ్వమున నిలుచుచున్నది.

10. కుమారీ, ఆలకించుము ఆలోచించి చెవియొగ్గుము నీ స్వజనమును నీ తండ్రి యింటిని మరువుము

కీర్తనకారుడు ఇక్కడ పవిత్రాత్మ మూలంగా వధువుకు అంటే క్రీస్తు విశ్వాసులకు కొన్ని ఆదేశాలను ఇస్తున్నాడు. పరలోక రాజుతో సంతృప్తి కరమైన సంబంధాన్ని అనుభవించాలంటే కొన్ని విషయాలు చాలా ముఖ్యం. మొదటిది గత జీవితానికి స్వస్థి చెప్పి, ఆ రాజుకే అంటిపెట్టుకుని ఉండడం (ఆదికాండము 12:1; మత్తయి 10:37-38; లూకా 14:25-26 లూకా 14:33; హెబ్రీయులకు 11:8-10 హెబ్రీయులకు 11:15-16). ఆశ, మనసు అంతా వేరొక చోట పెట్టుకున్న వధువును భూరాజుల్లో ఎవరూ ఇష్టపడడు గదా. పరలోక రాజు కూడా అదే విధంగా మన హృదయాన్నీ ప్రేమనూ కోరుతున్నాడు (సామెతలు 23:26). తనకోసం అన్నిటినీ విడిచిపెట్టిన వ్యక్తిలో పరమ రాజు గొప్ప సౌందర్యాన్ని చూస్తాడు (11 వ; పరమగీతము 4:7; లూకా 14:33). విశ్వాసి రాజైన యేసుప్రభువును గుర్తించి ఆయన్ను ఆరాధించాలి (యోహాను 13:13; రోమీయులకు 10:9; మత్తయి 2:2; లూకా 24:52; యోహాను 9:38; హెబ్రీయులకు 1:6; ప్రకటన గ్రంథం 5:7 ప్రకటన గ్రంథం 5:13-14).

11. ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించుము.

12. తూరు కుమార్తె నైవేద్యము తీసికొనివచ్చును జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెదకుదురు.

ఇక్కడ తూరు అంటే ఇస్రాయేల్ రాజ్యానికి ఇరుగుపొరుగునున్న అన్య సామ్రాజ్యాలన్నిటికీ ప్రతినిధి కావచ్చు. సంఘం మహిమలో క్రీస్తుతో కనబడేటప్పుడు ప్రపంచంలోని జాతులన్నీ తమ కానుకలను తెస్తాయి (ప్రకటన గ్రంథం 21:24-26). అప్పుడు సంఘం క్రీస్తుతో కలిసి రాజ్యం చేస్తుంది (మత్తయి 19:28; 2 తిమోతికి 2:12; ప్రకటన గ్రంథం 3:21; ప్రకటన గ్రంథం 5:10; ప్రకటన గ్రంథం 20:4).

13. అంతఃపురములోనుండు రాజుకుమార్తె కేవలము మహిమ గలది ఆమె వస్త్రము బంగారు బుట్టాపని చేసినది.

రాజులలో ఎవరినైనా పెండ్లాడబోయే కన్య ధరించబోయే దుస్తులను ప్రత్యేకమైన శ్రద్ధతో ఎంపిక చేస్తారు. అయితే పరలోక రాజు విషయంలో కూడా అంతే గదా (యెషయా 61:3; యెహెఙ్కేలు 16:9-14; ఎఫెసీయులకు 5:25-27). వధువు వెంట సాగివస్తున్న కన్యలంతా రాకుమార్తెలు (వ 9). ఆ రాజుకు, ఆయన వధువుకు కలిగే ఆనందంలో పాలు పంచుకొనే జాతులకు వీరు ప్రతినిధులు కావచ్చు (ప్రకటన గ్రంథం 21:24-27; ప్రకటన గ్రంథం 22:2). అయితే ఈ విషయాన్ని ఇదమిద్ధంగా తేల్చి చెప్పడం అసాధ్యం.

14. విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజు నొద్దకు ఆమె తీసికొని రాబడుచున్నది ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలైన కన్యకలు నీయొద్దకు తీసికొని రాబడుచున్నారు.

15. ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు రాజనగరులో ప్రవేశించుచున్నారు.

16. నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందురు భూమియందంతట నీవు వారిని అధికారులనుగా నియమించెదవు.

ఈ మాటలు రాజునుద్దేశించి పలికినట్టుగా ఉంది. ఆయన పూర్వీకులంటే పాత ఒడంబడికలోని వారు. క్రీస్తు అబ్రాహాము సంతానమైన దావీదు వంశీకుడు. ఆయన కుమారులు ఎవరంటే, ఆయన మొదటి సారి ఈ లోకంలోకి వచ్చినది మొదలు ఆయనలో నమ్మకముంచి ఆయన ఆత్మమూలంగా తిరిగి జన్మించినవారు. తన ప్రజలు భూమిపై బొత్తిగా లేకుండా పోయే సమయాలను దేవుడు రానివ్వడు. ప్రతి తరంలోను కొందరు ఈ రాజును ఎరిగి లోకమంతటా ఆయన స్తుతిని ప్రచురం చేస్తారు.

17. తరములన్నిటను నీ నామము జ్ఞాపకముండునట్లు నేను చేయుదును కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు.Shortcut Links
కీర్తనల గ్రంథము - Psalms : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 | 115 | 116 | 117 | 118 | 119 | 120 | 121 | 122 | 123 | 124 | 125 | 126 | 127 | 128 | 129 | 130 | 131 | 132 | 133 | 134 | 135 | 136 | 137 | 138 | 139 | 140 | 141 | 142 | 143 | 144 | 145 | 146 | 147 | 148 | 149 | 150 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |