నిర్గమకాండము 20:5; నిర్గమకాండము 34:6-7; విలాపవాక్యములు 5:7 చూడండి.
“పూర్వీకుల అపరాధాలు”– జాతీయ పాపం, దోషం గురించి ఇక్కడ ఆసాపు మాట్లాడుతున్నాడు. దానిమీదికి శిక్ష పంపవద్దని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. జాతి పాపం క్రమక్రమంగా పోగవుతూ తరవాతి తరాలపై ప్రభావం చూపుతుందనేది నిజం. చివరికి ఆ జాతిపైకి ఒకే ఒక తరంవారిపైకి గొప్ప శిక్ష ముంచుకు వస్తుంది. కనానులోని అమోరివారు దీనికి మంచి ఉదాహరణ ఒకటి (ఆదికాండము 15:16). వారి పాపం పండినప్పుడు దేవుడు వారి నాశనానికి వారి దేశంలోకి ఇస్రాయేల్వారిని పంపాడు. నెబుకద్నెజరు రాజు కాలంలో తమ పూర్ణ పాపాలకోసం శిక్షను అనుభవించిన ఇస్రాయేల్ జాతి దీనికి మరో ఉదాహరణ (2 రాజులు 23:26-27; 2 దినవృత్తాంతములు 36:15-19). యేసుప్రభువు మత్తయి 23:35-36 లో చెప్పిన భవిష్యద్వాక్కు ప్రకారం క్రీ.శ. 70లో రోమ్వారు జెరుసలంను నాశనం చేసి ఇస్రాయేల్ జాతిని చెదరగొట్టేయ్యడం మరో ఉదాహరణ. దేవుడు సహనం, దీర్ఘశాంతం గలవాడు. అయితే ఒక జాతి పోగైన పాపం హద్దులు దాటిపోతే, న్యాయం జరగడానికి మరిక ఆలస్యం కాకూడని పరిస్థితుల్లో దేవుడు ఆ జాతిపై తన కోపాన్ని కుమ్మరిస్తాడు. పై ఉదాహరణలలో అంతకుముందు తరాలన్నిటివల్ల తరువాతి తరాల లక్షణాలు ఏర్పడ్డాయి. చివరి తరం ముందున్న తరాలన్నిటికంటే చెడ్డది అయింది, దాని అపరాధం మరింత ఘోరమైనది. మానవ చరిత్ర చెప్పే కథ ఇదే. ఒక వ్యక్తిపైకి గానీ జాతిపైకి గానీ దేవుని శిక్ష రాకుండా చూచుకొనేందుకు ఏకైక మార్గం పశ్చాత్తాపపడి, దయ చూపాలని మనస్ఫూర్తిగా దేవుని వైపుకు తిరగడమే (2 దినవృత్తాంతములు 7:14; యెషయా 55:7; యెహెఙ్కేలు 18:30-32; యోనా 1:1-2; యోనా 3:6-10; లూకా 24:45-47; అపో. కార్యములు 3:19).