బహుశా రాహాబు ఇస్రాయేల్‌ను ఘోరంగా పీడించిన ఈజిప్ట్ అని అర్థం (కీర్తనల గ్రంథము 89:10; యెషయా 51:9). ఆ తరువాతి కాలంలో బబులోను జెరుసలంను ధ్వంసం చేసి దేవుని ప్రజలను బందీలుగా తీసుకుపోనుంది. ఫిలిష్తీయవారు తరచుగా ఇస్రాయేల్‌తో యుద్ధాలు చేశారు. తూరు గర్వం గల గొప్ప నగరంగా మారి దేవుణ్ణి వ్యతిరేకించింది. కూషు (ఇక్కడ బహుశా ఇతియోపియా) లోకంలో మరింత దూరంగా ఉన్న ప్రజలకు ప్రతినిధిగా ఉండవచ్చు. ఈ వచనంలో రాబోయే కాలంలో జరగబోయే గొప్ప మార్పును గురించిన భవిష్యద్వాక్కు ఉంది. ఈ జాతులు దేవుణ్ణి తెలుసుకుంటాయి. అవి సీయోనులో జన్మిస్తాయి. వ 5,6లో ఈ మాటే మళ్ళీ ఉంది. దీని అర్థం ఏమిటంటే – ప్రపంచ జాతులన్నిటికీ జెరుసలం ఆధ్యాత్మిక జీవానికి మూలస్థానం అవుతుంది. వ్యక్తులకు, జనాలకు కలిగే కొత్త జన్మ అక్కడ జరగబోయే సంఘటనలతో ముడిపడి ఉంటుంది. ఆధ్యాత్మిక జీవం, శాశ్వతానందం, ఉల్లాసాల ఊటలు అక్కడున్నాయి. నేటికీ రెండు వేల సంవత్సరాల క్రితం అక్కడ జరిగిన యేసుక్రీస్తు సిలువ మరణం, ఆయన తిరిగి లేవడం గురించే గదా ఈ మాటలు చెప్తున్నది. ఈ సంఘటనల మూలంగా, కేవలం ఈ సంఘటనల మూలంగానే మనం తిరిగి జన్మించగలం, లోకంలోని జాతులన్నీ దేవుని చెంతకు చేరగలవు. శాశ్వత జీవం ఊటలు వేదాంతం, తత్వ శాస్త్రాలకు కేంద్రమైన ఏథెన్సులో గానీ రాజ్యాధికార కేంద్రమైన రోమ్‌లో గానీ విగ్రహపూజ కేంద్రమైన బబులోనులో గానీ లేవు. పరలోక దేవుని నగరమైన జెరుసలంలోనే అవి కనిపిస్తాయి.