Exodus - నిర్గమకాండము 12 | View All

1. మోషే అహరోనులు ఐగుప్తుదేశములో ఉండగా యెహోవా వారితో ఈలాగు సెలవిచ్చెను
మత్తయి 26:2

పాత ఒడంబడిక గ్రంథంలో ఈ అధ్యాయం అతి ప్రాముఖ్యమైనది. ఇందులో దేవుడు వారి విమోచన అన్నది రక్తబలి మూలానే కలుగుతుందని తన ప్రజలకు నేర్పిస్తున్నాడు. ఇది ఎంత ప్రాముఖ్యమైనదంటే ఇస్రాయేల్‌వారు ఈ నెలనుంచి తమ కాలెండర్‌ను లెక్కించడం మొదలుపెట్టారు. ఇది వారికి మొదటి నెల. ఈ అధ్యాయమంతా దృష్టాంత రూపకంగా ఉంది, చిహ్నాలతో నిండి ఉంది. లేవీయకాండము 23:5 కూడా చూడండి. మనుషులను విమోచించడానికి తన రక్తాన్ని కార్చిన యేసుక్రీస్తుకు ఈ గొర్రెపిల్ల సూచనగా ఉంది (యోహాను 1:29 యోహాను 1:36 మత్తయి 26:28 ఎఫెసీయులకు 1:7 హెబ్రీయులకు 9:22 ప్రకటన గ్రంథం 5:9 ప్రకటన గ్రంథం 5:12).

2. నెలలలో ఈ నెల మీకు మొదటిది, యిది మీ సంవత్సరమునకు మొదటి నెల.

3. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో-ఈ నెల దశమినాడు వారు తమ తమ కుటుంబముల లెక్కచొప్పున ఒక్కొక్కడు గొఱ్ఱపిల్లనైనను, మేకపిల్లనైనను, అనగా ప్రతి యింటికిని ఒక గొఱ్ఱపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసికొనవలెను.
1 కోరింథీయులకు 5:8

4. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలక పోయినయెడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాని తీసికొనవలెను.

5. ఆ గొఱ్ఱపిల్లను భుజించుటకు ప్రతివాని భోజనము పరిమితినిబట్టి వారిని లెక్కింపవలెను.

ఇది క్రీస్తు లోపం లేని పరిపూర్ణతకు గుర్తు – లేవీయకాండము 1:10 లేవీయకాండము 22:18-21 హెబ్రీయులకు 9:14 1 పేతురు 1:18-20.

6. నిర్దోషమైన యేడాది మగపిల్లను తీసికొనవలెను. గొఱ్ఱెలలో నుండి యైనను మేకలలో నుండియైనను దాని తీసికొనవచ్చును.
మార్కు 14:12, లూకా 22:7

ఆ గొర్రెపిల్లలో ఏ లోపమూ లేదనే విషయాన్ని పరీక్షించి తెలుసుకునేందుకు దానిని నాలుగు రోజులు ఉంచి గమనించాలి. క్రీస్తు కూడా సిలువమీద మరణించకముందు ఆయన ఎదుర్కొన్న విషమ పరీక్షల్లో ఆయన జీవితం పాపరహితంగా ఏ మచ్చా లేనిదిగా ఉందని రుజువైంది (హెబ్రీయులకు 4:15 హెబ్రీయులకు 7:26).

7. ఈ నెల పదునాలుగవ దినమువరకు మీరు దాని నుంచు కొనవలెను; తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరు తమ తమ కూటములలో సాయంకాలమందు దాని చంపి దాని రక్తము కొంచెము తీసి, తాము దాని తిని యిండ్లద్వారబంధపు రెండు నిలువు కమ్ములమీదను పై కమ్మి మీదను చల్లి

22,23వ వచనాలు. రక్తాన్ని ప్రతి ఇంటికీ పూయాలి. లేకపోతే దానివల్ల ప్రయోజనమేమీ లేదు. క్రీస్తు మనకోసం చనిపోయాడని నమ్మి రక్షణ కోసం ఆయనపై ఆధారపడకపోతే పాపులకోసం ఆయన కార్చిన రక్తం ఎవరినీ రక్షించలేదు.

8. ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదుకూరలతో దాని తినవలెను
లూకా 22:8

మత్తయి 26:26 యోహాను 6:51-58 యోహాను 6:63 1 కోరింథీయులకు 5:7. “తినాలి”– ఇక్కడ తినడం ఒక ఆత్మసంబంధమైన వాస్తవాన్ని సూచిస్తున్నది. ఇస్రాయేల్‌వారు ఆ గొర్రెపిల్లను ప్రత్యక్షంగా తిన్నారు. ఈనాటి క్రైస్తవ విశ్వాసులు ఆధ్యాత్మికంగా క్రీస్తును భుజిస్తారు. అంటే, ఆయన రక్తం, దేహం తమకోసం సిలువపై అర్పణ అయ్యాయని నమ్మి, ఆ నమ్మకం మూలంగా ఆయన్ను తమ హృదయాల్లో చేర్చుకుంటారు. క్రీస్తునూ, ఆయన తమకోసం చేసిన పనినీ వారు ధ్యానిస్తారు. ఈ విధంగా మాత్రమే ఆయన వారికి ఆహారమౌతాడు. “పొంగజేసే పదార్థం”– పొంగని రొట్టెలు తన ప్రజలకు ఆహారమైన క్రీస్తుయొక్క పాపరాహిత్యానికి గుర్తు (యోహాను 6:35 యోహాను 6:48-51). బైబిల్లో పొంగజేసే పదార్థం దుర్మార్గతకు సూచన (మత్తయి 16:6 మత్తయి 16:11 1 కోరింథీయులకు 5:6-8 గలతియులకు 5:9).

9. దాని తలను దాని కాళ్లను దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాని తినవలెను;

గొర్రెపిల్లను భాగాలు చెయ్యకూడదు (46 వ; యోహాను 19:33 యోహాను 19:36). అర్పణను కాల్చే మంటలు దేవుని పవిత్రతకు గుర్తు. పాపుల స్థానంలో వారికి బదులుగా ఈ అర్పణను స్వీకరించడం జరిగింది. ఈ అర్పణలో నీటిని ఎక్కడా ఉపయోగించకూడదు, ఎందుకంటే అది నిప్పును సరిగ్గా మండనియ్యదు. కల్వరిలో యేసుప్రభువు పాపానికి వ్యతిరేకంగా ప్రజ్వరిల్లే దేవుని ప్రచండమైన కోపాగ్నిని పూర్తిగా అనుభవించాడు.

10. దానిలో ఉడికి ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తిననే తినకూడదు; ఉదయకాలమువరకు దానిలోనిదేదియు మిగిలింపకూడదు. ఉదయకాలమువరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చి వేయవలెను.

నిర్గమకాండము 34:35 చూడండి. దీనికి సాదృశ్య రూపకమైన అర్థం ఇది కావచ్చు – క్రీస్తు చేసిన బలియాగం ఒక్కసారే జరిగిపోయింది. దీన్ని మళ్ళీ మళ్ళీ చేయవలసిన అవసరం లేదు. దానిలో పాల్గొన్నవారికి కలిగే రక్షణ శాశ్వతమైనది (హెబ్రీయులకు 10:12 హెబ్రీయులకు 10:14).

11. మీరు దానిని తినవలసిన విధమేదనగా, మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కఱ్ఱలు చేత పట్టుకొని, త్వరపడుచుదాని తినవలెను; అది యెహోవాకు పస్కాబలి.
లూకా 12:35

వారు కనానుదేశానికి ప్రయాణం చెయ్యడానికి సిద్ధపడి ఉండాలి. ఈనాటి విశ్వాసి కూడా దేవుని గొర్రెపిల్ల బలి అర్పణలో పాలుపొందిన తరువాత ఈ లోకం విడిచి పై లోకానికి వెళ్ళడానికి సదా సిద్ధపడి ఉండాలి (లూకా 12:35-40).

12. ఆ రాత్రి నేను ఐగుప్తుదేశమందు సంచరించి, ఐగుప్తుదేశమందలి మనుష్యులలోనేగాని జంతువులలోనేగాని తొలి సంతతియంతయు హతముచేసి, ఐగుప్తు దేవతలకందరికిని తీర్పు తీర్చెదను; నేను యెహో వాను.

దేవుడు ఈజిప్ట్‌వాళ్ళ మీదే కాక వారి దేవుళ్ళమీద కూడా తీర్పు తీరుస్తున్నాడు. దేవుడు దేవుళ్ళనబడేవారికి విరోధి. ఈజిప్ట్‌వారు గాలి, భూమి, నైలునది, సూర్యుడు మొదలైన పంచభూతాలను ఒక్కొక్కదానికీ ఒక్కొక్క దేవుడికి ప్రతినిధిగా ఎంచి పూజించారు. దేవుడు ఇప్పటికైతే తాను నైలునది (నిర్గమకాండము 7:20-21), భూమి (నిర్గమకాండము 8:16-17), జంతుజాలం (నిర్గమకాండము 9:2 నిర్గమకాండము 9:6), గాలి (నిర్గమకాండము 9:8-9 నిర్గమకాండము 9:22-24), సూర్యుడు (నిర్గమకాండము 10:21-22) మొదలైనవాటికి సర్వాధికారినని నిరూపించుకున్నాడు. ఇప్పుడు జీవన్మరణాలు తన ఆధీనాలే అనీ, మరి ఏ దేవునికీ వాటిపై ఏ అధికారమూ లేదని చూపించబోతున్నాడు. ఈజిప్ట్‌వారు కొలిచే ప్రతి దేవుడూ ఏదో ఒక జంతువుకు ప్రతినిధే. ఇప్పుడు దేవుడు ప్రతి జంతువుకూ, ఈజిప్ట్‌వారందరికీ పుట్టిన ప్రథమ సంతానాన్ని హతమార్చడం ద్వారా ఈజిప్ట్ దేవుళ్ళ చేతగానితనాన్ని బయట పెడుతున్నాడు. ఇలాంటి దేవుళ్ళను – వారి కోసం ఏమీ చేయలేని ఆ దేవుళ్ళను – ఆరాధించడం ఎంత వ్యర్థం! (కీర్తనల గ్రంథము 115:3-8).

13. మీరున్న యిండ్లమీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటిపోయెదను. నేను ఐగుప్తుదేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు.

దేవుని తీర్పునుంచీ ఆయన కోపంనుంచీ వారిని రక్షించగలది ఈ రక్తం ఒక్కటే. అలానే నేడు పాపాత్ములపై రాబోతున్న దేవుని తీర్పునుండి విశ్వాసులను కాపాడి వారి పాపాల విషయంలో శుద్ధీకరణ చేసేది క్రీస్తు రక్తం మాత్రమే (రోమీయులకు 3:23-26 హెబ్రీయులకు 9:14 హెబ్రీయులకు 9:28 1 పేతురు 1:19 1 యోహాను 1:7 ప్రకటన గ్రంథం 1:5). సంరక్షణకు ఏకైక మార్గం ఇదే. పస్కా గురించి నోట్ లేవీయకాండము 23:5.

14. కాబట్టి యీ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును. మీరు యెహోవాకు పండుగగా దాని నాచరింపవలెను; తరతరములకు నిత్యమైనకట్టడగా దాని నాచరింపవలెను.
లూకా 22:7, మత్తయి 26:17

15. ఏడుదినములు పులియని రొట్టెలను తినవలెను. మొదటిదినమున మీ యిండ్ల లోనుండి పొంగినది పార వేయవలెను. మొదటి దినము మొదలుకొని యేడవ దినము వరకు పులిసిన దానిని తిను ప్రతిమనుష్యుడు ఇశ్రాయేలీయులలోనుండి కొట్టివేయబడును.
మార్కు 14:12, లూకా 22:7

నిర్గమకాండము 12:8 నిర్గమకాండము 13:6-7 నిర్గమకాండము 23:15 నిర్గమకాండము 34:18 లేవీయకాండము 23:6 సంఖ్యాకాండము 28:17 ద్వితీయోపదేశకాండము 16:3 ద్వితీయోపదేశకాండము 16:8. బైబిల్లో ఏడు అర్థవంతమైన సంఖ్య. ఇది పరిపూర్ణతను సూచించే సంఖ్య. ఇక్కడ ఇది ఒక సంపూర్ణ కాల పరిమితికి గుర్తుగా ఉంది – అంటే భూమిపై మన జీవిత కాలమంతటికీ సూచన అన్నమాట.

16. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను, ఏడవ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. ఆ దినములయందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును; అదియు గాక మరి ఏ పనియు చేయకూడదు.
లూకా 23:56

17. పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలెను. ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశములోనుండి వెలుపలికి రప్పించితిని గనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినము నాచరింపవలెను; ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును.

41వ వచనం.

18. మొదటి నెల పదునాలుగవదినము సాయం కాలము మొదలుకొని ఆ నెల యిరువది యొకటవదినము సాయంకాలమువరకు మీరు పులియనిరొట్టెలను తినవలెను.

19. ఏడు దినములు మీ యిండ్లలో పొంగిన దేదియును ఉండకూడదు, పులిసిన దానిని తినువాడు అన్యుడేగాని దేశములో పుట్టిన వాడేగాని ఇశ్రాయేలీ యుల సమాజములో నుండక కొట్టివేయబడును.

20. మీరు పులిసినదేదియు తినక మీ నివాసములన్నిటిలోను పులియని వాటినే తినవలెనని చెప్పుమనెను.

21. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల పెద్దల నందరిని పిలిపించి వారితో ఇట్లనెను-మీరు మీ కుటుంబముల చొప్పున మందలోనుండి పిల్లను తీసికొని పస్కా పశువును వధించుడి.
1 కోరింథీయులకు 5:7, హెబ్రీయులకు 11:28

22. మరియు హిస్సోపు కుంచె తీసికొని పళ్లెములో నున్న రక్తములో దాని ముంచి, ద్వారబంధపు పైకమ్మికిని రెండు నిలువు కమ్ములకును పళ్లెములోని రక్తమును తాకింప వలెను. తరువాత మీలో నెవరును ఉదయమువరకు తన యింటి ద్వారమునుండి బయలు వెళ్లకూడదు.

23. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు, ద్వారబంధపు పైకమ్మిమీదను రెండు నిలువు కమ్ములమీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును; మిమ్ము హతము చేయుటకు మీ యిండ్లలోనికి సంహారకుని చొరనియ్యడు.

సంహార దూత ఈజిప్ట్‌వారి మీద తీర్పు అమలు పరిచేందుకు దేవుడు పంపిన దూత (12 వ).

24. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలెను.
లూకా 2:41

25. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీ కిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీని నాచరింపవలెను.

26. మరియు మీకుమారులు మీరు ఆచరించు ఈ ఆచారమేమిటని మిమ్ము నడుగునప్పుడు

27. మీరు ఇది యెహోవాకు పస్కాబలి; ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు మన యిండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీయుల యిండ్లను విడిచి పెట్టెను అనవలెనని చెప్పెను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారముచేసిరి.

11,12,23 వచనాలు.

28. అప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్లి ఆలాగుచేసిరి; యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేసిరి.

దేవుని మాటమీద వారికున్న నమ్మకమే వారు ఆ రక్తాన్ని ద్వార బంధానికి పూసేలా చేసింది. హెబ్రీయులకు 11:28. అదే విధంగా విశ్వాసమే క్రీస్తు బలియాగంలోని సత్యాన్ని మనకు అన్వయించుకొనేలా చేస్తుంది.

29. అర్ధరాత్రివేళ జరిగినదేమనగా, సింహాసనముమీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తుదేశమందలి తొలిపిల్లల నందరిని పశువుల తొలిపిల్లలనన్నిటిని యెహోవా హతము చేసెను.

30. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరును ఐగుప్తీయులందరును లేచినప్పుడు శవములేని ఇల్లు ఒకటైన లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను.

31. ఆ రాత్రివేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో-మీరును ఇశ్రాయేలీయులును లేచి నా ప్రజల మధ్యనుండి బయలు వెళ్లుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి.

నిర్గమకాండము 11:1. ఫరో పశ్చాత్తాపం, వినయంలాంటి భావాలు చూపించినది ఇక్కడే. అయితే ఇది ఎంతో సేపు నిలువలేదు. పైగా అదంతా కేవలం స్వార్థపూరితం.

32. మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసికొని పోవుడి; నన్ను దీవించుడని చెప్పెను.

33. ఐగుప్తీయులు మనమందరము చచ్చిన వారమనుకొని, తమ దేశములోనుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతముచేసిరి.

34. కాబట్టి ప్రజలు తమ పిండిముద్దను తీసికొని, అది పులియక మునుపే పిండి పిసుకు తొట్లతో దానిని మూటకట్టు కొని, తమ భుజములమీద పెట్టుకొని పోయిరి.

35. ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పునచేసి ఐగుప్తీయులయొద్ద వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసికొనిరి.

36. యెహోవా ప్రజల యెడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి.

37. అప్పుడు ఇశ్రాయేలీయులు రామసేసునుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి వారు పిల్లలు గాక కాల్బలము ఆరులక్షల వీరులు.

అంతా కలిసి ఇరవై లక్షలకు తక్కువ ఉండరు (ఆదికాండము 46:27తో పోల్చిచూడండి).

38. అనేకులైన అన్యజనుల సమూహమును, గొఱ్ఱెలు ఎద్దులు మొదలైన పశువుల గొప్పమందయును వారితోకూడ బయలుదేరెను.

39. వారు ఐగుప్తులో నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలుచేసి కాల్చిరి. వారు ఐగుప్తులోనుండి వెళ్లగొట్టబడి తడవుచేయ లేకపోయిరి గనుక అది పులిసి యుండలేదు, వారు తమ కొరకు వేరొక ఆహారమును సిద్ధపరచుకొని యుండలేదు.

40. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము నాలుగు వందల ముప్పది సంవత్సరములు.
గలతియులకు 3:17

41. ఆ నాలుగు వందల ముప్పది సంవత్సరములు గడచిన తరువాత జరిగిన దేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నియు ఐగుప్తుదేశములో నుండి బయలుదేరిపోయెను.

42. ఆయన ఐగుప్తుదేశములో నుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. ఇశ్రాయేలీయులందరు తమ తమ తరములలో యెహోవాకు ఆచరింపదగిన రాత్రి యిదే.

43. మరియయెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను-ఇది పస్కాపండుగను గూర్చిన కట్టడ; అన్యుడెవడును దాని తినకూడదు గాని

విదేశీయుడెవరైనా, దేవునితో ఒడంబడిక సంబంధం లేనివాడెవరైనా, ఒడంబడిక గుర్తుగా ఉన్న సున్నతి సంస్కారం పొందనివారెవరైనా సరే దీనిలో పాల్గొనకూడదు (48 వ).

44. వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందినవాడైతే దాని తినవచ్చును.

45. పరదేశియు కూలికివచ్చిన దాసుడును దాని తినకూడదు.

46. మీరు ఒక్క యింటిలోనే దాని తినవలెను దాని మాంసములో కొంచెమైనను ఇంటిలో నుండి బయటికి తీసికొని పోకూడదు, దానిలో ఒక్క యెముకనైనను మీరు విరువ కూడదు.
యోహాను 19:36

47. ఇశ్రాయేలీయుల సర్వసమాజము ఈ పండుగను ఆచరింపవలెను.

48. నీయొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింప గోరినయెడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలెను; తరువాత అతడు సమాజములో చేరి దానిని ఆచరింపవచ్చును. అట్టి వాడు మీ దేశములో పుట్టినవానితో సముడగును. సున్నతి పొందనివాడు దానిని తినకూడదు.

49. దేశస్థునికిని మీలో నివసించు పరదేశికిని దీనిగూర్చి ఒకటే విధి యుండవలె ననెను.

50. ఇశ్రాయేలీయులందరు ఆలాగు చేసిరి; యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లు చేసిరి.

51. యెహోవా ఇశ్రాయేలీయులను వారివారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశములోనుండి వెలుపలికి రప్పించెను.
అపో. కార్యములు 13:17, హెబ్రీయులకు 11:27, యూదా 1:5Shortcut Links
నిర్గమకాండము - Exodus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |