హత్య చేసినా, తల్లిదండ్రులను కొట్టినా, దూషించినా, ఒక వ్యక్తిని మాయోపాయంతో దొంగిలించినా నిర్లక్ష్యం మూలంగా మరో వ్యక్తి మరణానికి కారణం అయినా ధర్మశాస్త్రం మరణశిక్ష విధించిందని ఈ అధ్యాయంలో తెలుస్తున్నది. ధర్మశాస్త్రంలో మరణశిక్షకు పాత్రమైన ఇతర నేరాలేవంటే, విశ్రాంతి దినం ఆచారాన్ని మీరడం (నిర్గమకాండము 31:14 నిర్గమకాండము 35:2), అబద్ధ దేవుడికి గానీ దేవికి గానీ పిల్లలను బలివ్వడం (లేవీయకాండము 20:2), వ్యభిచారం తదితర లైంగిక దోషాలు (లేవీయకాండము 20:10-16), పూనకం వచ్చేవారినీ సోదె చెప్పేవారినీ సంప్రదించడం (లేవీయకాండము 20:6), దేవదూషణ (లేవీయకాండము 24:15), విగ్రహ పూజా అబద్ధ ఆరాధనా చేయడం గానీ దాన్ని ప్రోత్సహించడం గానీ (ద్వితీయోపదేశకాండము 13:1-8), కపట ప్రవక్తగా పలకడం (ద్వితీయోపదేశకాండము 18:20), అవిధేయత తిరుగుబాటు (ద్వితీయోపదేశకాండము 21:18-21), మంత్ర విద్య అభ్యసించడం (నిర్గమకాండము 22:18), పరాయి దేవుళ్లను పూజించడం (నిర్గమకాండము 22:20). ఇప్పుడూ దేవుని దృష్టిలో ఇవి ఘోర నేరాలే.