పురాతన ప్రపంచంలో ఈజిప్ట్‌దేశం నాగరికతలో ముందంజ వేసిన దేశాల్లో ఒకటి. మోషే ఈజిప్ట్ జ్ఞానమంతటిలో పాండిత్యం సంపాదించినవాడు. తన మాటల్లోను క్రియల్లోను బలప్రభావాలు ఉన్నవాడు (అపో. కార్యములు 7:22). జీవితంలో ఏది సాధించడానికైనా సరైన ప్రాయంలో ఉన్నాడు. మగతనం, బలం అతనిలో ఉరకలు వేస్తున్నాయి. తన జాతిపట్ల అభిమానం, దేవునికోసం ఏమైనా చెయ్యగల ఆసక్తి అతనిలో పొంగిపొరలుతున్నాయి. అప్పుడే తన ప్రజలను ఈజిప్ట్‌నుంచి విడిపించి తీసుకురావడానికి అతడు సమర్థుడని అనుకోవచ్చు. అయితే దేవుని ఆలోచన వేరుగా ఉంది. దేవుని సంకల్పం ప్రకారం మోషే ఎడారిలో 40 ఏళ్ళు గడిపాడు (అపో. కార్యములు 7:23 అపో. కార్యములు 7:30 తో; నిర్గమకాండము 7:7 కలిపి చూడండి). తన మామగారి గొర్రెలకు కాపరి అయ్యాడు. దీన్ని బట్టి చూస్తే ఇస్రాయేల్ ప్రజను దాస్యంనుంచి విడిపించి వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి నాయకుడై నడిపించగలిగేటందుకు అతడు ఇంకా తెలుసుకోవలసినది ఒంటరితనం, దీనదశ, కష్టాలు నిండిన జీవితంలోనే నేర్చు కోవాలని కనిపిస్తున్నది. నమ్మకంగా గొర్రెలను కాస్తూ ఉన్నవేళ దేవుడతనికి ప్రత్యక్షమై ఒక ఉన్నతమైన సేవకు పిలిచాడు. (ఇలాంటి విషయానికి మరి కొన్ని ఉదాహరణలు: గిద్యోను – న్యాయాధిపతులు 6:11 ఎలీషా – 1 రాజులు 19:19 పేతురు – మత్తయి 4:18-19). తన ప్రజలను దాస్యంనుంచి విడిపించేందుకు దేవుడు నియమించిన సమయం ఆసన్నమైంది, గనుక ఆయన మోషేను హోరేబు కొండకు నడిపించాడు (హోరేబు సీనాయి కొండకు మరో పేరు). దీనికి దేవుని కొండ అని పేరు. ఎందుకంటే తరువాతి కాలంలో దేవుడు ఈ కొండమీదే అద్భుత రీతిలో తనను తాను వెల్లడి చేసుకొని ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. దేవుడు నిర్గమకాండం 19–40 అధ్యాయాలు, లేవీయకాండం, సంఖ్యాకాండం మొదటి 10 అధ్యాయాలు ఇచ్చినది ఇక్కడే. “యిత్రో”– నిర్గమకాండము 2:18 నోట్ చూడండి.