Proverbs - సామెతలు 1 | View All

1. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు.

సొలొమోను మొత్తం 3000 సామెతలు పలికాడు (1 రాజులు 4:32). ఈ పుస్తకంలో వెయ్యి సామెతలు కనిపిస్తున్నాయి. అందులోనూ అన్నీ సొలొమోను పలికినవి కావు (సామెతలు 30:1; సామెతలు 31:1). సొలొమోను సామెతలెన్నో కాలగర్భంలో కలిసిపోయాయి. సొలొమోనుకు మానవ మాత్రులెవరికీ లేని వివేచనాశక్తి, జ్ఞానం ఉన్నాయి. ఎందుకంటే అది దేవుని నుంచి ప్రత్యేకంగా అతనికి వచ్చినది (1 రాజులు 3:10-12). ఈ పుస్తకంలో రాసివున్న సొలొమోను సామెతలను దేవుని ఆత్మే ఎన్నుకొని మన ఉపదేశం కోసం రాయించాడు.

2. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును

సొలొమోను ఈ సామెతలు చెప్పడానికీ, పవిత్రాత్మ వాటిని బైబిల్లో మనకోసం రాయించడానికీ గల కారణాలు కొన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి. ముఖ్యమైన కారణం ఏమంటే వీటి ద్వారా మనం ఈ అనుదిన జీవిత వ్యవహారాలలో ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది. కేవలం తెలుసుకుని ఉండడం ముఖ్యం కాదు. తెలుసుకున్న వాటిని ఆచరణలో పెట్టాలి. అయితే సొలొమోను తానే కొన్ని సార్లు ఈ సూత్రాలను అనుసరించకపోవడం శోచనీయం (1 రాజులు 11:1-6).

3. నీతిన్యాయ యథార్థతల ననుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును

4. జ్ఞానములేనివారికి బుద్ధి కలిగించుటకును ¸యౌవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు.

“తెలివితక్కువ”– సామెతలు 8:5; కీర్తనల గ్రంథము 19:7; కీర్తనల గ్రంథము 119:30. దేవుని వాక్కు మన పాలిట తిరుగులేని జ్ఞాననిధి. వాక్కును నమ్మి, మన హృదయాల్లో స్వీకరించి, ధ్యానించుకుంటూ, దాని ప్రకారం చెయ్యాలి. “యువకులకు”– దేవుని వాక్కులవల్ల వయస్సులో చిన్నవారికి సైతం జ్ఞానం అబ్బుతుంది. సామెతల పుస్తకంలోని ఉపదేశాలు చాలా వరకు యువకులను ఉద్దేశించి రాసినవి (సామెతలు 1:8, సామెతలు 1:10; సామెతలు 2:2; సామెతలు 3:1; సామెతలు 4:1 మొ।।).

5. జ్ఞానముగలవాడు విని పాండిత్యము వృద్ధిచేసికొనును వివేకముగలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును.

6. వీటిచేత సామెతలను భావసూచక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు.

7. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు.

“భయభక్తులు”– అసలైన విషయానికి వచ్చేశాడు సొలొమోను. దేవుని పట్ల గౌరవపూర్వకమైన భయం, భక్తి భావం లేకుండా నిజమైన జ్ఞానం అసాధ్యం. అలాంటి భయభక్తులు లేకపోతే దేవుని దృష్టిలో జ్ఞానం అనిపించుకొనేదాని కనుచూపు మేరకైనా చేరలేము. ఆదికాండము 20:11; కీర్తనల గ్రంథము 34:11-14; కీర్తనల గ్రంథము 111:10; కీర్తనల గ్రంథము 130:3-4 నోట్స్ చూడండి. ఇలాంటి భయభక్తులు లేనివారు విద్యావంతులై ఉండవచ్చు. మేధావులు, ఆరితేరినవారై ఉండవచ్చు. ఒకవేళ బైబిలు కూడా వారికి బాగా తెలిసి ఉండవచ్చు. అయితే వారికి జ్ఞానం ఉన్నట్లు కాదు. “యెహోవా మీది భయభక్తులు” అనే మాటలు, అలాంటి అర్థాన్నిచ్చే మాటలు సామెతలు గ్రంథంలో 14 సార్లు కనిపిస్తాయి. ఇది ఈ పుస్తకానికి కీలకమైన అంశం. తత్వశాస్త్రం, వేదాంతం, ముఖ్యంగా అద్వైత వేదాంతం వివరించే జ్ఞానానికి బైబిలు వివరించిన జ్ఞానానికి ఎంత వ్యత్యాసం ఉందో జాగ్రత్తగా గమనించండి. “మూర్ఖులు”– కీర్తనల గ్రంథము 14:1 నోట్ చూడండి. దేవునిపై భయభక్తులను గానీ తద్వారా కలిగే జ్ఞానాన్ని గానీ మూర్ఖులు పట్టించుకోరు. తమ కోరికలను మాత్రం తీర్చుకొంటూ ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తించాలని వారి ఆశ. సామెతలు గ్రంథంలో ఎక్కడికక్కడ మూర్ఖులకూ జ్ఞానులకూ తేడా చెప్తూవుండడం కనిపిస్తుంది. ఇక్కడ మూర్ఖులంటే దుర్మార్గులు, జ్ఞానులంటే న్యాయవంతులు. పాపం చేయడం మూర్ఖత్వం, నీతిన్యాయాలతో బ్రతకడం జ్ఞానయుక్తం.

8. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము.

ఇహలోక జీవితం కోసం తమ పిల్లలకు బుద్ధి కలిగించడం తల్లిదండ్రుల బాధ్యత (సామెతలు 13:24; సామెతలు 22:6; ఆదికాండము 18:19; ద్వితీయోపదేశకాండము 6:7). వారలా చెయ్యని పక్షంలో పిల్లలు తుంటరులుగా తయారైతే ఆశ్చర్యపడవలసిన పని లేదు.

9. అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములునై యుండును

10. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము.

మంచి తల్లిదండ్రుల పిల్లలు కూడా దుర్మార్గులు స్నేహంలో పడిపోయే అవకాశం ఉంది. ఇలా జరిగినప్పుడు దౌర్జన్యం, దోపిడీ, నేరాలకు నడిపించే జారుడు నేలమీద వారున్నారన్నమాట (సామెతలు 22:24-25; 1 కోరింథీయులకు 15:33). ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా యువకులు తామెవరితో స్నేహం చేస్తున్నామో జాగ్రత్త వహించాలి. ఎందుకంటే స్నేహాలు మన ప్రవర్తనపై ఎంతో ప్రభావాన్ని చూపి అటు మితిలేని మేలుకైనా, అంతులేని కీడుకైనా దారితీస్తాయి.

11. మాతోకూడ రమ్ము మనము ప్రాణముతీయుటకై పొంచియుందము నిర్దోషియైన యొకని పట్టుకొనుటకు దాగియుందము

12. పాతాళము మనుష్యులను మింగివేయునట్లు వారిని జీవముతోనే మింగివేయుదము సమాధిలోనికి దిగువారు మింగబడునట్లు వారు పూర్ణ బలముతోనుండగా మనము వారిని మింగివేయుదము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకుము.

13. పలువిధములైన మంచి సొత్తులు మనకు దొరుకును మన యిండ్లను దోపుడుసొమ్ముతో నింపుకొందము

14. నీవు మాతో పాలివాడవై యుండుము మనకందరికిని సంచి ఒక్కటే యుండును అని వారు నీతో చెప్పుదురు.

15. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము వారి త్రోవలయందు నడువకుండ నీ పాదము వెనుకకు తీసికొనుము.

16. కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు.
రోమీయులకు 3:15-17

17. పక్షి చూచుచుండగా వల వేయుట వ్యర్థము.

బోయవాడు పక్షులను వల పన్ని పట్టుకుంటాడు. అయితే వల పన్నుతూ ఉండగా పక్షులు చూశాయంటే ఎగిరిపోతాయి (కీర్తనల గ్రంథము 91:3; సామెతలు 6:5; సామెతలు 7:23). మనం దుర్మార్గుల మాయలు, కుతంత్రాల విషయం సావధానంగా ఉంటే తప్పించుకోగలం.

18. వారు స్వనాశనమునకే పొంచియుందురు తమ్మును తామే పట్టుకొనుటకై దాగియుందురు.

ఇతరులను మోసగిద్దామని చూచే దుర్మార్గుడు తాను త్రవ్విన గోతిలో తానే పడతాడు (సామెతలు 26:27; కీర్తనల గ్రంథము 7:15; కీర్తనల గ్రంథము 35:7-8; కీర్తనల గ్రంథము 40:2; కీర్తనల గ్రంథము 94:13). తన వలలో తానే పడ్డవాడికి పక్షుల పాటి తెలివి కూడా లేదని అందరికీ అర్థమౌతుంది.

19. ఆశాపాతకులందరి గతి అట్టిదే దానిని స్వీకరించువారి ప్రాణము అది తీయును.

20. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది సంతవీధులలో బిగ్గరగా పలుకుచున్నది

మనుషులను పిలుస్తున్న రెండు ప్రధానమైన స్వరాలు ఉన్నాయి. ఒకటి జ్ఞానం. ఇది దేవుని వాక్కు (సామెతలు 8:12, సామెతలు 8:22-31). రెండోది మూర్ఖత్వం. ఇది దుర్మార్గుల సలహా (సామెతలు 9:13; కీర్తనల గ్రంథము 1:1). ఇహలోకంలో మన జీవిత విధానాన్నీ, శాశ్వత లోకంలో మన స్థితినీ నిర్ణయించేది మనం ఏ స్వరానికి లోబడతామన్నదే.

21. గొప్ప సందడిగల స్థలములలో ప్రకటన చేయు చున్నది పురద్వారములలోను పట్టణములోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది

22. ఎట్లనగా, జ్ఞానములేనివారలారా, మీరెన్నాళ్లు జ్ఞానములేని వారుగా ఉండగోరుదురు? అపహాసకులారా, మీరెన్నాళ్లు అపహాస్యము చేయుచు ఆనందింతురు? బుద్ధిహీనులారా, మీరెన్నాళ్లు జ్ఞానమును అసహ్యించు కొందురు?

ఈ అధ్యాయం ముగింపు వరకూ జ్ఞానం పలుకుతున్న మాటలే వినపడుతున్నాయి. నిజానికి బైబిలు అంతటా జ్ఞానం స్వరం వినిపిస్తూనే ఉంటుంది. బైబిలు ఎక్కడెక్కడికైతే వెళ్ళిందో, ఎక్కడెక్కడైతే దేవుడు మనుషులతో మాట్లాడుతున్నాడో అన్ని చోట్లా ఈ స్వరం వినబడుతుంది. అయితే ఈ జ్ఞానం స్వరాన్ని వినిపించుకోవడం ఎక్కువమందికి ఇష్టం ఉండదు. తద్వారా వారు తమ మూర్ఖత్వాన్ని బయటపెట్టుకుంటున్నారు. మూర్ఖులు తమ బుద్ధిహీనతనే అంటిపెట్టుకొని జ్ఞానాన్ని వెక్కిరిస్తూ వివేకాన్ని తిరస్కరిస్తూ అందులోనే సంతోషిస్తూ ఉండడం నిజంగా విపరీతమైన విషయం. అందువల్ల రాబోయే వచనాల్లో వారికి భయంకరమైన హెచ్చరిక ఉంది.

23. నా గద్దింపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీమీద కుమ్మరించుదును నా ఉపదేశమును మీకు తెలిపెదను.

మనుషులు తన మాట విని తనవైపు తిరిగితే వారిపట్ల దేవుడు ఈ విధంగా చేద్దామని ఎదురు చూస్తున్నాడు. ఆయన మానవాళికి బైబిలును ఇచ్చినది అందుకే. దేవుని హృదయాన్నీ ఆయన ఆలోచనలనూ మరింత విపులంగా తెలుసుకొనేందుకే మన జీవిత కాలమంతా గడపాలి.

24. నేను పిలువగా మీరు వినకపోతిరి. నా చేయిచాపగా ఎవరును లక్ష్యపెట్టకపోయిరి

యెషయా 65:12; యెషయా 66:4; యిర్మియా 7:13; యిర్మియా 26:5; యిర్మియా 35:17; యిర్మియా 36:31; హెబ్రీయులకు 12:25. జ్ఞానం స్వరాన్ని అంటే దేవుని మాటలు ఆలకించడానికి తిరస్కరించడం కంటే మూర్ఖత్వం, తలబిరుసుతనం, ప్రమాదం వేరొకటి లేదు.

25. నేను చెప్పిన బోధ యేమియు మీరు వినక త్రోసి వేసితిరి నేను గద్దింపగా లోబడకపోతిరి.

26. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను మీకు భయము వచ్చునప్పుడు నేను అపహాస్యము చేసెదను

ఇవి జ్ఞానం పిలుస్తున్నప్పుడు పెడచెవిని బెడితే కలిగే దుష్ఫలితాలు. కీర్తనల గ్రంథము 2:4; ద్వితీయోపదేశకాండము 28:62-63.

27. భయము మీమీదికి తుపానువలె వచ్చునప్పుడు సుడిగాలి వచ్చునట్లు మీకు అపాయము కలుగు నప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించునప్పుడు నేను అపహాస్యము చేసెదను.

28. అప్పుడు వారు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టెదరుగాని నేను ప్రత్యుత్తరమియ్యకుందును నన్ను శ్రద్ధగా వెదకెదరు గాని వారికి నేను కనబడ కుందును.

చేతులు కాలాక ఆకులు పట్టుకుంటారు కొందరు. చట్ట బద్ధంగా శిక్ష పడవలసిన సమయం ఆసన్నమైనప్పుడు, ఆ శిక్ష అమలు జరగవలసిన ఘడియ తోసుకువచ్చినప్పుడు కొందరు వ్యర్థంగా మొరపెట్టవచ్చు (ద్వితీయోపదేశకాండము 1:45; 1 సమూయేలు 8:18; యెషయా 1:15; యిర్మియా 11:11; హోషేయ 5:6). నోవహు, అతని కుటుంబం ఓడలోకి వెళ్ళిపోయాక, వరద మూలంగా మనుషులపై శిక్ష ఆరంభమయ్యాక, కరుణించాలని ప్రాధేయపడితే లాభం లేదు.

29. జ్ఞానము వారికి అసహ్యమాయెను యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వారి కిష్టము లేకపోయెను.

7వ వచనం, యెహోవాపట్ల భయభక్తులను మనుషులు తమకు తాము ఎంచుకోవాలి. అంతేకాక దాన్ని జాగ్రత్తగా పోషించుకుంటూ అనుసరిస్తూ ఉండాలి.

30. నా ఆలోచన విననొల్లకపోయిరి నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి.

31. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము ననుభ వించెదరు తమకు వెక్కసమగువరకు తమ ఆలోచనలను అనుసరించెదరు

32. జ్ఞానములేనివారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు.

మనుషులు తమ దుష్ ప్రవర్తన, మూర్ఖత్వం చేత తమ్మును తామే నాశనం చేసుకొంటారు. తమ చేజేతులా చేసుకొన్నదానికి దేవుణ్ణి నిందించకూడదు.

33. నా ఉపదేశము నంగీకరించువాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును.Shortcut Links
సామెతలు - Proverbs : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |