Proverbs - సామెతలు 8 | View All

1. జ్ఞానము ఘోషించుచున్నది వివేచన తన స్వరమును వినిపించుచున్నది

యోబు 28:12; సామెతలు 1:20-21. జ్ఞానం కోసం వెతికేవారికి అది అందుబాటులోనే ఉంటుందన్న విషయాన్ని ఇక్కడ సొలొమోను నొక్కి చెప్తున్నాడు. అది ఎక్కడో అందరానంత దూర తీరాల్లో లేదు.

2. త్రోవప్రక్కను రాజవీధుల మొగలలోను నడిమార్గములలోను అది నిలుచుచున్నది

3. గుమ్మములయొద్దను పురద్వారమునొద్దను పట్టణపు గవునులయొద్దను నిలువబడి అది ఈలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది

4. మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను నరులగు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను.

జ్ఞానం గురించి ఇక్కడ అనేకమైన ముఖ్య విషయాలు కనిపిస్తున్నాయి. (1) వారూ, వీరని తేడా లేకుండా తెలివిలేనివారు, బుద్ధిలేని వారు కూడా జ్ఞానాన్ని సంపాదించుకునే అవకాశం ఉంది (4,5 వ). (2) జ్ఞానమన్నది యథార్థత, సత్యం, పవిత్రత, న్యాయాలకు సంబంధించినది (6-9 వ). వీటికి భిన్నమైనదంతా అజ్ఞానమే. (3) లోక సంబంధమైన ఆస్తిపాస్తులన్నిటికంటే జ్ఞానం ప్రధానమైనది (10,11 వ) బైబిలు ప్రకారం జ్ఞానం అంటే దుష్టత్వం నుంచి తొలగి దేవునివైపుకు తిరిగి ఆయన వాక్కులను ధ్యానించుకొంటూ ఆయన ఆజ్ఞలను శిరసావహించడమే. క్రీస్తులో నమ్మకముంచినవాడు ప్రపంచంలో మిగిలిన వారందరికంటే నిజమైన జ్ఞానానికి చేరువలో ఉన్నాడు. ఎందుకంటే క్రీస్తే దేవుని జ్ఞానం. ఆయన తన విశ్వాసుల్లో ఉన్నాడు. వారి జ్ఞానం ఆయనే. వారు ఆయనలో సంపూర్ణులు (1 కోరింథీయులకు 1:24, 1 కోరింథీయులకు 1:30; కొలొస్సయులకు 2:3, కొలొస్సయులకు 2:8-10). క్రీస్తులో నమ్మకముంచి ఆయన్ను తెలుసుకొని ఉన్నవారు నిజమైన జ్ఞానోదయం పొందినవారు. వారు చేయవలసినది క్రీస్తువైపు చూస్తూ ఆయనకు లోబడి, ఆయనవద్ద నేర్చుకోవడమే.

5. జ్ఞానములేనివారలారా, జ్ఞానము ఎట్టిదైనది తెలిసి కొనుడి బుద్ధిహీనులారా,బుద్ధియెట్టిదైనది యోచించి చూడుడి.

6. నేను శ్రేష్ఠమైన సంగతులను చెప్పెదను వినుడి నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును

7. నా నోరు సత్యమైన మాటలు పలుకును దుష్టత్వము నా పెదవులకు అసహ్యము

8. నా నోటి మాటలన్నియు నీతిగలవి వాటిలో మూర్ఖతయైనను కుటిలతయైనను లేదు

9. అవియన్నియు వివేకికి తేటగాను తెలివినొందినవారికి యథార్థముగాను ఉన్నవి.

10. వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి మేలిమి బంగారు నాశింపక తెలివినొందుడి.

11. జ్ఞానము ముత్యములకన్న శ్రేష్ఠమైనది విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు.

12. జ్ఞానమను నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసికొనియున్నాను సదుపాయములు తెలిసికొనుట నాచేతనగును.

జ్ఞానం ఎలాంటిది, దానివల్ల సమకూడే ఫలితాలెలాంటివి అన్న విషయంపై మరి కొంత సమాచారం. జ్ఞానం అంటే మన దైనందిన జీవితాలతో సంబంధం లేని ఏదో అలౌకిక వేదాంత వితర్కం కాదు. జ్ఞానానికి, జీవితంలో మన ప్రవర్తన ఎలా ఉండాలి అనే విషయానికి సన్నిహిత సంబంధం ఉంది (12-16 వ). మనలను ప్రేమించే వారిని మనం ప్రేమిస్తే వారి దగ్గరికి ఎలా పరుగెత్తుతామో జ్ఞానం కూడా దాన్ని ప్రేమించేవారి చెంతకు చేరుతుంది (17 వ). ఒకవేళ జ్ఞానం ఇహలోక సంబంధమైన సంపదను కూడా ఇవ్వవచ్చు (18,21 వ), గాని అలాంటి సంపదకంటే మరింత ప్రశస్తమైన వాటిని అది ఇస్తుంది. (19,20 వ). నిజమైన జ్ఞానం ఉన్నవాళ్ళు పరలోకంలో ధనం కూడబెట్టుకుంటారు, ఇక్కడ కాదు (మత్తయి 6:19-21).

13. యెహోవాయందు భయభక్తులు గలిగియుండుట చెడుతనము నసహ్యించుకొనుటయే. గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు.

ఆదికాండము 20:11; కీర్తనల గ్రంథము 34:11-14 నోట్స్ చూడండి. దుర్మార్గం, గర్వం, కాపట్యం, ఇవంటే దేవునికి అసహ్యం గనుక, అవి మనిషిని పాడు చేస్తాయి గనుక జ్ఞానానికి ఇవంటే అసహ్యం.

14. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానము నిచ్చుటయు నా వశము జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే.

15. నావలన రాజులు ఏలుదురు అధికారులు న్యాయమునుబట్టి పాలనచేయుదురు.
రోమీయులకు 13:1

దేవుడిచ్చిన జ్ఞానం రాజులకూ పరిపాలకులకూ లేకపోతే వారి పాలన సవ్యంగా ఉండదు. అందుకనే సొలొమోనురాజు అన్నిటికంటే ముఖ్యంగా జ్ఞానం కోసం ప్రార్థించాడు (1 రాజులు 3:7-9; 2 దినవృత్తాంతములు 1:8-10).

16. నావలన అధిపతులును లోకములోని ఘనులైన న్యాయాధిపతులందరును ప్రభుత్వము చేయుదురు.

17. నన్ను ప్రేమించువారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు

“దొరుకుతాను”– మత్తయి 7:7-11; యాకోబు 1:5-8. ఇంత విలువైనదాన్నీ ప్రయత్నిస్తే లభ్యమయ్యే దాన్నీ చిత్తశుద్ధితో వెతికి సంపాదించుకోవాలి గదా.

18. ఐశ్వర్య ఘనతలును స్థిరమైన కలిమియు నీతియు నాయొద్ద నున్నవి.

19. మేలిమి బంగారముకంటెను అపరంజికంటెను నావలన కలుగు ఫలము మంచిది ప్రశస్తమైన వెండికంటె నావలన కలుగు వచ్చుబడి దొడ్డది.

20. నీతిమార్గమునందును న్యాయమార్గములయందును నేను నడచుచున్నాను.

21. నన్ను ప్రేమించువారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదును.

22. పూర్వకాలమందు తన సృష్ట్యారంభమున తన కార్య ములలో ప్రథమమైనదానిగా యెహోవా నన్ను కలుగజేసెను.
ప్రకటన గ్రంథం 3:14, యోహాను 1:1-2, యోహాను 17:24, కొలొస్సయులకు 1:17

సామెతలు 1:20-33; సామెతలు 3:15-18; సామెతలు 9:1-12 లో లాగానే ఇక్కడ కూడా జ్ఞానం ఒక వ్యక్తి మాట్లాడినట్టు మాట్లాడుతున్నది. కొందరు పండితులు ఈ వ్యక్తి క్రీస్తు అని భావించారు. మరి కొందరైతే దేవుని లక్షణాల్లో ఒక లక్షణాన్ని తీసుకొని కావ్యరూపంలో సొలొమోను రాశాడని అభిప్రాయపడ్డారు. ఇలాంటి సందేహాస్పదమైన సందర్భాల్లో ఇదమిద్ధంగా తేల్చి చెప్పడం సరికాదు. అయితే ఇదంతా క్రీస్తును దృష్టిలో పెట్టుకొని రాసినదన్న విషయం నిజమే కావచ్చు. 1 కోరింథీయులకు 1:24 లో క్రీస్తు దేవుని జ్ఞానం అని రాసివుంది. సమస్త సృష్టి కార్యమూ ఆయన మూలంగా జరిగిందని రాసి ఉంది (యోహాను 1:3, యోహాను 1:10; 1 కోరింథీయులకు 8:6; కొలొస్సయులకు 1:16; హెబ్రీయులకు 1:8).

23. అనాదికాలము మొదలుకొని మొదటినుండి భూమి ఉత్పత్తియైన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని.

మీకా 5:2; యోహాను 1:1. క్రీస్తు శాశ్వతుడు. దేవుని లక్షణాల్లో ఒకటైన జ్ఞానానికి కూడా ఆది, అంతం లేవు. దేవునికి జ్ఞానం తోడు లేని కాలం అంటూ ఏదీ లేదు. కాబట్టి “నేను రూపొందాను” అనే భావాన్ని అక్షరార్థంగా తీసుకోరాదు.

24. ప్రవాహజలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని.

25. పర్వతములు స్థాపింపబడకమునుపు కొండలు పుట్టకమునుపు

26. భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు నేల మట్టిని రవంతయు సృష్టింపకమునుపు నేను పుట్టితిని.

27. ఆయన ఆకాశవిశాలమును స్థిరపరచినప్పుడు మహాజలములమీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడ నుంటిని.

దేవుని సృష్టి కార్యమంతటిలోనూ ఎనలేని ప్రవీణత, జ్ఞానం ఉట్టిపడుతున్నాయి (ఆదికాండము 1:9, ఆదికాండము 1:12, ఆదికాండము 1:18, ఆదికాండము 1:25, ఆదికాండము 1:31; కీర్తనల గ్రంథము 104:24; కీర్తనల గ్రంథము 136:5). ఇదంతా మహానంద కారణం. యోబు 38:4-38 లో దేవుడు తన పనులను ఆనందంతో వర్ణించడం చూస్తాం. మనిషి పాపంలో పడిపోయి దేవుని హృదయానికి బాధ కలిగించనంత వరకు సృష్టి అంతా దేవుని దృష్టిలో మంచిదిగానే ఉంది (ఆదికాండము 1:31; ఆదికాండము 6:5-7).

28. ఆయన పైన ఆకాశమును స్థిరపరచినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు

29. జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరచినప్పుడు భూమియొక్క పునాదులను నిర్ణయించినప్పుడు

30. నేను ఆయనయొద్ద ప్రధానశిల్పినై అనుదినము సంతో షించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచునుంటిని.

31. ఆయన కలుగజేసిన పరలోకమునుబట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచునుంటిని.

32. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి నా మార్గముల ననుసరించువారు ధన్యులు

జ్ఞానం ఇంకా మాట్లాడుతూ మనుషులు దేవుని జ్ఞానంలో పాలుపొందవలసిన అవసరం, అవకాశం ఉన్నాయంటున్నది. దేవుడు మనిషిని తన పోలికలో సృజించాడు. వారు గనుక జ్ఞానాన్ని సంపాదించుకొంటే ఎన్నో ఘనకార్యాలు చేయగల సమర్థులౌతారు. “ధన్యులు”– ఆదికాండము 12:1-3; సంఖ్యాకాండము 6:22-27; కీర్తనల గ్రంథము 1:1-2 నోట్స్.

33. ఉపదేశమును నిరాకరింపక దాని నవలంబించి జ్ఞానులై యుండుడి.

34. అనుదినము నా గడపయొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధములయొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు.

జ్ఞాన సముపార్జన అన్నది ఒక సారి చేసి ముగించేది కాదు. అది కలకాలం సాగవలసినదే.

35. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును యెహోవా కటాక్షము వానికి కలుగును.

36. నన్ను కనుగొననివాడు తనకే హాని చేసికొనును నాయందు అసహ్యపడువారందరు మరణమును స్నేహించుదురు.Shortcut Links
సామెతలు - Proverbs : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |