“వెర్రి... అవివేకం”– 1 రాజులు 11:1-8 ను అర్థం చేసుకునేందుకు ఇది బహుశా కొంతవరకు ఉపకరించవచ్చు. బ్రతుకుకు అర్థం తెలుసుకునేందుకు సొలొమోను ఏదీ వదలకుండా పరిశ్రమించాడు. సాధారణంగా మనుషులు ఏ విషయాల జోలికైతే పోకూడదో వాటిని కూడా తరచి చూశాడు. తన పరిశోధనల్లో సొలొమోను అవివేకం, చీకటి పొరల వెనక్కు కూడా వెళ్ళాడు (ప్రసంగి 2:3, ప్రసంగి 2:8, ప్రసంగి 2:10, ప్రసంగి 2:12; ప్రసంగి 7:25). అనుభవించడానికి సాధ్యమైనది దేన్నీ విడిచిపెట్టకుండా అన్నిటినీ తరచి చూచి దేన్లోనైనా ఏమన్నా అర్థం కనిపిస్తుందేమో పరిశీలించాలని కోరాడు. అతని అడుగు జాడల్లోనే మనమూ నడవాలని లేదు. అతడు వెళ్ళిన చీకటి లోతులకు మనమూ వెళ్ళనవసరం లేదు. సొలొమోను అనుభవాలనూ, వాటిని గురించి అతని అభిప్రాయాలనూ దేవుడు తన వాక్కులో మనకోసం రాయించి ఉంచాడు. ఎందుకంటే అతడు వెళ్ళిన దారిన మనం వెళ్ళనవసరం లేకుండానే కొన్ని ముఖ్యమైన పాఠాలు నేర్చుకోవాలని ఆయన ఆశయం. సొలొమోను అవివేకం, చీకటి లోకాలను పరిశోధించి తిరిగి వచ్చాడు. అక్కడ ప్రయోజనకరమైనది ఏమీ లేదని, అంతా వ్యర్థమైన ప్రయాసే అనీ చెప్పేందుకే వచ్చాడు. దేవునికి వేరుగా మానవ జ్ఞానం వెంట పడడమైనా సరే నిష్ప్రయోజనమే. చివరికి అది విచారాన్నే తెచ్చిపెడుతుంది.