ఇది మనోహరమైన కావ్యరూపంలో యువకులకు యోగ్యమైన ఉపదేశం. తప్పనిసరిగా రాబోయే శిథిలావస్థ, వృద్ధాప్యం, మరణం వారిని మట్టిలో కలిపెయ్యక ముందే సృష్టికర్త అయిన దేవునివైపు తిరగాలని వారిని హెచ్చరిస్తున్నాడు ప్రసంగి. కనుదృష్టి, వరాలు, బలం, వినేశక్తి, ధైర్యం, ప్రాణం అన్నీ క్షీణించిపోతాయి (వ 2-5). ఆత్మను శరీరానికి కట్టి ఉంచే తాడు తెగిపోతుంది. బ్రతుకు కుండ ముక్కలైపోతుంది. జీవన పాత్రలోని నీరంతా నేలపాలౌతుంది. బావిలో నుంచి మళ్ళీ తోడుకునే వీలుండదు (వ 6). మనిషి ఆత్మ దేవుని దగ్గరికి తిరిగి వెళ్తుంది అనే నమ్మకాన్ని గమనించండి (వ 7). ప్రసంగి 3:18-21 లో దీని గురించి తనకు తెలియదని చెప్పాడు. ఆ తరువాత కొంత నేర్చుకొన్నట్టు ఉన్నాడు.