16వ వచనంలో కవి భావమేమిటో స్పష్టంగా లేదు. ఒకవేళ స్వనీతిని గురించీ, జ్ఞానినని మిడిసిపడ్డ సంగతి గురించీ హెచ్చరిస్తున్నాడేమో, లేక తన మానవ జ్ఞానం సహాయంతో తప్పుడు అభిప్రాయానికి వచ్చాడేమో. ఈ పుస్తకంలో మనుషులకు ఏది మంచిది అన్న విషయం గురించి సొలొమోను అభిప్రాయాలే ఉన్నాయి. దేవుని ఉద్దేశాలు కావు, సొలొమోను రాసిన దానంతటినీ దేవుడు క్రీస్తు ద్వారానూ, ఇతర రాయబారుల ద్వారానూ వెల్లడి చేసినదానితో సరిపోల్చుకోవాలి. సొలొమోను మాటలకు అర్థం ఇది కావచ్చు – ఇలాంటి అర్థం లేని దుష్ట ప్రపంచంలో అందరూ న్యాయ నియమాలను అనుసరించి ప్రవర్తించాలని ఎవరైనా పట్టు విడవకుండా నొక్కి చెపుతూ ఉంటే అతను మనుషుల ద్వేషానికి గురి అయ్యే ప్రమాదం ఉంది. అతని ప్రాణమే పోయే ప్రమాదం ఉంది (యెషయా 59:15). మనుషులకు నీతిన్యాయాలు కావాలని ఇష్టం లేకపోతే వాటిని బలవంతంగా వాళ్ళ నెత్తిన రుద్దడం నిష్ ప్రయోజనం, అపాయకరం (మత్తయి 7:6 చూడండి) మన వ్యక్తిగత జీవితాల్లో మనం ఎంత నీతిన్యాయాలతో బ్రతకగలిగితే అంత మంచిది గాని మన న్యాయ నియమాల గురించి ఏమీ లెక్క చెయ్యని వారిని తప్పులెన్నుతూ, విమర్శిస్తూ ఉండకూడదు. ఎక్కువ దుర్మార్గత, మూర్ఖత్వం ఇంకా ప్రమాదకరం (వ 17). అవి మనుషుల కోపాన్ని, దేవుని కోపాన్ని కూడా మనమీదికి తెచ్చి పెడతాయి. నిజంగా దేవునిపట్ల భయభక్తులున్న మనిషి తాను అవలంబించవలసిన సరైన మార్గమేదో తెలుసుకోగలుగుతాడు (వ 18).