3. అందరికిని ఒక్కటే గతి సంభవించును, సూర్యునిక్రింద జరుగువాటన్నిటిలో ఇది బహు దుఃఖ కరము, మరియు నరుల హృదయము చెడుతనముతో నిండియున్నది, వారు బ్రదుకుకాలమంతయు వారి హృదయమందు వెఱ్ఱితనముండును, తరువాత వారు మృతుల యొద్దకు పోవుదురు ఇదియును దుఃఖకరము.
ప్రసంగి 7:20; మార్కు 7:20-23; రోమీయులకు 1:29-32. పాపం నిండిన జీవితం ఉన్మాదంతో వెర్రితనంతో సమానం. అలాంటి మనుషులు దేవునితో నిమిత్తం లేక, ఆశాభావానికి ఆధారం లేక దేవుని శాసనాలనూ తమ అంతర్వాణినీ మీరుతూ దేవుని తీర్పు, రాబోయే శిక్ష మొదలైన వాటిని లెక్కచెయ్యకుండా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ ఉంటారు. కాలిపోతూ బూడిద కావడానికి సిద్ధంగా ఉన్న ఇంట్లో ఆటలాడుకునే వెర్రి మనుషులలాగా ఉంటారు. వారు బైబిల్లోని సత్యాన్ని బట్టి చూస్తే ఇహలోకం ఇవ్వజూసే మిధ్యా సుఖాలను ఆశించడం, వాటి గురించిన ప్రలోభంలో, మత్తులో పడి ఉండడం, గాలిని పట్టుకుందామని పరుగెత్తడం, వ్యర్థమైన వాటికోసం జీవించడం అంతా పిచ్చితనమే. అది అక్షరాలా ఆత్మసంబంధమైన ఆధ్యాత్మిక వాస్తవికతతో నిమిత్తం లేకుండా ఉండడం. ఆత్మ సంబంధంగా వెర్రివారు భ్రమకు లోనై తమ విపరీతమైన ఆలోచనలు వాస్తవమనీ వాస్తవికత విభ్రాంతి అనీ భావిస్తారు.