Song of Solomon - పరమగీతము 5 | View All

1. నా సహోదరీ, ప్రాణేశ్వరీ, నా ఉద్యానవనమునకు నేను ఏతెంచితిని నా జటామాంసిని నా గంధవర్గములను కూర్చుకొను చున్నాను తేనెయు తేనెపట్టును భుజించుచున్నాను క్షీరసహితద్రాక్షారసము పానము చేయుచున్నాను. నా సఖులారా, భుజించుడి లెస్సగా పానము చేయుడి స్నేహితులారా, పానము చేయుడి.

1. నా ప్రియ సఖీ, నా ప్రియ వధూ, నేను నా తోటలో ప్రవేశించాను, నేను నా బోళం సుగంధ ద్రవ్యాలను ఏరుకున్నాను, తేనె తాగాను తేనె పొర తిన్నాను నేను నా మధుక్షీరాలు సేవించాను. ప్రియాతి ప్రియ నేస్తాల్లారా తినండి, తాగండి! ప్రేమను జుర్రి మత్తిల్లండి!

2. నేను నిద్రించితినే గాని నా మనస్సు మేలుకొని యున్నది నా సహోదరీ, నా ప్రియురాలా, నా పావురమా, నిష్కళంకురాలా, ఆలంకిపుము నా తల మంచుకు తడిసినది నా వెండ్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపుతీయుమనుచు నాప్రియుడు వాకిలి తట్టు చున్నాడు.

2. నేను నిద్రించానేగాని నా హృదయం మేల్కొనేవుంది. నా ప్రియుడు తలుపు తట్టి ఇలా అనడం విన్నాను “నా ప్రియ సఖీ, ప్రేయసీ నా గువ్వపిట్టా, సుగుణ ఖనీ! నా తల మంచుతో తడిసింది నా జుట్టు రేమంచు జడికి నానింది.”

3. నేను వస్త్రము తీసివేసితిని నేను మరల దాని ధరింపనేల? నా పాదములు కడుగుకొంటిని నేను మరల వాటిని మురికిచేయనేల?

3. “నేను నా వస్త్రం తోలగించాను, దాన్ని తిరిగి ధరించాలని అనిపించలేదు. నేను నా పాదాలు కడుక్కున్నాను. అవి తిరిగి మురికి అవడం ఇష్టం లేక పోయింది.”

4. తలుపుసందులో నా ప్రియుడు చెయ్యియుంచగా నా అంతరంగము అతనియెడల జాలిగొనెను.

4. తలుపు సందులో నా ప్రియుడు చేతినుంచాడు నేనతని పట్ల జాలినొందాను .

5. నా ప్రియునికి తలుపు తీయ లేచితిని నా చేతులనుండియు నా వ్రేళ్లనుండియు జటామాంసి గడియలమీద స్రవించెను

5. నా చేతుల నుంచి జటామాంసి జారగా, నా వేళ్ల నుంచి జటామాంసి పరిమళ ద్రవం తలుపు గడియ పైకి జాలువారగా నేను నా ప్రియునికి తలుపు తీయ తలంచాను.

6. నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్లిపోయెను అతనిమాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లెను నేనతని వెదకినను అతడు కనబడకపోయెను నేను పిలిచినను అతడు పలుకలేదు.

6. నేను నా ప్రియుడికి తలుపు తెరిచాను, కాని అప్పటికే నా ప్రియుడు వెనుదిరిగి వెళ్లిపోయాడు! అతడు వెళ్లిపోయినంతనే నా ప్రాణం కడగట్టింది . నేనతని కోసం గాలించాను. కాని అతడు కనిపించలేదు. నేనతన్ని పిలిచాను, కాని అతడు బదులీయలేదు.

7. పట్టణములో తిరుగు కావలివారు నా కెదురుపడి నన్ను కొట్టి గాయపరచిరి ప్రాకారముమీది కావలివారు నా పైవస్త్రమును దొంగిలించిరి.

7. నగరంలో పారా తిరిగేవారు నాకు తారసిల్లారు నన్ను కొట్టి, గాయపరిచారు. ప్రాకారం కావలివారు నా పై దుస్తును కాజేశారు.

8. యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడినయెడల ప్రేమాతిశయముచేత నీ ప్రియురాలు మూర్ఛిల్లెనని మీరతనికి తెలియజేయునట్లు నేను మీచేత ప్రమాణము చేయించుకొందును.

8. యెరూషలేము స్త్రీలారా, నా ప్రియుడు మీ కంట పడితే చెప్పండి, నీ ప్రియురాలు నీ ప్రేమతో కృంగి కృశించి పోతోందని.

9. స్త్రీలలో అధిక సుందరివగుదానా, వేరు ప్రియునికన్న నీ ప్రియుని విశేషమేమి? నీవు మాచేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియునికన్న నీ ప్రియుని విశేషమేమి?

9. అతిలోక సుందరి, ఇతర ప్రియులకంటె నీ ప్రియుని విశేషం ఏమిటి? ఇతర ప్రియుల కన్న నీ ప్రియుడు వేటివేటిలో ఎక్కువా? అంతగా ఎక్కువ కనుకనేనా, మాచేత ప్రమాణం చేయించుకున్నావు?

10. నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు పదివేలమంది పురుషులలో అతని గుర్తింపవచ్చును

10. నా ప్రియుడు కమిలి ప్రకాశించు కాయమ్ము కలవాడు, పదివేలలోనైన రాణించగలవాడు.

11. అతని శిరస్సు అపరంజివంటిది అతని తలవెండ్రుకలు కాకపక్షములవలె కృష్ణ వర్ణ ములు అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి.

11. మేలిమి బంగారు పోలిన శిరస్సు గలవాడు తుమ్మెద రెక్కలవంటి నొక్కు నొక్కుల కారునల్లటి శిరో జాలవాడు.

12. అతని నేత్రములు నదీతీరములందుండు గువ్వలవలె కనబడుచున్నవి అవి పాలతో కడుగబడినట్టున్నవి అవి చక్కగా తాచిన రత్నములవలె ఉన్నవి.

12. అతని కనులేమో సెలయేటి ఒడ్డున ఎగిరేటి గువ్వల పోలు పాల మునిగిన పావురాల పోలు బంగారం తాపిన రత్నాల పోలు.

13. అతని చెక్కిళ్లు పరిమళ పుష్పస్థానములు సుగంధవృక్షములచేత శోభిల్లు ఉన్నత భూభాగ ములు అతని పెదవులు పద్మములవంటివి ద్రవరూపక జటామాంసివలె అవి పరిమళించును.

13. అతడి చెక్కిళ్లు సుగంధ ఉద్యానాల పరిమళ పుష్పరాశుల పోలు అతని పెదవులు బోళంతో తడిసిన అత్తరు వారు కెందామరలు.

14. అతని కరములు తార్షీషు రత్నభూషితమైన స్వర్ణగోళమువలె ఉన్నవి అతని కాయము నీలరత్నఖచితమైన విచిత్రమగు దంతపుపనిగా కనబడుచున్నది.

14. అతని చేతులు వజ్రాలు పొదిగిన బంగారు కడ్డీల పోలు అతని కాయము నీలాలు తాపిన నున్నటి దంత దూలమ్ము పోలు.

15. అతని కాళ్లు మేలిమిబంగారు మట్లయందు నిలిపిన చలువరాతి స్తంభములవలె ఉన్నవి. అతని వైఖరి లెబానోను పర్వతతుల్యము అది దేవదారు వృక్షములంత ప్రసిద్ధము

15. అతని పాదాలు బంగారు దిమ్మమీది పాలరాతి స్తంభాల పోలు అతని సుదీర్ఘ శరీరం లెబానోను పర్వతం మీది నిటారైన దేవదారు వృక్షాన్ని తలపింపజేయు.

16. అతని నోరు అతిమధురము. అతడు అతికాంక్షణీయుడు యెరూషలేము కూమార్తెలారా, ఇతడే నా ప్రియుడు ఇతడే నా స్నేహితుడు.

16. ఔనౌను, యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు అత్యంత వాంఛనీయుడు, అతని అధరం అత్యంత మధురం అతనే నా ప్రియుడు, నా ప్రాణ సఖుడు.Shortcut Links
పరమగీతము - Song of Solomon : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |