2. నేను నిద్రించితినే గాని నా మనస్సు మేలుకొని యున్నది నా సహోదరీ, నా ప్రియురాలా, నా పావురమా, నిష్కళంకురాలా, ఆలంకిపుము నా తల మంచుకు తడిసినది నా వెండ్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపుతీయుమనుచు నాప్రియుడు వాకిలి తట్టు చున్నాడు.
మరో దృశ్యం, మరో సమయం. ఆమె రాత్రివేళ ఒంటరిగా ఎక్కడో ఉండగా వరుడు వచ్చి ఆమెను పిలిచాడు. అతను దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చాడు. లేదా బయట చాలా సేపు నిలబడ్డాడు – మంచువల్ల అతని తల తడిగా ఉంది. ఏవిధంగా చూచుకొన్నా అతని ప్రేమ అర్థమౌతూనే ఉంది. అతడు వచ్చినందువల్ల ఆమె మురిసిపోయింది గాని లేచి తలుపు తీయడానికి ఏమంత ఇష్టం ఉన్నట్టు లేదు (వ 3). ఆలస్యం చేస్తూ ఉంది. మొత్తానికి ఎలానో లేచినప్పుడు కూడా తన గురించి పట్టింపే గాని అతని విషయం ఎక్కువగా ఆలోచించడం లేదు (వ 5). ఇంతకుముందు కూడా ఆమెలో ఈ పొరపాటు కనిపించకపోలేదు (పరమగీతము 1:5, పరమగీతము 1:12; పరమగీతము 2:1). ఆమె జాగు చేయడం, తానంటే పెద్దగా ఆసక్తి చూపకపోవడం అతనికి బాధ కలిగించి అతను వెళ్ళిపోయాడు (వ 6). క్రీస్తు తనకోసం అభిలాష లేని చోట ఎంతో కాలం నిలిచి ఉండడు. ఒక విశ్వాసి ఆధ్యాత్మిక జీవితంలో అతనికీ క్రీస్తుకూ మధ్య సహవాస బంధం తెగిపోయిందంటే అందుకు కారణం క్రీస్తు ఎంత మాత్రం కాదు. సహవాసం కోసం ఎంత దూరమైనా ఆయన వస్తాడు. సహనంతో వేచి ఉంటాడు. అయితే తలుపు తీసేందుకు అయిష్టత, నిర్లక్ష్యం (ఇది ఆరంభ ప్రేమ అంతరించిందని సూచిస్తుంది) ఆయనకు బాధ కలిగిస్తుంది. స్వంత వ్యవహారాల్లో మునిగి ఉన్న స్థితి ఆయనతో సహవాసానికి అడ్డుపడుతుంది. తన ప్రేమలో యేసుప్రభువు మనలను పిలిచేది మనం బద్దకంగానూ మన అందాలను మనం చూసుకుని మురిసిపోయే ధోరణిలోనూ ఉండాలని కాదు. మనకు అబ్బిన దేవుని కృప, ఉచిత వరాలు మనల్ని మనం చూచుకొంటూ చంకలు కొట్టుకునేందుకు కాదు. ఆయన సన్నిధే మరీ మరీ కావాలని కోరేవారికీ, ఆ కోరికను వెల్లడించే వారికీ అది తప్పక దొరుకుతుంది. ప్రేమించే ప్రతి వ్యక్తీ తాను ప్రేమించిన వ్యక్తీ అదే విధంగా తనను ప్రేమించాలని కోరడం సహజమే కదా (పరమగీతము 8:6-7; మత్తయి 22:37). మనకు ఉండవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏమంటే మన సావకాశం, మన సుఖం గురించి చూచుకోవడం కాకుండా కేవలం క్రీస్తునే సంతోష పెట్టే విధంగా ఆయన్ను ప్రేమించాలి.