Isaiah - యెషయా 1 | View All

1. ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియాయను యూదారాజుల దినములలో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనము.

1. ఆమోజు కుమారుడు యెషయా దర్శనం ఇది. యూదాకు, యెరూషలేముకు సంభవించే సంగతులను దేవుడు యెషయాకు చూపించాడు. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా యూదాకు రాజులుగా ఉన్న కాలవ్యవధిలో ఈ సంగతులను యెషయా చూశాడు.

2. యెహోవా మాటలాడుచున్నాడు ఆకాశమా, ఆలకించుము; భూమీ, చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని వారు నామీద తిరుగబడియున్నారు.

2. ఆకాశమా, భూమీ యెహోవా మాట వినండి! యెహోవా ఇలా చెబుతున్నాడు. “నా పిల్లల్ని నేను పెంచాను. నా పిల్లలు పెరగటానికి నేను సహాయం చేసాను. కానీ నా పిల్లలు నా మీద తిరగబడ్డారు.

3. ఎద్దు తన కామందు నెరుగును గాడిద సొంతవాని దొడ్డి తెలిసికొనును ఇశ్రాయేలుకు తెలివిలేదు నాజనులు యోచింపరు

3. ఎద్దుకు తన కామందు తెలుసు. గాడిదకు దాని సొంతదారుడు మేత పెట్టే చోటు తెలుసు. కానీ ఇశ్రాయేలు ప్రజలకు నేను తెలియదు. నా ప్రజలు గ్రహించరు.”

4. పాపిష్ఠి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్టసంతానమా, చెరుపుచేయు పిల్లలారా, మీకుశ్రమ. వారు యెహోవాను విసర్జించి యున్నారు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుని దూషింతురు ఆయనను విడిచి తొలగిపోయి యున్నారు.

4. ఇశ్రాయేలు ప్రజలు దోషులు. ఈ దోషం ప్రజలు మోయాల్సిన భారమైన బరువులా ఉంది. ఆ ప్రజలు చెడు కుటుంబాలకు చెందిన దుర్మార్గపు పిల్లల్లా ఉన్నారు. వారు యెహోవాను విడిచిపెట్టేశారు. ఇశ్రాయేలీయుల పరిశుద్ధుణ్ణి (దేవుడు) అ ప్రజలు అవమానించారు. వాళ్లు దేవుణ్ణి విడిచిపెట్టి, పరాయి వాళ్లలా ఉన్నారు.

5. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేల ఇంకను కొట్టబడుదురు? ప్రతివాడు నడినెత్తిని వ్యాధి గలిగి యున్నాడు ప్రతివాని గుండె బలహీనమయ్యెను.

5. దేవుడు చెబుతున్నాడు: “ప్రజలారా నేనెందుకు మిమ్మల్ని శిక్షిస్తూనే ఉండాలి?నేను మిమ్మల్ని శిక్షించాను. కాని మీరు మారలేదు. మీరు నా మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ప్రతి తల, ప్రతిగుండె వ్యాధితో ఉన్నాయి.

6. అరకాలు మొదలుకొని తలవరకు స్వస్థత కొంచెమైనను లేదు ఎక్కడ చూచినను గాయములు దెబ్బలు పచ్చి పుండ్లు అవి పిండబడలేదు కట్టబడలేదు తైలముతో మెత్తన చేయబడలేదు.

6. మీ అరికాలు మొదలుకొని మీ నడినెత్తి వరకు శరీరమంతా గాయాలు, దెబ్బలు, పచ్చిపుండ్లు ఉన్నాయి. మీ పుండ్లను గూర్చి మీరు శ్రద్ద తీసుకోలేదు. మీ పుండ్లు శుభ్రం చేయబడలేదు. వాటికి కట్లు కట్టలేదు.

7. మీ దేశము పాడైపోయెను మీ పట్టణములు అగ్నిచేత కాలిపోయెను మీ యెదుటనే అన్యులు మీ భూమిని తినివేయుచున్నారు అన్యులకు తటస్థించు నాశనమువలె అది పాడైపోయెను.

7. “మీ దేశం పాడైపోయింది. మీ పట్టణాలు అగ్నితో కాల్చివేయబడ్డాయి. మీ దేశాన్ని మీ శత్రువులు స్వాధీనం చేసుకొన్నారు. సైన్యం నాశనం చేసిన దేశంలా మీ భూమి పాడు చేయబడింది.

8. ద్రాక్షతోటలోని గుడిసెవలెను దోసపాదులలోని పాకవలెను ముట్టడి వేయబడిన పట్టణమువలెను సీయోను కుమార్తె విడువబడియున్నది.

8. ఇప్పుడు సీయోను కుమార్తె (యెరూషలేము) ద్రాక్ష తోటలో విడువబడిన ఖాళీ గుడారర లా ఉంది. దోస పాదుల్లో విసర్జించబడిన పాత గుడిసెలాగ ఉంది. అది శత్రువులచేత ఓడించబడిన పట్టణంలా ఉంది.”

9. సైన్యములకధిపతియగు యెహోవా బహు కొద్దిపాటి శేషము మనకు నిలుపని యెడల మనము సొదొమవలె నుందుము గొమొఱ్ఱాతో సమానముగా ఉందుము.
రోమీయులకు 9:29

9. ఇది నిజమే, కానీ సర్వశక్తిమంతుడైన యెహోవా కొద్ది మంది ప్రజలను బతకనిచ్చాడు. సొదొమ, గొమొర్రా పట్టణాల్లా మనం సర్వనాశనం చేయబడలేదు.

10. సొదొమ న్యాయాధిపతులారా, యెహోవామాట ఆల కించుడి. గొమొఱ్ఱా జనులారా, మన దేవుని ఉపదేశమునకు చెవి యొగ్గుడి.
ప్రకటన గ్రంథం 11:8

10. సొదొమ నాయకులారా, యెహోవా సందేశం వినండి. గొమొర్రా ప్రజలారా, దేవుని ఉపదేశాలు వినండి.

11. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే విస్తారమైన మీ బలులు నాకేల? దహనబలులగు పాట్టేళ్లును బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కస మాయెను కోడెల రక్తమందైనను గొఱ్ఱపిల్లల రక్తమందైనను మేక పోతుల రక్తమందైనను నాకిష్టములేదు.

11. దేవుడు అంటున్నాడు: “ఇంకా ఎందుకు మీరు నాకు బలులు అర్పిస్తూనే ఉన్నారు? మీ మేకల బలులు, దూడల కొవ్వు, గొర్రెలు, మేకలు నాకు వెక్కసం అయ్యాయి.

12. నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్న వాడెవడు?

12. “మీరు నన్ను కలుసుకొనేందుకు వచ్చినప్పుడు, నా ఆవరణం అంతా తిరుగుతారు. మిమ్మల్ని ఇలా చేయమన్నది ఎవరు?

13. మీ నైవేద్యము వ్యర్థము అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము దాని నికను తేకుడి అమావాస్యయు విశ్రాంతిదినమును సమాజకూట ప్రక టనమును జరుగుచున్నవి పాపులగుంపుకూడిన ఉత్సవసమాజమును నే నోర్చ జాలను.

13. “నా కోసం పనికిమాలిన బలులు ఇక మీదట తీసుకొని రావద్ద. మీరు నాకు అర్పించే ధూపం నాకు అసహ్యం మీ అమావాస్య, సబ్బాతు, పవిత్ర రోజుల పండుగలను నేను సహించను. మీ పరిశుద్ధ సమావేశాలలో మీరు చేసేది నాకు అసహ్యం.

14. మీ అమావాస్య ఉత్సవములును నియామక కాలము లును నాకు హేయములు అవి నాకు బాధకరములు వాటిని సహింపలేక విసికియున్నాను.

14. మీ నెలసరి సమావేశాలు, సభలు నాకు బొత్తిగా అసహ్యం. ఈ సమావేశాలు నాకు చాలా బరువులా తయారయ్యాయి. ఆ బరువులు మోయటం నాకు విసుగు.

15. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థనచేసినను నేను వినను మీ చేతులు రక్తముతో నిండియున్నవి.
యోహాను 9:31

15. “మీరు నన్ను ప్రార్థించాలని మీ చేతులు పైకి ఎత్తుతారు కానీ నేను మిమ్మల్ని చూడటానికి కూడా ఒప్పుకోను. మీరు మరిన్ని ప్రార్థనలు చేస్తారు కాని నేను మీ ప్రార్థనలు వినేందుకు ఒప్పుకోను. ఎందుకంటే మీ చేతులు రక్తమయము.

16. మిమ్మును కడుగుకొనుడి శుద్ధి చేసికొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండ వాటిని తొలగింపుడి.
యాకోబు 4:8

16. “మిమ్మల్ని మీరు కడుక్కోండి. మిమ్మల్ని మీరు పరిశుభ్రం చేసుకోండి. మీరు చేస్తున్న చెడు పనులు చాలించండి. ఆ చెడు పనులు చూడటం నాకు ఇష్టం లేదు. తప్పు చేయటం మానివేయండి.

17. కీడుచేయుట మానుడి మేలుచేయ నేర్చుకొనుడి న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని విడిపించుడి తండ్రిలేనివానికి న్యాయము తీర్చుడి విధవరాలి పక్షముగా వాదించుడి.

17. మంచి పనులు చేయటం నేర్చుకోండి. ఇతరుల విషయంలో న్యాయంగా ఉండండి. ఇతరులను బాధించే వారిని శిక్షించండి. తల్లిదండ్రులు లేని పిల్లలకు సహాయం చేయండి. భర్తలు చనిపోయిన స్త్రీలకు సహాయం చేయండి.”

18. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకొందము మీ పాపములు రక్తమువలె ఎఱ్ఱనివైనను అవి హిమము వలె తెల్లబడును కెంపువలె ఎఱ్ఱనివైనను అవి గొఱ్ఱబొచ్చువలె తెల్లని వగును.

18. యెహోవా చెబుతున్నాడు, “రండి, ఈ విషయాలు మనం పరిష్కరించుకొందాము. మీ పాపాలు కెంపులాగా ఎర్రగా ఉన్నా సరే వాటిని కడగవచ్చు, మీరు మంచులా తెల్లగా అవుతారు. మీ పాపాలు చాలా ఎర్రగా ఉన్నా సరే మీరు మాత్రం ఉన్నిలాగ తెల్లగా మారవచ్చును.

19. మీరు సమ్మతించి నా మాట వినినయెడల మీరు భూమి యొక్క మంచిపదార్థములను అనుభవింతురు.

19. “నేను చెప్పే మాటలు మీరు వింటే అప్పుడు ఈ దేశపు మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు.

20. సమ్మతింపక తిరుగబడినయెడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు యెహోవా యీలాగుననే సెలవిచ్చియున్నాడు.

20. కానీ మీరు వినేందుకు నిరాకరిస్తే, మీరు నాకు వ్యతిరేకమే. మీ శత్రువులు మిమ్మల్ని నాశనం చేసేస్తారు.” యెహోవా తానే ఈ విషయాలు చెప్పాడు.

21. అయ్యో, నమ్మకమైన నగరము వేశ్య ఆయెనే! అది న్యాయముతో నిండియుండెను నీతి దానిలో నివసించెను ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురమున్నారు.

21. దేవుడు చెబుతున్నాడు: “యెరూషలేమును చూడండి. అది నన్ను నమ్మి వెంబడించిన పట్టణం. అది ఓ వేశ్య అయ్యేట్టుగా చేసింది ఏమిటి? ఇప్పుడు అది నన్ను వెంబడించటం లేదు. యెరూషలేము న్యాయంతో నిండి ఉండాలి. యెరూషలేము నివాసులు యెహోవా కోరిన విధంగా జీవించాలి, కానీ ఇప్పుడు నరహంతకులు అక్కడ నివసిస్తున్నారు.

22. నీ వెండి మష్టాయెను, నీ ద్రాక్షారసము నీళ్లతో కలిసి చెడిపోయెను.

22. “మంచితనం వెండిలాంటిది. కానీ మీ వెండి పనికిమాలినదిగా తయారయింది. మీ ద్రాక్షారసం నీళ్లతో కలపబడి నిస్సారమయింది.

23. నీ అధికారులు ద్రోహులు దొంగల సహవాసులు వారందరు లంచము కోరుదురు బహుమానములకొరకు కనిపెట్టుదురు తండ్రిలేనివారిపక్షమున న్యాయము తీర్చరు, విధవ రాండ్ర వ్యాజ్యెము విచారించరు.

23. మీ అధికారులు తిరుగుబాటు దారులు, దొంగల స్నేహితులు. మీ అధికారులు అందరూ లంచాలు అడుగుతారు, తప్పుడు పనులు చేయటం కోసం డబ్బు స్వీకరిస్తారు. మీ అధికారులంతా ప్రజలను మోసం చేసేందుకు డబ్బు పుచ్చు కొంటారు. మీ అధికారులు అనాథ పిల్లలకు సహాయం చేసేందుకు ప్రయత్నం చేయరు. భర్తలు చనిపోయిన స్త్రీల అవసరాలను గూర్చి మీ అధికారులు వినిపించుకోరు.”

24. కావున ప్రభువును ఇశ్రాయేలుయొక్క బలిష్ఠుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగున అనుకొనుచున్నాడు ఆహా, నా శత్రువులనుగూర్చి నేనికను ఆయాసపడను నా విరోధులమీద నేను పగ తీర్చుకొందును.

24. ఈ విషయాలన్నింటి మూలంగా, ఆ యజమాని, సర్వశక్తిమంతుడైన యెహోవా, ఇశ్రాయేలీయుల మహాబలశాలి ఇలా చెబుతున్నాడు, “నా శత్రువులారా, నేను మిమ్మల్ని శిక్షిస్తాను. ఇంకెంత మాత్రం మీరు నాకు కష్టం కలిగించరు.

25. నా హస్తము నీమీద పెట్టి క్షారము వేసి నీ మష్టును నిర్మలము చేసి నీలో కలిపిన తగరమంతయు తీసి వేసెదను.

25. వెండిని శుద్ధిచేయటానికి మనుష్యులు క్షారం వాడుతారు. అదే విధంగా మీ తప్పులన్నిటినీ నేను శుద్ధి చేసేస్తాను. మీలోంచి పనికిమాలిన వాటన్నింటినీ నేను తీసివేస్తాను.

26. మొదటనుండినట్లు నీకు న్యాయాధిపతులను మరల ఇచ్చెదను ఆదిలోనుండినట్లు నీకు ఆలోచనకర్తలను మరల నియమించెదను అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును.

26. ఆరంభంలో మీకు ఉన్నమాదిరి న్యాయమూర్తుల్ని నేను మళ్లీ తీసుకొని వస్తాను. మీ సలహాదారులు చాలాకాలం క్రిందట మీకు ఉన్న సలహాదారుల్లా ఉంటారు. అప్పుడు మీరు మంచి, నమ్మకమైన పట్టణం”‘ అని పిలువబడతారు.

27. సీయోనుకు న్యాయము చేతను తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతిచేతను విమోచనము కలుగును.

27. దేవుడు మంచివాడు, ఆయన సరైన వాటినే చేస్తాడు. కనుక ఆయన సీయోనును, తన దగ్గరకు తిరిగి వచ్చే ప్రజలను రక్షిస్తాడు.

28. అతిక్రమము చేయువారును పాపులును నిశ్శేషముగా నాశనమగుదురు యెహోవాను విసర్జించువారు లయమగుదురు.

28. అయితే నేరుస్థులు, పాపులు అందురూ నాశనం చేయబడతారు. (వారు యెహోవాను వెంబడించని ప్రజలు.)

29. మీరు ఇచ్ఛయించిన మస్తకివృక్షమునుగూర్చి వారు సిగ్గుపడుదురు మీకు సంతోషకరములైన తోటలనుగూర్చి మీ ముఖ ములు ఎఱ్ఱబారును

29. మీరు పూజించటానికి ఏర్పరచుకొనే మస్తకివృక్షాలు, ప్రత్యేక వనాలు చూచి భవిష్యత్తులో ప్రజలు సిగ్గుపడతారు.

30. మీరు ఆకులు వాడు మస్తకివృక్షమువలెను నీరులేని తోటవలెను అగుదురు.

30. మీరు ఎండిపోతున్న ఆకుల మస్తకి వృక్షాల్లా ఉంటారు. కనుక ఇలా జరుగుతుంది. నీళ్లులేక ఎండిపోతున్న తోటలా మీరుంటారు.

31. బలవంతులు నారపీచువలె నుందురు, వారి పని అగ్ని కణమువలె నుండును ఆర్పువాడెవడును లేక వారును వారి పనియు బొత్తిగా కాలిపోవును.

31. శక్తిమంతులైన ప్రజలు ఎండిపోయిన చిన్న చెక్క ముక్కల్లా ఉంటారు. ఆ ప్రజలు చేసే పనులు నిప్పు రాజబెట్టే నిప్పురవ్వల్లా ఉంటాయి. శక్తిమంతులైన ప్రజలూ, వారు చేసే పనులూ కాలిపోవటం మొదలవుతుంది. ఆ అగ్నిని ఎవరూ ఆర్పివేయలేరు.Shortcut Links
యెషయా - Isaiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |