Isaiah - యెషయా 1 | View All

1. ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియాయను యూదారాజుల దినములలో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనము.

ఇక్కడ దర్శనం అంటే దేవుడు వెల్లడించిన విషయాలు అని అర్థం. ఆదికాండము 15:1 నోట్ చూడండి. ఆయన ఈ విషయాలను చాలా కాలం పాటు అనేక సందర్భాలలో యెషయాకు వెల్లడించాడు. వెల్లడి అయిన విషయాలన్నీ యెషయా గ్రంథమంతట్లో రాసి ఉన్నాయి. “యూదా రాజులు”– ఈ రాజులంతా వంద సంవత్సరాలకు పైగా (క్రీ.పూ 792–686) యూదాను పరిపాలించారు. ఉజ్జియా పరిపాలన ఆరంభం నుంచి హిజ్కియా పరిపాలన అంతం వరకు యెషయా దేవుని మూలంగా పలికాడని ఇక్కడ చెప్పడం లేదు గానీ ఈ రాజులు ఏలుతున్న కాలంలో అప్పుడప్పుడూ యెషయాకు దేవుని దర్శనాలు కలిగాయని మాత్రమే గమనించాలి. బహుశా ఉజ్జియా పరిపాలన చివరి రోజుల్లో యెషయా దేవుని మూలంగా పలకడం ఆరంభించి ఉండవచ్చు. అయితే ఈ విషయాన్ని ఖచ్చితంగా చెప్పలేము. 6వ అధ్యాయంలోని దర్శనం యెషయా తన పరిచర్య ఆరంభించిన చాలా కాలానికి వచ్చి ఉండవచ్చునేమో తెలియదు. యెషయా 6:1 చూడండి.

2. యెహోవా మాటలాడుచున్నాడు ఆకాశమా, ఆలకించుము; భూమీ, చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని వారు నామీద తిరుగబడియున్నారు.

“ఆలకించడం”– ద్వితీయోపదేశకాండము 4:26; ద్వితీయోపదేశకాండము 30:19; ద్వితీయోపదేశకాండము 31:28; ద్వితీయోపదేశకాండము 32:1. దేవుడు తనకు వెల్లడించినవి అతి ప్రాముఖ్యమైన సంగతులని యెషయా గట్టి నమ్మకం. దేవుడు చెప్పినది భూమీ, సకల జగత్తూ వినాలని కోరుతున్నాడు. దేవుడు తన ప్రజలపై మోపుతున్న నేరాలకు సాక్షులుగా అవి ఉండాలని అడుగుతున్నాడు. ప్రపంచాలను సృష్టించినవాడు తన కోసమని ప్రత్యేకించుకున్న ప్రజలు ఆయననుండి తొలగిపోయి అజ్ఞానంలో దుర్మార్గతలో తమ స్వంత దారులు పట్టి వెళ్ళిపోయారన్నదే ఈ సందేశం. కీర్తనల గ్రంథము 95:10; యెషయా 53:6; యిర్మియా 8:5-6 పోల్చి చూడండి. ఇక్కడ పిల్లలు అంటే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల సంతతి (నిర్గమకాండము 4:22; ద్వితీయోపదేశకాండము 32:6; 2 సమూయేలు 7:24; యెషయా 64:8; మొ।।).

3. ఎద్దు తన కామందు నెరుగును గాడిద సొంతవాని దొడ్డి తెలిసికొనును ఇశ్రాయేలుకు తెలివిలేదు నాజనులు యోచింపరు

తమనూ సమస్తాన్నీ సృష్టించిన దేవుని పై తిరుగుబాటు చేసిన మనుషులు తెలివిలేని పశువుల కన్న అవివేకంగా కనిపిస్తారు. యూదా, ఇస్రాయేల్ ప్రజలు ఈ విషయంలో ఇతర జనాలకంటే ఉత్తములు కాదు, తెలివైనవారు కాదు (ద్వితీయోపదేశకాండము 32:28; యిర్మియా 4:22; యిర్మియా 8:7). ఎద్దు, గాడిద, జంతువులన్నిటిలోకీ తెలివైనవేమీ కాదు. అయితే ఒక ముఖ్యమైన విషయంలో ఇస్రాయేల్ ప్రజలకంటే వాటికే ఎక్కువ జ్ఞానం ఉంది. ఆ ప్రజలకు యజమాని ఉన్నాడు. కానీ వారు ఆయన ప్రేమనూ, సంరక్షణనూ వదిలించుకుని దూరం వెళ్ళిపోవాలని ప్రయత్నించారు.

4. పాపిష్ఠి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్టసంతానమా, చెరుపుచేయు పిల్లలారా, మీకుశ్రమ. వారు యెహోవాను విసర్జించి యున్నారు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుని దూషింతురు ఆయనను విడిచి తొలగిపోయి యున్నారు.

నీతి న్యాయాల విషయంలో, ఆత్మ సంబంధమైన విషయాల్లో యూదా, జెరుసలం వారి ఘోర స్థితిని ఈ ఒక్క వచనం బయట పెడుతున్నది. వారి విషయంలో ఈ అంచనా కట్టినది దేవుడే, మనిషి కాదు. ఇది ఒక్క యూదా పరిస్థితి మాత్రమే కాదు. లోకమంతటి తీరూ ఇంతే (కీర్తనల గ్రంథము 14:2-3; రోమీయులకు 3:9-18). “ఇస్రాయేల్ ప్రజల పవిత్రుడు” అనేమాట యెషయా గ్రంథంలో 26 సార్లు, మిగతా పాత ఒడంబడిక గ్రంథం మొత్తంలో 6 సార్లు కనిపిస్తుంది. యెషయా గ్రంథం దేవుని పవిత్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నది. దేవుని పవిత్రత వెలుగులో మానవ స్వభావం అత్యంత పాప భూయిష్టంగా కనిపిస్తుంది. లేవీయకాండము 20:7 లో “పవిత్రత” పై నోట్స్ చూడండి.

5. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేల ఇంకను కొట్టబడుదురు? ప్రతివాడు నడినెత్తిని వ్యాధి గలిగి యున్నాడు ప్రతివాని గుండె బలహీనమయ్యెను.

ఇవి దేవునికి వ్యతిరేకంగా వారు చేసిన తిరుగుబాటు ఫలితాల్లో కొన్ని (పాపం వల్ల కలిగే భయంకరమైన ప్రతి ఫలాలను బైబిలు పదేపదే ఏకరువు పెడుతూ ఉంది ఆదికాండము 2:17; లేవీయకాండము 26:14-22; సంఖ్యాకాండము 32:23; యెహెఙ్కేలు 18:20; రోమీయులకు 1:18; రోమీయులకు 6:23; హెబ్రీయులకు 2:2). ప్రవక్త (ప్రవక్త ద్వారా దేవుడు) యూదా జాతిని అడుగుతున్నాడు – “ఇంత బాధకరమైన ఫలితాలు ఎదురౌతున్నప్పటికీ మీరింకా పాపంలోనే కొనసాగాలని కోరుకుంటారెందుకు?” వ్యాధివల్ల కలిగే హానికరమైన ఫలితాలను శరీరం అనుభవించినట్టే దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినందువల్ల కలిగే నాశనకరమైన ఫలితాలను జాతి మొత్తం అనుభవించింది. శత్రు సైన్యాల దండయాత్రల మూలంగా ఈ నాశనం వారి పైకి వచ్చింది. 2 దినవృత్తాంతములు 28:5-8; 2 దినవృత్తాంతములు 32:1-2, 2 దినవృత్తాంతములు 32:9 పోల్చి చూడండి. ఒక దేశం దుర్మార్గతను శిక్షించేందుకు దేవుడు మరొక దేశం సైన్యాలను ఉపయోగించుకుంటాడు (యెషయా 7:20; యెషయా 10:5-6; యిర్మియా 50:15, యిర్మియా 50:23; యిర్మియా 51:1, యిర్మియా 51:20-23; హబక్కూకు 1:6; ప్రకటన గ్రంథం 17:16-17 చూడండి).

6. అరకాలు మొదలుకొని తలవరకు స్వస్థత కొంచెమైనను లేదు ఎక్కడ చూచినను గాయములు దెబ్బలు పచ్చి పుండ్లు అవి పిండబడలేదు కట్టబడలేదు తైలముతో మెత్తన చేయబడలేదు.

7. మీ దేశము పాడైపోయెను మీ పట్టణములు అగ్నిచేత కాలిపోయెను మీ యెదుటనే అన్యులు మీ భూమిని తినివేయుచున్నారు అన్యులకు తటస్థించు నాశనమువలె అది పాడైపోయెను.

8. ద్రాక్షతోటలోని గుడిసెవలెను దోసపాదులలోని పాకవలెను ముట్టడి వేయబడిన పట్టణమువలెను సీయోను కుమార్తె విడువబడియున్నది.

సీయోను కుమారి అంటే జెరుసలం నగరం, దాని ప్రజానీకం. దాని పై కత్తిగట్టిన ఇతర జాతులమధ్య ఇది ఒంటరిగా నిలిచి ఉంది.

9. సైన్యములకధిపతియగు యెహోవా బహు కొద్దిపాటి శేషము మనకు నిలుపని యెడల మనము సొదొమవలె నుందుము గొమొఱ్ఱాతో సమానముగా ఉందుము.
రోమీయులకు 9:29

రోమీయులకు 9:29. ఆ తిరుగుబాటు ప్రజల పట్ల దేవుడు గనుక జాలి చూపకపోతే సొదొమ, గొమొర్రాల్లాగా ఆ నగరం, జాతి మొత్తంగా భూమి పై ఉండకుండా తుడిచి పెట్టుకుపోయేది (ఆదికాండము 19:20-25). “సేనల ప్రభువు యెహోవా”– 1 సమూయేలు 1:3 నోట్ చూడండి.

10. సొదొమ న్యాయాధిపతులారా, యెహోవామాట ఆల కించుడి. గొమొఱ్ఱా జనులారా, మన దేవుని ఉపదేశమునకు చెవి యొగ్గుడి.
ప్రకటన గ్రంథం 11:8

యూదా పాలకులతో, ప్రజలతో వారు సొదొమ గొమొర్రా పాలకులైనట్టుగా మాట్లాడుతున్నాడు యెషయా. నాశనమైపోయిన ఆ నగరాలు వినాశనానికి ఎంత పాత్రమైనవో ఈనాడు జెరుసలం యూదాలు కూడా అంతే అవినీతి పూరితంగా నాశనానికి తగినవిగా ఎంచుతున్నాడు.

11. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే విస్తారమైన మీ బలులు నాకేల? దహనబలులగు పాట్టేళ్లును బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కస మాయెను కోడెల రక్తమందైనను గొఱ్ఱపిల్లల రక్తమందైనను మేక పోతుల రక్తమందైనను నాకిష్టములేదు.

ఇది ఆరాధన గురించి చాలా ప్రాముఖ్యమైన భాగం. ఏది దేవునికి అంగీకారమో, ఏది కాదో ఈ భాగం తెలియజేస్తున్నది. కీర్తనల గ్రంథము 50:1-23; యిర్మియా 7:1-11; యోహాను 4:21-24; యాకోబు 1:26-27 కూడా చూడండి. అణకువ, దేవునిపట్ల విధేయత లేకుంటే, నిష్కాపట్యం సదుద్దేశం, పవిత్ర హృదయం, ఆధ్యాత్మిక జీవనం లేకుంటే మన ఆరాధనకు ప్రయోజనం శూన్యం. దాన్ని దేవుడు అంగీకరించడు. కీర్తనల గ్రంథము 40:6; కీర్తనల గ్రంథము 50:9; యిర్మియా 6:20; 1 సమూయేలు 15:22.

12. నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్న వాడెవడు?

నిజమైన మతం హృదయానుగతం. అంతరంగంలో దేవుని పట్ల ప్రేమ, భయభక్తులు లేకుండా ఆరాధన స్థలాలకు వెళ్ళడం వ్యర్థం. అది దేవునికి అంగీకారం కాదు.

13. మీ నైవేద్యము వ్యర్థము అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము దాని నికను తేకుడి అమావాస్యయు విశ్రాంతిదినమును సమాజకూట ప్రక టనమును జరుగుచున్నవి పాపులగుంపుకూడిన ఉత్సవసమాజమును నే నోర్చ జాలను.

ఇలాంటి ఆరాధన దేవునికి అంగీకార యోగ్యం కాదు, సరిగదా అసహ్యం కూడా. మనుషులు తమ వ్యర్థమైన కపట ఆరాధన దేవునికి ఆనందం కలిగిస్తున్నది అనుకోవచ్చు. అయితే నిజానికి వారాయనకు చీదర పుట్టిస్తున్నారు. కోపం రేపుతున్నారు. 13 వ వచనంలో గమనించండి. దేవుని ప్రజల ఆరాధన సమావేశాలు ఆయన దృష్టిలో దుష్ట సమావేశాలు అయ్యే ప్రమాదం ఉంది.

14. మీ అమావాస్య ఉత్సవములును నియామక కాలము లును నాకు హేయములు అవి నాకు బాధకరములు వాటిని సహింపలేక విసికియున్నాను.

15. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థనచేసినను నేను వినను మీ చేతులు రక్తముతో నిండియున్నవి.
యోహాను 9:31

తన పై తిరగబడి పాపంలో జీవిస్తూ ఉన్నవారి ప్రార్థనలకు దేవుడు జవాబియ్యడు. ఇలాంటి ప్రజలకు ఆరాధన క్రమాలు ఉండవచ్చు. ఎన్నో ప్రార్థనలు చేయవచ్చు. అయితే అలాంటి వాటినుంచి దేవుడు తన ముఖం తిప్పేసుకుంటాడు (కీర్తనల గ్రంథము 66:18; యోహాను 9:13; యాకోబు 4:3). మనం ఆయన్ను ప్రేమించకుండా, విధేయత చూపకుండా, ఆయన్ను సేవించకుండా ఆయన మన ప్రార్థనలను ఆలకిస్తాడను కోకూడదు. కేవలం స్వార్థ ప్రయోజనాలను ఆశించి చేసే ప్రార్థనలకు జవాబిస్తాడని ఆశించకూడదు. “రక్తం”– వారు రక్తపాతం జరిగించారు. నిస్సహాయులను చంపారు (వ 21; యెషయా 59:3; కీర్తనల గ్రంథము 106:38; యిర్మియా 2:34). అయినా దేవుడు తమ ప్రార్థనలకు జవాబు ఇస్తాడని చూస్తున్నారు! మానవుడి అజ్ఞానంతో కూడిన భ్రష్ట స్వభావం ఇలాంటిదే.

16. మిమ్మును కడుగుకొనుడి శుద్ధి చేసికొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండ వాటిని తొలగింపుడి.
యాకోబు 4:8

నీతిన్యాయాల విషయాల్లో, ఆత్మ సంబంధమైన విషయాల్లో వారి స్థితి ఘోరంగా ఉన్నప్పటికీ వారు పశ్చాత్తాపపడితే పాపక్షమాపణ, దీవెనలు వారికి కలుగుతాయన్న ఆశాభావానికి అవకాశం ఇంకా ఉంది. బైబిలంతటా ఈ ఆశాభావమే వెల్లడి అవుతూ ఉంది (యెషయా 55:7; 2 దినవృత్తాంతములు 7:14; యెహెఙ్కేలు 18:27-28, యెహెఙ్కేలు 18:32; లూకా 24:45-47). “కడుక్కోండి”– యాకోబు 4:8; 2 కోరింథీయులకు 7:1. దేవుడు తనను కడగాలని దావీదు ప్రార్థించాడు (కీర్తనల గ్రంథము 51:2). పశ్చాత్తాపపడి, పాపాలు ఒప్పుకొని, విశ్వాసంతో దేవుని వైపు తిరిగి తమ జీవితంలోని పాపాన్ని జయించేందుకు ఆయన శక్తిని ఆశ్రయించిన వారు తమ అశుద్ధతను తామే కడిగివేసుకున్నట్టు ఉంటారు. ఇదంతా వారి హృదయాల్లో దేవుడు జరిగించే చర్యే గనుక దేవుడే వారిని కడిగినట్టు వారిలోని అన్యాయమంతటినీ కడిగివేయడం ద్వారా దేవుడు దీన్ని పూర్తి చేస్తాడు (1 యోహాను 1:7, 1 యోహాను 1:9). దుష్టత్వమంతటినీ మనలోనుండి కడిగివేసుకోవాలన్న అభిలాష మనలో లేకుండా దేవుడు మనల్ని కడుగుతాడని ఎదురుచూడకూడదు. “మానండి”– ఈ ఆజ్ఞ చిన్నదే గానీ దీని ప్రకారం చేస్తే కలిగే ఫలితం గొప్పది. అయితే ఇలా జరిగేందుకు దేవుని పై మనం ఆధారపడకపోతే ఇది అసాధ్యం (యిర్మియా 13:23). కాబట్టి చెడుతనం మానివేయాలన్న ఆజ్ఞకు అర్థం మన బలాన్ని దేవునిలో వెతకాలని (యెషయా 40:31; కీర్తనల గ్రంథము 29:11; కీర్తనల గ్రంథము 105:4; కీర్తనల గ్రంథము 138:3; ఎఫెసీయులకు 6:10).

17. కీడుచేయుట మానుడి మేలుచేయ నేర్చుకొనుడి న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని విడిపించుడి తండ్రిలేనివానికి న్యాయము తీర్చుడి విధవరాలి పక్షముగా వాదించుడి.

“మంచి”– కీర్తనల గ్రంథము 34:14; కీర్తనల గ్రంథము 37:27. చెడుతనం చేయడం మనుషులు వేరే నేర్చుకోనక్కరలేదు. ఊపిరి తీసుకున్నంత సహజంగా అది వారికి అబ్బుతుంది (ఆదికాండము 6:5; ఆదికాండము 8:21; కీర్తనల గ్రంథము 51:5; కీర్తనల గ్రంథము 58:3; యిర్మియా 17:9; మత్తయి 15:19-20). సరైనది చెయ్యడమే నేర్చుకోవలసి ఉంది. ఒక్కడే అయిన నిజ దేవుని వైపుకు మళ్ళడం ద్వారానూ, దేవుని వాక్కు పఠిస్తూ, దానికి లోబడుతూ ఉండడం ద్వారానూ దీన్ని సాధించవచ్చు. దేవుని వాక్కు లేకుంటే కొన్నిసార్లు మనుషులకు “మంచి” ఏమిటో చూచాయగానైనా తెలియదు (యెషయా 5:20 పోల్చి చూడండి). దేవుని వాక్కు మనకెంత బాగా తెలిస్తే మంచి ఏమిటో అంత బాగా బోధపడుతుంది. ఈ భూమిపై ఉన్నంత కాలం దేవుని ప్రజలు మంచి చేయడం నేర్చుకుంటూనే ఉండాలి. “న్యాయాన్ని...వాదించండి”– మంచి చేయడం నేర్చుకున్నందువల్ల కలిగే ఫలితం మనం న్యాయం పక్షాన నిలబడగలగడం, పేదలకు, దిక్కులేని వారికి సహాయం చెయ్యగలగడం (నిర్గమకాండము 22:22-24; ద్వితీయోపదేశకాండము 10:18; ద్వితీయోపదేశకాండము 14:29; ద్వితీయోపదేశకాండము 24:19-21; ద్వితీయోపదేశకాండము 26:12-13; ద్వితీయోపదేశకాండము 27:19; కీర్తనల గ్రంథము 68:5; కీర్తనల గ్రంథము 82:1-4; మీకా 6:8; యాకోబు 1:27).

18. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకొందము మీ పాపములు రక్తమువలె ఎఱ్ఱనివైనను అవి హిమము వలె తెల్లబడును కెంపువలె ఎఱ్ఱనివైనను అవి గొఱ్ఱబొచ్చువలె తెల్లని వగును.

19. మీరు సమ్మతించి నా మాట వినినయెడల మీరు భూమి యొక్క మంచిపదార్థములను అనుభవింతురు.

ఈ వచనాల్లో కనిపించే తేడా బైబిల్లో అన్ని చోట్లా కనిపిస్తుంది – లేవీయకాండము 26:3-35; ద్వితీయోపదేశకాండము 28:1-68; ద్వితీయోపదేశకాండము 30:15-20; యెషయా 66:24. దేవుని వాక్కుకు లోబడడం గొప్ప దీవెన తెస్తుంది. మానక తిరుగుబాటు చేస్తూ ఉంటే మరణం, నాశనం, శాశ్వత శిక్ష ప్రాప్తిస్తాయి.

20. సమ్మతింపక తిరుగబడినయెడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు యెహోవా యీలాగుననే సెలవిచ్చియున్నాడు.

21. అయ్యో, నమ్మకమైన నగరము వేశ్య ఆయెనే! అది న్యాయముతో నిండియుండెను నీతి దానిలో నివసించెను ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురమున్నారు.

“వేశ్య”– జెరుసలం దేవుని విషయంలో నమ్మకంగా ప్రవర్తించలేదు (వ 4). ఇతర దేవుళ్ళను పూజించింది (యెషయా 2:8). బైబిలు దీన్ని వేశ్య ప్రవర్తనతో లేక వ్యభిచారంతో పోలుస్తున్నది (లేవీయకాండము 20:5; యిర్మియా 2:20; యిర్మియా 3:1, యిర్మియా 3:6, యిర్మియా 3:8-9; యిర్మియా 13:27; యెహెఙ్కేలు 16:17, యెహెఙ్కేలు 16:28; యెహెఙ్కేలు 23:5, యెహెఙ్కేలు 23:8, యెహెఙ్కేలు 23:19; హోషేయ 2:5; హోషేయ 4:15; హోషేయ 5:3-4). “హంతకులు”– వ 15.

22. నీ వెండి మష్టాయెను, నీ ద్రాక్షారసము నీళ్లతో కలిసి చెడిపోయెను.

ఆ ప్రజల హృదయాలు భ్రష్టమైపోయినందుచేత తక్కినవన్నీ భ్రష్టమైపోయాయి.

23. నీ అధికారులు ద్రోహులు దొంగల సహవాసులు వారందరు లంచము కోరుదురు బహుమానములకొరకు కనిపెట్టుదురు తండ్రిలేనివారిపక్షమున న్యాయము తీర్చరు, విధవ రాండ్ర వ్యాజ్యెము విచారించరు.

“అధికారులు”– యిర్మియా 1:18-19; యిర్మియా 2:8; యెహెఙ్కేలు 34:1-6 పోల్చి చూడండి. దేవుడు చూడగోరిన అధికారులు ఎలాంటివారుగా ఉండాలో వ 26; కీర్తన 101 మొదలైన చోట్ల చూడండి. “వితంతువులు”– వ 17.

24. కావున ప్రభువును ఇశ్రాయేలుయొక్క బలిష్ఠుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగున అనుకొనుచున్నాడు ఆహా, నా శత్రువులనుగూర్చి నేనికను ఆయాసపడను నా విరోధులమీద నేను పగ తీర్చుకొందును.

పై వచనాల్లో చెప్పినట్టు ప్రవర్తించే అధికారులు దేవునికి శత్రువులు. వారితో ఎలా వ్యవహరించాలో ఆయనకు తెలుసు (ద్వితీయోపదేశకాండము 32:40-41; మొ।।).

25. నా హస్తము నీమీద పెట్టి క్షారము వేసి నీ మష్టును నిర్మలము చేసి నీలో కలిపిన తగరమంతయు తీసి వేసెదను.

ఈ వచనాలన్నీ జెరుసలం నగరాన్ని గురించి పలికినవే. దాని నివాసులంతా భ్రష్టులైపోయినప్పటికీ దేవునికింకా దానిపట్ల ఉన్నతమైన, పవిత్రమైన ఆశయాలు ఉన్నాయి. దాన్ని శుద్ధి చేసి దానికి నీతిన్యాయాలను తిరిగి కలిగించాలని ఆయన దృఢ నిర్ణయం. ఇది జరగాలంటే ఆ నగరానికి బాధలు, దాన్లో తిరుగుబాటు చేసినవారికి నాశనం తప్పనిసరి. “శుద్ది చేసి”– యెషయా 4:4; కీర్తనల గ్రంథము 66:10-12; మలాకీ 3:3.

26. మొదటనుండినట్లు నీకు న్యాయాధిపతులను మరల ఇచ్చెదను ఆదిలోనుండినట్లు నీకు ఆలోచనకర్తలను మరల నియమించెదను అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును.

ఉదాహరణకు సమూయేలులాగా ప్రజలకు మార్గం చూపి నడిపించగల నాయకులు. “నమ్మకమైన నగరం”– వ 21; జెకర్యా 8:3.

27. సీయోనుకు న్యాయము చేతను తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతిచేతను విమోచనము కలుగును.

“మళ్ళీ తిరిగిన”– మనస్ఫూర్తిగా దేవునివైపుకు తిరిగేవారే ప్రాణాలతో బయటపడి సీయోనుకు దేవుడిచ్చే దీవెనల్లో పాలి భాగస్థులు అవుతారు.

28. అతిక్రమము చేయువారును పాపులును నిశ్శేషముగా నాశనమగుదురు యెహోవాను విసర్జించువారు లయమగుదురు.

29. మీరు ఇచ్ఛయించిన మస్తకివృక్షమునుగూర్చి వారు సిగ్గుపడుదురు మీకు సంతోషకరములైన తోటలనుగూర్చి మీ ముఖ ములు ఎఱ్ఱబారును

ఇవి విగ్రహ పూజ, బహుశా లైంగిక దుర్నీతి జరిగే స్థలాలు (యెషయా 65:3).

30. మీరు ఆకులు వాడు మస్తకివృక్షమువలెను నీరులేని తోటవలెను అగుదురు.

దీన్ని యెషయా 5:7; కీర్తనల గ్రంథము 1:3; పరమగీతము 4:12 తో పోల్చి, ఉన్న తేడా చూడండి.

31. బలవంతులు నారపీచువలె నుందురు, వారి పని అగ్ని కణమువలె నుండును ఆర్పువాడెవడును లేక వారును వారి పనియు బొత్తిగా కాలిపోవును.Shortcut Links
యెషయా - Isaiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |