ఇది అర్థం చేసుకొనేందుకు కష్టతరమైన అస్పష్టమైన భాగం. ఇందులోని వివరాలన్నిటినీ సంతృప్తికరంగా విప్పి చెప్పడం కష్టం. ఇది “ఆ రోజు” అనే పదంతో ఆరంభమౌతుంది. ఇదే మాట 18,19,23,24 వచనాలలో కనిపిస్తుంది. దీని అర్థం ఇదమిద్ధంగా చెప్పలేం గాని యెషయా ఇంతకుముందే చెప్పిన ప్రభువు దినాన్ని సూచించే పదం అయి ఉండవచ్చు (యెషయా 2:20; మొ।।. ప్రభువు దినం గురించి నోట్స్ యెషయా 13:6-13; యోవేలు 1:15; 1 థెస్సలొనీకయులకు 5:2; 2 థెస్సలొనీకయులకు 2:2; 2 పేతురు 3:10). “ఆ రోజున” అంటే అష్షూరు, బబులోను సైన్యాలు ప్రవక్తల కాలంలో దండెత్తి వచ్చే సమయం అనుకోవడానికి వీలులేదు. ఈ వచనాల్లో చెప్పబడినవన్నీ ఆ కాలంలో నెరవేరలేదన్నది నిస్సందేహం. ఇక్కడ ఉన్న భవిష్యద్వాక్కులు ఈజిప్ట్ అంతా దేవుని వైపు తిరుగుతుందనీ, ఇస్రాయేల్, ఈజిప్ట్, అష్షూరువారి మధ్య పూర్తి శాంతి, సహకారాలు ఉంటాయనీ తెలియజేస్తున్నాయి (23,24 అధ్యాయాలు). శతాబ్దాలుగా ఈ దేశాలు ఒకదానితో ఒకటి పోట్లాడుకున్నాయి. అయితే ఇది జరగక ముందు దేవుడు ఈజిప్ట్‌ను దెబ్బ తీస్తాడు (వ 16,22). దేవుడే ఇలా చేశాడని ఆ ప్రజలకు తెలుస్తుంది. ఆయనకూ, ఆయన ప్రజలకూ (యూదా – 15,16 వచనాలు) వారు భయపడతారు. ఈజిప్ట్‌ను దేవుని వైపు తిప్పడానికి, దాన్ని భూమి పై దీవెన కారణంగా చెయ్యడానికి ఇది సాధనం (వ 24). 25 వ వచనంలో ఉన్న అద్భుతమైన మాటలను దేవుడు పలికేలా ఇది చేస్తుంది. క్రీస్తు రెండవ సారి వచ్చి భూమి పై ఆయన పరిపాలన సమయంలో విశ్వ శాంతిని నెలకొల్పే వరకూ ఇది నెరవేర్చడం ఎలా సాధ్యం? (యెషయా 2:2-4; యెషయా 9:7; యెషయా 11:1-16).